Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Guru Shishya relationship

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఫ్యాషన్‌ 'బుట్ట'లో ప్రపంచం - ..

అందంగా లంగా వోణీలు, చెవులకు రాళ్ల బుట్టలు పల్లెటూరి అమ్మాయిల అందాల్ని అందంగా చూపించేవి. అయితే ఒక టైంలో ఆ లంగావోణీలకు, చెవి కమ్మల్లో మొదటి స్థానమైన బుట్టలకు టాటా బైబై చెప్పేసింది యువత. అయితే భూమి గుండ్రంగా తిరిగినట్లే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గుండ్రంగా తిరుగుతూనే ఉంటుంది. అలాగే కాలాన్ని బట్టి ఫ్యాషన్‌ కూడా తిరుగుతుంది. అయితే కొంతకాలం ఒక్కచోట ఫిక్స్‌డ్‌గా ఉండిపోతుంది. అమ్మాయిలు, అబ్బాయిలు కొంత కాలం ఓ రకమైన ట్రెండ్‌ని ఫాలో చేస్తారు. కాస్ట్యూమ్స్‌, హెయిర్‌ స్టైల్స్‌ ఇలా ఒక్కటేమిటి ఫ్యాషన్‌లో ఏది కొత్తగా వచ్చినా కొన్నాళ్లు అందరూ ఆ ఫ్యాషన్‌ వైపే మొగ్గు చూపడం పరిపాటి. 
ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే, ఏది ట్రెండింగ్‌లో ఉందో దాన్ని ఖచ్చితంగా ఫాలో చేయాల్సిందే. అలా మేకప్‌ విషయంలో మగువల ముఖాన్ని మరింత అందంగా మార్చే ఐటెమ్స్‌ చెవి పోగులు.

చెవి పోగులు అంటే ఈ తరం అమ్మాయిలు ఠక్కున ఇష్టపడేది 'బుట్టలు'. ఒకానొక టైంలో చక్కగా చెవులకు బుట్టలు పెట్టుకోమ్మా.. అని అమ్మ చెబితే, హా.! బుట్టలా.. ఓల్డ్‌ ఫ్యాషన్‌ పల్లెటూరి అమ్మాయిలు పెట్టుకుంటారు అని పట్నం పాపలు మూతులు ముడుచుకునేవారు. కానీ ఇప్పుడో మరి. బుట్టలకే ప్రధమ స్థానం కట్టబెడుతున్నారు. ఓల్డ్‌ ఫ్యాషన్‌ బుట్టలకే సరికొత్తగా కలరింగ్‌ ఇచ్చి నేటి తరం అమ్మాయిల మనసుల్ని ఇట్టే దోచేసేలా డిజైన్‌ చేస్తున్నారు మన ట్రెండీ జ్యూయలరీ డిజైనర్లు. లంగావోణీలకు మాత్రమే సెట్‌ అవుతాయని భావించే ఈ బుట్టలు ఇప్పుడు ఏ టైప్‌ మోడ్రన్‌ కాస్ట్యూమ్‌కైనా ఇట్టే సెట్‌ అయిపోతున్నాయి. ఇది కూడా అమ్మాయిలు బుట్టల్ని ట్రెండీ ఫ్యాషన్‌గా మలచుకోవడానికి ఓ ముఖ్య కారణం అని చెప్పొచ్చు.

బుట్టలంటే పైన ఓ రౌండ్‌ చందమామలాంటి దుద్దుకు వేలాడే లోలాకు మాత్రమే కాదు. దుద్దేమీ లేకుండా జస్ట్‌ హ్యాంగింగ్‌లా కూడా బుట్టలు ధరిస్తున్నారు నేటి అమ్మాయిలు. అలాగే పెద్ద పెద్ద దుద్దులకూ చక్కగా వేలాడేస్తున్నారు. అంతేనా ఒక్కటే కాదు, రెండు మూడు, నాలుగైదు మల్టీ బుట్టల్నీ ఎంపిక చేసుకుంటున్నారు. మోడ్రన్‌ డస్స్రుల మీదకు ఈ మల్టీ బుట్టలు భలే బాగుంటున్నాయిలే. ఏ టైపు జ్యూయలరీకైనా ఇప్పుడు బుట్టల్ని జత చేస్తూ వాటి అందాన్ని మరింత రెట్టింపు చేస్తున్నారు. రాళ్లు, బంగారం, కెంపులూ, పచ్చలు పొదిగిన బుట్టలే కాకుండా, సిల్కు థ్రెడ్‌తో కలర్‌ఫుల్‌గా ఆకర్షణీయంగా తయారవుతున్న బుట్టల్ని కూడా ట్రెండీగా వాడుతున్నారు నేటి తరం కాలేజీ అమ్మాయిలు. చక్కగా డైలీ వేర్‌కి మ్యాచ్‌ అయ్యేలా ఈ బుట్టల రంగుల్ని ఎంచుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం చెవిపోగుల్లో బుట్టలది ప్రధమ స్థానమైపోయింది. చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడా లేకుండా, అన్ని రకాల మెటల్స్‌లోనూ బుట్టలు అమ్మాయిలు మనసుల్ని దోచేస్తున్నాయి. అందుకే ఇప్పుడు చెవిపోగుల ప్రపంచం 'బుట్ట'లో పడిపోయింది మరి.
మరిన్ని శీర్షికలు
tamilnadu