Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఇందూరమణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి..... http://www.gotelugu.com/issue287/752/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)... రాజమండ్రి  నుండి వస్తుండగా తనపై జరిగిన హత్యా ప్రయత్నం చేసింది కూడా ఈ హంతకుడే అన్నది తన అనుమానం. నిజం కూడా అదే. ఇదే ఆయుధంతో తనని చంప బోయి హంతకుడే చని పోయాడు. అదే ఆయుధం.... కత్తి మూడు చోట్ల ఉపయోగించాడు. అన్నవరం పోలీస్ నుండి కూడా హంతకుడి కత్తి స్వాధీనం చేసుకోవాలి. అక్కడి నుండి పోస్టుమార్టమ్ రిపోర్ట్ వస్తుంది. హత్యా యుధం కూడా పరీక్షించి రిపోర్ట్ పంపిస్తారు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో నిర్ధారణ జరుగుతుంది.

రెండు చోట్ల జరిగిన హత్యకు వాడిన ఆయుధం అదే అని నిర్ధారణ అవుతుంది. హంతకుడు అతడే అని నిర్ధారణగా తెలుస్తోంది. కానీ కేసులు రెండూ విడి పోయినట్టు కనిపిస్తున్నా ఇంకా అంతు చిక్కని విషయం ఏదో దాగుందనిపిస్తోంది.

ఈ హత్యకి సూత్రధారి ఎవరు?! ఎందుకు చేస్తున్నారు? ఆమె ఎవరు? ఆమె హతురాలు సత్యవతమ్మ కూతురేనా?! ఆ యాచకులతో ఆమెకి ఏమిటి పని? ఎందుకు కిడ్నాప్ చేసింది?!

ఆలోచిస్తూ మౌనంగా పోస్టుమార్టమ్ రిపోర్ట్ చూస్తూండిపోయాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సార్! ఖాన్ గారూ!...’’ టూటౌన్ ఎస్సై తట్టి పిలిచే సరికి ఇహానికొచ్చాడు అక్బర్ ఖాన్.

‘‘ఓకే బ్రదర్! ఈ రిపోర్ట్ నేను తీసుకుంటాను.’’ అంటూ సీట్లో నుండి లేచి టూటౌన్ ఎస్సైకి షేక్ హేండ్ ఇచ్చి వెనుదిరిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.
కేసు ముడి విడిపోతున్నట్టే ఉంది. కానీ, వీటన్నిటికీ అతీతంగా ఇంకేదో జరుగుతోందనిపిస్తోంది. అదేమిటో అర్థం కావటం లేదు. ఆమె ఎవరో తెలిస్తేనే గాని....ఆమెని పట్టుకుంటేనే గాని....ఈ ‘హత్య’కు కారణం....ఏంటో తెలియదు. అది తెలుసుకుంటేనే గాని  తన పరిశోధన పూర్తి కాదు. ఎస్! ‘ఆమె’ని పట్టుకోవడమే తన ముందున్న ఛాలెంజ్! ఎలా?! ఆలోచిస్తూనే స్టేషన్లో నుండి బుల్లెట్ దగ్గర కొచ్చాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘సార్! నేను డ్రైవ్ చెయ్యనా!’’ ఏదో పరధ్యానంలో బుల్లెట్ తీయబోతున్న ఎస్సై అక్బర్ ఖాన్ తో అన్నాడు రైటర్. రైటర్ అన్న మాటలకి ఉలిక్కి పడి తేరుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘కేసంతా స్పష్టంగా కనిపిస్తోంది రైటర్ గారూ! కానీ, ఇంకా ఏదో ఉందనిపిస్తోంది. హంతకుడు దొరికాడు. హత్యా యుధం దొరికింది. కానీ....కానీ...ఎందుకు హత్యలు చేసాడో తెలియాలిగా! ‘ఆమె’  ఎవరో అంతా మిస్టరీగా ఉంది. ఈ కేసులు పూర్తి పూర్వాపరాలు తెలియాలంటే ముందు మనం ‘ఆమె’ ఎవరో కనిపెట్టాలి. స్థిరంగా అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఎస్ సార్! మీరు రిలాక్స్ డ్ గా  వెనుక కూర్చోండి సార్! బుల్లెట్ నేను  తీస్తాను.’’ అంటూ ఎస్సై అక్బర్ ఖాన్ చేతిలో తాళం తీసుకున్నాడు రైటర్.

‘‘ఓకే’’ అంటూ రైటర్ వెనుక కూర్చున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సార్! నేరుగా స్టేషన్ కే కదా?’’ అడిగాడు రైటర్.

‘‘ఎలాగూ మనం ఇక్కడే ఉన్నాంగా! ఓ సారి బ్యాంకు జోనల్ ఆఫీసుకు వెళ్దాం.’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సార్!....’’ అయోమయంగా ఎస్సై కేసి చూసాడు రైటర్.

‘‘అదేనయ్యా! ఆమె ఏ టి ఎమ్ కార్డు మన దగ్గరుందిగా. జోనల్ ఆఫీసులో అకౌంట్ వివరాలు సేకరిద్దాం. అప్పుడు ఆమె ఎవరో తెలిసి పోతుందిగా.’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఎస్సార్’’ అంటూ హుషారుగా బుల్లెట్ ని చిన వాల్తేరు కేసి ఉరికించాడు రైటర్.

పది నిమిషాల్లో బ్యాంకు జోనల్ కార్యయం ముందు ఆగింది బుల్లెట్. జేబులో ఉన్న ఏ టి ఎమ్ కార్డు తీసి ఎస్సై అక్బర్ ఖాన్ చేతికి ఇచ్చాడు రైటర్.

ఏ టి ఎమ్ కార్డుని అటూ ఇటూ త్రిప్పి చూసి బ్యాంకు జోనల్ ఆఫీసు ముందు నిలబడి పైన ఉన్న బోర్డు కేసి ఓ సారి చూసి తృప్తిగా లోపలకు అడుగు పెట్టాడు. అతన్ని అనుసరించాడు రైటర్.

ద్వారం దగ్గరున్న సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్సై అక్బర్ ఖాన్, రైటర్ వచ్చిన పని గురించి ఆరా తీసి నేరుగా జోనల్ ఆఫీసర్ గది చూపించి వెళ్లమన్నాడు.

‘‘సార్!  ఇలా ఎంక్వయిరీ చేస్తే వివరాలు ఇవ్వ కూడదు సార్! అఫీషియల్ గా లెటర్ పెట్టండి.’’ అన్నాడు జోనల్ ఆఫీసర్. పోలీసు వచ్చీ రావడం తోనే ఏటిఎమ్ కార్డు వివరాలు అడిగే సరికి బ్యాంకు రూల్సు చెప్పాడు జోనల్ ఆఫీసరు.

‘‘ఇది మూడు హత్య కేసుల్లో చాలా ప్రధానమైన ఆధారం సార్! వీలైనంత త్వరగా ఇప్పించండి.’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఓకే సార్! మీరింతగా రిక్వెస్ట్ చేస్తున్నారుగా. ఒక లెటర్ రాసివ్వండి. నేను మీ పోలీస్ స్టేషన్ మెయిల్ ఐడి కి అకౌంట్ వివరాలు మెయిల్ చేస్తాను. బై హేండ్ ఇవ్వలేము.’’ కరా ఖండీగా చెప్పాడు జోనల్ ఆఫీసర్.

‘‘ఆల్ రెడీ మీకు రిక్వెస్ట్ లెటర్ మా కానిస్టేబుల్ తో పంపించాం సార్’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అది ఎవరికిచ్చాడో ఇప్పుడు వెతకాలంటే టైమ్ పడుతుంది సార్’’ అన్నాడు జోనల్ ఆఫీసరు.

‘‘ఓకే సార్’’ అంటూ ఆ క్షణమే రైటర్ తో రిక్వెస్ట్ లెటర్ రాయించి సంతకం చేసి ఇచ్చాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘మీరు వెళ్లండి సార్! మీరు మీ పోలీస్ స్టేషన్ కి చేరే లోపు మెయిల్ చేరుతుంది.’’ అంటూ జోనల్ ఆఫీసర్ ఇద్దరికీ షేక్ హేండ్ ఇచ్చాడు.

‘‘థేంక్యూ సార్!’’ అని చెప్పి హుందాగా వెను దిరిగాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఇద్దరూ ఆగమేఘాల మీద గోపాల పట్నం చేరుకున్నారు.
అప్పటికే అక్కడ కొండమెట్ల దారిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి పూజారి నిలబడి ఉన్నాడు. స్టేషన్ లోకి వెళ్లి గదిలో కూర్చోగానే ఎస్సై అక్బర్ ఖాన్ దగ్గరికి ఓ కానిస్టేబుల్ గుడి పూజారిని వెంట బెట్టుకుని లోపలకు వచ్చాడు.

‘‘మీరు గుడి పూజారి గారా?’’ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అవును సార్!’’ చెప్పాడు పూజారి. 

‘‘మీరు ‘ఈమె’ ని చూసారా?’’ తన దగ్గరున్న ఫొటో తీసి చూపించి అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘చూసాను సార్!.... చూసాను!’’ చెప్పాడు పూజారి.

‘‘ఎక్కడ? ఎప్పుడు?’’ అడిగాడు ఎస్సై

‘‘మూడేళ్ళ క్రిందటే చూసాను సార్?’’ అన్నాడు పూజారి.

‘‘మూడేళ్ల క్రిందట...’’ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై. 

‘‘అవును సార్! మూడేళ్ల క్రిందట నాకు ఆపరేషన్ జరిగింది అప్పుడు చూసాను సార్!’’ అన్నాడు పూజారి.

‘‘ఎక్కడ చూసారు?’’ ఉత్సాహంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘హాస్పిటల్ లో.’’ చెప్పాడు పూజారి.

‘‘హాస్పటల్ లోనా? ఆమెకేమైంది?’’   

‘‘ఆమెకేమీ కాలేదు సార్. నాకే కిడ్నీ ట్రాన్స్ పరెన్స్ జరిగింది. ఆ హాస్పిటల్ లోనే’’ అన్నాడు పూజారి.

‘‘సరిగ్గా అర్థమైనట్టు చెప్పండి సార్. మంత్రాలు చదివినట్టు చెప్తే మాకెక్కడ అర్థమౌతుంది?’’ చిరాగ్గా అన్నాడు

‘‘అవును సార్! హాస్పిటల్ లోనే చూసాను. ఆమె ఫొటో అక్కడ పెద్ద డాక్టర్ గారి గదిలో గోడ మీద చూసాను.’’ విడమర్చి చెప్పాడు పూజారి.

‘‘గోడ మీద....హాస్పిటల్లో....ఆశ్చర్యంగా ఉందే! ఆమె ఫొటో అక్కడుందంటే....?’’ మరింత ఆశ్చర్యంగా అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘హాస్పిటల్ ఛైర్మన్ గారి భార్యట సార్ ఆమె.’’ చెప్పాడు పూజారి.

‘‘వ్వాట్!?!.... అది ఏ హాస్పిటల్?’’ మరింత ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై.

‘‘యలమంచిలి హాస్పిటల్స్ గ్రూప్ కి చెందిన ప్రైవేట్ హాస్పిటల్ సార్.’’ చెప్పాడు పూజారి. పూజారి చెప్పింది వింటూనే ఒక్క క్షణం అవాక్కయి సీటుకు జారగిలబడి ఉండి పోయాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘మళ్లీ ఆమెని ఈ మధ్య ఎప్పుడన్నా... ఎక్కడన్నా చూసారా?’’ తేరుకుని అడిగాడు ఎస్సై.

‘‘మూడు రోజు ల క్రితం.... చూసి షాకయ్యాను.’’ ఆందోళనగా అన్నాడు పూజారి.

‘‘షాక్ అయ్యారా?... దేనికి?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఎప్పుడో చనిపోయిన ఆమె...మళ్లీ కళ్ళెదుట కనిపిస్తే... ఎలా ఉంటుంది సార్? అనుకోకుండా చూసాను. ఎక్కడ చూసానా అని మళ్లీ మళ్లీ చూసాను...’’ అన్నాడు పూజారి.

‘‘మరి? మా వాళ్లు మిమ్మల్ని కలిసి అడిగితే ‘గుర్తు’ రాలేదని చెప్పారట కదా!’’ సంశయంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘నిజమే సార్! నా అనుభవాన్ని.... యదార్థమని నేనే నమ్మలేక పోయాను. భ్రమనుకుని ఆ విషయమే మర్చి పోయాను. మళ్లీ, మీ వాళ్ళు ‘ఆమె’ ఫొటో చూపించి అడిగితే ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే గుర్తు లేదని చెప్పాను.’’ అన్నాడు పూజారి.

‘‘మరి.... ఇప్పుడు...!?’’ ఇక్కడికెందుకొచ్చారన్నట్టు చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘నిన్ననే హాస్పిటల్ కి  వెళ్లాను సార్! చెకప్ కోసం. ‘ఆమె’ అవునో కాదో తెలుసుకుందామని పెద్ద డాక్టర్ గదికి వెళ్లాను. మీ దగ్గరున్న ఫొటో ఆమెదే. సందేహం లేదు. అది చెప్పాలనే వచ్చాను.’’ పూజారి గట్టిగా బల్ల గుద్దినట్టు చెప్పాడు.

‘‘అంటే...?!  చనిపోయిన మనిషి ఎలా బ్రతికొచ్చిందంటారు? ఆమె చనిపోయిందని మీకు రూఢీగా తెలుసా?’’ సీరియస్ గా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సార్! నేను చిన్న పిల్లాడ్ని కాదు. డాక్టర్ గారి గదిలో దండ వేసి ఉన్న ఫొటోలో స్త్రీ బ్రతికుందో...బ్రతికి లేదో తెలుసుకోడానికి!’’ స్థిరంగా అన్నాడు పూజారి.

‘‘ఓకే పూజారి గారూ! అవసరం అనుకుంటే మళ్లీ పిలుస్తాను ప్లీజ్.’’ అంటూ పూజారిని పంపించేసాడు ఎస్సై అక్బర్ ఖాన్. మౌనంగా తల దించుకుని వెళ్ళిపోయాడు  పూజారి.

(చనిపోయిన వ్యక్తి కనిపించడమేమిటి? అటు పోలీసులనూ, ఇటు జనాన్నీ అయోమయానికి గురిచేయడమెందుకు? అసలెవరామె? చిక్కుముడులు వీడిపోతున్నాయా? మరింత బిగుసుకుంటున్నాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఆగాల్సిందే)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani