Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bhaginee hasta bojanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

డబ్బుకి డబ్బూ, కాలక్షేపానికి కాలక్షేపమూ - భమిడిపాటిఫణిబాబు

Money for money

సాధారణంగా, ఓ మనిషైనా, యంత్రమైనా నిర్ణీత కాలం వరకే పనిచేసే శక్తనండి, క్షమతనండి, ఉంటుంది… ఆకారాలు చూడ్డానికి బాగానే ఉంటాయి, కానీ, మొదట్లో ఉన్నట్టుగా కాదుగా.. ఉదాహరణకి వాహనాల విషయం తీసుకోండి, ప్రభుత్వం వారు , 15, 20 ఏళ్ళుదాటిన వాహనాలని నడపకూడదనే, చట్టం అయితే ఉంది, కానీ స్కూలు బస్సుల కాంట్రాక్టర్లు కొందరు, పాతబస్సులకే రంగులు వేసి, కొత్తదన్నట్టుగా నడిపించేస్తూంటారు, ఎప్పుడో దురదృష్టవశాత్తూ ఆ బస్సుకి ఏదో  accident  అయినప్పుడు మాత్రమే, విషయాలు బయటకొస్తూంటాయి.. ఆ బస్సులో ముఖ్యమైన భాగాలు కొత్తలో ఉన్నట్టుండమంటే ఎలా ఉంటాయీ? ఏదో మామూళ్ళు తినిపించేసి, ఆ డొక్కు బస్సుకే, పెర్మిట్ తీసుకోవడం, అందరినీ ఇబ్బంది పెట్టడం… పైగా పాతబడేకొద్దీ, ఆ బస్సుకి fuel  కూడా ఎక్కువ అవసరమవుతుందిట. ప్రతీదానికీ  efficiency  అని ఒకటుంటుందిగా, అది లోపించబట్టే కష్టాలన్నీనూ. అలాగే ఇళ్ళల్లో ఉండే సామగ్రి కూడా. పాతవాటికి ఏ రిపేరీ అయినా వస్తే, వాటి  spare parts  కూడా దొరకవు.. ఏదో ఆకారం ఉందిగా అనుకుంటే సరిపోతుందా మరి ? యంత్రాలకి ఉన్నట్టే మనుషులకీనూ.. ఉద్యోగాలు చేసేవారికి, ప్రభుత్వం వారు ఓ 60 ఏళ్ళొచ్చేసరికి , రిటైరు చేసేస్తారు. కారణం – ఉద్యోగంలో చేరినప్పటి ఉత్సాహం, ఓపిక తగ్గిపోతాయి.. భగవంతుడుకూడా, ఓ ప్రణాలిక ప్రకారమే, మన శరీరాల్ని నిర్మించాడు… పురాణాల్లో ఏవేవో- బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం,  వానప్రస్థం అంటూ నిర్ణయించారు.. ఆయుష్షు ఓ 70-80 ఏళ్ళుండేట్టుగా. మామూలు పరిస్థితుల్లో అయితే, రిటైరయే సమయానికి, మానవ జన్మెత్తినందుకు, బాధ్యతలన్నీ పూర్తిచేసుకోవాలి.. ఎక్కడో అరుదుగా వీటిని పూర్తిచేసుకోలేనివారుంటారు.. అయినా మనం మాట్టాడుకునేది, అన్ని పనులూ పూర్తిచేసుకుని, హాయిగా మనవలూ, మనవరాళ్ళతో గడపకుండా, సంపాదనే ధ్యేయంగా వెంపర్లాడేవారి గురించి.. రిటైరయిన తరవాత దేంట్లోనో చేరేవారు చెప్పేది ఒక్కటే.. “  డబ్బుకోసం కాదండీ.. 24 గంటలూ పనిచేసిచేసి ఖాళీగా ఉండడం కష్టం అయిపోతోందీ.. పోనీ పాపం వాడెవడో పిలిచి ఉద్యోగం ఇస్తూంటే కాదనలేకా… “ ఇదో  Universal excuse.  పైగా ఇలాటివేమైనా అంటే, “ మీకు దొరకలేదని,  చేసేవాళ్ళంటే కుళ్ళూ.. “ అంటారు.

అలాగే కార్లూ, స్కూటర్లూ, బైక్కులూ నడిపేవాళ్ళు, నలభై ఏళ్ళు నడిపారుకదా, పోనీ ఇంక వాటి జోలికి వెళ్ళకుండా, హాయిగా ఏ బస్సులోనో, టాక్సీలోనో వెళ్ళొచ్చుగా, కాదూకూడదనుకుంటే, ఓ డ్రైవర్ ని పెట్టుకుని, స్వంత కారే వాడుకోవచ్చుగా..అబ్బే అలాఎలా కుదురుతుందీ, అందరికీ తెలియొద్దూ, 70 ఏళ్ళు దాటినా , కళ్ళజోడుకూడా లేకుండా , జుయ్యిమంటూ ఎలా వెళ్తున్నాడో అని ఆశ్చర్యపోవద్దూ? ఈరోజుల్లో రోడ్లమీద ట్రాఫిక్ ఎలా ఉంటోందో అందరికీ తెలిసిందే.. మనం జాగ్రత్తగా బండి నడిపిస్తే సరిపోదు, అవతలివాడెవడో కూడా నడిపించాలి, లేకపోతే ఆసుపత్రి పాలే. పైగా ఏ కాలో, చెయ్యో విరిగితే అంత తొందరగా అతుక్కోదుకూడానూ… ఆ accident  చేసినవాడు, మహా అయితే ఓ  sorry  చెప్తాడు.. మంచం పట్టేది, మన 70 ఏళ్ళ హీరోగారే… ఏదో చూపించేసుకోవాలనే యావ..కృత్రిమ అలంకరణలు చేసేసుకుంటే, ఉడిగిపోయిన శరీరంలో శక్తి వస్తుందా? మన శరీరం ఎంతవరకూ తట్టుకోగలదో మనమే చూసుకోవాలి, ఇంకోరెవరూ కాదు. నిజమే కొందరికి రిటైరయిపోయినా కుటుంబ బాధ్యతలుంటాయి, కాదనను, కానీ డబ్బువ్యామోహంతోనే , రిటైరయిన తరవాతకూడా ఉద్యోగాలు చేసేవారు ఈ విషయాలు గమనించాలి.

కుటుంబ పెద్దగా, చేయవలసిన పనులన్నీ చేసిన తరవాత ఇంకా ప్రపంచానికి ఏం చూపించాలో అర్ధమవదు. అంతగా కాలం గడపలేకుంటారూ అనుకుంటే, ఈరోజుల్లోకూడా, అంతర్జాలం (  Internet )  లో కావాల్సినన్ని వ్యాపకాలున్నాయి. డబ్బుకి డబ్బూ, కాలక్షేపానికి కాలక్షేపమూనూ..

రాజకీయ నాయకులు 60 ఏళ్ళు దాతిన తరవాతకూడా చేయడం లేదా అంటే, వాళ్ళ సంగతి వేరూ—ప్రజలకి మాయమాటలు చెప్పడమే వారికి మొదటినుండీ వ్యాపకమాయే…పైగా దానికి “ ప్రజా సేవ “ అని ఓ పేరుకూడానూ..

ఓ వయసు వచ్చిన తరవాత మన faculties  అంత sharp  గాఉండవని గుర్తిస్తే చాలు…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
weekly horoscope november 9th to november15th