Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raju ledu geeju ledu

ఈ సంచికలో >> కథలు >> అమ్మ కావాలి

amma kavali-p.k.jayalakshmi

సావిత్రమ్మ మంచం లో ఇబ్బందిగా కదలడం గమనించిన  హరినాథ్ "అమ్మకి బెడ్ పాన్ పెట్టాలనుకుంటా హారతీ ఒకసారి ఇట్రా!" అంటూ లోపలికి తొంగి చూస్తూ భార్యని కేకేసాడు . "ఆ ఇదుగో వచ్చేస్తున్నా!" అంటూ చేతిలో గిన్నె డైనింగ్ టేబిల్ మీద పెట్టి కిచెన్ లోంచి బైటకొచ్చింది హారతి. "అత్తయ్యా కాస్త జరగండి!" అని బెడ్ పాన్ అమర్చి పనిపిల్ల సాయంతో ఆమెకి స్నానం చేయించి నైటీ వేసి మంచం మీద వేరే దుప్పటి మార్చి పడుకోబెట్టింది. "అమ్మ కాళ్ళకి నేను నూనె రాస్తూ ఉంటా! ఈలోగా అన్నం కలిపి పట్రా హారతీ!" అన్నాడు కప్ బోర్డ్ లోంచి ఆయిల్ సీసా అందుకుంటూ. "సరే" అంటూ చారులో తిరగమోత వేసి కంచంలో వేడిగా అన్నం టమాటో పప్పు చారుతో మెత్తగా కలిపి వంకాయ కొత్తిమీర కారం కూర పక్కన వేసి చిన్న కప్పులో పెరుగుతో అత్తగారి దగ్గర కొచ్చి పని పిల్లని మంచినీళ్లు తీసుకురమ్మని పురమాయించింది. "అత్తయ్యా నోరు తెరవండి" అంటూ ముద్దలు కలిపి తినిపించసాగింది.

హారతీ హరినాథ్ ఈమధ్యే షష్టిపూర్తి చేసుకున్నజంట. హరిది పెద్ద కుటుంబం. ఏడుగురు పిల్లలు. తండ్రి చనిపోయి పన్నెండేళ్ళవుతుంది. నలుగురన్నదమ్ముల్లో హరి మూడోవాడు ఇంకా ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు. తల్లి సావిత్రమ్మ ఎంతో ఓపిగ్గా పిల్లలందర్నీ ప్రయోజకుల్ని చేయడంలో భర్తకి తోడుగా నిలబడింది. అందరూ చదువుకొని జీవితంలో బాగానే స్థిరపడ్డారు... రెండో కొడుకే కొంచెం వెనకపడ్డాడు! సరైన ఉద్యోగం లేకపోవడంతో మొదట్నించి హరి ఇంట్లోనే కింద వాటాలో నామమాత్రపు అద్దె కడుతూ భార్యాపిల్లలతో ఉంటున్నాడు. అతని ఆర్థిక పరిస్థితి తెలిసిందే కనుక తమకున్నంతలోనే వాళ్ళని చేరదీశారు హరి, హారతి. ఉన్నట్టుండి ఒక రోజు ఏదో విషజ్వరం సోకి అన్నగారి భార్య కన్ను మూయడంతో ఆయనకి, పిల్లలకి వీళ్ళే దిక్కయ్యారు. హరికి కొడుకు ఒక్కడే కానీ అతని పై ఆధారపడిన వాళ్ళు మాత్రం నలుగురు. కొడుకు శ్యామ్ ఇంజినీరింగ్ అయ్యాక పెద్దవాళ్ళు చెప్పిన పిల్లనే చేసుకొని ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు.

ఇంచుమించు డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చేవరకు సావిత్రమ్మ వంతులు వేయకుండా వంకలు పెట్టకుండా యంత్రం లా చాకిరీ చేస్తూనే ఉండేది.  కానీ ఆ రోజు  పెరాలి సిస్ రాకుండా ఉన్నట్టైతే ఎలా ఉండేదో! కాళ్ళూ చేతులూ ఆడుతున్నంత కాలం ఆవిడ సేవలు అందరూ బాగానే వాడుకున్నారు. అసలు సమస్య అప్పుడు మొదలైంది... ఆవిడ ఎవరి దగ్గర ఉండాలి? ఆస్తులు ఆనందంగా ఆడ మగ సమానంగా పంచుకున్నారు గాని ఇన్నేళ్లు నోరెత్తకుండా ఇంటిల్లిపాదికీ చాకిరీ చేసిన ఆ తల్లి కి సేవ చేయడానికి  తర్జనభర్జనలు మొదలయ్యాయి... హరి, పెద్దన్న, తమ్ముడు ఇద్దరూమంచి పొజిషన్ లోనే ఉన్నా తల్లిని తమతో తీసుకెళ్లడానికి సిద్ధంగా లేరు. తమ్ముడి పిల్లలు చిన్నవాళ్లు, మరదలికేమో ఉద్యోగం ! పెద్దన్న భార్యామణి అయితే మొహమాటం లేకుండా చెప్పేసింది "నేను పిలిచినపుడు ఆవిడ  నా కూతుళ్ళు పురుళ్లూ అనుకుంటూ రాలేదు! ఇప్పుడు ఆవిడ వస్తానన్నా నేను చేసే పరిస్థితి లో లేను" అంటూ.

ఇక కూతుళ్ల సంగతి సరే సరి! ఎంతసేపూ పుట్టింటి నించి ఆశించడమే గాని అయ్యో అన్నదమ్ములతో సమానంగా ఆస్తులు పంచుకున్నాం. అలాగే అమ్మ బాధ్యతని కూడా తీసుకుందాం, ఆవిడ మన కోసం ఎంత కష్టపడిందీ అని పొరపాట్న కూడా అనుకోరు! దేవుడు ఎవర్నీ ఎప్పుడు నిర్దయగా వదిలేయడు కదా! మూడో కొడుకు హరినాథ్ కి తల్లి పట్ల విపరీతమైన  ప్రేమ, దాంతో సావిత్రమ్మ బాధ్యతని తానే తీస్కుంటానని ముందుకొచ్చాడు. భార్య  హారతి కూడా అనుకూలవతి కావటంతో వ్యతిరేకత ఎదురవలేదు. తల్లి బాధ్యత కనీసం వంతులవారిగా కూడా తీసుకోవడానికి ముందుకు రాని ఈ ప్రబుద్ధులు నెలకోసారి ఆవిడ మీద ప్రేమ కారిపోతున్నట్లు   చేతులూపుకుంటూ హరి ఇంటిని విజిట్ చేస్తూ ఉంటారు. పోనీ పెద్దావిడకి ఏమీ తేకపోయినా కనీసం ఒక రోజు సర్వీస్ అయినా చేయరు. పై పెచ్చు 

ఆడపిల్లలైతే  హారతిని "మా అమ్మని సరిగ్గా చూస్తున్నారా? టైమ్ కి మందులు వేస్తున్నారా? వేళ పట్టున అన్నం పెడుతున్నారా?" అంటూ ఎంక్వయిరీలు! ఇక కొడుకులిద్దరూ అయితే భార్యా పిల్లలతో వచ్చి ఒక్క పనిలో కూడా సాయం చేయకుండా సినిమాలకి, షాపింగ్ లకి తిరిగేసి వెళ్లిపోయేటప్పుడు మాత్రం "అమ్మా! ఆరోగ్యం జాగ్రత్త" అని చిలక పలుకులు పలికేసి "వస్తాం రా హరీ ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్" అంటూ చక్కాపోతారు. వీళ్ళు వస్తే హారతికి డబల్ వర్కే! తోటికోడళ్ళు తీరిగ్గా కాళ్ళు జాపుకుని టీవి చూస్తూనో సెల్ మాట్లాడుకుంటూనో పని జోలికి రాకుండా పై పైన మెరమెచ్చు కబుర్లు ఒకటి "అయ్యో హారతీ మీకు చాలా బర్డెన్ పడిపోయింది. పోనీ కొన్నాళ్లు మేం తీసుకువెళ్దామన్నా ఆవిడ మా దగ్గరకి రారు కదా! ఎంతైనా అత్తగారికి మీరంటేనే ఇష్టం" అనడం. అత్తగారికి సేవ చేయడం అటుంచి కనీసం తమ పిల్లలకైనా వండి పెట్టుకోరు. "హారతీ! అదేంటోగాని మా పిల్లలికి నువ్వు చేసే ఐటమ్స్ నచ్చుతాయి!" అనో "అయ్యో వాడికి ఉత్తి పాలు ఇచ్చావా? బోర్నవిటా తప్పమరోటి  తాగడు" అనో రకరకాల కోరికలతో ఊదరగొట్టేస్తారు.

హారతి క్కూడా వయసు మీద పడుతోండడంతో మోకాళ్ళ నెప్పులు, లో బి.పి పలకరించాయి. తనకి ఓపిక ఎక్కువనే చెప్పాలి దానికి తోడు తాను పెద్ద ఫ్యామిలి నించి రావడంతో బంధుప్రీతి, మొహమాటం రెండూ ఎక్కువే. పెద్దవారంటే భక్తి గౌరవం. ఆపైన భర్త ఒకసారి చెప్పిన మాటలు ఆమె మనసులో నాటుకుపోయాయి. "హారతీ! అమ్మ మమ్మల్ని కంటికి రెప్పలా పెంచింది. ఈ వయసులో ఆవిణ్ణి జాగ్రత్తగా చూసుకోవడం మనధర్మం! మా వాళ్ళెవరూ పట్టించుకొవట్లేదు కాబట్టి మనం కూడా వదిలేయాలని అనుకోవద్దు మనం ఎవరితోనూ పోల్చుకోవద్దు. నేను ఒక్కడే కొడుకునయ్యుంటే ఏం చేసే వాళ్ళం? మా అమ్మ నా దగ్గర ఉంటే నాకెంతో ధైర్యం, సంతోషం. నాకు అమ్మ కావాలి. నా మాట కాదనవు కదా!" అని హరి జాలిగా అడిగేసరికి హారతి మనసు ద్రవించిపోయింది. తన తల్లి లాటిదే కదా భర్త తల్లి కూడా! అత్తగారు కూడా ఏ మాటకామాట చెప్పుకోవాలి కోడళ్ళనెప్పుడూ పల్లెత్తు మాట అని ఎరుగదు. అలాటిది ఆవిడని తను  ఎలా కాదంటుంది? కానీ ఇలా చూడ్డానికి వచ్చే పోయేవాళ్ళ వల్లే వీళ్ళకి తలనెప్పిఎక్కువౌతోంది.

కాలేజీ లో చదువుకునే రోజుల్లో కొడుకు శ్యామ్ బాధపడేవాడు "ఏంటమ్మా నీకు రెస్ట్ అనేదే లేదు. పెదనాన్న ఫ్యామిలీకి నాన్నమ్మకి  నువ్వే చాకిరీ చేయాలా? మనం ముగ్గురం హాయిగా ఉండకుండా వీళ్ళందరూ ఎందుకు మనతో? నాన్నమ్మని బాబాయి దగ్గరకి పంపేయమని డాడీ కి చెప్దాం" అంటే వాణ్ని కోప్పడింది. "తప్పు నాన్నా నీకు నేనెంత ముఖ్యమో డాడీకి కూడా వాళ్ళ అమ్మ అంతే కదా! డాడీ వింటే బాధ పడతారు. ఎప్పుడూ అలా అనకేం!" అంది కానీ మనసులో కొడుక్కి తన మీద ఉన్న ప్రేమకి ఎంతో పొంగి పోయింది.

కాలం గడుస్తూనే ఉంది. కొడుకు పెళ్లి ఘనంగానే చేశారు. ఆస్ట్రేలియా లో ఉద్యోగం రావడంతో భార్యాసమేతంగా వెళ్లిపోయాడు. శ్యామ్ కి కొడుకు పుట్టినా వియ్యంకులు వెళ్లారు గాని తను వెళ్లలేకపోయింది. అత్తగారి బాధ్యతని నెలరోజులు కాదు నాల్రోజులు కూడా తీస్కోడానికి ఎవరూ ముందుకి రాలేదు. ఆవిడనలా ఆమె ఖర్మానికి వదిలేసి వెళ్లడానికి మనస్కరించలేదు. కొన్నాళ్ళకి కొడుకు, కోడలు వచ్చి మనవడిని చూపించి వెళ్లారు. వాడి పెళ్ళయి నాలుగేళ్ళు కావస్తున్నా పట్టుమని పది రోజులైనా కొడుకు కాపురం చూడ్డానికి తాము వెళ్లలేకపోయామని ఎన్ని సార్లు మధన పడిందో ఆ దేవుడికే తెల్సు! చాలాసార్లు అడిగి అడిగి విసిగిపోయాడు. ఇదిగో మళ్ళీ వచ్చేవారం వస్తున్నాడు. ఈసారి మాత్రం ఇంక ఒప్పుకోడు. ఎలాగైనా తమ దగ్గరకి వచ్చేయమని పట్టుబడతాడు. వాడు నా బంగారం! ఊహ తెలిసినప్పటి నుంచి  అమ్మ కష్టాలు చూస్తున్నాడు కదా! ఎప్పుడూ "నాకు జాబ్ వచ్చాక మా అమ్మ నాతోనే ఉంటుంది. ఏం కావాలంటే అవి కొనిపెడతాను. కార్లో తిప్పుతాను." అంటూ ఉండేవాడు. పిచ్చి తండ్రి ఎలా ఉన్నాడో? ఏం తింటున్నాడో? అనుకుంది హారతి అత్తగారి నోట్లో ముద్ద పెడుతూ. సావిత్రమ్మ ఇంక చాలన్నట్లు సైగ చేయడంతో మంచినీళ్లు తాగించి ఆవిడ మూతి తుడిచి మంచం మీద వాలుగా పడుకోబెట్టి టి‌వి ఆన్ చేసి బైటకి వచ్చింది.    

*****

ఆ రోజే శ్యామ్ భార్యాపిల్లలతో దిగాడు. హారతి ఆనందానికి హద్దు లేదు. మూడు సంవత్సరాల తర్వాత  చూడ్డమాయె! కోడలికి ఒక్క పని కూడా చెప్పకుండా అపురూపంగా చూసుకుంటోంది. మనవడి మురిపాలు సరేసరి. కొడుక్కి ఏవేవో చేసి పెట్టాలని తెగ హైరానా పడిపోతోంది. ఇంత హడావిడి లోనూ అత్తగారి సేవలు విస్మరించడం లేదు. సమ్మర్ కావడంతో మరిది. ఆడ పడుచులు ఎప్పటిలాగే కుటుంబాలతో దఫదఫాలుగా వచ్చి వెళ్తున్నారు.

మోకాళ్ళ నెప్పులు, లో బి‌పి తో బాధపడుతూ కూడా అలాగే లేని ఓపిక తెచ్చుకొని పనిమనిషి సాయంతో అందరికీ కావలిసినవన్నీ అమరుస్తూ చేసుకుపోతోంది హారతి. శ్యామ్ ఇవన్నీ గమనిస్తున్నాడు. వాళ్ళు చూడబోతే అదో రకం 'అర్ధరాత్రి దాకా టి‌వి చూడ్డం తెల్లారి లేటుగా లేవడం'. వేళ పట్టున తినరు. ఇక్కడి పిల్లే అయినా కోడలు స్వర్ణకి ఏవీ నచ్చవు. శ్యామ్ కూడా భార్యకి వత్తాసు "ఏంటమ్మా ఈ వంటలు? ఆర్య ఇలా వండితే తినడు" అంటూ. కోడలు పనిలో కాస్త కూడా చొరవ తీసుకోదు. మనవడిని దగ్గర తీసుకోబోతే  "వాడు రాడండి కొత్త కదా" అంటూ తన గదిలోకి తీసుకెళ్లిపోతుంది. హారతికి చాలా అసంతృప్తిగా అన్పించింది.  

వాళ్ళు వెళ్ళే రోజు దగ్గరికీ రానే వచ్చింది. కొడుక్కి ఏవేవో ప్యాక్ చేస్తూ ఒకటే హడావిడి పడుతోంది హారతి. ఇంకో పక్క అత్తగార్ని చూడ్డానికి వచ్చి వెళ్తున్న చిన్నాడపడుచుకీ శ్యామ్ తో పాటు ఊరగాయలు, స్వీట్స్ ప్యాక్ చేసిచ్చి అంపకం పెట్టి సోఫాలో అలసటగా కూలబడింది. శ్యామ్ ఈ పదిహేను రోజుల్నించి ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తూనే ఉన్నాడు. "అమ్మా!" అని కొడుకు పిలవగానే "ఏం నాన్నా!" అంటూ చూసింది.

నాకు తెల్సు ఎలాగైనా నా కొడుక్కి నేనంటే ప్రేమ! ఇంత చాకిరీ చేస్తున్నానని పిచ్చికన్న ఎంత బాధ పడుతున్నాడో? పైకి చెప్పడు కానీ మనసులో  ఫీలవుతుంటాడు. నాకు తెలీదా ఏంటి? చిన్నప్పటిలాగే "నువ్వూ మాతో వచ్చెయ్యమ్మా" అని పట్టుబడతాడేమో! ఏం చెప్పాలో ఏంటో? "అమ్మా! ఎంత ఓపికే నీకు? మంచం మీద నాన్నమ్మకి, ఇంటికొచ్చేపోయే చుట్టపక్కాలకి ఎలా వండి వారుస్తూ ఎన్ని సపర్యలు చేస్తున్నావే?"

హారతి లోలోపల మురిసిపోయింది తన కొడుకు కన్సర్న్ కి! కానీ ఆ తర్వాత ఊహించని డైలాగ్ కి నిశ్చేష్టురాలైంది. 

“ఇంతమందికి చేస్తున్నావు! నా భార్యకి ఎప్పుడైనా ఇంత సేవ చేశావా అమ్మా? అసలు నువ్వు మాకేం నిలబడ్డావమ్మా? నేను ఆఫీసుకి వెళ్ళాక తను పిల్లాడితో సంభాళించుకోలేక ఎంత పైనా కిందా అవుతుందో నీకేం తెల్సు? ఇక్కడికొచ్చాక అన్నీ చూసి స్వర్ణ ఎంత బాధపడుతోందో... 'మీ అమ్మగారు నాకేం చేశారు?' అని అడుగుతోంటే ఏం సమాధానం చెప్పమంటావు? అమ్మా ఇదే చెప్తున్నా నాకు నువ్వు కావాలి!" వేదన ధ్వనించే స్వరంతో అన్నాడు శ్యామ్.

"మా అమ్మ కోడలితో సేవలు చేయించుకోవలిసిన యాభై ఏడేళ్ళ వయసులో తొంభై ఏళ్ల అత్తగారికి సేవలు చేస్తోంది. సో, నువ్వు మా అమ్మని చూసి నేర్చుకో అత్తగార్ని ఎలా చూసుకోవాలో!" అని బుద్ధి చెప్పడం పోయి మంచం పట్టిన పెద్దావిడతో పోల్చుకుంటూ కుమిలిపోతున్న భార్యకి సేవలు అందించడానికి అమ్మ కావాలంటున్న కొడుకుని విస్తుపోయి చూస్తూ ఆలోచనలో పడిపోయింది హారతి. ఎంత ఆశ్చర్యం? ఏడుగురు సంతానం లో ఒకడిగా సామాన్యంగా పెరిగిన తన భర్తేమో తల్లి సేవ చేయడం తన బాధ్యతగా అమ్మ కావాలి అనుకుంటుంటే ఒకే ఒక్కడుగా అపురూపంగా పెరిగిన కొడుకేమో తల్లి సేవ అందుకోవడం తన హక్కుగా అమ్మ కావాలి అంటున్నాడు. తరాల మధ్య ఈ అంతరానికి కారణం ఏమైనా ఒక స్త్రీ గా తను మాత్రం హక్కుల గురించి మాట్లాడకుండా బాధ్యతల్ని నెరవేర్చాల్సిందే అనుకుంది మాతృప్రేమకి, మానవత్వానికి నీరాజనమయిన హారతి.
 

మరిన్ని కథలు
hatosmi