Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రతాప వెంకట సుబ్బారాయుడు

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....

http://www.gotelugu.com/issue285/748/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)...

బాగా పొద్దెక్కాక ఇద్దరూ ఫ్రెష్షై కిందకి వచ్చే సరికి రాజా రావు గారింటిలో ఆయన, ఆయన భార్యా, అచ్యుత రామయ్య గారు, యశోదమ్మ కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకొంటున్నారు. వీళ్లని చూడగానే ముందుగా రాజా రావు గారు "ఏం కొత్త దంపతులూ మా ఇంట్లో ఇబ్బదేం కలగ లేదుగా?"అన్నాడు నవ్వుతూ.

ఇద్దరు సిగ్గు పడి పోయి ఆయన కాళ్లకు దణ్నం పెట్టారు.

అయన ఇద్దర్నీ లేపి "ఎప్పుడూ ఇలాగే కలిసి మెలిసి సంతోషంగా ఉండాలి"అన్నాడు.

ఆ తర్వాత వాళ్లు రాజా రావు గారి భార్యకి, అచ్యుత రామయ్య గారికి, యశోదమ్మ కాళ్లకీ దణ్నం పెట్టారు.

వాళ్లందరి కనుల పండువగా ఉంది ఆ జంట.

ఆ ఇంట్లోనే మూడు రాత్రులను మనసులో కమ్మని మరచి పోలేని మధురానుభూతుల ముద్రికగా నమోదు చేసుకున్నారు.

***

కొత్త దంపతులు ఉండడానికి రాజా రావు గారి ఇల్లు చాలనందున కమలాకర్, ఆఫీసు దగ్గరలో డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకుని కాపురం పెట్టాడు. అతను ఇల్లు ఖాళీ చేసేప్పుడు రాజా రావు గారికి ఎంతో బాధ కలిగింది. సొంత కొడుకే వేరు వెళ్లి పోతున్నంత దుఃఖం కలిగింది. ఇద్దరికీ బట్టలు, స్వీట్లు పెట్టాడు.

"మీ ఇద్దరూ నా పిల్లలు. ఏ అవసరం వచ్చినా నిస్సంకోచంగా మనింటికి రావచ్చు" అన్నాడు డగ్గుత్తికతో.

***

ఆఫీసు దగ్గరలో శ్రీ గాయత్రీ అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకుని అక్కడికి షిప్ట్ అయ్యారు వాళ్లు.

పేరుకు తగ్గట్టే శ్రీ గాయత్రీ అపార్ట్ మెంట్ అక్కడున్న ఇతర అపార్ట్మెంట్లలో కడిగిన ముత్యంలా, కింద పార్కింగ్ ఏరియా చుట్టూ తులసి, మందార, మరువం, దవనం లాంటి చెట్లతో, వాటి మధ్య కొలువు దీరిన గాయత్రీ అమ్మవారి ప్రతిమతో తో , వచ్చిన వాళ్లకు పవిత్ర భావన కలగజేస్తూంటుంది. నాలుగు రోడ్ల కూడలిలో ఉండడం మూలానూ, బస్టాప్, హాస్పిటల్, సినిమా హాల్స్ అన్నీ దగ్గరే. అందుకే రెంట్ కూడ కాస్త ఎక్కువే. ఓనర్లు కమలాకర్ ఫ్రెండ్ కు తెలుసున్నవాళ్లు అవడంతో అతనే ఆ ఇంటిని కమలాకర్ కు అద్దెకి ఇప్పించాడు.

కొన్ని అవసరమైన వస్తువులు అచ్యుత రామయ్య గారు కొనిచ్చారు. మరికొన్ని గిఫ్ట్స్ గా వచ్చాయి. ఫ్లాట్ లోని గదుల్లో అన్ని సామానులు నీట్ గా సర్దింది కాత్యాయని.

ఒక బెడ్ రూం కమలాకర్ వాళ్లమ్మకీ, రెండోది వాళ్లిద్దరికీను.

బెడ్రూం వాళ్లిద్దరికీ ప్రత్యేకమైంది కావడంతో డబల్ బెడ్ కాట్, వాటిపై మెత్తని పరుపు, తెల్లటి దుప్పటీ, లైట్ గులాబీ కలర్ పిల్లోస్, పక్కన టీపాయ్, దానిపై కృష్ణుని గాఢ పరిష్వంగంలో వివశురాలైన రాధ పాల రాతి బొమ్మ, పళ్లు పెట్టుకునే బుట్ట,  గోడలకి శృంగారానికి ఉత్ప్రేరకంగా నిలిచే పెయింటింగ్స్, చక్కగా, అందంగా సర్దుకున్నారు. వాళ్ల బెడ్రూం కి ఉన్న రెండు గోడలకీ  రెండు కిటికీలున్నాయి. వాటికి అటు సైడు దట్టంగా ఉన్నపూల మొక్కలూ, సువాసన మొక్కలూ ఉంటాయి. అందువల్ల కిటికీ లోంచి కమ్మటి సువాసన అన్నివేళలా వస్తూంటుంది. ఆ ఇల్లు అదృష్టవశాత్తు వాళ్లకి దొరికింది. ఆ గదిలో ఆ దంపతులకు ప్రతి రాత్రీ వసంత రాత్రే!

కమలాకర్ జీతం కూడా మంచిదే అవడంతో అయిదారు నెలల్లో ఇంటికి కావలసిన హంగులు సమకూర్చాడు.

అప్పుడప్పుడూ వాళ్లింటికొచ్చి చూసి వెళుతున్న అచ్యుత రామయ్య గారు యశోదమ్మలు, తమ పిల్లను యువ రాణీలా చూసుకుంటున్న అల్లుని మంచితనానికి మనసులో ప్రణామాలర్పిస్తూ, మనసంతా ఆనందాన్ని నింపుకుని వెళుతున్నారు.

ఆనందం అనేది కాల చక్రానికి కందెన (ఆయిల్). అది ఎటువంటి ఇబ్బంది లేకుండా గిర్రున తిప్పేస్తుంది.

సంవత్సరం అయింది. కమలాకర్ కు మంచి ఇంక్రిమెంట్ వచ్చింది.

ఆ ఆనందంలో తన తల్లికీ, రాజా రావు గారికి, ఆయన భార్యకు, అత్త మామలకు పెద్ద హోటల్లో మంచి పార్టీ ఇచ్చి ఖరీదైన బట్టలు పెట్టాడు.

ఇంటికొస్తున్నప్పుడు అచ్యుత రామయ్య గారు ‘రాజా రావు గారు, మరో తండ్రిలా బాధ్యత వహించి కాత్యాయనికి మంచి సంబంధం చూశారని’ భార్యతో ఎన్నిసార్లు అన్నాడో.

కమలాకర్ దంపతులతో సహా అందరూ పిల్లల కోసం చూస్తున్నారు.

ఆ వరం కూడా భగవంతుడు ప్రసాదిస్తే వాళ్లది బ్లెస్డ్ లైఫ్!

అయితే అన్నీ మనమనుకున్నట్టుగా జరిగితే ఇంకేముంది? అనూహ్యమైన  సంఘటనలు జరగాలి. అప్పుడే షడ్రుచులున్న జీవితం అవుతుంది. అసలు అందు కోసమే కొంత మందిని ముందు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేసి తర్వాత జీవితాలతో ఆడుకుంటుంది విధి.

అదే జరిగింది వాళ్ల జీవితం లోనూ!

***

విధి ఆడబోయే నాటకంలో ఆ నవదంపతుల జీవితాలలో ఏం మార్పులను తీసుకురాబోతోంది? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఆగాల్సిందే....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్