Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue290/759/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)...  మనోహర్ ఏదన్నా తల్చుకుంటే సాధించకుండా ఉండడు. ఇప్పుడు కాత్యాయనిని సాధించడమే అతని ముందున్న ఛాలెంజ్ !

ఫస్ట్ స్టెప్ గా కాత్యాయని ఇంటి పక్కనున్న అపార్ట్ మెంట్ ఫస్ట్ ఫ్లోర్ లోని ఫ్లాట్ లోకి మారి పోయాడు. అదేమంత గొప్పగా ఉండదు. సాధారణ మనుషులు ఉండే అతి మామూలు అపార్ట్ మెంట్. కాని ఏదైనా సాధించాలంటే, కొన్ని కోల్పోవాలని అతనికి తెలిసినంత మరెవరికీ తెలియదు. చిన్న చిన్న సుఖాలని త్యాగం చేస్తే అమర సుఖం సొంతమయి తీరుదుందన్నది అతని థీరీ!

ఆ ఫ్లాట్ లోని ఉత్తరం వైపున్న కిటికీ తలుపు తెరిస్తే కాత్యాయని ఉండే ఇంటి పెరడు మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. లేట్ నైట్ పడుకుని ఉదయం పదకొండు, పన్నెండు గంటలకు బద్ధకంగా నిద్రలేచే మిస్టర్ మనోహర్ ఇప్పుడు అయిదు గంటలకే బుద్ధిగా నిద్రలేస్తాడు. లేవంగానే మొదట చేసే పని కిటికీ రెక్కలు తీసి కాత్యాయనిని వీక్షించడానికి ఓపిగ్గా మేక కోసం ఎదురు చూసే పులిలా నుంచుంటాడు. కాత్యాయని చక్కగా స్నానం చేసి పెరట్లో ఉన్న తులసి మొక్క కు పూలతో పూజ చేసి, అగరొత్తులు వెలిగించి అక్కడి మట్టిలో గుచ్చి, దణ్నం పెట్టుకుని వెళ్లి పోతుంది. అది సుమారుగా పదిహేన్నిమిషాల కార్యక్రమం. అది మనోహర్ కి రోజంతా కిక్కిచ్చే అద్భుత దృశ్యం. అప్పుడే స్నానించిన గులాబీలా బొద్దుగా, ముద్దుగా ఉండే కాత్యాయనిని చూస్తే మనోహర్ కి పిచ్చెక్కి పోతుంది. ‘ఆ శృంగార దేవత ఎప్పుడు తనను కరుణిస్తుందో. తనకి అమర సుఖం చవి చూపిస్తుందో’ అని మనసులో అనుకుంటూ భారంగా కదిలి పోయి తన నిత్య కృత్యాల్లో పడిపోతాడు.

ఆమె టైం టేబుల్ అతను ఎంతగా స్టడీ చేశాడంటే ఆమె ఎప్పుడెప్పుడు ఏయే టైములో ఏ పని మీద బయటకెళుతుందో అతను కంఠతా పట్టేశాడు. ఆమె భర్త కమలాకర్ అనారోగ్య పరిస్థితీ, అత్యవసరంగా ఆపరేషన్ చేయించాల్సిన అవసరమూ తెలుసుకున్నాడు. ఆమె దైన్య జీవితం అతని ఎరకి తప్పకుండా పడుతుందని మనసులో నిశ్చయించుకున్నాడు. అప్పుడప్పుడూ కావాలని ఆమెకి ఎదురు పడి, యాదృచ్ఛికంగా చూసినట్టు చూసి నవ్వేవాడు. ఆమె చటుక్కున తల దించుకోవడం అతనికి భలేగా అనిపించేది. ఆడా-మగ రిలేషన్స్ బయటి లోకంలో ఎన్నో చూశాడు. కొంత మంది తమ స్వార్థం కోసం నైతిక విలువలను తాకట్టు పెట్టుకోవడమూ తెలుసూ. ఒకప్పుడు తలుపు చాటున నిలబడ్డ ఆడవాళ్లు, ఈనాడు జాబ్ కోసం, కెరీర్ కోసం తమ శరీరాలను సమర్పించే స్థాయికి దిగజారడమూ చూశాడు.

సినిమాల్లో ‘నీకామె పడిందా?’ ‘వాడు నీ వెనక కుక్కలా తిరుగుతున్నాడు’ లాంటి మాటలతో శృంగారాన్ని రోడ్డు మీదకి ఈడ్చుకు రావడమూ చూశాడు. ఇప్పుడు ప్రేమ అన్నది కేవలం ’లస్ట్’ అంతే! అది అతని నిశ్చితాభిప్రాయం. అలాంటిది గంజాయి వనంలో తులసిలా ఫ్రెష్ గా, సంప్రదాయంతో తళుకులీనుతున్న కాత్యాయని అతనికో విచిత్రం. అందుకే ఆమెని అనుభవిస్తేనే అతని మగతనానికి ఓ ప్లస్ అనేది అతని ఫీలింగ్!

ఒక రోజు పొద్దున్నే హఠాత్తుగా నిద్ర లేచిన మనోహర్ టైం చూసి, ఆరూ పది అవడంతో ఆలస్యంగా నిద్ర లేచినందుకు తనను తను బూతులు తిట్టుకుంటూ కిటికీ లోంచి బయటకి చూశాడు. అప్పటికే తులసి పూజ అయిపోయిన గుర్తుగా తులసి మొదట్లో పూలేసి, అగరొత్తులు వెలిగించి ఉన్నాయి. అతన్ని ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. డల్ గా ఫ్రెష్ అయి ఆ రోజు కేలండర్ చూసి, ఆరోజే కాత్యాయని తన భర్తని ఆస్పత్రికి తీసుకెళ్లే రోజని గుర్తించి గబగబా రెడీ అయి పది గంటలకు బయట కెళ్లి ఎదురు చూస్తూ నుంచున్నాడు.

బ్లాక్ కలర్ ట్రౌషర్ పై వైట్ షర్ట్ టక్ ఇన్ చేసుకుని, లైట్ బ్రౌన్ కలర్ గాగుల్స్ తో, పార్క్ అవెన్యూ డియోడోరెంట్ స్ప్రే చేసుకుని అమ్మాయిల కళ్లని హిప్నటైజ్ చేసి తన వైపు కట్టేసుకునేంత హేండ్ సమ్ గా ఉన్నాడు.

కాత్యాయని ఒక చేత్తో ఆమె భర్తకు సపోర్ట్ ఇస్తూ బయటకు నడిపించుకొచ్చింది. ఆమె మరో చేతిలో మెడికల్ హిస్టరీ ఫైల్ ఉంది.కాత్యాయని గ్రీన్ శారీ లో వన దేవతలా మగ చూపుల్ని క(చు)ట్టి పడేసేంత అందంగా ఉంది. అప్పటికే సూర్యుడు చండ ప్రచండమవుతూ నిప్పులు చెరగడానికి సిద్ధ పడుతున్నాడు. ఆ వెలుగులో ఆమె మరింత మెరిసి పోతోంది. బహుశా ఆమె అందాన్ని ప్రపంచానికి చూపించడానికే సూర్యుడు తన వెలుగును పెంచుతూ తాపత్రయ పడుతున్నట్టుంది.

‘ ఆటో ’ దూరంగా వెళుతున్న ఆటోను పిలిచింది కాత్యాయని.

ఆటో అతను అది పట్టించుకోకుండా వేగంగా వెళ్లి పోయాడు.

డైరెక్ట్ గా చూస్తే బాగోదని క్రీగంట ఆ అందాల రాశి అందాలను కళ్లతో గ్రోలుతూన్నాడు.

మరో ఆటోని పిలిచింది. అతను ఆమె దగ్గరగా వచ్చాడు. కొద్ది సేపు మాట్లాడిన తర్వాత ఆ ఆటో వెళ్లి పోయింది. బహుశా ఫేర్ కుదర లేదనుకుంటా!

మరో ఆటోను పిలిచినా రాలేదు. ఎండ చుర్రుమనిపిస్తోంది. చేతిలో ఉన్న మెడికల్ ఫైల్ ను సూర్యుడి తీక్షణతకు అడ్డంగా పెట్టి, భర్త ముఖానికి, తన ముఖానికి కాస్త నీడ వచ్చేలా చేసుకుంది.

మరో ఆటోను ఆమె పిలిచేంతలో.. ఉన్నట్టుండి కమలాకర్ సొమ్మసిల్లినట్టు వాలి పోయాడు.

"ఏవండీ.."గట్టిగా అరిచింది కాత్యాయని గుండె జారి పోతుండగా.

*******
అంతలోనే కమలాకర్ కి ఏమైంది? అతనికి ముంచుకొచ్చిన ఆపద మనోహర్ కి అవకాశంగా ఉపయోగపడిందా?? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఎదురు చూడాల్సిందే........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana