Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrydayam

పా'త్రి'కాలజ్ఞులు (పార్టు - 2)

 

నా సినిమాల్లో 'మనసంతా నువ్వే' సమయానికి పెద్దగా ఇంటర్నెట్ రివ్యూలు లేవు. పత్రికల్లో వచ్చిన సమీక్షలే. శ్రీరామ్ నుంచి స్టార్టయ్యాయి. నెట్ మ్యాగజైన్లు, 'నేనున్నాను' సినిమా మొదటిరోజు మార్నింగ్ షో తర్వాత చాలా రివ్యూస్ లో అట్టర్ ఫ్లాప్ అని పెట్టారు. 5కి 1 1/2 అనుకుంట. నాలుగో వారం తరువాత కలెక్షన్లు, థియేటర్లు అనూహ్యంగా పెరిగాక, ఉత్తరాంధ్రలో కొన్ని రికార్డులు కూడా బద్దలుకొట్టాక, రీ రివ్యూ పెట్టారు. 5కి 3 1/2 అనుకుంట. కానీ ఈలోపు జరగాల్సిన డామేజ్ జరిగింది. యు.ఎస్. లో మొదటిరోజు రివ్యూ చదివాక దాదాపు 300 టికెట్లు కొని, థియేటర్ కి వెళ్లకుండా క్యాన్సిల్ చేసేసుకున్నారు అక్కడి ప్రేక్షకులు.

తర్వాత పునః సమీక్ష పెట్టినా చూడలేదు. 'రెయిన్ బో' సినిమాకి పాత్రికేయ మిత్రుడు జీవి గారు రివ్యూ రాయనన్నారు సినిమా చూసి. మూడున్నర కోట్ల డబ్బు ఖర్చు పెట్టి, మంచో, చెడో ఒక సినిమా కష్టపడి తీస్తే రివ్యూ రాసే అర్హతకి కూడా నోచుకోలేదా అని బాధేసింది. నేనే బలవంతంగా రాయమని రివ్యూ పెట్టించాను. నేనడిగానని కూడా అందులో రాసేశారు విడుదలయిన మూడువారాల తర్వాత. అయినా ఫర్లేదు. విమర్శిస్తే స్పోర్టివ్ గా తీసుకునే యాటిట్యూడ్ నాకుంది గానీ, అసలు బరిలోనే లేవు వేస్ట్ అంటే వూరుకోలేను. నచ్చడం, నచ్చకపోవడం ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది. దాని మీద ఆధారపడడం, పడకపోవడం ఇంకొంతమంది వెసులుబాటు.

ఇవన్నీ భరించేవాళ్ళం అని తెలిసికూడా మా అమూల్యమైన అభిప్రాయం చెప్పడానికి కూడా మీరు అర్హులు కారు అంటే అంతకు మించి అవమానం లేదు. దుర్యోధనుణ్ణి చూసి మయసభలో ద్రౌపది నవ్విన దానికన్నా పదిరెట్లు ఎక్కువ అవమానం. మరి, కురుక్షేత్ర యుద్ధం చేయడంలో తప్పులేదు కదా! అయినా, లక్షమంది ప్రేక్షకుల్లో చదువుకున్న అక్షరాస్యులు పదో, పదిహేనో శాతం వుంటారు. వాళ్లే రివ్యూలు కూడా చదువుతారు. కానీ విచిత్రంగా ఇవాళ ఓవర్సీస్ తో సహా అన్ని ప్రధాన నగరాల్లోనూ ఆ పది, పదిహేను శాతం ప్రేక్షకులే సినిమాలకి నిత్యపోషకులు. అక్కడే తేడా.

ఎవరెంత గింజుకున్నా, పూరీ జగన్నాథ్ గారు 'నేనింతే' సినిమాలో సీనే పెట్టినా, ఫ్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకి, జర్నలిజంలో వృత్తిరీత్యా ఉన్న ఎథిక్స్, సూపర్ విజన్, ఇంటర్నెట్ మీడియాకి లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు రాసేసుకుని, ప్రపంచవ్యాప్తంగా అది చూసే వాళ్ళందరికీ మన అభిప్రాయాల్ని రుద్దేసే ఇంటర్నెట్ జర్నలిజంకి వ్యక్తుల సంస్కారమే తప్ప, వ్యవస్థాగత సంస్కారం లేదు. అందుకని దాన్ని పట్టించుకోవలసిన అవసరం కూడా లేదు.

సినిమాలు తీయడం వెనుక కష్టం ప్రేక్షకులకంటే పరిశ్రమలో మమేకమైన పాత్రికేయులకే ఎక్కువ తెలుసు. అయినా, ప్రేక్షకులే చాలా విషయాల్ని క్షమించేస్తుంటారు. కానీ, పాత్రికేయులు క్షమించరెందుకనో.

రాఘవేంద్రరావు గారు ఓ విషయం చెప్పారు. తెలుగు ప్రేక్షకుడు ఎంత దయార్ద హృదయుడంటే, "ఘరానా మొగుడు" తీసినప్పుడు రాఘవేంద్రరావు, రాఘవేంద్రరావే రా... ఎంత బాగా తీశాడో సినిమా అంటార్ట. ఆయనే 'మంచి దొంగ' తీసినప్పుడు రాఘవేంద్రరావు తీసుండడురా. బిజీగా ఉండి ఏ కో - డైరెక్టరు కో అప్పచెప్పేసి ఉంటాడు అంటార్ట. ఇది చాలాసార్లు ప్రేక్షకుడిగా నేను కూడా విన్నాను. పాత్రికేయులకి పనికొచ్చే విషయం ఒకటి చెప్పాలి. చలం గారి పుస్తకానికి శ్రీ శ్రీ గారు రాసిన మంచిమాటలో ఉంది. 'పుస్తకం రాసిన వాడి మీద సానుభూతితో చదవండి' అని మొదలుపెట్టారు ఆ ముందు మాట. పాత్రికేయులు కూడా 'సినిమా తీసిన వాడి మీద సానుభూతితో చూడండి' అని నాకు టైటిల్స్ లో పెట్టాలని కోరిక. ఇప్పుడు ప్రేక్షకులకి కూడా క్షమించే గుణం తగ్గింది. ఎక్కువ శాతం యంగ్ స్టర్స్ థియేటర్లని నింపుతుండడం కారణం కావచ్చు.

నేను పాత్రికేయ ప్రపంచానికి చిన్నప్పట్నుంచీ మిత్రుడిననే చొరవతో రాస్తున్నదే కానీ, ఏ ఒక్కరినీ పనిగట్టుకుని విమర్శించే ఉద్దేశ్యం నాకేమాత్రం లేదు. పైగా నాపైన న్యూస్ లని నేను ఎంత స్పోర్టివ్ గా తీసుకుంటానో నేను పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి నాకా బాధ కూడా లేదు. నేను పర్సనల్ గా ఓటేయమంటే, ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్, ఫ్రింట్ మీడియాలలో ఫ్రింట్ మీడియాకే మొదటి ఓటు. ఎలక్ట్రానిక్ మీడియాకి రెండో ఓటు, ఇంటర్నెట్ కి అసలు ఓటే లేదు. వచ్చే ఎన్నికల నుంచి కొత్తగా ప్రవేశపెడుతున్న 'అభ్యర్ధి నచ్చలేదు' అన్న ఆప్షనే.

మా మేనత్తగారబ్బాయి, శర్మ బావ మా ఇంట్లో మొదటి అధికారిక జర్నలిస్ట్. ఏలూరులో రత్నగర్భ విలేకరిగా చేరారు నా చిన్నప్పుడు. ర.వి. (రత్న గర్భ విలేకరి) అనే కలం పేరుతో సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, రాజకీయ వ్యాసాలు రాయటంతో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆయన పైన ముళ్ళపూడి, ఆరుద్ర గార్ల ముద్ర బాగా ఉండేది. ఆ తర్వాత పాతికేళ్ళకు పైగా 'ఈనాడు' లోనే అంచెలంచెలుగా ఎదిగి చీఫ్ సబ్ ఎడిటరయ్యారు. ఆయన స్నేహితుడు హరిప్రసాద్ గారు, నేను కాలేజ్ లో ఉన్నప్పట్నుంచి పరిచయం. ఆయన ఈనాడు నుంచి ఇప్పుడు సివిఆర్ న్యూస్ చానెల్ కి హెడ్ గా ఉన్నారు. వీళ్ళిద్దరి ప్రోత్సాహంతో మా పెద్దన్నయ్య సతీష్ డిగ్రీ అవ్వగానే ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రవేశపరీక్ష రాసి ఆ పేపర్ లోనే రిపోర్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు టాలీవుడ్ టీవీ ఛానెల్ లో ప్రోగ్రామింగ్ హెడ్ గా ఉన్నాడు.

ఇలా ఇంట్లోనే పాత్రికేయులు ఉండటం వల్ల మా మిత్రబృందంలో చాలా మంది పాత్రికేయులు ఉన్నారు. అయినా నేను ఒక్కరోజు కూడా నాగురించి ఇలా రాయమని ఎవర్నీ అడగలేదు. ఇలా రాయద్దని ఎవర్నీ అడగలేదు. నేను ఇంటర్వ్యూ ఇస్తే నా మాటల్లోనే ఆ ఇంటర్వ్యూ ఉండాలని మాత్రం డిమాండ్ చేస్తాను. అంటే డిక్టేషన్ లా రాసుకోకుండా వాయిస్ రికార్డ్ చేసి రాయండి అని అడుగుతాను. అంతే... ఎథికల్ జర్నలిజం, ఎల్లో జర్నలిజంలలో కాలానుగుణంగా ఒక్కోసారి ఒక్కోటి పేయింగ్ ఎలిమెంట్ అవుతుంటుంది. ప్రస్తుతం ఎల్లో జర్నలిజం ట్రెండ్ నడుస్తోంది. బురద చల్లడం - వివాదాలు సృష్టించడం - 'బ్రేకింగ్' న్యూస్ కాన్సెప్ట్ ఇదే. 'కనెక్టింగ్' న్యూస్ కాన్సెప్ట్ ఎప్పుడొస్తుందో - ఫెవిక్విక్ యాడ్ వచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది. న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ అని రాగానే కింద ఈ యాడ్ ఇవ్వాలని నాకెప్పట్నుంచో కోరిక.

జర్నలిజం కూడా ఒక 'ఇజమ్', అంటే సిద్ధాంతం అయినందుకు ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు గర్వపడాలి. ఆ స్టేటస్ చాలా తక్కువ వృత్తులకి ఉంది. ఆ వృత్తిని ఆసరాగా చేసుకుని అనవసరమైన రాద్ధాంతం చేసేవాళ్లని చాలామందినే చూశాను. వాళ్ల కర్మ - జర్నలిజంలో నిజం ఉండాలి. బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్ అస్సలుండకూడదు. వాళ్ళడిగిన ఫేవర్ మనం చేయలేకపోతే, కొందరు బాధగా వెళతారు. కొందరు జర్నలిస్టులు మాత్రం కొంటెగా నవ్వి వెళ్తారు. అంత అసహజంగా, క్రూరంగా జర్నలిస్టు ఉంటే, ఇంక ఫ్యూచర్ ఎలా ఉంటుందో నేను చెప్పనక్కర్లేదు.

హిందూ పేపర్ లో ఎమ్.ఎల్.నరసింహం గారు, ఈనాడు సినిమా పేజీలో చక్రవర్తి, అన్వర్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో మోహన్ రావు గారు, ఇదివరకు డి. సి. లో సురేష్ కవిరాయని, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కూర్మనాధ్ (ఈయన కూడా మా బంధువే), సాక్షిలో పులగం చిన్నారాయణ, ఇందిర, సమీర, ఫోటోగ్రాఫర్ శివ, ట్రేడ్ గైడ్ లో ప్రభు, ఇండియా టుడేలో రెంటాల జయదేవ్, సూపర్ హిట్ లో రాంబాబు వర్మ, సంతోషంలో పసుపులేటి రామారావుగారు, ఈటీవీ లో సత్యన్నారాయణ, మాటీవీలో రఘు, టీవీ9 లో రవిచంద్ర, జలపతి, జీ తెలుగులో రమేష్, ఐన్యూస్ లో ఫణి, ఎఫ్.ఎమ్. రేడియోల్లో మధు, హేమంత్, భార్గవి, రాంబాబు, దూరదర్శన్ లో సుబ్రహ్మణ్యంగారు, ఆంధ్రప్రభ లో యజ్ఞమూర్తి, సితార లో  విహారి - వీళ్లంతా నాకు తెలిసి, సినిమాని ప్రేమించేవాళ్లు. అందులో ఉన్న మంచిని ప్రోత్సహించేవాళ్లు. ఇంకా కొందరు నాకు తెలియని వాళ్లో, నేను మర్చిపోయిన వాళ్ళో ఉంటారు. కానీ మంచి చెప్పులేసుకునేలోపు చెడు ఊరంతా తిరిగొస్తుందని, సామెతలాగ చెడుకి స్పీడెక్కువ, ఆదరణ, ఆసక్తి ఎక్కువ - మంచికి మంచితనం తప్ప అన్నీ తక్కువే.

పేరుకి మనం హాలీవుడ్ ని చూసి, బాలీవుడ్ ని చూసి, 'టాలీవుడ్' అని స్టైల్ గా అంటుంటాం గానీ, ఈ రోజుకీ మన పరిశ్రమలో హాలీవుడ్ లో ఉన్నంత విశృంఖల జీవనశైలి లేదు. బాలీవుడ్ లో ఉన్నంత ప్రొఫెషనలిజం లేదు. ఇవాళ్టికీ తెలుగు సినిమావాళ్ళం ఎమోషనల్ గానే  ఎకువ వర్క చేస్తాం. ఇవాళ్టికీ తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ అయితే పెళ్ళిళ్ళవ్వవనో, చుట్టాలేమనుకుంటారో అనో ఆలోచిస్తూనే ఉన్నారు. అదే, పరిశ్రమ చెన్నై లో ఉన్నప్పుడు చూడండి - ఎక్కువమంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్ లు అయ్యేవారు. హైదరాబాద్ వచ్చాక దాదాపు తగ్గిపోయింది. తమిళంకో, మలయాళంకో, కన్నడంకో ఎక్కువమంది తెలుగు హీరోయిన్ లు వెళ్ళిపోతున్నారు. ఉన్న ఊళ్ళో అన్ని రకాల వేషాలూ వేయలేకపోవడమంటే మనం ప్రొఫెషనల్ గా లేమనేగా... చాలా ఎమోషనల్ గా ఆలోచిస్తున్నామనేగా... ఇది వదిలేసి, తెలుగువాళ్లు తెలుగమ్మాయిల్ని ఎంకరేజ్ చేయరని నిర్ధారించేవారు. ఎంత కష్టపడి పనిచేసినా, ప్రెస్సుని ఇంప్రెస్ చేయడం ఒకింత కష్టమైన వ్యవహారం. సారస్వత పాత్రికేయులు, సానుకూల పాత్రికేయులు, సంస్కరణ పాత్రికేయులు, సునిశిత విమర్శనాత్మక దృక్కోణం కలిగిన పాత్రికేయులు, ఏరంగానికైనా, ఏసమాజానికైనా చాలా అవసరం. ఏది ఏమైనప్పటికీ, ఇవ్వాళ సినిమా రంగమే కాదు, ఏ ప్రోడక్టు అయినా, పదిమందికి చేరాలంటే ప్రచారం చాలా అవసరం. ఆ ప్రచార సారధులు, నవ సమాజ వారధులు పాత్రికేయులే అన్న సత్యం విస్మరించరానిది. ఆ రంగంపైన అత్యుత్తమమైన గౌరవంతో వందనాలర్పిస్తూ...

మీ
వి.ఎన్.ఆదిత్య.
మరిన్ని సినిమా కబుర్లు
guru shishyulu in telugu movie industry