Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి..http://www.gotelugu.com/issue293/764/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)... లిఫ్ట్ గోడకు ఆనుకుని నుంచున్న మనోహర్ కుప్పపోసి ఉన్న కాత్యాయని అందాన్ని కళ్లతో జుర్రుకుంటున్నాడు. ఆ లిఫ్ట్ కి ఒక వైపున గ్లాస్ ఉండడం చేత బయట లాన్లో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తోంది కాత్యాయని. ఆమెను గబుక్కున అందుకుని ముద్దు పెట్టుకోవాలన్న కోరికను బలంగా అణచుకున్నాడు. లిఫ్ట్ మెత్తగా కిందకు జేరాక డోర్స్ తెరచుకున్నాయి.
ముందుగా మనోహర్ బయటకు నడిచి కాత్యాయనిని బయటకు రమ్మన్నట్టుగా రెండుచేతులూ సాచి ఆహ్వానించాడు. అతని మన్మధ హృదయానికి అది హాస్పిటల్ లా లేదు. బృందావనంలా ఉంది. ఎందుకంటే అక్కడున్న డాక్టర్లు, నర్స్ లు, స్టాఫ్, హాస్పిటల్ వాతావరణం ఏదీ కనిపించడం లేదు. తను కోరుకున్న శృంగార దేవత తనముందు ఉండడమే దానికి కారణం!

ఆమె సిగ్గుపడుతూ దిగాక తను ముందు నడుస్తూంటే ఆమె అతణ్ని అనుసరించింది. వచ్చేటప్పుడు టెన్షన్తో చూడలేదు గాని అది చాలా పెద్ద హాస్పిటల్. అన్ని రకాల వ్యాధులకి అక్కడ పెద్ద పెద్ద డెడికేటెడ్ బ్లాకులు ఉన్నాయి. అవగాహన లేకుండా వాటిల్లోకి అడుగుపెడితే తప్పిపోయే ప్రమాదం కూడా ఉంది. పెద్ద అడవిలో ఉన్న లేడిపిల్లలా ఉంది ఆమె పరిస్థితి. ఆశ్చర్యం, భయంలతో కళ్ళు పెద్దవవుతున్నాయి. ఒళ్లు గగుర్పొడుస్తోంది. కాళ్లూ చేతులు చల్లబడుతున్నాయి. అతని వెనకాలే మంత్రగాడి వెనక మంత్రించబడిన అందమైన అమ్మాయిలా వెంబడిస్తోంది.

హాస్పిటల్ బయటకు వస్తూండగానే ఫోన్ చేయడం చేత క్యాబ్ అప్పటికే అక్కడ వాళ్లకోసం ఎదురుచూస్తోంది. అతను ఆమెను ముందు ఎక్కమని, తర్వాత తనూ ఎక్కి ఆమె పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఇలా ఆమెకి ఆనుకుంటూ సీట్లో కూర్చోడం అతనికి చాలా కంఫర్ట్ బుల్ గా ఉంది.

ఆ కారుకు కుదుపులుండవు. అయినా మన గతుకుల రోడ్ల వల్ల కారు గోతుల్లో వెళుతుంటే చిన్నగా ఎదురయ్యే కదలికలకు అటూ ఇటూ చిన్నగా కదులుతూ ఆమె పై ఒరుగుతుంటే అతని నర నరం తీయని స్వరాలు పలుకుతోంది. ఆమెని ఆ కారు వెనక సీటు మీద పడుకోబెట్టి అప్పటికప్పడే ఆమెను ఆక్రమించుకోవాలన్న తపన అతనిలో క్షణ క్షణం అధికమవుతుంది. కళ్లు ఎర్రబారుతున్నాయి. ఒళ్లు మైకాన్నలుముకుంటోంది. సరిగ్గా అదే సమయంలో వాళ్లు దిగాల్సిన ఇల్లు వచ్చేసింది. అదీ ఆమె విండోలోంచి తమ కాలనీ చూసి ‘ఇక్కడే’ అని గట్టిగా డ్రైవర్తో చెప్పింది. ఆ అరుపులాంటి మాటకి ఈ లోకంలోకి వచ్చాడు మనోహర్. ‘ఊహే ఇంతగా ఇనస్పైర్ చేస్తే రేపన్నరోజున తెల్లటి దుప్పటి పరచి, దానిపై పూలు జల్లి, రూమంతా ఫ్రాగ్రాన్స్ అలముకుని ఉన్న మంచం మీద ఆమెని పడుకోబెట్టి ఆమెపై ఒరిగి అణువణువునూ తడుముతూ, ఆమె శరీరంలో తన కంటబడకుండా గోప్యంగా, అపురూపంగా ఉన్న భాగాలని స్పృశిస్తూ అలా అలా సాగిపోతుంటే..ఓహ్!’ అనుకుంటూ కిందకు దిగాడు.

"థాంక్సండీ, మీరన్నవారు లేకపోతే ఇవాళ నా పరిస్థితి  ఏమయిపోయేదో. నేను బట్టలు సర్దుకుని బస్సులోనో, ఆటోలోనో హాస్పిటల్ కి వెళతాను" అంది.

"నో..నో మీరు ఇబ్బంది పడతారు. నేను కార్ ముందే మాట్లాడి పెట్టాను. రేపు మీరు ఇంటి పని చూసుకుని బయటకొచ్చేసరికి సిద్ధంగా ఉంటుంది. మీరు వెళ్లండి. నేను రేపు సాయంత్రం హాస్పిటల్ కి వస్తాను" అన్నాడు.

‘అయ్యో ఎండుకండీ..’ఆమె అంటున్నా వినిపించనట్టుగా వెళ్లిపోయాడు. చేసేదేం లేక ఆమె ఇంట్లోకెళ్లి తన అత్తగారికి, అక్కడే ఉన్న రాధమ్మకీ  ఉదయం నుంచి జరిగింది చెప్పింది. అత్తగారు బాధ పడుతున్నట్టుగా శరీరం కంపించసాగింది. కళ్లు కన్నీళ్లు కార్చసాగాయి. రాధమ్మ బాధపడి ‘మళ్ళీ రెపొస్తానని ’చెప్పి వెళ్లిపోయింది.

కాత్యాయని అత్తగార్ని ఊర్కోబెట్టి మెల్లగా ఇంటి పనిలో దిగింది. స్నానం చేసి అన్నం, కూర వండి అత్తగారికి పెట్టి, తనూ తినీ పడుకుంది. పడుకుందేకాని చాలా సేపు నిద్రపట్టలేదు. గజిబిజిగా ఆలోచనలు మెదడంతా స్వైర విహారం చేసి, చివరికి మనోహర్ గుర్తొచ్చేసరికి మనసు ప్రశాంత మైంది. నిద్రాకమ్ముకుంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్