Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ఇరవై నాల్గవ భాగం

anubandhalu-suryadevar ram mohan rao

నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోందన్నయ్యా. మనం తప్పు చేశాం. చాలా పెద్ద తప్పే చేశాం." అంది బాధపడుతూ.

"నిజమే... మనం వచ్చింది ఇండియా అని మర్చిపోయి అమెరికాలో వున్నట్టే ఇక్కడా వుండాలనుకోవడం తప్పే. ముక్కూ ముఖం తెలీనివాళ్ళు మాట కలిపితే నమ్మి స్నేహం చేయడం అంతకన్నా పెద్ద తప్పు. థాంక్ గాడ్! నవీన్ నిన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా ముఖం ఎవరికీ చూపించలేకపోయేవాడిని" అన్నాడు బాధగా అనంత్.

"నిజమే. ఇప్పుడు బావకి నా ముఖం ఎలా చూపాలో తెలీటం లేదు. మూడు లక్షలు వస్తుంది గదా బావ దగ్గర తీసుకున్న పదివేలు ఇచ్చేద్దామనుకున్నాను. ఇక ఆ డబ్బు పోయినట్టే" అంది బాధగా శివాని.

ఇంతలో మహేశ్వరి వస్తున్నట్టు అలికిడి గావడంతో అంతటితో ఇద్దరి మధ్యన సంభాషణ ఆగిపోయింది. ట్రేలో మూడుకప్పుల్లో టీ తీసుకొచ్చింది మహేశ్వరి. అన్నాచెల్లెల్లిద్దరికీ చెరో కప్పు అందించి, తనొకటి తీసుకుని అనంత్ పక్కనే కూర్చుంది.

"మహీ! నవీన్ ఎక్కడ?" టీ తాగుతూ అడిగాడు అనంత్.

"తెలీదు బావా! అన్నయ్య కూడా ఎక్కడికో వెళ్లినట్టున్నాడు. నిన్నంతా కనబడలేదు. రాత్రి వచ్చాడంటోంది అమ్మ. కానీ ఉదయమే బయటకెళ్లాడట. ఎక్కడికో తెలీదు" అంది మహేశ్వరి. జరిగిన వ్యవహారం ఏదీ నవీన్ ఇంట్లో చెప్పలేదని అన్నాచెల్లెళ్ళు ఇద్దరికీ అర్ధమైంది. చెప్పివుంటే ఈపాటికే పెదనాన్న, పెద్దమ్మ, మావయ్య, అత్తయ్య, అంతా చూడ్డానికొచ్చి తమని ముఖం వాచేలా తిట్టి వుండేవాళ్ళు.

ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉండగానే రామలింగేశ్వర్రావు, రఘునాథ్, మహాలక్ష్మీ, భ్రమరాంబ ఒకరి తర్వాత ఒకరు లోనకొచ్చారు. మహేశ్వరి టీ తీసుకురావడానికి వెళ్ళి అనంత్ కి దెబ్బలు తగిలాయని చెప్పడంతో వాళ్ళంతా పరామర్శించడానికి వచ్చారు. వాళ్లని చూసి అనంత్ పక్క నుంచి లేచి దూరంగా నిలబడింది మహేశ్వరి.

మొత్తానికి అసలు విషయం ఇంట్లో ఎవరికీ తెలీకుండా జాగ్రత్తపడగలిగారు. వాళ్లు వెళ్లగానే అనంత్ తన గదిలోకి వచ్చేసాడు. స్నానం చేసి దుస్తులు మార్చుకున్నాడు. శివాని కూడా స్నానం చేసి పంజాబీ డ్రస్ వేసుకుంది. మహేశ్వరి వచ్చి పిలవకుండానే మండువా లోగిట్లోకి వచ్చి అందరితో కూర్చుని టిఫిన్ చేశారు.

నవీన్ జాడ మాత్రం తెలీదు. నవీన్ సెల్ కి ఫోన్ చేద్దామనుకుని కూడా శివానీ ఫోన్ చేయలేకపోయింది.

ఎన్నో సందర్భాల్లో తను అతన్ని అవమానించింది. కానీ అవేమీ మనసులో పెట్టుకోకుండా వచ్చి తనను కాపాడాడు. ఇప్పుడు అతన్ని ఎలా పలకరించాలి... అదే ఆమె బాధ. ఇలా రకరకాల ఆలోచనల మధ్య సమయం వేగంగా గడిచిపోవడం తెలీలేదు. సరిగ్గా మధ్యాహ్నం భోజనం వేళకి తన బైక్ మీద ఇంటికి చేరుకున్నాడు నవీన్.

ఆ సమయానికి ఇంట్లో ఎవరెవరు వుంటే వాళ్ళంతా ఒకేసారి భోజనాలక్కూర్చోవడం అక్కడ అలవాటు. ఇది ఇవాళ, నిన్న కాదు. అన్నపూర్ణేశ్వరి తన పిల్లలు చిన్నవాళ్ళుగా వున్నప్పట్నుంచి అందరికీ నేర్పించిన అలవాటు. ఆమె ఏర్పరచిన శాసనం. ఎవరు ఎక్కడ వున్నా, భోజన సమయానికి ఇంటికొచ్చేయాలి. అలా రాలేని పరిస్థితిలో తెలియపర్చాలి. మిగిలినవాళ్ళంతా ఒకేసారి భోంజేయాలి. ప్రస్తుతం ఆమె అమెరికాలో వున్నా ఇక్కడ మార్పులేదు. అదే శాసనం అమలు అవుతోంది.

అందుకే...

"సారీ... లేటయిపోయింది" అంటూ వచ్చి తనూ భోజనానికి కూర్చున్నాడు. సరిగ్గా అతడి ఎదురుగా శివానీ కూర్చునుంది.

యధాపలంగా ఆమె వంక చూశాడు.

కళ్ళలో దూకటానికి సిద్ధంగా వుంది కన్నీరు. ఏదో మాట్లాడాలని చూస్తోంది గాని గొంతు పెగలడం లేదు.

ఆమె మాట్లాడితే విషయం అందరికీ తెలిసిపోతుందన్న భయంతో కళ్ళతోనే నిశ్శబ్దంగా కూర్చోమన్నట్టు సైగచేశాడు. అనంత్ ని కూడా అలాగే హెచ్చరించాడు.

"అరే నవీన్! ఏమిట్రా వీడు? అనంత్ రాత్రి కారు దిగబోతూ తూలిపడిపోయాట్ట. ఆ దెబ్బలు చూడు. మాకేమీ అర్ధం కావడం లేదు" అంటూ రామలింగేశ్వర్రావు మేనల్లుడిని చూస్తూ ఏదో చెప్పబోయాడు.

"ఆ మాట నిజమే మావయ్యా! ఇంచుమించు నేను వచ్చిన టైంకే వాళ్ళూ వచ్చారు. నేనే బావని లోపల పడుకోబెట్టి గాయాలకి మందు పూశాను" అన్నాడు.

"అలాగా... ఇంతకీ తెల్లారి వీడు ఎక్కడికెళ్లాడో అడుగు బావా! రానురాను వీడికి ఇల్లు పట్టకుండా పోతోంది. కనీసం బయటికెళ్తే చెప్పి వెళ్ళాలన్న ఇంగిత జ్ఞానం కూడా వుండడం లేదు" అంటూ కొడుకుమీద రామలింగేశ్వర్రావుకి పిర్యాదు చేశాడు రఘునాథ్.

"మావయ్యా! రాత్రి కొంచెం మందుకొట్టి గురకతీసి నిద్రపోయే వాళ్లకి చెవి దగ్గర టపాకాయలు పేల్చినా వినబడుతుందా చెప్పు? నేను చీకటితోనే వెళుతూ చెప్పాను. ఆయనకు వినబడకపోతే నా తప్పా? కావాలంటే అమ్మనడగమను" అన్నాడు నవీన్.

"అవునన్నయ్యా! పనిమీద బెజవాడ వెళుతున్నాను. భోజనం టైంకి వచ్చేస్తాను అని చెప్పే వెళ్లాడన్నయ్యా! వాడి తప్పులేదు. అమ్మ, కొడుకు కలిసి నన్ను ఫూల్ ని చేస్తున్నారు. ఇదేం బాగాలేదు" ఉడికిపోతున్నట్టు ముఖం పెట్టి అన్నాడు రఘునాథ్.

"అవునవును. అమ్మమ్మకు ఫోన్ చేసి నువ్వు ఈ మధ్య మందుకొడుతున్నావని చెప్తేగాని నాకు బాగోదు. మావయ్యా! సాయంత్రం అమెరికా ఫోన్ చేయాలి. నువ్వు కూడా పక్కన వుండి అవునని చెప్పాలి. అంతే?" అన్నాడు నవీన్.

"ఒరే ఒరే... నేను తీసుకునేదేదో ఎప్పుడో ఓ సారి. అదికాస్తా బయటపెట్టి పరువు తీయకురా నీకు పుణ్యం ఉంటుంది" అంటూ రాజీకొచ్చాడు రఘునాథ్.

"అదేమరి. వాడితో గొడవ వద్దండీ అంటే వింటారా? ఒరే! నువ్వు ఫోన్ చేసి చెప్పరా" అంది నవ్వేస్తూ భ్రమరాంబ.

ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరిసాయి.

ఉమ్మడి కుటుంబంలో అంతా ఒకచోట కూర్చుని భోంచేయడంలో ఆనందాలు, సంతోషాలు ఎలా ఉంటాయో, కష్టసుఖాలు ఎలా పంచుకుంటారో అన్నాచెల్లెల్లిద్దరికీ అర్ధంకావడం ఆరంభమైంది. ఇంతకుముందు ఒకేసారి భోంచేయాలి, ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్లాలి. ఎదురించి మాట్లాడకూడదు అంటూ ఏమిటీ రూల్స్, ఏమిటీ వెధవ సెంటిమెంట్లు అని విసుక్కునేవారు. కానీ ఆ ఉదయం నుంచి ఇద్దరిలో పాజిటివ్ ఆలోచనలు ఆరంభమయ్యాయి. తమకు తెలియకుండానే అందరితోబాటు నవ్వేసారు.

భోంచేసాక అనంత్, శివానీలు డాబా ఇంట్లోకి వచ్చేశారు. శివానీకి నవీన్ తో మాట్లాడాలని ఉంది. అది ఒంటరిగా. కానీ ఎలా? ఫోన్ చేసి పిలిపిస్తే... పిలవాలని నిర్ణయించుకొని ఫోన్ అందుకునే లోపలే నవీన్ అక్కడికి వచ్చేశాడు. అతను సరాసరి రావడమే శివానీ గదిలోకి వచ్చాడు. పక్క గదిలో అనంత్ కి అతను వచ్చిన విషయం తెలీదు. అతన్ని చూడగానే ఇక దుఃఖం ఆగలేదు శివానీకి. ఒక్కసారిగా ముందుకు వచ్చి అతని చాతీ తన చేతులతో చుట్టేస్తూ గుండెల మీద ముఖం ఆన్చుకొని చిన్నగా ఏడ్చేసింది. నవీన్ తన చేతిలోని బ్రీఫ్ కేస్ బెడ్ మీద పడేసి ఆమె భుజాలు పట్టుకొని లేసాడు.

"ఏ ఏమిటీ... నువ్వు సేఫ్ గా ఉన్నావు చాలు. ఇంకెప్పుడూ అలాంటి వాళ్లని నమ్మి, స్నేహం చేసి వెంట వెళ్లకండి. ఊరుకో... ప్లీజ్..." అన్నాడు కన్నీరు తుడుస్తూ.

"లేదు బావా అవి కన్నీళ్లు కాదు. ఆనందభాష్పాలు... సమయానికి నువ్వు రాకపోతే..."

"ష్... పిచ్చిగా మాట్లాడకు. నేను రానిదెప్పుడు? నాకు తెలుసు. మీ అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ అమాయకులు. సులువుగా నమ్మి మోసపోయేంత అమాయకులు. ఎందుకంటే అమెరికాలానే ఇక్కడా ఉంటారని మీ నమ్మకం. మంచి చెడు అనేవి ప్రతి దేశంలోనూ ఉంటాయి. తెలిసి మసలుకోవాలి. మీరు ఇల్లు వదిలిన ప్రతిసారీ మీ వెనక నేను ఉంటూనే వచ్చాను. ఎందుకో తెలుసా? మిమ్మల్ని నమ్మి మావయ్య మీ ఇద్దర్నీ మా దగ్గరకు పంపించాడు. రేపు జరక్కూడనిది ఏమైనా మీకు జరిగితే అమ్మమ్మకి, మావయ్యకి, అత్తయ్యకి మేం ఏం బదులు చెప్పాలి. మీరు చూస్తే చెప్పిన మాట వినేలా లేరు. అందుకే మీకు రక్షణ కోసం నేను మీ వెంట వస్తూనే ఉన్నాను. అలాగే ఇదీ జరిగింది. నేను ఊహించిందే నిజమైంది. సమయానికి మిమ్మల్ని కాపాడకోగల్గాను. ఇట్స్ మై డ్యూటీ డోంట్ వర్రీ... బీ హ్యాపీ" అన్నాడు.

అంతలోనే అనంత్ రావడం చూసి చటుక్కున నవీన్ ని వదిలి ఎడంగా జరిగి నిలబడింది శివాని. అనంత్ వస్తూనే నవీన్ చేతులు పట్టుకొని కన్నీళ్ళతో అతని ముఖంలోకి
చూసాడు.

"మా అమాయకత్వాన్ని క్షమించు బావా! మా కోసం నువ్వు తీసుకున్న శ్రద్ధకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కావడం లేదు. చెల్లాయికి ఏమన్నా జరిగుంటే నా ముఖం ఎవరికీ చూపించలేక ఖచ్చితంగా చచ్చిపోయుండేవాడిని"

"ఏయ్ ఏం మాటలవి?... మేం ఉండగా మీ వంటిమీద ఈగ వాలదు. ఇది మన వూరు... ఇది మన ఇల్లు... మీకు అమెరికా మాత్రమే కాదు... ఇది మీ దేశం... ఇది మీ ఊరు... ఇది మీరు తెలుసుకుంటే ఇక మీద పొరపాట్లు జరగవు. గణపతి నుండి మీకు రావాల్సిన మూడు లక్షలు వడ్డీతో సహా వసూలు చేసి తెచ్చాను. డబ్బులు బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి. తగలేస్తారో, జాగ్రత్తగా పెట్టుకుంటారో మీ ఇష్టం. ఏ శివానీ నిన్న నీకిచ్చిన పదివేలు నేను తీసుకున్నాను. ఆ డబ్బులో పదివేలు తగ్గుతాయి.. అర్ధమైందా? నేను వస్తాను" అంటూ వెనుతిరిగాడు నవీన్.

"బావా ప్లీజ్ నన్ను తిట్టు. నా అసమర్ధతను నిందించు. నేను అప్రయోజకుడిని. నువ్వు కొట్టాల్సింది గణపతి వాళ్లని కాదు బావా నన్ను కొట్టు. నాకు బుద్ధి రావాలి" అన్నాడు అనంత్.

"లేదు అనంత్. ఇది నువ్వు కావాలని చేసిన తప్పు కాదు. మత్తు మందు ఎఫెక్ట్ లేకపోతే నువ్వొక్కడివే వాళ్ళందర్నీ మట్టికరిపించేవాడివి. నాకు తెలుసు. ఇక ఆ విషయం మర్చిపోండి. రెండ్రోజులు మీరు ఎక్కడికీ వెళ్లకుండా ఉంటే మంచిది. త్వరగా కోలుకుంటారు." హెచ్చరించి బయటకు వెళ్లిపోయాడు నవీన్.

అయితే నవీన్ ఊహించినట్టు ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో రెండు పోలీస్ జీపులు మున్నలూరు దూసుకొచ్చి అన్నపూర్ణేశ్వరి ఇంటిముందు ఆగాయి. పోలీసుల వెంట గణపతితోబాటు వాడి ఫ్రెండ్స్ ముగ్గురూ ఉన్నారు. హైద్రాబాద్ పోలీసుల్ని వెంటబెట్టుకొచ్చి, లోకల్ పోలీసులతో కలిసి నవీన్ ను అరెస్ట్ చేయడానికి ఏర్పాట్లతో వచ్చాడు గణపతి. లోకల్ ఎస్సై నవీన్ కు బాగా తెలుసు. జరిగిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.

వీళ్ల రాక గురించి ఊళ్లో తెలిసి పరువుపోయే పరిస్థితి ఏర్పడింది. అయినా ఇప్పుడు కూడా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డాడు నవీన్. వచ్చిన హైద్రాబాద్ ఎస్సైని, లోకల్ ఎస్సైని లోనకు తీసుకెళ్లి విడి విడిగా మాట్లాడాడు.

"వాడు మీకిచ్చిన రిపోర్ట్ తప్పు. వాళ్లని కొట్టి నేను డబ్బు దొంగతనం చేసి తెచ్చానని వాడు ఇచ్చిన రిపోర్ట్ పచ్చి అబద్ధం. అసలు విషయం అదికాదు"అంటూ తను ఉదయం బెజవాడకెళ్లి ప్రింటు వేయించి తెచ్చిన ఫోటోలన్నీ ఎస్సైల ముందుంచాడు. నిజానికి మేం కేసు పెట్టాలి. ఆడపిల్ల పరువుపోకూడదని కేసు పెట్టలేదు. వాళ్ళు ఎన్నారైలు. అమెరికా పౌరసత్వం ఉంది. వాళ్లకి హాని చేసిన, మోసగించిన నేరాలు రుజువైతే శిక్షలేమిటో మీకు తెలుసు. వాళ్లని నేరస్థులుగా చూపడానికి అన్నీ ఆధారాలు నా దగ్గరున్నాయి. అంతేకాదు విదేశీ యువతిపై ఎం.పి. రాజలింగం కొడుకు గణపతి అత్యాచార ప్రయత్నం అని తాటికాయలంత అక్షరాలతో కూడిన హెడ్డింగ్ తో ఫోటోలను న్యూస్ పేపర్లో చూడాలని ఉంటే ఓ.కే. అరెస్ట్ చేయండి. నేను రెడీ" అన్నాడు ఆవేశంగా నవీన్. ఫోటోలు చూశాక, నవీన్ మాటలు విన్నాక వచ్చిన అధికారులకు తల తిరిగినంత పనైంది. అదే సమయంలో నవీన్ అనంతసాయిని, సాయి శివానీని లోనకు పిలిచి వాళ్లచేత కూడా జరిగింది చెప్పించాడు. అనంత్ గాయాలను కూడా వాళ్లకి చూపించాడు.

'మీకు తెలుసో లేదో, అమెరికా సెనేట్ లో పలుకుబడి గల గొప్ప డాక్టర్ మా మావయ్య డాక్టర్ గోపాల్. ఈ విషయం ఆయన నోటీస్ కి వెళితే అమెరికా లెవెల్ కి వచ్చే వత్తిడికి వాళ్లు తట్టుకోగల్గితే ఇప్పుడే నేను మీతో వస్తాను."

ఇక్కడికొచ్చే వరకు అసలు విషయం తెలీదు. కేసు పెడితే ఇది తమ పీకలకు చుట్టుకునే అవకాశం ఉందని అర్ధమైపోయింది. దాంతో ఏ విధమైనా అరెస్టులు లేకుండానే సారీ చెప్పి వెనుతిరిగారు.

బయటకొచ్చాక గణపతి భుజంమ్మీద చేయి వేసి పక్కకు తీసుకెళ్ళాడు.

"రేయ్ గణపతీ! పోటీ అంటూ వస్తే ఎదుటివాడి ముఖం పగలగొట్టే వరకూ నిద్రపోని మనస్తత్వం నాది. నాతో పెట్టుకోవాలని చూస్తే అక్కడ నీ బాబు పునాదులు కదులుతాయి. మీ జాతకం నా చేతిలో ఉంది. మీ నాన్నలాంటి వెధవలకి నరేంద్ర మోడీనో, చంద్రబాబు నాయుడో ప్రైమ్ మినిస్టర్ గా వస్తే సరిగ్గా సరిపోతుంది. ఆ రోజు కూడా దగ్గర్లోనే ఉంది.

ఇక పైన అయినా బుద్ధిగా ఉండు. బాగు పడతావు. వెళ్లు ఇంకెప్పుడూ నా కంటపడే ప్రయత్నం చేయకు" అంటూ హెచ్చరించి వదిలేసాడు.

చేయగల్గింది లేక తలవంచుకొని పోలీసులతో వెనుదిరిగాడు గణపతి. మరోపెద్ద గండం గడిచింది. అన్నాచెల్లెళ్లిద్దరూ తేలికగా ఊపిరి తీసుకున్నారు.

అయితే రామలింగేశ్వర్రావు, రఘునాథ్ ఏం జరిగిందో చెప్పాలని నిలదీసి పట్టుబట్టారు. అప్పుడు కూడా అసలువిషయం బయటపెట్టకుండా దాచాడు నవీన్. నిందను తన మీద వేసుకున్నాడు. మీరు అనవసరంగా కంగారుపడకండి. వాడు ఎం.పి. కొడుకు అని తేలికగా వాడేదో వెధవ పని చేస్తుంటే కొట్టాను. అది మనసులో పెట్టుకుని నా మీద పోలీస్ కేస్ పెట్టాలని చూశాడు. నేను జరిగింది చెప్పడంతో పోలీసులు వెళ్లిపోయారు" అన్నాడు.

"నీకీ మధ్యన అనవసర విషయాల్లో వేలు పెట్టడం ఎక్కువైపోతోంది. నీ పద్ధతి మార్చుకో. ఇంటి పరువు వీధిన పడే పరిస్థితి తీసుకువస్తే క్షమించను. ఇంతవరకు పోలీసులు మన గడప తొక్కలేదు" అంటూ కేకలేశాడు రామలింగేశ్వర్రావు.

తమ పరువు పోకుండా అతడు తీసుకున్న జాగ్రత్తలు శివాని మనసుకు హత్తుకునేలా చేసాయి. నవీన్ అడ్డం పడకపోతే తమ పరువు ఎంత నాశనం అయ్యేదో తలచుకుంటేనే శివానీకి భయం వేసింది. అందుకే ఆ రాత్రి భోజనాలు చేసాక బయటకు వస్తున్న నవీన్ ని చేయి పట్టుకొని పెరట్లోకి తీసుకెళ్ళింది.

"ఏయ్ శివానీ నీకేమైంది?" అంటూ నవ్వుతూ అడిగాడు నవీన్.

"నాకు చాలా బాధగా ఉంది బావా. తప్పు చేశాను. అన్నయ్యా నేనూ ఇక్కడికొచ్చి ఎంత మూర్ఖంగా వ్యవహరించామో తలచుకుంటే బాధగా ఉంది. మా మూలంగా నువ్వు మాటలు పడాల్సి వచ్చింది. నన్ను క్షమించు బావా" చిన్నగా ఏడ్చేసింది.

మాటలు పడ్డందుకు నాకు బాధలేదు. శివానీ. అమ్మ, అమ్మమ్మ, మావయ్యలు, అత్తయ్యలు, మీ అమ్మా నాన్నా అంతా మీరెలా ఉండాలని ఆశ పడుతున్నారో ఆ విధంగా చేసి చూపండి. అప్పుడే నేను క్షమించడం కాదు ఆనందిస్తాను. నిజమైన ఆనందమంటే సరదాగా తిరగడం, మందు తాగి డ్యాన్సులేయడం కాదు. మీ అమెరికాలోని కుటుంబ వ్యవస్థ వేరు. ఇక్కడి కుటుంబ వ్యవస్థ వేరు. ముందు మన పరిస్థితులకి రండి. అప్పుడు మీకు నిజమైన సంతోషం ఏమిటో అర్ధమౌతుంది. వెళ్లి నిశ్చంతగా పడుకో. మనసు ప్రశాంతంగా అవుతుంది" అన్నాడు.

విని మౌనంగా ఉంది.

"ఏమిటి అర్ధమైందా?" అని అడిగాడు.

మౌనంగా తల ఊపింది.

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
gunde godavari