Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anubandhalu-suryadevar ram mohan rao

ఈ సంచికలో >> సీరియల్స్

గుండె గోదావరి - గోపరాజు రాధాకృష్ణ

gunde godavari

గోదావరికి ఏటవాలుగా ఓ పాయ తల్లి గోదావరికీ మధ్య ఓ చిన్న ఊరు రామరాజులంక! వంద పైన గడప. ఓ గుడి, స్కూలు, పంచాయితీ ఆఫీసు, కమ్యూనిటీ హాలు, వేణుగోపాలస్వామి గుడి, కరణంగారిల్లు ఇంకా విసిరేసినట్లు అక్కడోటీ అక్కడోటీ ఇళ్లు... మిగతా అంతా వరిచేలు... కొబ్బరి తోటలూ. ఆ ఊళ్ళోంచి బయటి ప్రపంచంలోకి వెళ్ళాలంటే, గోదావరి పాయ దాటాలి. పాయ దాటాలంటే వరద పడవ ఎక్కాల్సిందే.

*****

గుట్టుపైన పాసింజర్లందరూ పడవలోకి వచ్చాక రై రై అని అరిచాడు. పంక్చర్లేసే అన్నవరం చేత్తో పట్టుకొన్న వెదురుగడని నీళ్లలోంచి నేల తగిలేలా గోదావరిలో గుచ్చాడు వరద. ఒక్కసారి బలంగా కదిపితే పదవ కొంచెం కదిలింది.

'ఆగండాగండి' అంటూ పంచె ఎగ్గట్టి రెండు చేతులతో సైకిల్ ని పైకి పట్టుకొని నదిలో గంతులేస్తూ నీళ్లని చిందిస్తూ వచ్చి పడవ ఎక్కాడు టైలర్ భద్రం ఒగరుస్తూ.

"జాగార్తరా భద్రం... జారతావ్... కూతంత పెందరాళ్ళే రావచ్చుకదరా... నువ్వు చిన్నప్పటి నుంచీ ఇంతే" గువ్వపిట్టలా లోపలకూర్చుని స్పీచ్ ఇచ్చాడు పంచాయితీ ఆఫీసు
క్లర్కు దాసు.

సైకిల్ ని ఓ పక్కగా వాల్చాడు భద్రం.

ఊళ్ళో ఎవరికీ పరిచయం లేని ఒక కొత్త ముఖం మాత్రం ఎవరికీ పట్టనట్టు చూస్తూ ప్రపంచాన్ని చూస్తున్నాడు.

వెదురుగడ గట్టిగా అదిమిపట్టి తడికాళ్ళతో అంచు వెంబడి వడివడిగా అడుగులు వేస్తూ ఈ చివర్నించి ఆ చివరికి వెళ్ళాడు వరద. అక్కడ తెడ్డు తీసుకొని పడవని నడిపించడం మొదలుపెట్టాడు.

నీళ్లలో తెడ్డు కదులుతున్న చిన్న శబ్దంతో గోదావరి అలలపై జారుతూ వెళ్తోంది పడవ. రామరాజులంక నుంచి తడిసిన అంచుల మీంచి తడిసిన తన కాళ్ళతో వడివడిగా నడిచినప్పుడు ఏనాడూ వరద అడుగు తడబడలేదు. వెదురుగడ ఎక్కడ వెయ్యాలో... ఆ చివరికి ఎన్ని అడుగులు వెళ్తే తెడ్డు ఉంటుందో... గాలి వాలు ఎటు ఉంటే పడవని ఎటు నడపాలో... నావని మలుపు తిప్పాలంటే ఒకే వైపు తెడ్డుని ఎంత సేపు ఉంచాలో... ఎక్కడ మలుపు తిప్పాలో... ఎంత వేగంతో వెళ్తే ఒడ్డు ఎన్ని నిమిషాలకు చేరుకోవచ్చో... ఒడ్డుకి ఎంత దూరంలో పడవని ఆపాలో... పడవని నిలిపేందుకు పగ్గం కట్టే రాట ఎక్కడుంటుందో... నీళ్ళు పూటుగా ఉంటే ఎంత వేగంతో వెళ్ళాలో అన్నీ వరదకి కొట్టినపిండి.

'వాలాయన వెలచిన వా దేవుని రీతి విల్లాలే వీ జగతికి జీవనజ్యోతి' అని మూల కూర్చుని పాడిన కిట్టారావు అందరి ముందుకీ వచ్చి చెయ్యి చాస్తున్నాడు. తలా రూపాయి అర్ధా వేస్తున్నారు.

కిట్టారావుకి కళ్ళు కనిపించవు.

పడవ గోదావరి మధ్యకి వెళ్తున్న కొద్దీ గాల్లో చల్లదనం పెరుగుతోంది.

'ఈ చొక్కాలో హీరోలా ఉన్నావురా వరదా... ఇంకో ఏడాది లాగించేద్దామనుకున్నాను గానొరే... మా లేడీసు జాకీటుతో దీన్ని వాషింగ్ మిషన్లో వేసి రంగు అంటించేశార్రా...' అన్నాడు కోళ్ళఫారం భామిరెడ్డి.

ఇక్కడ లేడీసు అనగా బహువచనం కాదు. ఏకవచనమే. భార్య అని అర్ధం.

రంగు అంటుకొన్న ఆ చొక్కాని ఆ ముందురోజే వరదకి ఇచ్చింది భామిరెడ్డి భార్య మంగళగౌరి.

'ఇదో ఎరైటీగా ఉందన్నాదండి మా నీలమ్మ' తెడ్డు కదుపుతూనే సమాధానం ఇచ్చాడు వరద.

వరద భార్య నీలమ్మ.

ఇంతలో భామిరెడ్డి దగ్గరికి కిట్టారావు వచ్చాడు.

'నీ స్టోను సూపర్రా కిట్టారావు... టీవీ ప్రోగ్రాముల్లో పెడెయ్యచ్చు నువ్వు' అంటూ పై జేవులోంచి ఐదు రూపాయల బిళ్ల తీసి కిట్టారావు చేతిలో వేశాడు.

స్టోను అనే మాట విని తనలో తనే నవ్వుకున్నాడు కొత్త ముఖం.

పడవలో ఉన్న ఇరవైమంది గుంపులుగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

'గిరాకీ ఎలా ఉందిరా భద్రం' ఎల్లయిసీ ఏజంట్ సూరిబాబు అడిగాడు.

అందరూ రెడీమెంట్ కి ఎల్పోతుంటే ఇంకేముంటది... ఈగలు దోమలూను' అని నిర్వేదంగా నవ్వాడు భద్రం కిట్టారావు చేతిలో అర్ధరూపాయి వేస్తూ.

'అందుకేనేట్రా దోమల బ్యాట్ కొన్నావు...' వెటకారంగా అన్నాడు సూరిబాబు. నవ్వులు... కిట్టారావు కొత్త మొహం దగ్గరికి వచ్చాడు. కొత్త మొహం ఏం స్పందించలేదు. కిట్టారావు పక్కకి తిరిగాడు. బుకింగుల్లేని ఫేమస్ స్టేజీ ఆర్టిస్టు నాగరాజు తనలో తానే 'ఇచ్చోటనే...' పద్యం పాడుకుంటున్నాడు.

కిట్టారావు రావడాన్ని చూసి పద్యం పాడుతూనే జేబు వెతుక్కున్నాడు.

విషయం అర్ధమయ్యి కిట్టారావు పక్క ప్యాసింజర్ దగ్గరకి వెళ్ళిపోయాడు.

ఆరెంపీ డాక్టర్ రామావతారానికి ఆరు మాసాలు సైకిల్ తొక్కి డాక్టరుగా బోర్డు పెట్టేసుకొన్న కేశవులు... పురిటికి వెళ్ళిన భార్యతో సెల్ లో తెగ మాట్లాడుతున్నాడు భద్రం సైకిల్ కి ఆనుకొని. కిట్టారావుకి రెండ్రూపాయలు ఇచ్చాడు.

చేపలు పట్టే అబ్బులు తన పని పూర్తి చేసుకొని వల పడవలోకి లాగాడు. అక్కడికక్కడే బేరం పెట్టేశాడు.

నిమిషాల్లో రెండొందలు జేబులో వేసుకున్నాడు. వరదకి ఓ చేప ఇచ్చాడు.

పండగ చేసుకో... అన్నాడు.

'అదే సేత్తో నీలమ్మకి ఇవ్వరా' అన్నాడు వరద.

'తవరు ఎవరి తాలూకండి బాబూ...' కొత్త మొహాన్ని అడిగాడు ఫంక్చర్లేసే అన్నవరం.

అన్నవరాన్ని సీరియస్ గా చూశాడు కొత్త మొహం.

ఏటిగట్టు దగ్గరికి వచ్చింది పడవ. అలవాటు ప్రకారం దేవదాసు డబ్బులేం ఇవ్వకుండానే దిగిపోయాడు.

మిగతా వాళ్ళందరూ తలో రూపాయి రెండ్రూపాయలు... ఎవరికి తోచింది వాళ్ళు సత్తు గిన్నెలో వేశారు...

ఎన్ని టపాటపా చప్పుళ్ళు వస్తున్నాయో లెక్కపెట్టుకున్నాడు వరద. అందరూ వెళ్ళాకా డబ్బులు లెక్కపెట్టుకున్నాడు శూన్యంలోకి చూస్తూ.

పడవ దిగడానికి నానా ఇబ్బంది పడి, కొత్త మొహం పడవ అంచుమీద చెయ్య వేశాడు. బయటకి వెళ్ళడానికి. చిల్లర డబ్బులు లాగు జేబులో వేసుకొని, సత్తు గిన్నెని పడవ చెక్కకి కట్టేసి లోపలికి వెళ్దామని అంచుమీద అడుగు వేశాడు వరద. వరద పాదం కింద కొత్త వాడి చెయ్యి ఉండి పోయింది.

'ఛమించండి బాబూ సూసుకోలేదు...' అన్నాడు వరద.

'ఏమయ్యా... కళ్ళు కనపడట్లేదా' కసురుకున్నాడు కొత్తవాడు.

'నాకు నిజంగానే కళ్ళు కనపడవండి... నా సూపు లోపలికి తిరిగిపోయింది బాబూ' వెదురుగడ కోసం వెతుకుతూ అన్నాడు వరద. కొత్తవాడు కొయ్యబారిపోయాడు.

కాలేజీ పిల్లలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు, పస్తున్నవాళ్లు... ఇలా ఎందర్నో వరద అవతల ఒడ్డుకి చేరుస్తాడు. అక్కణ్ణించి భద్రంగా రామరాజులంక తీసుకొస్తాడు. రోజుకి ఏడెనిమిదిసార్లు పడవ అటూ ఇటూ తిప్పుతాడు. పొద్దున్న, సాయంత్రం పడవ నిండా ప్యాసింజర్లుంటారు గానీ... ఒక్కోసారి ఇద్దరు ముగ్గురితో కూడా వెళ్లవలసి వస్తుంది.

ఎందరు పడవెక్కారు... ఎన్ని డబ్బులొచ్చాయి అన్నిది ఒక్కటే వరద ఆలోచన కాదు. తన పడవపైన అవతల ఒడ్డుకు వెళ్లాలనుకున్నవారెవరూ ఎక్కువ సేపు నిలబడకూడదు. అవతలవైపు తీస్కెళ్ళి పడెయ్యాల్సిందే.

వరద పైన ఊరంతటికీ ఎంతో నమ్మకం. ఇరవై సంవత్సరాల్లో అతని పాదం గానీ పడవగానీ గోదాట్లో తొణికిన దాఖలాల్లేవు. అతనికి కళ్ళు లేవన్నమాటే గానీ... మిగతా అంతా ఒక తెలివైనపడవవాడు.

ఊళ్ళో జనాలు అతనికి బట్టలిస్తారు. బియ్యం ఇస్తారు. కూరగాయలిస్తారు. పప్పులు ఉప్పులు ఇస్తారు. వీటితో తిని, పడవమీద వచ్చే డబ్బుల్ని దాచుకుంటారు వరద. బ్యాంకులో పనిచేసే శేషాచార్యులు గారబ్బాయి కృష్ణమాచార్యులుగారు ఈ డబ్బుల్ని బ్యాంకులో దాస్తారు. పదీపరకా సాదరు ఖర్చుకి దాచుకుంటారు. వరద, నీలమ్మ. నీలమ్మ కూడా ఖాళీగా ఉండదు. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనులు చేస్తోంది.

ఆ రోజు పెద్దగా ప్యాసింజర్లు లేరు. పైగా అబ్బులు చేప ఇచ్చినప్పటి నుంచీ దాని మీదే ధ్యాసంతా. చాలా రోజులైంది చేపల పులుసు తిని. నాలిక పీకేస్తోందతనికి.

ఆ రాత్రి చేపల పులుసు వేసుకొని కడుపునిండా అన్నం తిని, రోజూలాగే రేడియో వింటూ పడవలో పడుకున్నాడు వరద. గోదారమ్మ ఉయ్యాల ఊపుతున్నట్టు పడవ ఊగుతోంది. ఏటిగట్టు పైన గుడిసెలో నీలమ్మ తడక అడ్డుపెట్టుకొని ఒకత్తే పడుకుంది.

మర్నాడు ఉదయమే పడవ ఎక్కుతూ కోళ్లఫారం భామిరెడ్డి ఓ విషయం చెప్పాడు.

'వరదా... సత్యానంద్ అని ఓ కుర్రాడు నీ పడవలో వెళ్లేవోడు గుర్తుందా... మన రాంబాబుగారి కొడుకు... ఆయనగారు కలక్టరయ్యాడంట తెలుసా...' గుర్తు చేయడానికి ప్రయత్నించేశాడు భామిరెడ్డి.

'సత్యానందా... గుర్తొచ్చింది... పడవలో కూడా సదూకుంటూ ఉండేవోడని మిగతా పిల్లలు సెప్పేవోరు... ఆయన కలక్టరయ్యాడా... చాలా సంతోసం రెడ్డిగారూ...' ఆనందంగా అన్నాడు వరద.

'ఆయనగారు రేపు మన ఊరు వస్తున్నార్రా... మన ఊరు కుర్రోడు కలక్టరయ్యారంటే మనకి ఎంతో ఇది కదా...' భామిరెడ్డి కూడా చాలా ఆనందపడుతున్నాడు.

వరదరాజులుకి ఎంతో సంతోషంగా ఉంది. ఏదో తన కొడుకే కలక్టరయినట్టు తెగ సంబరపడిపోతన్నాడు. ఆ రోజు పడవ కట్టేసి ఇంటికొచ్చాక కూడా సత్యానంద్ ని ఎన్నోసార్లు తలుచుకున్నాడు. నీలమ్మకి కనీసం పదిసార్లు చెప్పి ఉంటాడు.

'నీకేమైనా సాయం సేత్తాడేమోలే...' అంది నీలమ్మ.

'మనం అడుగుతామేంటి... అరే సేత్తేరా... మనల్ని మర్సిపోదు' వరద ఆనంద గోదావరి అయింది.

సత్యానంద్ వస్తున్నాడని గురువయ్యని పిలిపించాడు. గడ్డం చేయించుకొన్నాడు. కరణంగారబ్బాయి ఇచ్చిన తెల్లచొక్కా తగిలించాడు. ఎప్పుడూ నీళ్లలో నానే కాళ్లకి చెప్పులు వేసుకున్నాడు. నీలమ్మ చేత కొబ్బరి నూనె రాయించుకొని, తల దువ్వించుకున్నాడు.

ఆ మర్నాడే అట్టహాసంగా మందీ మార్బలంతో సత్యానంద్ వచ్చాడు. వరద దగ్గరకొచ్చి మరీ ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. తన పడవపైనే సత్యానంద్ ని రామరాజులంక తీసుకెళ్లాడు వరద. ఊరు ఊరు మొత్తం సత్యానంద్ ని అభినందించడానికి తరలి వచ్చింది.

పూల దండలు, ఫోటోలు, టీవీ కెమెరాలు, బొకేలు, తోరణాలు... అంతా పండగ వాతావరణం. సత్యానంద్ సన్మానసభకి వరదని చేయిపట్టుకొని తీసుకెళ్లింది నీలమ్మ. సత్యానంద్ ఏం మాట్లాడతాడో విందామని వరదే బలవంతంగా బయల్దేరదీశాడు.

సత్యానంద్ రామరాజులంక జనానికి ఒక హామీ ఇచ్చాడు.

గోదావరి పాయమీద వంతెన కట్టిస్తానన్నాడు. రోజు పాయ దాటాల్సిన అవసరం లేకుండా ఊరు మొత్తం వంతెనపైన వెళ్ళొచ్చని చెప్పి వెళ్ళిపోయాడు. ఊరు వరదలో మునక్కుండా కూడా ఆలోచిస్తాననీ అన్నాడు.

వరద మనసు కల్లోల గోదావరి అయ్యింది.

గోదావరి పాయమీద వంతెన పడితే... తరువాత తన పరిస్థితేంటి?...

సత్యానంద్ మాటలు గుర్తు చేసుకుంటూ, ఆ రోజు వరద పడవలోనే పడుకున్నాడు.

కానీ రేడియో మోగట్లేదు. గోదారమ్మ పడవని ఉయ్యాల్లా ఊపుతున్నా నిద్ర పట్టలేదు.

గుడిసెలో నిద్రపోతున్న నీలమ్మని లేపి, ఈ విషయం చెప్పాడు.

'ఎలా జరగాలంటే అలా జరుగుత్తి... ఎల్లి పడుకో' అని పైకి వరదరాజుల్లో అనేసింది గానీ నీలమ్మ మనసు లోనూ ఆందోళన మొదలైంది.

సత్యానంద్ అ మాటలు ఆన్నప్పటి నుంచీ నీలమ్మకి కూడా ఆందోళనగానే ఉంది.

'ఏదో చేత్తాడని అనుకుంటే సత్తానంద్ బాబూ ఇలా సేశాడేంటి... ఈ పిచ్చోడేమో అతనేదో చేత్తాడని ఎదురు సూశాడు. ఈ గోదారమ్మతో బందం తెగిపోవాల్సిందేనా...' నీలమ్మ కళ్లల్లో గోదావరి పాయ.

గుడిసె తడక పక్కకి పెట్టిన శబ్దం విని కళ్ళు తుడుచుకుంది నీలమ్మ. నిద్ర నటిస్తూనే ఉంది. మళ్ళీ నీలమ్మని తట్టాడు వరద.

అటు తిరిగి పడుకున్న నీలమ్మ ముందు తల ఒకటీ తిప్పి, తరవాత తిగంది. లాంతరు వత్తి పెంచింది. వంతెన ఏసెత్తారంటావా...' అని అడిగాడు బేలగా మొహం పెట్టి.

నువ్వు ఎందుకు దాని గురించి అంత ఆలోసిత్తన్నావు... పడుకో. పొద్దునే ఆలోసిద్దాంలే...' సర్ది చెప్పింది నీలమ్మ. వంతెన విషయం ఎంత మరిచిపోదామని ప్రయత్నించినా కుదరట్లేదు వరదకి.

మర్నాడు పడవలో వంతెన విషయాన్ని ఎల్లయిసీ ఏజంట్ సూరిబాబుతో అన్నాడు వరద.

'ఆళ్లు అలా హామీలిచ్చి ఎల్పోతారు... అనక పట్టించుకొనేవాడే ఉండడు... ఎన్ని చూళ్లేదు... మన కష్టాలు మనవే... మన వరదలు మనవే' అని సూరిబాబు అంటే వరద మనసులో ఎక్కడో చిన్న ఆనందం... పది రోజుల తరువాత వరద సూచిక రానే వచ్చింది. వర్షాలు మొదలయ్యాయి.

******

రామరాజులంక ఊళ్ళో చాలా ఇళ్లు నేల మట్టానికి ఉండవు. కనీసం ఓ పదిఅడుగుల ఎత్తునే కట్టుకుంటారు.. కారణం... వరద! ఆ వూళ్ళో ప్రతి గడపనీ పలకరించాలని గోదావరికి అనిపిస్తుందో ఏమో వరద రూపంలో ఊరంతా కలియదిరుగుతుంది. అప్పుడు ఊరు కనిపించదు. అంతా గోదారమ్మ రాజ్యం. అప్పుడు పాయ దాటడం ఉండదు. ఎటు చూసినా నీళ్లే. ఊళ్లోకి నీళ్లు వస్తే అసలు రామరాజులంక అనే ఊరే పటంలో ఉండదు. తాత్కాలికంగా. నీళ్ల పైనే కనిపించే సగం గుడి గోపురం, కొన్ని ఇళ్లను బట్టి ఇక్కడో ఊరుండేదనుకోవాల్సిందే.

పల్లంలో ఇళ్ళున్నవాళ్లు తట్టా బుట్టా కమ్యూనిటీ హాల్లో దాచుకొని పాయదాటి వెళ్లిపోతారు. వరద తీశాకా తిరిగి ఇళ్లకి వస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ సాధారణంగా జరిగేదే. ఎత్తులో ఇళ్లున్నవాళ్లు మాత్రం కదలాల్సిన అవసరం ఉండదు.

వరదకి గుడి గోపురం సగం మునిగిపోతుంది. అప్పుడు కూడా శేషాచార్యులవారు ఊరుకోరు. ప్రసాదం గిన్నెతో వరద పడవెక్కి ఆ గోపురానికి దగ్గరగా వెళ్లి పడవలోంచే నైవేద్యం పెడతారు. దేవుడు నిండానీళ్లలో ఉన్నా నైవేద్యానికి ఆటంకం ఉండకూడదంటారాయన. ఈ సారీ అలాగే నైవేద్యం పెట్టారు.

నీళ్లలో గుచ్చినట్టు కనిపించే చెట్లతలల్ని, లైటు స్తంభాల్ని తప్పించుకుంటూ ఆచార్యుల వారు దారి చూపిస్తుంటే గుడి వరకు పడవను తీసుకెళ్తాడు వరద. అక్కడ పడవను నిలపడం సాధ్యం కాదు గనక గోపురం చుట్టూ పడవ తిప్పుతూ ఉంటాడు. ఆచార్యులవారు తనలో తాను మంత్రాలు చదువుతూ ఉంటారు.

వరద కనీసం ఐదు రోజులు ఉంటుంది.

ఈ ఐదు రోజుల్లోనూ ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో జనాలు వరద చూడ్డానికి వస్తారు. వాళ్ళందర్నీ వరద తన పడవపైన తిప్పి చూపిస్తాడు. వరదకి కళ్ళు కనబడవు గనుక పడవ ఎక్కినవారే దారి చెబుతూ ఉంటారు.

పాయ దాటించే డబ్బులు రాకపోయినా ఆచార్యుల వారు ఇచ్చేవీ, వరద చూడ్డానికి వచ్చే జనాలు ఇచ్చేవీ డబ్బులతో వరద పరిస్థితి బాగానే ఉంటుంది.

ఐదు రోజులకు గోదారమ్మ పలకరింపులు అయ్యాయి. వరద ఊళ్ళోంచి వెళ్ళిపోయింది. పరిస్థితి సాధారణం అయిపోయింది.

మళ్లీ రామరాజులంక నుంచి పడవ దాటే జనాలు పెరిగారు.

మళ్ళీ కోళ్ళఫారం భామిరెడ్డి, చేపలు పట్టే అబ్బులు, టైలర్ భద్రం, పంచాయితీ ఆఫీసు క్లర్కుదాసు, కిట్టారావు, ఎల్లయిసీ ఏజంట్ సూరిబాబు, కేశవులు, బుకింగుల్లేని ఫేమస్ స్టేజీ ఆర్టిస్టు నాగరాజు వగైరా వగైరా మామూలే.

ఒక నెల తరువాత పేపర్ కి వార్తలు రాసే జవహర్ లాల్ పడవెక్కాడు.

'వచ్చే నెల వంతెన పనులు మొదలవుతాయి... మన కలట్రు గారు కొబ్బరికాయ కొడతారంట...' అన్నాడు. వరద మనసు సుడిగుండంలో చిక్కుకుంది.

వంతెన పనుల కోసం ముందుగా పాయకి నీళ్ళు ఆపేశారు.

ఎప్పుడూ కళకళలాడే నీళ్ళలో ఉయ్యాల్లా ఊగే పడవ రెక్కలు తెగ్గొట్టిన పక్షిలా ఓ పక్కన పడుంది.

పడవ అంచుమీద చక చకా అడుగులేసే ఆ పాదాలు గుడిసె గుమ్మం దగ్గరే ఆగిపోయాయి.

వరదలో కొట్టుకుపోతూ ఆధారం కోసం తహతహలాడుతున్న నిస్సహాయ జీవిలా ఉందతని మనసు.

పడవలోకెళ్లి పడుకుందామనుకున్నాడు. కానీ నీళ్లు లేని గోదావరిలో బురద వల్ల విపరీతమైన వాసన వస్తోంది. గుడిసెలోనే కోడి కునుకు తీశాడు.

చూస్తూ చూస్తుండగానే వంతెన స్తంభాల పని పూర్తయింది. మళ్ళీ పాయలోకి నీళ్లు వదిలారు. వరదకి రవ్వంత ఊరట.

మళ్ళీ పడవపైన ప్రయాణం మొదలైంది. కానీ ఈ విషయం వరదని పెద్దగా సంతృప్తి పరచలేకపోయింది. ఎందుకంటే వంతెన ఓ పక్క వేగంగా తయారైపోతోంది. పడవ నడుపుతున్నంతసేపూ అతనిదే ఆలోచన. ఓ రోజు... పడవ అంచుమీద నడుస్తూ తెడ్డు తీసుకోవడానికి ఆ పక్కకి వడివడిగా వెళ్తుండగా అడుగు కొంచెం అవతలవైపు పడింది.

గోదావరిలో పడిపోయాడు వరద.

సూదిగా ఉన్న రాయి వరద తలకి తగిలింది. తెడ్డు నిలపడం కోసం దిగ్గొట్టుకున్న మేకులు రెండు అతని కడుపు మీద చీరేశాయి. వరదకి నెత్తురొస్తోంది.

ఎల్లయిసీ ఏజంట్ సూరిబాబు, కిరాణాకొట్టు సూన్నాణ, కాఫీ హోటల్ బుల్లెబ్బాయి గబగబా పైకి లాగారు. గట్టుమీద పడుకోబెట్టారు.

కేశవులుగాడికి కవురెట్టండ్రా...' అని నాటకంలో పద్యం అందుకున్నట్టు గట్టిగా అరిచాడు స్టేజీ ఆర్టిస్టు నాగరాజు.

అంతా మూగారు.

టెలిఫోన్ బూతు సత్తిరాజు న్యూస్ పేపర్ తో విసిరాడు. బళ్ళో గంట కొట్టే వీరన్న గోదారిలో నీళ్ళు తీసి వరద ముఖానికి కొట్టాడు. ఈ లోగా డాక్టర్ కేశవులు వచ్చాడు. కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చాడు.

'పది రోజులు కదలకూడదు మరి...' అన్నాడు కేశవులు.

పాయల్లోకి నీళ్ళొచ్చినా ట్రిప్పుల్లేకుండా పోయాయి వరదకి.

పడవకి పూర్తిగా పనిలేకుండా పోయింది. బ్యాంకులో డబ్బులు తీసుకొని తినాల్సిన పరిస్థితివచ్చింది.

ఊళ్లోవాళ్ళు బట్టలివ్వట్లేదు... కూరగాయల్లేవు... ఊరగాయల్లేవు... చేపల్లేవు... మనసు పులకరించే పలకరింపులు లేవు... ఏవీ లేవు. అస్సలు వరదని ఎవరూ పట్టించుకోవట్లేదు. వరద అనే మనిషి ఉన్నాడన్న విషయాన్నే మర్చిపోయారు.

వరద గుండె చెరువైంది... చెరువేంటి ఏకంగా గోదావరే అయింది.

వంతెన కింద నుంచి గోదావరి నీళ్లు దర్జాగా అటూ ఇటూ కదులుతున్నాయి.

పడవలేదు. జీవితం లేదు... పడవలాగే జీవితం కూడా అర్ధంతరంగా ఆగిపోయింది.

అంతా చిమ్మచీకటి... గోదారమ్మ అలల సవ్వడి...

మనుషుల మాటలేవీ వినిపించట్లేదు.

అతనికి కళ్ళు కనిపించకపోవడం ఏనాడూ లోటుగా అనిపించలేదు... కానీ ఇప్పుడు అనిపిస్తోంది. దిగులుగా గుడిసె గుమ్మం దగ్గర కూర్చుంటున్నాడు. వరద... వరద కోసం ఎదురు చూస్తూ.

 

మరిన్ని సీరియల్స్