Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope november 9th to november15th

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

( కుంభకోణం , సారంగపాణి కోవెల )

కుంభేశ్వరుని కోవెలకి ఓ ఫర్లాంగుల దూరంలో వున్న విష్ణుమందిరం , కుంభకోణం పట్టణంలో వున్న అతిపెద్ద విష్ణుకోవెల యీ సారంగపాణి కోవెలే . ఒకే పట్టణం లో యింత దగ్గరదగ్గరగా శివ , విష్ణు మందిరాలు వుండడం అరుదనే చెప్పాలి .

ధనస్సును చేత పట్టుకున విష్ణుమూర్తిని ‘ సారంగపాణి అని అంటారు .

11 అంతస్థుల రాజగోపురం సుమారు 178 అడుగుల యెత్తు వుండి , దేవీదేవతా విగ్రహాలతో చక్కగా వుంటుంది . చుట్టూరా పెద్దరాతిగోడ ,  మందిర ప్రాకారంలో వున్న‘ పోత్రమారై ‘ పుష్కరిణి . పోత్రమారై పుష్కరిణి కుంభకోణంలో వున్న పరమపవిత్రమైన పుష్కరిణిలలో ఒకటి . ఈ పుష్కరిణి పరమపవిత్రమైనది యెందుకైందంటే ఈ పుష్కరిణిలో అమృతం పడిందట , యీ వొక్కచోటే కాదు కుంభకోణం లో చాలా చోట్ల అమృతం పడిందట , ఆ కథేంటో ముందుగా తెలుసుకుందాం .

దేవదానవులు అమృతమథనం చేసినప్పుడు కల్పవృక్షం , కామధేనువు , ఐరావతం , ధన్వంతరి , మహాలక్ష్మి మొదలయినవెన్నో పుట్టిన తరువాత హాలాహలం పుట్టగా దానిని శివుడు కంఠంలో బంధించడం కూడా మనకు తెలుసు , చివరగా అమృతం పుడుతుంది . అమృతం కోసం దేవదానవులు యెదురుచూస్తూ తమకే దక్కాలని వ్యూహాలు రచిస్తూ వుంటారు , అయితే అమృతం పుట్టగానే గాలికన్నావేగంగా తనరెక్కలతో సూర్యుచంద్రులను కప్పివేస్తూ లోకమంత చీకటి చేసి మెరుపు వేగంతో అమృత కలశాన్ని గరుత్మంతుడు యెత్తుకుపోతాడు .      గరుత్మంతుడు అమృతం యెత్తున పోవడానిక ఓ కథ వుంది , గరుత్మంతుడి తల్లి వినత  సవతి తల్లి అయిన కద్రువ ఓ నాడు దూరంగా పచ్చిక మేస్తున్న ఇంద్రుని గుర్రాన్ని చూసి యెంత తెల్లని గుర్రమో అని వినత అనగా లేదు ఆ గుర్రపు తోక నల్లని రంగులో వున్నది అన్నదట కద్రువ , ఆ విషయమై యిద్దరూ వాదనలు చేసుకొని ఆగుర్రాన్ని దగ్గరకు పోయి చూడాలని గుర్రము తెల్లగా వుంటే కద్రువ ఆమె పుతృలైన నాగులు వినతకు , ఆమె పుతృలైన గరుత్మంతుడు , అనూరులకు బానిసలుగ వుండాలని లేకపోతే వినత ఆమె పుతృలు కద్రువ ఆమె పుతృలైన నాగులకు బానిసలుగ వుండాలనే షరతు పెట్టుకుంటారు .  కద్రువ వినతను తన బానిసగా చేసుకోవాలనే తలంపుతో తన పుతృలకు విషయం చెప్పగా వారు గుర్రము తోకను చుట్టుకుంటారు . వినత , కద్రువ పోయి చూడగా గుర్రము తోక నల్లగా వుండడం చూసి వినత తాను ఓడిపోయినట్లు అంగీకరిస్తుంది , అప్పటినుంచి వినత ఆమె పుతృలు , కద్రువ ఆమె పుతృలైన నాగులకు బానిసలుగ వుంటారు . నాగులు వినత , గరుత్మంతులను నానా విధాలుగ బాధిస్తూ వుంటారు . ఓనాడు గరుత్మంతుడు నాగులను బానిసరికం నుంచి విముక్తులను చెయ్యమనగా నాగులు అమృతం తెచ్చి యిస్తే వారిని బానిసరికం నుంచి విముక్తులను చేస్తామని చెప్తారు .  అమృతం త్రాగి అమరులైపోదామనే దురాశ నాగులది .

గరుత్మంతుడు విష్ణుమూర్తితో నాగుల దురాలోచన చెప్పగా హరి అమృతం ఉద్భవించగానే తీసుకువెళ్లి నాగులకు యిచ్చి విముక్తి పొంది వెంటనే అమృతాన్ని తిరిగి తనకు యివ్వమని  చెప్తాడు . అందుకని గరుత్మంతుడు అమృతం తీసుకొని కద్రువనాగుల నివాసానికి వెళ్లి దాస్యవిముక్తుడౌతాడు . దాస్యవిముక్తులైనట్లు నాగులు అంగీకరించగానే తిరిగి అదే వేగంతో అమృతం తీసుకుపోయి విష్ణుమూర్తికి అమృతభాండం యిచ్చివేస్తాడు . గరుత్మంతుడు అలా అమృతకలశం తీసుకు వస్తున్నప్పుడు గరుత్మంతుని వేగానికి కొన్ని అమృతం చుక్కలు భూమి పై వెదజల్ల బడ్డాయట ,  అలా వెదజల్లబడ్డ అమృతం భూమిమీద చాలాచోట్ల పడ్డదట , హరిద్వార్ , నాసిక్ , ఉజ్జయిని , అలహాబాదు మొదలయిన ప్రదేశాలతో పాటు కుంభకోణం లోని ‘ మహామఖం ‘ తటాకం లోను , పోత్రమారై తటాకంలోనూ అమృతం చుక్కలు పడ్డాయట . ఇలా అమృతం పడ్డ ప్రదేశాలలో ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు . సాధారణంగా నదులకు అంటే గంగా , గోదావరి నదులకు కుంభమేళా నిర్వహించడం చూస్తూ వుంటాం , కాని కుంభకోణంలో మందిరానికి చెందిన పుష్కరిణులకు  కుంభమేళా నిర్వహించడం కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది . అయితే పుష్కరిణి చిన్నదికదా అని యీ కుంభమేళాకి జనం తక్కువ రారండోయ్ , లక్షలలో జనం వచ్చి యీ రెండు పుష్కరిణిలలోనూ స్నానాలు చేసుకుంటూ వుంటారు . దీనిని ‘ మహామఖం ‘ అని అంటారు . రెండు పుష్కరిణి లకు కొత్తగా గట్లు కట్టి స్నానాలకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం యెర్పాట్లు చేసింది . ఎలాగ మహామఖం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మహామఖం పుష్కరిణి గురించి కూడా చెప్పుకుందాం . 

ఈ పుష్కరిణి కుంభేశ్వరుని మందిరం బయట వుంటుంది , చుట్టూర పెద్దపెద్ద గట్ల నిర్మాణం చేసి చిన్నచిన్న మందిరాలు నిర్మించేరు , మహామఖం స్నానాలు చేసుకొని భక్తులు దర్శనాలు చేసుకొనే నిమిత్తం గణేష , కార్తికేయ , శివ పార్వతి , విష్ణుమూర్తి , నారద , సప్తఋషుల విగ్రహాలను గట్టులపైన ప్రతిష్టించేరు . మామూలు కొలను లా వుండే యీ మహామఖం లో లక్షలాది భక్తులు స్నానాలు చేస్తారు అంటే నమ్మశక్యం కాదు , కాని స్నానాలు చేసిన వారి అనుభవం వింటే యేదో అద్భుతంలా కనిపిస్తుంది . ఎంత మంది స్నానాలు చేసినా నీటికి కొరత వుండదు నీరు మురికి అవదు అంటారు .

ఇక సారంగపాణి కోవెల గురించి తెలుసుకుందాం . కోవెల స్థంభాలపై భరతనాట్య భంగిమలలో వున్న అప్సరసలు , వివిధ దేవతా మూర్తులు యిట్టే ఆకట్టుకుంటాయి . ఈ కోవెల నిర్మాణం డు జరిగింది తెలియదు కాని  7 వ శతాబ్దం లో చోళరాజులకాలానికే యీ మందిరం వున్నట్లు చరిత్రలో వుంది , రాజ్యానికి వచ్చిన పల్లవుల విజయనగర రాజుల ప్రభావం యీ మందిరం లో అడుగడుగునా కనిపిస్తుంది . కుంభకోణం లోని మందిర నిర్మాణం , శిల్పకళలను గురించి వర్ణించడం నా శక్తికి మించిన పని , కళ్లారా చూస్తే తప్ప వాటి గొప్పదనం తెలియదు , లోపల గర్భగుడి రధం ఆ కారం లో వుంటుంది . గర్భగుడి పైన అంతా దేవీ దేవతల విగ్రహాలు వుంటాయి , లోపల విష్ణమూర్తి నాభి నుంచి వచ్చిన కలువ పువ్వు పై బ్రహ్మదేవునితో శేష శయనుడై వుంటాడు , శివ పార్వతులు , నారద తుంబురులు , సప్తఋషులు , దేవీదేవతలు కొలువై వుంటారు . వీరేకాక ‘ హేమ ఋషి ‘ విగ్రహాన్ని కూడా చూడొచ్చు . కాని లక్ష్మీదేవి విగ్రహం గర్భగుడిలో వుండదు . గర్భగుడికి దక్షిణ ద్వారంలోంచి ఆరునెలలు , ఉత్తర ద్వారం నుంచి ఆరునెలలు భక్తులకు ప్రవేశం వుంటుంది .

గర్భగుడి కి పక్కగా  వున్న మందిరంలో లక్ష్మీ దేవి కళకళలాడుతూ వుంటుంది . ఎందుకో యీ కోవెలలో లక్ష్మీదేవి నిజంగా అక్కడ కూర్చొని పూజలందుకుంటున్నట్లు అనిపించింది . గర్భగుడి చుట్టూర కూడా అంతులేని శిల్పసంపద చూడడానికి రెండు కళ్లూ చాలవు . 

ఈ కోవెల వైష్ణవులకు పవిత్రమైన 108 దివ్యదేశాలలో ఒకటి . కావేరీనదీ తీరంలో వున్న పంచరంగ క్షేత్రాలలో యిది వొకటి . 

ఇక స్థలపురాణం తెలుసుకుందాం .

హేమ ఋషి విష్ణుమూర్తిని గురించి అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సాచరించగా విష్ణుమూర్తి ప్రసన్నుడై సారంగాన్ని ధరించి ప్రత్యక్షమై యేం కావాలని అడుగగా హేమఋషి లక్ష్మీదేవిని పుత్రికగా అనుగ్రహించమని కోరాడట , అప్పుడు లక్ష్మీదేవి పోత్రమారై కొలనులో వేల కలువపువ్వుల మధ్య ఉద్భవించిందట , అందుకే యిక్కడ లక్ష్మీదేవిని ‘ కమలవల్లి ‘ అని అంటారు . ఆమెను వివాహం చేసుకోడానికి స్వర్గం నుండి ఏనుగులు , గుర్రాలు లాగుతున్న రథంలో విష్ణుమూర్తి సపరివారంగా వచ్చియిక్కడ దిగేడట . కంభేశ్వరాలయంలో మగపెళ్లివారు విడిది చేసేరుట , లక్ష్మీదేవిని వివాహం చేసుకొని విష్ణుమూర్తి  వైకుంఠానికి తరలిపోయేడట , హేమ ఋషికి సారంగపాణిగా దర్శనమిచ్చిన ప్రదేశం కావడంతో యీకోవెలని సారంగపాణి మందిరమని అంటారు . హేమఋషి కోరికపై విష్ణుమూర్తి యిక్కడ పెళ్లికి తరలివచ్చిన దేవీదేవతలతో కొలువై వున్నాడన అంటారు .

ముందుగా నేను మనవి చేసినట్లు యిక్కడవున్న అనేక మందిరాలలో ముఖ్యమైన వాటిని మాత్రమే మీకు పరిచయం చేస్తున్నాను , వచ్చేసంచికలో మరికొన్ని మందిరాల గురించి మీకు తెలియజేస్తానని మనవి చేస్తూ అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
Panasa Pottu Kura