Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue289/756/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)...‘‘ఆమె....?’’ ఫొటో కేసి చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.
ఎస్సై అక్బర్ ఖాన్ దృష్టి మరల్చకుండానే అడిగిన ప్రశ్నలకి రిసెప్షన్ లో ఉన్న అమ్మాయిలు అందరూ ఒక్కసారే వెనక్కి తిరిగి గోడ కేసి చూసారు.

‘‘ఆ ఫొటో యలమంచిలి గ్రూప్ ఆఫ్ చైర్మన్ గారు ఆయన భార్య సార్’’ అంది ఇంకో అమ్మాయి.

‘‘ఫొటోకి దండ వేసారు...?’’ సంశయంగా అన్నాడు రైటర్.

‘‘చైర్మన్ సార్ కూడా ఈ మధ్యే చనిపోయినారు సార్’’ అంది మరో అమ్మాయి.

‘‘మేడమ్ గారు...?’’ సంశయంగా అడిగాడు రైటర్.

‘‘మేడమ్ గారు చనిపోయి చాలా ఏళ్ళ యిందంటారు సార్’’

ఎస్సై అక్బర్ ఖాన్, రైటర్ లిద్దరూ ఒక్కసారే ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. "గుడి పూజారి చెప్పింది నిజమేనన్న మాట.." అనుకున్నారిద్దరూ. మౌనంగా వెనక్కి తిరిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సార్! చెన్నై అడ్రస్ తీసుకుంటేనో....’’ ఎస్సై అక్బర్ ఖాన్ వెనుకే మౌనంగా నడుస్తూ అన్నాడు రైటర్. అక్కర లేదు. యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటూ బాగా పేరున్న సంస్థ లాగే ఉంది. గూగుల్ లో సెర్చ్ కొడితే ఇట్టే తెలుస్తుంది. మనం అడ్రస్ అడిగితే వీళ్ళు వెంటనే ఇన్ఫర్ మేషన్ పాస్ చేస్తారు. మనం ఎలాగూ చెన్నై వెళ్లానుకుంటున్నా కదా!’’ నవ్వుతూ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అవును కదా! సార్. నాకు తెలియక అడుగుతాను ఇక్కడ ‘ఈమె’ చనిపోయిందంటున్నారు. కానీ, ఈమె లాగే ఉన్న ‘ఆమె’ ఎవరంటారు? ఏ.టి.ఎమ్ కార్డు లో ఉన్న ఫొటో అడ్రస్ చూస్తే ఎవరిదో ఉంది!?! పైగా పెద్దావిడ ఫొటో. ఆ ఏ టి ఎమ్ కార్డు ‘ఆమె’ దగ్గరకెలా వచ్చిందో అర్థం కాలేదు. మనం చెన్నై వెళ్ళడం కూడా అనవసరమేమోననిపిస్తోంది సార్!’’ అన్నాడు రైటర్.

రైటర్ అలా అనే సరికి చురుగ్గా చూసాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘కొండ మీద చనిపోయిన ముసలమ్మ సత్యవతమ్మ వివరాల కోసం రాజమండ్రి వెళ్ళాడు. అక్కడ గ్రూప్ ఫొటోలో సత్యవతమ్మ గారి కూతురు ఫొటో చూసాడు. ఆమె కూడా ఈమె లాగే ఉంది. ఛైర్మన్ భార్య, సత్యవతమ్మ కూతురు, నగరంలో సంచరిస్తున్న ‘ఆమె’ ఈ ముగ్గురూ ఒక్కరేనా? ముగ్గురు వేరు వేరా?!

‘‘ప్రపంచంలో ఒకరిని పోలిన ఒకరు ఏడుగురుంటారంటారు. అందులో ఒకేలా ఉండే ఈ ముగ్గురూ నాకే తారసపడాలా? హే అల్లా! ఏందయ్యా ఈ డ్రామా?’’

హత్యలు చేస్తున్నదీ, చేయిస్తున్నదీ ఎవరు? ఆమె అమాయకురాలైతే చురకత్తులు, గన్లు పెట్టుకు తిరగడమెందుకు? మంచిదే అయితే దొంగలా ఏ టి ఎమ్ లలో డబ్బు డ్రా చెయ్యదు కదా! దీనంతటికీ ‘సూత్రధారి’ ‘ఆమె’ అయి ఉంటుంది. ‘ఆమె’ ఎవరో తెలుసుకో గలిగితే రెండు కేసులు పరిష్కారం అయినట్టే’ మనసులోనే అనుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్..

అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఇద్దరూ పోలీస్ స్టేషన్ కి చేరుకునే సరికి ఎవరో ఇద్దరు వ్యక్తులు సూటు, బూటు వేసుకుని రైటర్ గదిలో కూర్చున్నారు.
ఎస్సై అక్బర్ ఖాన్ తో పాటు రైటర్ పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టగానే సెంట్రి ఎదురొచ్చాడు.

‘‘సార్! ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఇద్దరూ అమెరికా నుండి వచ్చారట. మిమ్మల్నే కలవాలట సార్!’’ చెప్పాడు సెంట్రీ.
‘బహుశా కొండ మీద హత్య చేయబడ్డ ముసలమ్మ కొడుకులై ఉంటారు.’ మనసు లోనే అనుకుంటూ నేరుగా రైటర్ గది దగ్గరకు వెళ్ళాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్సై అక్బర్ ఖాన్ ని చూస్తూనే ఆ వ్యక్తులిద్దరూ మర్యాదగా లేచి నిలబడ్డారు.

‘సార్!’’ ఇద్దరూ ఒక్కసారే వినయంగా నమస్కారం చేసారు.

‘‘మీరు సత్యవతి గారి అబ్బాయిు కదా!’’ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అవును సార్! మీరు నాతోనే ఫోన్ లో మాట్లాడారు.’’ చెప్పాడు ఒక వ్యక్తి.

‘‘రండి! నా గదిలో కూర్చుందాం.’’ అంటూ వారిద్దరినీ తీసుకుని తన గది లోకి దారి తీసాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సార్! మేము చాలా మూర్ఖంగా ఆలోచించాము. అమ్మని మాతో అమెరికా తీసుకు వెళ్ళి పోదాం అనుకున్నాం కానీ. ఇంత ఖరీదైన ఆస్తిని ప్రేమ సమాజానికి ధారాదత్తం చెయ్యాలనిపించ లేదు.’’ అన్నాడు వారిద్దరిలో పెద్ద వాడు.

‘‘అవును సార్? అమ్మ నాన్న మమ్మల్ని ఎన్నో కష్టాలు పడి పెంచారు. అదృష్టం కొద్దీ ఇద్దరం బాగా సెటిలయ్యాం. అమెరికాలో స్థిర పడ్డాం. నాన్న ఎలాగూ లేరు. నువ్వైనా మాతో రా అమ్మా అంటే రాలేదు.’’ అన్నాడు రెండో వాడు.

‘‘అమ్మ గారు రానన్నారా? రాలేనన్నారా?’’ అంటూ వారిద్దరి మొహాల కేసి చూసాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఎస్సై అలా అర్థం కాని విధంగా అడిగే సరికి ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

‘‘రాను అంటే రాలేననే కదా సార్! మా ఇల్లు ఇక్కడే విశాఖ పట్నంలో ఉన్న అనాథ శరణాలయానికి అప్పగించేసాక వస్తానని మొండి పట్టు పట్టుక్కూర్చుంది. మాకిద్దరికీ ఆ ఆస్తి మా పిల్లకి ఇవ్వాలన్నది ఆశ. తాత ఆస్తి మనుమలకే కదా చెందాలి.’’ అన్నాడు పెద్ద వాడు.
‘‘అదిప్పుడు మీ అమ్మ గారి వీలునామా ప్రకారం ప్రేమ సమాజానికే కదా చెందుతుంది. మీ నాన్నగారి చివరి కోరిక తీర్చాలన్నది మీ అమ్మగారి ఆకాంక్ష.’’ అంటూ తన దగ్గరున్న వీలునామా, డాక్యుమెంట్లు తీసి వారిద్దరి ముందుంచాడు ఎస్సై అక్బర్ ఖాన్.
ఇద్దరూ మరేం మాట్లాడలేదు. మౌనంగా తల్లి రాసిన వీలునామా తీసి చదివారు.

‘‘అమ్మే పోయాక ఈ ఆస్తి మాకెందుకు సార్! మా అమ్మను చివరి సారిగా చూద్దామనే పరిగెట్టుకు వచ్చాం. అమ్మ భౌతిక కాయాన్ని మాకు అప్పగిస్తే?’’ దు:ఖంలో గొంతు పెగలక చివరి అక్షరాలు మింగేసాడు పెద్ద కొడుకు. రెండో వాడు తల్లి వీలునామా చూస్తూనే కంట తడి పెట్టుకున్నాడు.

‘‘అమ్మ మనసు.... ఆశ అర్థం చేసుకో లేక పోయాం సార్! అమ్మని చాలా బాధ పెట్టాం. చివరి దశలో....అంత ముసలి తనంలో మాకెవరికీ తెలీకుండా ఇల్లు వదిలి వెళ్ళి పోయింది. అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటుందని ఇంట్లో ఆయాని కూడా పెట్టాం. అమ్మ కూడా మమ్మల్ని అపార్థం చేసుకుంది.’’ వలవలా ఏడుస్తూ అన్నాడు రెండో వాడు.

‘‘ఈ ఆస్తి ప్రేమ సమాజానికి మీ చేతుల మీదుగా అప్పగించేస్తే బాగుంటుంది. మీ అమ్మగారి ఆత్మ శాంతిస్తుంది’’  అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అమ్మ గారి పెద్ద కర్మ రోజున రాజమండ్రి లోనే ‘ప్రేమ సమాజం’ నిర్వాహకులకి అప్పగించేస్తాం సార్. మేము కూడా ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నాం. మా పిల్లలు కూడా మా అంతటి వాళ్లయ్యారు. మేము కూడా రిటైరయ్యాం. ‘

‘‘వెల్ డన్ సార్! ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకున్నారు. కేజిహెచ్ లో మార్చురీ లో ఉన్న మీ అమ్మ గారి భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకోండి. మా రైటర్ ని మీతో పంపిస్తాను. ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే సరి పోతుంది.’’ అంటూనే ఏదో గుర్తొచ్చి ఉలిక్కి పడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఇద్దరు అన్నదమ్ములు లేచి నిలబడి నమస్కారం చేస్తూ ‘‘వస్తాం సార్!’’ అన్నారు.

‘‘సారీ! చాలా ఇంపార్టెంట్ విషయమే మర్చిపోయాను.’’ అంటూనే సెల్ ఫోన్ తీసి రాజమండ్రిలో తీసిన వారి ఫేమిలీ ఫొటో చూపించాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఫేమిలీ ఫొటో చూస్తూనే ఇద్దరి మొహాలు మాడిపోయాయి. మౌనంగా తలలు దించుకున్నారు.

‘‘ఈ ఫొటోలో ఉన్నది మీ సిస్టరేనా?’’ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

అవునన్నట్టు ఇద్దరూ తలూపారు.

‘‘ఇప్పుడు ‘ఆమె’ ఎక్కడుంటున్నారో తెలుసా?’’ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ముప్ఫై ఆరేళ్లయింది సార్ అది మాకు దూరమై.’’ నిర్లిప్తంగా అన్నాడు పెద్దవాడు.

‘‘అదేంటి? ఎలా దూరమై పోయింది?!’’ అర్థమైనా అర్థం కానట్టు అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘టెన్త్ లో ఫస్ట్ రేంక్ లో ప్యాసయిందని దాన్ని ‘డాక్టర్’ చెయ్యాలన్న ఆశతో నాన్న విజయవాడలో రెసిడెన్షియల్ కాలేజీలో జాయిన్ చేసాడు సార్! ఇంటర్ పూర్తి అయిందో...లేదో... ఎవడ్నో ప్రేమించి పెళ్లి చేసుకున్నానని వాడ్ని ఇంటికి తీసుకొచ్చింది. అప్పటికింకా మా చదువు కూడా పూర్తి కాలేదు. అమ్మ నాన్న కోపంతో తిట్టి బయటకు తోసేసారు. అంతే అప్పట్నుండీ దానికీ, మాకూ సంబంధాలు తెగి పోయాయి. మేము చదువు కోసం అమెరికా వెళ్ళాక దాని విషయమే మర్చి పోయాము.’’ అన్నారిద్దరూ.

‘‘కనీసం మీ చెల్లెలు ఎక్కడుందోనని కూడా ఆరా తియ్యలేదా?’’ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అమ్మ అప్పుడప్పుడు చెల్లెలు కోసం ఏడ్చేది. నాన్న బయటకి గంభీరంగా ఉండేవాడే గాని అదే ఏదో రోజు మనల్ని వెదుక్కుంటూ వస్తుందిలే అని అమ్మని ఓదార్చేవాడు.’’ చెప్పాడు పెద్దవాడు.

‘‘సార్! ఇప్పుడు మీరు ఉన్నట్టుండి మా చెల్లెలు గురించి అడగాల్సిన అవసరం ఏముంది?’’ రెండోవాడు టక్కున అడిగాడు.

‘‘ఊరికే అడుగుతున్నాను. టేకిట్ ఈజీ. మీరు వెళ్లండి.’’ అంటూ వారికి షేక్ హేండ్ ఇచ్చి సాదరంగా సాగనంపాడు ఎస్సై అక్బర్ ఖాన్.
ప్రేమాభిమానాలు లేని వీళ్ళకి వివరాలు చెప్పడం అనవసరమనిపించింది. చూచాయగా కథ అర్థమౌతోంది. ఏది ఏమైనా ఏ.టి.ఎమ్ కార్డు హోల్డర్ అడ్రస్ లో ఉన్న వ్యక్తిని కలిస్తే మొత్తం కథంతా ఓ కొలిక్కి వస్తుంది. ‘ఆమె’ ఎవరో.....ఎక్కడుందో....ఎందుకిదంతా జరుగుతోందో...ఈ హత్య వెనుక గూడార్థం కూడా అర్థమౌతుంది.

ఎస్! ఇక తాత్సారం చేయకూడదు వెంటనే చెన్నై వెళ్లాలి.’ అనుకుంటూనే భద్రంగా దాచిన అకౌంట్ కాపీ బయటకు తీసి మరోసారి చదువుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

చెన్నై టి.నగర్ సెంటర్ దగ్గర బ్యాంకు అకౌంట్ అది. శ్రీమతి ఎర్రబిల్లి శోభాదేవి పేర ఉందా అకౌంట్. ఓ మూల ఫొటో అతికించి ఉంది. ఫొటో కేసి తేరిపార చూసాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఆ ఫొటోకి తన దగ్గరున్న ఆమె ఫొటోకి ఎక్కడా పోలిక లేదు. ఆమె ఈమె ఒక్కరనుకోవడానికి ఏ కోశానా ఆస్కారం లేదు.

ఎవరిదో ఏటిఎమ్ కార్డు ఈమె దగ్గరుందంటే....ఆలోచించాల్సిన విషయమే. ఆమె ఈమెకి బాగా దగ్గర బంధువైనా అయుండాలి. లేదా, ఈ ఏటిఎమ్ ఈమెకి దొరికైనా ఉండాలి. దొరికిన ఏటిఎమ్ లో డబ్బు డ్రా చెయ్యాంటే ‘పిన్’ నంబర్ కావాలి. అదెలా సాధ్యం? అంటే  ఆమె ఎవరైనా ఈ అకౌంట్ హోల్డర్ కి బాగా కావాల్సిన వ్యక్తే అయి ఉంటుంది. అంతే!

మనసులోనే పరి పరి విధాలా ఆలోచిస్తూ ఛటుక్కున సీట్లో నుండి లేచాడు ఎస్సై అక్బర్ ఖాన్.అమెరికా నుంచి వచ్చిన ఆమె కొడుకులు చెబుతున్నదానితో అంతా వీడిపోయినట్టే అనిపిస్తోన్నా, ఎస్సై అక్బర్ ఖాన్ మదిలో ఇంకా ఎన్నెన్నో చిక్కుముడులు....అవన్నీ తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా వేచిచూడాల్సిందే....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani