Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue290/758/telugu-serials/anveshana/anveshana/

 

(గత సంచిక తరువాయి)... పోలీస్‌ కమీషనర్‌ ఆఫీసు

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ తో పాటు సి.ఐ. సత్యారావు, సౌత్‌ ఏ.సి.పి. కూడా కమీషనర్‌ ఎదురుగా కూర్చున్నారు.ఇంత వరకూ జరిగిన పరిశోధన వివరాలు అంతా విడమర్చి చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘మీకు దొరికిన పిస్టల్‌ కి లైసెన్స్‌ ఉందో లేదో, దాని యజమాని ఎవరో ఆరా కోసం ఇంటిలిజెన్స్‌ బ్యూరోకి పంపించాను. అది ఈరోజో... రేపో మెయిల్‌ రావొచ్చు. ఖాన్‌! మీరు ఒక్కరే  చెన్నై వెళ్ళండి. అక్కడ మీకు కావసిన ఏర్పాట్లు చేయమని చెన్నై పోలీసు కమీషనర్‌ కి రిక్వెస్ట్‌ పంపిస్తాను. బీ కేర్‌ఫుల్‌.’’ చెప్పాడు కమీషనర్‌.

‘‘ఎస్ సార్‌!’’ వినయంగా అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సార్‌! ఇఫ్‌ యూ డోంట్‌ మైండ్‌...నాదో చిన్న అనుమానం.’’ ఉన్నట్టుండి అన్నాడు సౌత్‌ ఏ.సి.పి.

‘‘చెప్పండి !’’ హుందాగా అన్నారు కమీషనర్‌.

‘‘హతుల వివరాలు తెలుసు. హంతకుడు, హత్యాయుధం అన్నీ దొరికాయి. ఇక ఈ కేసుల్లో ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్‌ అవసరమా సార్‌?’’ అన్నాడు సౌత్‌. ఏ.సి.పి.

సౌత్‌ ఏ.సి.పి. మాటలు వింటూనే పోలీస్‌ కమీషనర్‌తో పాటు సి.ఐ. సత్యారావు, ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ఆశ్చర్యంగా ఆయన కేసి చూసారు.
‘‘ఓకే ఏసిపి గారూ! హత్యలు చేసిన హంతకుడు చచ్చాడు. చంపడానికి ఉపయోగించిన ఆయుధం కూడా దొరికింది.  చని పోయిన వాళ్ళు అనాథలు ఒకే... కానీ, ఒక్క విషయం చెప్పండి. వాళ్లు వీళ్లని ఎందుకు చంపారు?! ప్లీజ్‌ టెల్‌ మీ’’ కూల్‌ గానే ప్రశ్నించాడు పోలీస్‌ కమీషనర్‌.
పోలీస్‌ కమీషనర్‌ అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలీక మౌనంగా ఉండి పోయాడు సౌత్‌ ఏసిపి.

‘‘ఏసిపి గారూ! అక్కడ దొరికిన ఆధారాల ప్రకారం ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్ళిచ్చిన రిపోర్ట్‌లో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల వేలి ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. హంతకుడు ఒక్కడే మన ఎస్సై మీద హత్యాయత్నం చేస్తూ బస్సు క్రింద పడి చనిపోయాడు. మరి రెండో వాడు ఏడి?! అసు ఈ ‘హత్యలు’  ఎందుకు చేసారు? వీళ్ళు సైకో కిల్లర్స్ కాదు. ఎక్కడ పడితే అక్కడ కనిపించిన వాళ్లని చంపుకు పోలేదు. మరి?! ఎవరు వీళ్ళు? ఎందుకు ఈ హత్యలు చేస్తున్నారు. చేయిస్తున్నారు? మెయిన్‌ మోటివ్‌ తెలియాలి కదా ఏసిపి గారూ!’’ అంటూనే గంభీరంగా మారి పోయి ‘‘హత్యకు కారణం తెలిసే వరకూ ‘కేసు’ ముగిసినట్టు కాదు.’’ కొంచెం కటువుగానే గొంతు పెంచి చెప్పాడు పోలీస్‌ కమీషనర్‌.

కమీషనర్‌ మాటలకి మరి మారు మాట్లాడ లేదు ఏసిపి.‘‘ఓకే! ఇట్సాల్‌ రైట్‌! మీరు వెంటనే ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ప్రయాణానికి కావలసిన ఫ్లైట్‌ టిక్కెట్లు అరేంజ్‌ చేయండి. అక్కడ దిగ్గానే నీకు చెన్నై పోలీసులు హెల్ప్‌గా ఉంటారు.’’ చెప్తూ సీట్లోంచి లేచారు పోలీస్‌ కమీషనర్‌.పోలీస్‌ కమీషనర్‌ లేచి నిలబడగానే ముగ్గురూ వినయంగా గౌరవ సూచనగా టక్కున లేచి నిలబడ్డారు.

‘‘ఖాన్‌! ఈ హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించాయి. ముఖ్యంగా దేవాలయం ప్రాంగణంలో జరిగిన హత్యలు భక్తుల మనో భావాలపై ప్రభావం చూపిస్తుంది. మన ‘పరిశోధన’ సారాంశం తెలియ జేయాలి. అప్పుడే మన డిపార్ట్‌మెంట్‌ గౌరవం నిలబడుతుంది. ఆల్‌ ద బెస్ట్‌.’’ అంటూ షేక్‌ హేండ్‌ ఇచ్చి అభినందన పూర్వకంగా అన్నాడు పోలీస్‌ కమీషనర్‌.

‘ఎస్సార్‌!’’ వినయంగా సెల్యూట్ చేసి ఒద్దికగా నిలబడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. సి.ఐ. సత్యారావు, సౌత్‌ ఏసిపిలు కూడా సెల్యూట్ చేసారు.

*******

చెన్నై, మీనంబాకం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు. అంతర్జాతీయ ప్రయాణీకులతో కళకళలాడుతోంది.

ఉదయం పది గంటలవుతోంది.

విమానం లేండ్‌ అవుతోంది. చెన్నై చేరుకుంటున్నామని, మరి కొద్ది క్షణాల్లో విమానం లేండ్‌ కాబోతోందని, ప్రయాణీకులంతా సీటు బెల్ట్‌ నడుముకు తగిలించుకోవాలంటూ ఎయిర్‌ హోస్టెస్‌ అనౌన్స్‌ చేయగానే ఏదో ఆలోచనలో ఉన్న ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ఉలిక్కి పడ్డాడు. ఎకానమీ క్లాసులో ఆఖరి వరుసలో కూర్చున్నాడు. విమానం లేండ్‌ కాగానే ప్రయాణీకులంతా ఒక్క సారే లేచి నిలబడ్డారు. సీటు పైన ఉన్న డేష్‌ బోర్డు లో బ్యాగు తీసుకుంటున్నారు.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ తనతో పాటు తెచ్చుకున్న చిన్న బ్రీఫ్‌ కేసు తీసి పట్టుకుని దిగడానికి సిద్ధంగా నిలబడ్డాడు.‘ఎయిర్‌ పోర్ట్‌ కి ఎవరైనా వస్తే బావుండేది ! చెన్నై పోలీసులకి మెసేజ్‌ ఇచ్చానని కమీషనర్‌ చెప్పారు. ఎయిర్‌ పోర్ట్‌లో దిగీ దిగగానే ఫోన్‌ చెయ్యమని ఒక నెంబర్‌ ఇచ్చారు. బహుశా ఆ వ్యక్తి తనని రిసీవ్‌ చేసుకోడానికి స్టేషన్‌కి వస్తాడేమో చూడాలి. తనకిక్కడ అంతా కొత్తే కదా! తను వెతుక్కుంటూ వచ్చిన ఏ.టి.ఎమ్‌ అకౌంట్‌ హోల్డర్ అడ్రస్‌ ‘టి.నగర్‌’లో ఉంది.

ఇక్కడ నుండి టినగర్‌ ఎంత దూరం ఉంటుందో?’ అనుకుంటూనే టక్కున ఏదో గుర్తొచ్చి సెల్ ఫోన్‌ ఉంది కదా! నెట్‌లో సెర్చ్‌ చెయ్యొచ్చు’ అనుకుంటూనే విమానం దిగి ఎయిర్‌ పోర్ట్‌ బయటకు వచ్చాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.చేతిలో బ్రీప్‌ కేస్‌ పట్టుకుని చిన్న సైజు జేమ్స్‌ బాండ్‌లా కనిపిస్తున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.  సూటూ బూటు వేసుకున్నాడు. కాళ్లకి కావాలనే కలర్‌ బూట్లు మానేసి నల్లలగా నిగ నిగ మెరుస్తున్న కొత్త బూట్లు వేసుకున్నాడు.

ఎయిర్‌ పోర్ట్‌ లాంజ్‌ లో నుండి అరైవల్‌ గేటు దగ్గర కొచ్చేసరికి ఎవరో ఒక వ్యక్తి ‘ఎస్సై అక్బర్‌ ఖాన్‌’ అన్న ప్లకార్డు పట్టుకుని ఎదురు చూస్తూ నిలబడ్డాడు. విమానం దిగి వచ్చే తమ వారి కోసం చాలా మంది పూలబొకే తో ఆహ్వానిస్తూ నిలబడి ఉన్నారు. హోటల్‌ వాళ్ళు, టూరిస్ట్‌ గైడ్ లు  ప్ల కార్డుల్లో పేరు రాసుకుని అందరికీ కనిపించేలా పైకెత్తి నిలబడ్డారు.

‘అతనే తను కలవాల్సిన వ్యక్తి అయి ఉంటాడనుకుంటూ నేరుగా తన పేరు రాసి ప్లకార్డు పైకెత్తి పట్టుకున్నతని దగ్గరకు వెళ్ళాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘వెల్‌ కమ్‌ టు చెన్నై సార్‌.’’ అంటూ అతను ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కి షేక్‌ హేండ్‌ ఇచ్చాడు. ఇద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. అతను హెడ్‌ కానిస్టేబుల్‌ రామ్‌ తెలుగు తెలిసిన తమిళ పోలీసు.

‘‘థేంక్యూ రామ్‌.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘రండి సార్‌!’’ అంటూ దగ్గరుండి తీసుకు వెళ్లాడు అతను.

ఇద్దరూ విమానాశ్రయంలో నుండి బయటకు వచ్చారు. పార్కింగ్‌లో పార్క్‌ చేసిన బుల్లెట్‌ తీసుకుని ఎస్సై అక్బర్‌ ఖాన్‌ని ఎక్కించుకుని ముందుకురికించాడు తమిళ పోలీసు రామ్‌.

రోడ్డుకిరువైపులా ఎత్తుగా ఉన్న భవనాలను, పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌ కేసి చూస్తూ వాటిపై  ఇంగ్లీషులో  రాసిన పేర్లు చదువుతూ ఆ ప్రాంతం పేరు కూడా మనసు లోనే మననం చేసుకుంటూ బుల్లెట్‌ మీద ఉత్సాహంగా కూర్చున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సార్‌! మనం ఎక్కడికి పోవాలో సెలవిస్తే అటు పోతా సార్‌!’’ బైక్‌ స్లో చేస్తూ అన్నాడతను.

‘‘టి. నగర్‌.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘టి. నగర్‌లోని ఏ ప్రాంతం సార్‌?’’ అడిగాడతను.

‘‘టి. నగర్‌లో....’’ అంటూ ఆలోచిస్తూనే బేక్‌ పాకెట్టులో ముందే రాసి దాచిన అడ్రస్‌ కాగితం బయటకు తీసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సౌత్‌ భాగ్‌ రోడ్‌, టి,నగర్‌.’’ చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

అర్థ గంటలో సౌత్‌ భాగ్‌ రోడ్‌ చేరుకున్నారు.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ దగ్గరున్న అడ్రస్‌ తీసుకుని చూసి ఒక్క సారే అదిరి పడ్డాడు అతను.

‘‘సార్‌! ఈ అడ్రస్‌ కా వచ్చాము. అమ్మో ! వద్దు సార్‌! మీరు కూడా పోవద్దు సార్‌.’’ ఆందోళనగా అన్నాడతను.

‘‘వ్వాట్‌! ఏమైంది? ఎందుకొద్దంటున్నారు? మనం వెళ్ళేది జస్ట్‌ ఎంక్వయిరీకే కదా!’’ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.‘‘అదేంటి సార్‌! మీకు తెలియక అడుగుతున్నారా? మన దక్షిణాది రాష్ట్రాల్లో పేరున్న పెద్ద సార్వాడు సార్‌. యలమంచిలి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ ఛైర్మన్‌ సార్‌ వాడు సార్‌ ఘర్‌ సార్‌ ఇది.’’ ఆందోళనతో అన్నాడు తమిళ పోలీసు రామ్‌.

‘‘ఇదిగో...ఈ అడ్రస్‌ చూడండి.’’ అంటూ తన దగ్గరున్న అడ్రస్‌ అతనికి చూపించాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

అడ్రస్‌లో ఉన్న డోర్‌ నెంబర్‌తో అంతా సరి చూసాడు పోలీసు రామ్‌. అంతా సరిగా సరి పోయింది. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ దగ్గరున్న అడ్రస్‌లో ఉన్న ఇల్లు ఇదే!’’ మౌనంగా అడ్రస్‌ తిరిగి ఎస్సై అక్బర్‌ ఖాన్‌ చేతికిచ్చేసాడు పోలీసు రామ్‌.

ఆ పోలీసు అంతగా అదిరిపోయేంత విషయం ఏముంది ఆ అడ్రస్ లో? అందులోకి ఎంక్వయిరీకి వెళ్ళ్బోతున్న అక్బర్ ఖాన్ ఎదుర్కోబోతున్న పరిస్థితులేమిటి.....ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే.......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్