Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఏది శాస్త్రం

edi shastram

ఆంజనేయస్వామి గుడి.. మలుపులో ఆగిన .. బస్సు లోంచి దిగారు రాజామణి ఆమె కూతురు మంజుల. అది రాజామణి పుట్టిన ఊరు. ఇప్పుడక్కడ అన్నయ్య పరశురాముడు మాత్రమే ఉంటున్నాడు.

ఇంటి ముందు వాకిట్లోకి అడుగు పెట్టారో! లేదో! ఎక్కడ నుంచి వచ్చాయో .. బిలబిలమంటూ నాలుగు పిల్లి కూనలు చుట్టుముట్టాయి, ఆ వెనుకనే వాటి తల్లి.

బస్సు దిగిన .. చోటే చిన్నిపాటి సంత జరుగుతుంటే,  అన్నగారికి ఇష్టమని ఓ చెరువు చేప కొనుక్కుని మరీ వచ్చింది రాజామణి.
ఆమె చేతి సంచితో పాటు ఉన్న.. మరో కవర్ లోంచి  బయటికే కనిపించి ముక్కుపుటాలు ఆదరగోడుతుంటే,  ఆ వాసనకి  ఆకలి కేకలు వేస్తూ .. ఆమె చుట్టూ గింగిరాలు కొడుతూ, నిలబడనివ్వకుండా చేస్తున్నాయి.

పుట్టింటితో సంబంధ౦ కలుపుకోవాలని, తన కూతురు మంజులని .. అన్నగారి కొడుకైన  అత్యుతానందన్ కి ఇచ్చి పెళ్ళి చెయ్యాలన్న తలంపుతో వచ్చింది. అత్యుతానందన్ ఇంజనీరింగ్ చదివి, చిన్న ఉద్యోగంలో కూడా ఉన్నాడు.  అలా అన్నగారింట అడుగుపెట్టిన .. ఆమెకు ఈ విధంగా శకునం  ఎదురుకావడం కొద్దిగా అయినా నచ్చలేదు.

అయితే, ఎప్పుడో మేనల్లుడు ఓ పిల్లి పిల్లను చేరదియ్యడం తెలుసు. అప్పుడే గట్టిగా వారించింది.  తెల్లవారి లేచి దాని ముఖం చూడడం గాని, దాని ఎదురు గాని మంచిది కాదని, ఇప్పుడు గుమ్మం లోకి వచ్చే సరికి  సరిగ్గా  అదే పిల్లి ఎదురు రావడంతో చిర్రెత్తు కొచ్చింది.
అత్త రాకను గమనించి .. ముందుగా ఎదురొచ్చిన మేనల్లుడి వైపు కోపంగా చూస్తూ “ ఏరా! నీకు ఆ రోజు ఎంతగా చెప్పాను. పిల్లి ఎదురు .. ఇంటికి మంచిది కాదని, అంత ముద్దుగా ఉంటే,  ఏ ఆల్సేషియన్ కుక్క పిల్లనో తెచ్చి పెంచుకోక .. ఇంటి నిండా ఈ పాడు పిల్లుల గోలేమిట్రా? అదైతే, ఇంటి కాపలా అయినా ఉంటుంది. శుభమా! అంటూ ఇంటికొస్తే .. ఇవా ఎదురోచ్చేది? అంది.

అత్త పక్కనే ఉన్న మంజులని ఆరాధనగా చూస్తూ,  పలకరింపుగా నవ్వి  “ అత్తయ్యా! ఆ రోజు నువ్వు చూసిన చిన్న పిల్లే .. ఈ పెద్ద పిల్లి.  లైకా ..  ఇప్పుడు పిల్లల్ని పెట్టింది. ఏం చేయ్యదులే. తప్పించుకుని వచ్చేయ్!  కాస్త పెద్దయితే, అవే  వెళ్లిపోతాయి “ అంటూ అత్తకు నచ్చచెబుతూ ..

వాటిని ఉద్దేశించి  ‘లైకా .. దూరం జరగ౦డి .. అత్తయ్యని లోనికి రానివ్వు౦డి ’  అంటూ వాటికీ అర్ధమయ్యేలా  చెబుతున్నాడు.
అప్పటికే ఆ కూనలు .. కువకువలాడుతూ రాజామణి చీరేకు తోకలు ఆనించి,  రాసుకుంటూ  గోలగోలగా ఆమె చుట్టూ తిరగసాగాయి. అవి అలా తాకుతూ తిరగడం ఆమెకు కంపరాన్ని పుట్టించాయి.

వాటిని తన చేతి సంచితో  అదిలిస్తూ దూరంగా విసిరి కొడుతూ, కాళ్ళు తొక్కుకుని కలియతిరుగుతూ  “ కబుర్లు బాగా నేర్చావు. పైగా వాటికి పేర్లు కూడా పెట్టి పిలుస్తూ .. నెత్తి మీద ఎక్కించుకుంటే, ఇక అవి ఎక్కడికి పోతాయి”  చిరచిరలాడింది. అయినా వాటి ప్రయత్నం అవి మానలేదు.

మంజుల అప్పటికే వాటిని దాటుకుని వసారీలోకి అడుగుపెట్టింది.

“ అత్తా! మనకే ఈ సెంటిమెంట్లు, స్కూల్ పుస్తకాల్లో పిల్లిని  అపశకునం అని ఎక్కడా చెప్పలేదు. వేరే దేశాల్లో ఇలాంటివి ఉండవు. పైగా వాళ్ళకి అవి ఎంతో శుభసూచికం కూడా” రాజమణి  చేతిలోని  సంచుల్ని అందుకున్నాడు.

వీధి గుమ్మంలో హడావుడికి ఇంట్లో నుంచి బయటకి వచ్చారు అన్నగారైన పరశురాముడు, భార్య భవాని. ఎదురొచ్చిన మంజుల చెయ్యందుకుంది భవాని.

“ ఒరేయ్! నువ్వు ఎన్ని అన్నా చెప్పు .. నా కూతుర్ని నీ కిద్దామని .. మీ నాన్నని సంభంధం అడగడానికి ఎంతో ఆశతో వచ్చాను. ఇంటికి వచ్చేసరికి అపశకునం ఎదురు. నువ్వు వీటిని దూరంగా తరిమేస్తే తప్ప నా కూతుర్ని నీ కివ్వను. పిల్లులున్న కొంపకి నా కూతుర్ని పంపను. వేరే సంభంధం అయినా చూసుకుంటా గాని” వాటి వంక మరింత చిరాకుగా చూస్తూ.  

ఆ మాటకు తల్లి వైపు బేలగా చూసింది మంజుల.

చెల్లెలి కోపం తాటాకుమంట అని తెలిసినా “ ముందు లోపలి రావే! మాట్లాడుకుందాం. అవోచ్చిన తరువాత ఇంట్లోనూ, పొలంలోనూ ఎలుకలూ, పందికొక్కులనేవే లేవు. గాదిలో ధాన్యం .. గాదిలోనే ఉంటుంది.  అందుకోసం అయినా సంతోషపడాలి” అంటూ నాలుగు మాటలు చెప్పి చెల్లెల్ని ఇంట్లోకి తీసుకు వచ్చాడు పరశురాముడు.   

“ అవును. మణీ ఎందుకైనా పాల గిన్నె బయటే మర్చిపోయినా .. బయటి పిల్లులు వచ్చి నోరు పెట్టాలి గాని, ఇవి మాత్రం ముట్టవు. కుక్కలు అనుకుంటాం గాని, ఇవీ అంత నమ్మకమైనవే. చిన్నప్పటి నుండి మనలో పిల్లుల పట్ల ఏవో అపోహలు  అలా ఉండిపోయాయి.  వీటిని చూసిన తరువాత అది అంత నిజ౦ అనిపించలేదు” అంటూ  చెప్పిన వదిన మాటలూ రుచించలేదు ఆమెకు.

కొడుక్కి పక్కనే ఉన్న టౌనులో.. చిన్న ఉద్యోగం కూడా దొరకడం,  పెళ్ళి కూడా చేసేయ్యలనుకుంటున్న తరుణంలో రాజామణికి రాక సంతోషాన్ని ఇచ్చింది  ఆ కుటుంబానికి.

ఆడపడుచు కూతురు మంజులని చేసుకోవడం భవానీకీ  ఇష్టమే. చూడ చక్కని పిల్ల. వాళ్ళ ఊరిలో ఇంటరు వరకూ చదివి, ఆ పైన  కాలేజీ లేకపోవడంతో అంతటితో సరిపెట్టింది.  అత్యుతానందన్ సంగతి చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడా అని కలలు కంటున్నాడు.
అతని కళ్ళన్నీ మంజుల మీదే ఉన్నాయి.  మంజుల చిన్నప్పుడు తనతో ..బాగానే మాట్లాడినా .. వయసు వచ్చేసరికి సిగ్గుపడడం ప్రారంభించింది.

***

రాజామణికి మాత్రం పిల్లి కూనల పొడ గిట్టకుండా పోయింది. అన్నగారింటికి  వచ్చింది మొదలు ముళ్ళ మీద ఉన్నట్టే ఉంది. ఎక్కడికి వెళితే అక్కడికి  వెన్నంటే, తిరుగడం చిరాకుగా అనిపిస్తే, అస్తమానం ‘మ్యావ్’ మంటూ వాటి అరిచే అరుపులు కర్ణ కఠోరం వినిపించసాగాయి.
అన్నావదినలు వాటిని ముద్దు చేస్తూ, కబుర్లాడడం చూస్తూ  ‘ఎవరి పిచ్చి వాళ్ళకానందం .. కొడుకు వీళ్ళనీ  మార్చేసాడు’  అనుకుంది.
ఓసారి ..

తన కొడుకు నాగరాజు చీకటి మొకంతోనే పిల్లిని చూడడం వలన జరిగిన నష్టం గుర్తు తెచ్చుకుంది.

ఉద్యోగాలో చేరిన కొత్తలో .. డిపార్టుమెంటు పరీక్షలకి వెళ్ళడం కోసం తెల్లవారుజామున నాలుగు గంటలకే  నిద్ర లేచాడు. బయటకు వెళ్ళడం కోసం తలుపు తీసేసరికి  ఎదురుగా నల్లటి బావురు పిల్లి .. మెట్లపై కూర్చుని ఉందట. ఆరోజు ఎంత ప్రయత్నం చేసినా  పరీక్షకు హాజరుకాలేకపోయాడు.

ఆ పరీక్షలు వ్రాయడానికి  యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండకు  వెళ్ళాలి. గంటన్నర ప్రయాణం. రోజూ అలాగే వెళ్లి వస్తున్నాడు. ఎందుకనో  ఆ రోజు  ఆందోళనకారులు .. బస్సుల్ని చాలా సేపు  డిపోలోనే ఆపుచేసేసారట. కారణాలు ఎవరికీ తెలివు. ఎక్కిన బస్సు ఆలస్యంగా వెళ్లడంతో .. పరీక్ష హలు లోనికి  అనుమతించలేదు.  ముందు మూడు రోజుల పరీక్షలూ బాగానే, వ్రాసినా నాలుగవ రోజు పరీక్ష వ్రాయలేక పోవడంతో .. మొత్తం పరీక్ష ఫైయిలు అయ్యాడు.

మళ్ళీ .. పరీక్షలు  వ్రాసి .. ప్రమోషను తెచ్చుకోవడానికి నాలుగేళ్ళు పట్టింది .. అప్పుడు  వాడితో పాటు వ్రాసిన వాళ్ళంతా మూడు సంవత్సరాలు ముందుగా ప్రమోషను తెచ్చుకున్నారట.

ఆ రోజు నల్లపిల్లి  ఎదురు పడడమే ఇంత అనర్ధానికి కారణం అంటూ చెప్పుకొచ్చింది.

“ ఒక్కోసారి అంతే ” ఖండించలేక పోయింది భవాని.

ఏదో కొడుకు ముద్దు చేసాడని ఊరుకు౦ది గానీ,  అవి అస్తమానం కాళ్ళకి అడ్డం పడడం .. నడిచేటప్పుడు .. కాళ్ళ క్రింద పడి ఎక్కడ నలిగిపోతాయో! అని భయపడుతూ, అదురదురుగా నడవాల్సి వస్తుంది.

అనుకోకుండా పిల్లికి ఏమైనా జరిగితే .. పిల్లిని చంపిన పాపం ‘బంగారుగుడి’ కట్టించినా పోదట. బంగారుగుడి కట్టించే స్థితి మంతులా! వాళ్ళు
శుభమా అంటూ పెళ్ళి జరిగే ఇంట్లో .. ఇలాంటి అపశకునాలు ఉండడ౦ మంచిది కాదని భవానీ కూడా భావించింది. పెళ్ళంటే, అందరూ వచ్చి పోయే వేడుక కాబట్టి,  వాటిని ఎక్కడైనా దూరంగా వదిలి పెట్టి రావడమే ఉత్తమంగా తోచింది పరశురాముడికి కూడా చెల్లెలి హితభోదతో.
అత్త నమ్మకం సరిఅయినది కాకపోయినా వాదనకు దిగలేదు అత్యుతానందన్. కారణం మంజుల. ఇదమిద్దంగా ఒక్కోసారి ఇవీ అంటూ సరిఅయిన నిర్వచనాలు చెప్పలేము. అలా జరగాల్సి ఉంది. జరిగిది అనుకోవడం తప్ప.

***

సాకిన ప్రేమను చంపుకుని,

మరునాడే ..

లైకాని ఒక గొనెసంచి లోనూ, పిల్లల్ని మరో గొనెసంచి లోనూ వేసుకుని సైకిలు ఎక్కాడు అత్యుతానందన్. దగ్గరలో వదిలేస్తే, అవి మళ్ళీ వెనక్కి వచ్చేసే ప్రమాదం ఉంది కాబట్టి, కాస్త దూరంగా వదిలి రావాలని నిర్ణయించుకున్నాడు.

‘ పోనీలే నేటితో వాటి పీడ వదిలి పోతుందిలే ఈ ఇంటికి’ అనుకుని శాంతపడింది రాజమణి. అవి దారిపొడుగునా గొడవ చేయసాగాయి. వాటి కష్టానికి అత్యుతానందన్లో పాపభీతి మొదలై౦ది.  అందరూ అత్తయ్యలాగే ఆలోచిస్తుండ౦తో .. తనొక్కడూ ఏం చెయ్యగలడు? ఎంతసేపని ఏటికి ఎదురీదగలడు?

ఊరి నుండి .. ఓ రెండుగంటల పాటు సైకిలు తొక్కి .. పాతిక కిలోమీటర్లు ప్రయాణం చేసి, ‘దురాజుపల్లి గుట్ట’ కి చేరుకున్నాడు. మూటల్ని రెండూ దింపి, తాళ్ళు విప్పదీసి .. గుట్ట క్రిందికి తోలేసాడు.

బంధించబడి ఉన్నవి కాస్తా  బయట ప్రపంచంలోకి అడుగు పెట్టి .. తలో దిక్కుకూ పరిగెత్తాయి. ‘హమ్మయ్యా!’ అన్నట్లు ఊపిరిపిల్చుకు౦టూ, ఇంకా అక్కడే ఉంటే, తనను పట్టుకుని వదలవని, సైకిలు ఎక్కి అదే పోకన .. వెనుదిరగకుండా వచ్చేసాడు.

ఎంత ముందుకు వెళితే .. అంత వెనక్కు రావాల్సిందేగా.  వెళ్ళేటప్పుడు ఉన్న ఓపిక వచ్చేటప్పుడు లేదు.  అలుపోచ్చినా  మంజులని తలచుకుంటూ .. తొక్కాడు. ఇదివరకటి కన్నా ఒళ్ళు చేసి మరింత అందంగా తయారయ్యింది. తన మేనత్త కూతురు అంత అందమైనదని అప్పటివరకూ తెలీదు.

ఎట్టకేలకు ఇల్లు చేరుకొని ..

ఎదురుగా .. కనిపించిన దృశ్యం చూసి కోయ్యబారిపోయాడు.

అప్పటికే వాకిట్లో నిలబడి ఉన్న తల్లితండ్రుల కళ్ళల్లో ఆశ్చర్యాతి రేఖలు. అసలు వీడు చివరికంటా వెళ్ళడా! లేదా! అన్న సంశయం.  తన పాతిక కిలోమీటర్ల కష్టం బూడిదలో పోసినా .. తప్పిపోయిందనుకున్న ఆనందం తిరిగి వచ్చింది.

పిల్లికి  గ్రహణ శక్తి ఎక్కువ. ఒకప్పుడు అవి కూడా అన్ని జంతువులతో పాటు అడవిలోనే ఉండేవట. మనిషి నీడ ననుసరించి .. జనావాసాల్లోకి వచ్చి చేరి మనుషుల తోపాటే ఉండిపోయాయని తను ఎక్కడో చదివాడు.

అసలు తనని ఎలా? వెంబడించాయో తెలీదు? తనకన్నా ముందుగా ఇల్లు ఎలా చేరుకున్నాయో! తెలీదు? అంతా మాయగా  ఉంది.
అది కలా! నిజామా! సందిగ్ధం ఉండగానే .. ఒక్క ఉదుటన లైకా వచ్చి అతని పాదాలు ముద్దాడి ఆర్తిగా, అభిమానంగా నాకింది తన గరుకైన నాలుకతో.

అది వాస్తవమే, అని తెలుసుకున్న అత్యుతానందన్ .. ఇక ఆలశ్యం చెయ్యలేదు. “లైకా! నా బుజ్జి, చిన్ను” అంటూ వాటిని చేతుల్లోకి తీసుకుని తనివితీరా గుండెలకి హత్తుకున్నాడు.  

ఇంత జరిగినా వాటి అభిమానంలో మార్పులేదు. అంతే ఆత్రంగా .. అత్యుతానందన్ ముందు నిలబడి అతని చేతులకు .. వాటి చేతులను అందిస్తూ, ఏదో తెలియని అవ్యక్త ఆనందంతో .. పెనవేసుకు౦టున్నాయి.

‘ఇక మమ్మల్ని ఎప్పుడూ అలా వదిలి పెట్టకు’ అన్నట్లు వాటి ‘జాలి కళ్ళ’ వేడుకోలుకు  కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

అవి తిరిగి వచ్చినందుకు అన్నావదినలు  .. వాళ్ళ గుండె చప్పుడు తిరిగివచ్చిన౦తగా సంతోషించడం .. ఆత్రంగా వదిన వాటిని చేతుల్లోకి తీసుకుని, అన్నం కలిపి పెట్టడం .. రాజమణి గుండెను తట్టి లేపాయి.

పరిగెత్తుకుని వచ్చిన అలసటకు గడగడా వణికిపోతూ, నిలువలేనట్లు పడిపోతున్న వాటిని చూసి ఆమెకూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
నోరు లేకపోయినా  వాటికీ ప్రేమించే మనసుందని తెలుసుకుంది. శకునం పేరుతో మూగ   జంతువుల పట్ల తనెంత హేయంగా ప్రవర్తించిందో! అప్పుడు అర్ధం అయ్యింది.   ప్రేమగా చూడాలేగాని పామైనా పడగ ఎత్తి ఆడుతుందట. ఇంతసేపూ  వాటి మీద పెంచుకున్న కోపంతో వాటిని విదిలించి కొట్టి తప్పు చేసానని అనుకుంది.

తన కొడుకు ఉద్యోగ విషయంలో అలా జరగడం .. తన చదువు తక్కువతనం అందుకు దోహదమిచ్చాయి. 

ఆకలిదప్పులకు వడలి .. అలసి సొలసి, పీక్కుపోయిన వాటి ముఖాల్ని చూస్తే, మనసు కష్టపడింది.  తన మూఢనమ్మకమే కదా! వీటి పట్ల రాక్షసంగా ప్రవర్తించడానికి కారణం అయ్యింది అనుకునే సరికి .. మనసు పశ్చాత్తాపంతో దహించుకుపోయి౦ది.   

కడుపు నిండిన తరువాత డస్సిపోయి  వాకిట్లో కాళ్ళు  అడ్డదిడ్డంగా పడేసి, నిస్సత్తువగా పడిఉన్న  వాటిని ఆ విధంగా చూడడం  హృదయం ద్రవించి, గుండె గొంతుక లోకి వచ్చినట్లయ్యింది.

తనకే గనుక .. అలాంటి కష్టం కలిగితే ..ఇక ఆలోచించలేకపోయింది.

‘ పొరపాటు చేశాను వీటి పట్ల’ అన్న అపరాధభావం కలిగి .. లైకా దగ్గరకు వెళ్లి  తల మీద చెయ్యేసి నిమురుతూ ‘ నన్ను క్షమించండే’ అన్నట్లు  రెండు కన్నీటి బొట్లు రాల్చింది.  అలాగే పిల్లలనీ చేతిలోకి తీసుకుని లాలించింది.

అప్పుడు అవి ‘ మ్యావ్’ అన్నా ‘అమ్మా’ అన్నట్లే వినిపించింది. అవి రాజమణి  చేతిని  కృతజ్ఞతగా  నాకాయి.

ప్రేమ ప్రేమను ప్రేమిస్తుందట. ఎప్పుడూ పుస్తకాల్లో పిల్లిని గురించిగానీ, బల్లిని గురించి గానీ మంచిగా చదవలేదు మరి.
ఒక్కసారిగా దృక్పధం మారాలంటే కొంత ఒత్తిడి, కొంత రాపిడి జరగాల్సిందే. అత్తలో వచ్చిన మార్పును చూసి పెళ్ళిబాజాలు మ్రోగాయి అత్యుతానందన్ మదిలో. కన్నార్పకుండా చూస్తున్న బావను గమనించి సిగ్గుల మొగ్గ అయ్యింది కాబోయే పెళ్ళికూతురు.                  
                    .  
 


   

మరిన్ని కథలు
seetakokachiluka