Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
poems

ఈ సంచికలో >> శీర్షికలు >>

మృత్యుకేళి - లక్ష్మి పాల

 

సమయం సాయంత్రం గం.5.00లు.

కీర్తి వాళ్ళింటిముందు ఇనోవా వచ్చి ఆగింది. దానికోసమే ఎదురుచూస్తున్న కీర్తి ముఖం సంతోషంతో  విప్పారింది.

“హేయ్...కీర్తి...కమ్ కమ్...” ఫ్రంట్ సీట్ లోంచి దిగి క్రింద నిలబడి పిలిచింది రెజీనా. లోపల ఉన్నవాళ్ళందరూ...”త్వరగా... త్వరగా...!” తొందర చేసారు.

“అమ్మా... వెళ్తున్నా...!” బ్యాగు తగిలించుకుని బయటికి పరుగెత్తుకొచ్చి కారు ఎక్కి మధ్య సీట్ లో ఉన్న సరయు పక్కన కూర్చుంది కీర్తి.“ఏం మాటలే అవి... వెళ్ళొస్తా అని చెప్పు” మందలిస్తూ వెనుకనుండి కీర్తి తల్లి అపర్ణ అంటున్న మాటలు ఎవరూ వినిపించుకోలేదు.

“ఓకే... టా టా....!” చేయి ఊపింది కీర్తి. రెజీనా ఫ్రంట్ సీట్ లో కూర్చోగానే అందరూ ఒక్కసారి “ఆంటీ... బై బై” అని చెప్పి బయలుదేరిపోయారు.

ఒక నీడలాంటిదేదో వారి కారుపై పరచుకోవడం... అది కారుతో పాటే ప్రయాణించడం వెనుకనుండి అపర్ణకు లీలగా కనిపించింది. కానీ, ఆమె దాన్నంతగా పట్టించుకోలేదు. తలుపేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది.రూరల్ డెవలప్ మెంట్ (PGDRDM) లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేస్తున్నారు రెజినా, కీర్తీ, సరయు, సాధిక్, కార్తీ. అయిదుగురు ప్రాణమిత్రులు. ఏం చేసినా కలసి కట్టుగా చేయడం వారి కలవాటు. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ అని తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి, పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరు మండలంలోని “కౌండిన్యముక్తి” అనే గిరిజన గ్రామానికి బయలుదేరారు. కానీ, వాస్తవానికి వాళ్ళు వెళుతున్న పని వేరు.

అరగంటలో ఇనోవా హైదరాబాద్ సిటీ దాటి అవుట్ కట్స్ చేరుకుంది. అక్కడనుండి సూర్యాపేట వైపు మళ్ళింది.

“ రెజీ... అక్కడికి జర్నీ ఎన్నిగంటలు?” అడిగింది కీర్తి.

“దాదాపూ తొమ్మిది గంటలు ఉంటుందేమో... రాత్రంతా... సాధిక్ సవ్యంగా నడిపితే కాస్త త్వరగానే చేరుకుంటాము...!” అంది రెజీనా చేయి చాచి, డ్రైవర్ సీట్లో ఉన్న సాధిక్ తలపై చిన్నగా మొట్టుతూ...

“వాడిని డిస్టర్బ్ చేయకు తల్లీ... డ్రైవింగ్ పనిష్మెంటు నాకు పడుతుంది.” నవ్వుతూ అన్నాడు  వెనుక చివరి సీట్లో కూర్చున్న కార్తీక్. అందరూ నవ్వేసారు.

“అసలు ప్రోగ్రాం షెడ్యూల్ చెప్పనేలేదు” మళ్ళీ అంది కీర్తి.

ఏముంది...? రేపు తెల్లవారు జాముకు బూర్గంపహాడ్ దాటి కుక్కునూరు మండలం లోని అమరవరం పాతూరు గ్రామాన్ని చేరుకుంటాము. అక్కడ ఉన్న మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అయి, టిఫిన్స్ కంప్లీట్ చేసుకుని, ఎనిమిది గంటలకు మళ్ళీ స్టార్టయి అర్ధగంటలో ముత్యాలంపాడు, అక్కడనుండి ఇరవై నిమిషాల్లో కౌండిన్యముక్తి లో మనకోసం అరేంజ్ చేయబడిన ఒక మనిషిని కలవడం... ఆ తరువాత గోదావరి ఒడ్డు, శివాలయం సందర్శన, అక్కడ ఉన్న ఆ ముసలమ్మను కలిసి... ఆవిడకు ఆ శక్తి ఎలా వచ్చిందో... అది నిజమో, కాదో... స్వయంగా తెలుసుకోవడం...!

“ఓకే...బాగుంది.” ఫ్రెండ్సంతా ఉత్సాహంగా చెప్పారు. వాళ్ళల్లో సరయు మాత్రమే నిశ్శబ్ధంగా ఉండడం గమనించింది రెజీనా.

“ఏంటే... అలా సైలెంట్ గా ఉన్నావు...? భయంగా ఉందా...?” అడిగింది.

విండో నుండి బయటకి చూస్తున్న సరయు లేదన్నట్లు తలఊపి, “భయం కాదు. కానీ, ఇప్పుడా ముసలమ్మను చూడటం  అంత అవసరమా...?” నెమ్మదిగా అడిగింది సరయు.

“ప్రత్యేకంగా అవసరం అంటూ ఏమీలేదు... ఏదో తెలుసుకోవాలని కుతూహలం అంతే...! ఏం నీకు ఇంట్రస్టు లేదా...?ఆ మాట ముందే చెప్పొచ్చుగా... నిన్ను హైదరాబాదులోనే ఒదిలేసి వచ్చేవాళ్లం...!”  అంది రెజీనా నవ్వుతూ...

ఆమె మాటలకు మౌనంగా ఉండిపోయింది సరయు.

కొన్ని కుతూహలాలు దేనికి దారికి తీస్తాయో... ఎవరమూ చెప్పలేము. సరయుకెందుకో ఈ ప్రయాణం... సంతోషకరంగా లేదు. మనసు మొదటినుండీ ఏదో తెలియని కీడును సూచిస్తుంది.

సరిగ్గా అదే సమయంలో కౌండిన్యముక్తి లోని గోదావరి ఒడ్డున ఉన్న కొండమీది శివాలయంలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్న తొంబై ఏళ్ళ “ముత్తి” చటుక్కున కళ్ళు తెరచింది. శివాలయం ముందున్న ఎత్తైన వెలగ చెట్టుమీద అప్పుడే వచ్చి వాలిన ఓ అడవి పక్షి వింతగా అరుస్తూ... తనకు ఏవో సంకేతాలు పంపింది. అది విన్న ముత్తి ముఖం క్షణంలో గంభీరంగా మారిపోయింది. ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి, కోయ భాషలో “శివయ్యా...అందరినీ కాపాడు.” అంటూ... తిరిగి, లోలోపలే ఏవో మంత్రాలు జపిస్తూ... మళ్ళీ కళ్ళు మూసుకుంది.

********

గోదావరి ఒడ్డున పొందిగ్గా ఏర్పరచుకున్న చక్కని పల్లెటూరు “కౌండిన్యముక్తి”. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియకపోయినా... అంత గొప్ప పేరు పెట్టుకోవాలనే ఆ ఊరి ప్రజల ఆలోచనకు మాత్రం సాల్యూట్ చేయవలసిందే. దాదాపూ ముఫ్పయి గడపలున్న చిన్న ఊరు. ఓ రెండు దుకాణాలు ఆ ఊరి కిరాణా అవసరాలు తీరుస్తుంటాయి. ఊరు చుట్టూతా పంటపొలాలు. వారికి అవసరమైన అన్ని ధాన్యాలు వాళ్ళే పండించుకుంటారు. కష్టమొస్తే ఒకరినొకరు ఆదుకుంటారు. సంతోషం వస్తే... అందరూ కలిసి జాతర చేసుకుని సంబరపడతారు.
ఆ ఊరికి ఉన్న ఒకే ఒక పెద్ద దిక్కు “ముత్తి”. ఆమె ఎక్కడనుండి వచ్చిందో, ఎక్కడ ఉంటుందో... ఎవరికీ తెలియదు. పగలంతా గోదావరి ఒడ్డున ఉన్న శివాలంయంలో ఉంటుంది. ఆకలి వేళకి ఊరిలో ఉన్న ఎవరో ఒకరు  ఆమెకు భోజనం తీసుకు వెళతారు. సాయంత్రం వరకూ గుడిలోనే ఉండి, చీకటి పడ్డాక లేచి గోదావరిని ఆనుకుని ఉన్న  కౌండిన్యముక్తి అడవుల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ తన నివాస స్థలం ఏదో...  చూసినవాళ్ళు ఇప్పటివరకూ లేరు.

అందరికీ ఆమె అంటే ఎంత భక్తో... అంతకు మించిన భయం కూడానూ! ఆమె తమ ఊరిని అన్ని ఉపద్రవాలనుండీ కాపాడుతుందనే విశ్వాసం. అయినప్పటికీ ఆమె తమ ఊరిలోకి రాకూడదనే దేవుడిని కోరుకుంటారు. ఆమె వస్తుందని తెలియగానే ఎవరికి వాళ్ళు ఇంటి తలుపులు మూసేసి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గుడిసెల్లోనే దాక్కుని, ఆమె ఎవరి ఇంటిముందు ఆగుతుందా... అని ఎదురు చూస్తుంటారు. సాధారణంగా ఎప్పుడూ ఆమె ఊరిలోకి రాదు. కానీ,  ఎవరింటికైనా ఏదైనా కష్టం వస్తుందని తన మనోదృష్టికి స్పురించగానే... ఆమె ఆ ఇంటిముందుకు వచ్చేస్తుంది. “ఒరేయ్... నీ ఇంటి గడప మీద మహమ్మారి కూర్చుని ఉందిరా...! జాగ్రత్త... జాగ్రత్త...!!” అని హెచ్చరించి వెళుతుంది. ఆమె అన్నట్లుగానే... ఆ ఇంటివారు ఏ జాగ్రత్తలూ తీసుకోకపోతే... ఆ రోజు, ఆ ఇంట్లో ఏదో ఒక కీడు తప్పక జరిగి తీరుతుంది. ఒక విధంగా ఆమెను ఆ దేవుడు పంపిన దూతగానే భావిస్తుంటారు అక్కడి ప్రజలంతా...!

ప్రతిరోజూ... ముత్యాలంపాడు నుండి వచ్చే పూజారి బ్రహ్మయ్య కన్నా, తనే ముందు శివయ్యకు అభిషేకాలు జరిపి, పూజ చేసి ధ్యానంలో కూర్చుండిపోతుంది ముత్తి. గుడికి వచ్చిన ఎవరితోనూ మాట్లాడదు. పూజారి బ్రహ్మయ్యతో మాట్లాడటం కూడా చాలా తక్కువ. గుడికి వచ్చే భక్తులంతా పూజ అనంతరం ఆ ముసలమ్మ కాళ్ళకు మొక్కి వెళ్ళిపోతారు. ఆ ఊరిలో ఎవరింటిలో ఏ పండుగ జరుపుకున్నా ఆమెకు కొత్త బట్టలు, తినుబండారాలు ఆమె దగ్గర పెట్టి వచ్చేస్తుంటారు. ఎవరింట్లో నూతన జననం జరిగినా ఆ పసికందును ఆమె ఒడిలో పడుకోబెడతారు. ఆ బిడ్డ జాతకం ఆరోజే తెలిసిపోతుంది వాళ్ళకు. ఆమె ప్రసన్నంగా తాకితే, వాడు ఆయుష్మంతుడవుతాడు. ఆమె తాకకపోతే, వాడి జాతకంలో ఏదో దోషముందని సూచన. ఆ దోషమేదో పూజారి బ్రహ్మయ్య జాతకచక్రం వేసి చూసి, పరిష్కారాలు సూచిస్తుంటాడు. వివాహాలు జరిగినా నూతన వధూవరులను ఆమె ఆశిస్సులకోసం తీసుకొచ్చి ఆమె ముందు నిలబెడతారు.

ఆ గ్రామానికి సంబంధించిన ఈ విషయాలన్నీ ఓ నాలుగురోజుల క్రితం ఎవరో ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడంతో... రెజీనాకు ఆ గ్రామం మీద ఆసక్తి పెరిగింది. తనకు ఇటువంటివి అంటే చాలా ఇంట్రస్ట్. వెంటనే ఫ్రెండ్స్ తో మాట్లాడి ఈ ఊరు ప్లాన్ చేసింది. దాని ఫలితమే ఈ ప్రయాణం.

*******

రాత్రి పన్నెండవుతోంది. సాధిక్ దీక్షగా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇనోవా ఖమ్మం దాటి, భద్రాద్రి కొత్తగూడెం వైపు వాయువేగంతో పరుగులు తీస్తోంది. ఖమ్మంలో ఎంటర్ అవుతున్నపుడు అడిగాడు కార్తీక్. “తను కాస్సేపు డ్రైవింగ్ చేస్తానని.” వద్దని చెప్పి, తనే డ్రైవ్ చేస్తున్నాడు సాధిక్.  ఓ సారి వెనుతిరిగి చూసాడు. కారులో ఉన్న వారంతా గాఢనిద్రలో ఉన్నారు.

చిన్నగా నవ్వుకుంటూ రోడ్డు పైకి దృష్టిని మళ్ళించాడు. రోడ్డంతా నిర్మానుష్యంగా, ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడూ వెళ్ళే లారీల వంటి  హెవీ వెహికిల్స్ తప్ప రోడ్డుమీద పెద్దగా సంచారం లేదు. రోడ్డంతా ఇలా ఉంటే, బండిని 160 స్పీడులో పరుగెత్తించొచ్చు. ఇలా ప్రయాణించడం తనకూ ఇంట్రస్టే!  కార్లో ఆడవాళ్ళున్నారు గాని... ఇలాంటి సమయంలో తను ఒక్కడే ఉండి, పక్కన బాటిల్, చేతిలో సిగరేట్ ఉంటే, ఈ ప్రయాణం మరింత కిక్కు ఇచ్చేది.

లోలోపలే చిన్నగా ఏదో హమ్ చేస్తూ... పరిసరాలను చూస్తూ పోనిస్తున్న సాధిక్ దృష్టి, కాస్త దూరంలో రోడ్డుకు ఎడమవైపు కదులుతున్న ఒక ఆకారంపై పడింది. మనిషో కాదో అర్ధంకాకుండా ఉందది. సాధిక్ పరిశీలనగా చూసాడు. దగ్గరగా వెళుతున్నా కొద్ది, కారు హెడ్ లైట్స్ కాంతిలో ఆ ఆకారం స్పష్టంగా కనబడుతోంది. ఎవరో ఒక మగ మనిషి నడుస్తూ వెళుతున్నాడు. వైట్ ఫ్యాంట్, ఎరుపు, నలుపూ  చెక్స్ ఉన్న షర్ట్. ఇంత అర్ధరాత్రి వీడికేం అవసరమొచ్చి వెళుతున్నాడో... అనుకుంటూ యధాలాపంగా క్రిందకి చూసిన సాధిక్ ఒక్కసారి ఉలిక్కి పడి బండి వేగం తగ్గించాడు.

తమ బండికి చాలా దగ్గరలో... టూవీలర్ ఒకటి అడ్డంగా పడిపోయి ఉంది. ఈ బండి ఆ వెళుతున్నవాడిదేనని అర్ధమైంది. “డామిట్... వాడిని చూస్తూ ఇది గానీ, చూడకపోయి ఉంటే... తను దాన్ని ఎక్కించేసేవాడే...! బాగా తాగి ఉన్నాడేమో బండి నడపలేక అక్కడ వదిలేసి వెళుతున్నాడు బద్మాష్ గాడు...” అంటూ వాడిని కసిగా తిట్టుకుంటూ... స్టీరింగ్ ని రైట్ కి తిప్పి, అక్కడ పడిఉన్న ఆ టూ వీలర్ పక్కగా పోనిస్తున్న సాధిక్ అక్కడ కనబడిన దృశ్యం చూసి ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. అక్కడ బండితోపాటూ ఒక వ్యక్తి రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. ఏదో లారి మీదనుండి వెళ్ళి ఉంటుంది. టూవీలర్ తో పాటూ అతని శరీరం కూడా నుజ్జు నుజ్జయి ఉంది. అతని ఒంటిమీద వైట్ ఫ్యాంట్, ఎరుపు, నలుపూ  చెక్స్ ఉన్న షర్ట్.

సాధిక్ కి గుండె ఆగినంత పనయ్యింది. అంటే తను చూసింది.... ఇంకేం ఆలోచించలేకపోయాడు. మెదడు మొద్దుబారిపోయినట్లయింది. “యా... అల్లా...!” భయంతో శరీరం నిలువెల్లా వణికి పోయింది. ఆ టెన్షన్ లో కారును ఎటు తిప్పుతున్నాడో ఓ క్షణం అర్ధం కాలేదు. ఈ లోపే... ఊహించని విధంగా... వెనుకనుండి పెద్ద లైట్ల వెలుతురు... చెవులు బ్రద్దలయ్యేలా హారన్ సౌండు... ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపే, ఏదో ఒక పెద్దలారి వచ్చి ఇనోవాను బలంగా తాకడం, ఆ వేగానికి ఒక్క సారిగా ఇనోవా  ఎగిరి, పేద్ద శబ్ధంతో రోడ్డు పక్కనున్న తుప్పల్లో, దఢేళున పడిపోయింది. నిద్రలో ఉన్న అందరూ నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. రక్తసిక్తమైన వారి దేహాలు కారులోనుండి బయటకు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయి, క్షణంలో అక్కడ ఎవ్వరూ చూడలేనంత భీభత్సమైన వాతావరణం నెలకొంది.

******

“సాధిక్....” కెవ్వున అరచింది సరయు. ఆ అరుపుకు కార్లో కూర్చున్న అందరూ ఉలిక్కిపడి లేచారు. సాధిక్ సడెన్ బ్రేక్ వేసి కారును ఆపేసాడు.

“సరయు... సరయూ...ఏమైంది...?” తనని పట్టి కుదిపి కుదిపి అడిగారు అందరూ. కళ్ళు తెరచిన సరయు చిగురాకులా వణుకిపోతూ అందరివంకా చూసింది. “మైగాడ్... ఒక భయంకరమైన బ్యాడ్ డ్రీమ్...” వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదిమి పట్టుకుని, ఉఛ్ఛ్వాస నిశ్వాసలను అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పింది. “ఉఫ్....కలా...” అందరూ తేలిగ్గా ఉపిరి పీల్చుకున్నారు.

“లేదే... మన కారుకి ఏదో పేద్ద యాక్సిడెంట్... మనమెవ్వరమూ ప్రాణాలతో లేము...” కలనుండి ఇంకా తేరుకోనట్లుగా చెపుతూనే ఉంది.

“హేయ్... కూల్ సరయూ...కూల్... మనమందరమూ బ్రతికే ఉన్నాము. మన కార్ కి అసలు యాక్సిడెం కాలేదు.” పక్కన కూర్చున్న కీర్తి నవ్వుతూ సరయును దగ్గరకు తీసుకుంది.

రెజీనా అంది “అసలే నీకు ఈ ప్రయాణం ఇష్టం లేదు. కారు ఎక్కుతూనే... డౌట్ గా ఉన్నావు. అందుకే, నీకీ కల వచ్చింది. అర్ధరాత్రి వచ్చిన కలలు నిజం కావు గానీ, భయపడకే...!”

సరయు ఇంకా సెట్ కాలేదు. “సాధిక్... నువ్వు ఓకే కదూ...!”  అడిగింది.

సాధిక్ నవ్వాడు. “వాడు ఓకే... సరయూ డోంట్ వర్రీ...! కాస్త సాధిక్  డ్రైవింగ్ మీద నమ్మకముంచు ప్లీజ్...” వెనక నుండి ఆమె భుజం మీద చేయి వేస్తూ... నవ్వుతూ చెప్పాడు కార్తీక్.

“లేదు లేదు కార్తీక్... ఇందాక కలలో మన కారు ఎదురుగా యాక్సిడెంట్ అయి పడి ఉన్న ఒక టూవీలర్...ఒక డెడ్ బాడీ... ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మను సాధిక్ చూసి భయంతో కారును...అటూ ఇటూ తిప్పడం... వెనుకనుండీ...” ఇంకేదో చెపుతూ... బాధగా కళ్ళు మూసుకుని, రెండు చేతులతో కణతలు రుద్దుకుంది.

సాధిక్ ఉలిక్కిపడ్డాడు. అతని గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకుంది. ముఖంలో నెత్తురుచుక్క లేదు. “తనకు రోడ్డుమీద కనిపించిన వాస్తవ దృశ్యం...సరయు కలలో ఎలా...? తృటిలో తమకు తప్పిన రోడ్డు యాక్సిడెంట్... ఒకే సమయంలో సరయు కలలో ఎలా కనిపించింది...?” అతని బుర్ర బద్దలైపోతుంది.

*******

సరిగ్గా ఇదే సమయంలో కౌండిన్యముక్తి లో ఓ ఇంటినుండి స్త్రీ ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ప్రసవ వేదన భరించలేక... బిగ్గరగా ఏడుస్తుందామె. కాన్పు చేయడానికి వచ్చిన ఆయమ్మ, చుట్టూ ఉన్న ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కాస్త ఓర్చుకోమని చెపుతున్నారు. ఆమె భర్త రవి గదిబయట నిలబడి టెన్షన్ పడుతున్నాడు. పెళ్ళయిన చాలా ఏళ్ళకు గర్భం దాల్చింది అతని భార్య పద్మ. కాన్పు కష్టంగా ఉండడంతో విలవిల్లాడిపోతుంది. కాలు గాలిన పిల్లిలా... అటూ ఇటూ తిరుగుతున్న రవి యధాలాపంగా చీకట్లోకి చూసి ఉలిక్కిపడ్డాడు. తన ఇంటి గుమ్మంలో “ముత్తి.”

అతని మనసు కీడు శంకించింది. “అవ్వా... ఏందవ్వా... నా ఇంటికొచ్చావు...?” భయంతో బయటికి పరుగెత్తి, చేతులు జోడించి ఆమె ముందు నిలబడ్డాడు.

“ఈయాల నీ ఇంట పుట్టేది నీ బిడ్డ కాదురా... కొన్ని ప్రాణాలను తీసుకుని పోయే యమదూత పుడుతున్నాడు. ఆ ప్రాణాలను తీసుకుని వాడు కూడా వాటితో వెళ్ళిపోతాడు. ఆశ పెట్టుకోకు... కొడుకు మీద ఆశ పెట్టుకోకూ...” గంభీరంగా చెప్పి, చేయి అడ్డంగా ఊపుతూ... అక్కడనుండి ముందుకు వెళ్ళిపోయి చీకట్లో కలిసిపోయింది ముత్తి. రవి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇంతలో...”కెవ్వు” మని భార్య కేక... “క్యార్ క్యార్” మని పసిగుడ్డు ఏడుపూ వినబడింది. కళ్ళు తుడుచుకుంటూ... లోపలికి పరుగెత్తాడు.

******

కౌండిన్యముక్తి లోనికి రావడానికి ముందు రెండు దారులుంటాయి. ఒకటి ఊరిలోకి వెళ్ళేదారి. రెండవది గోదావరి ఒడ్డున ఉన్న ముత్యాలంపాడు ప్రజల పొలాలకు వెళ్ళే బండ్లదారి. కౌండిన్యముక్తి గ్రామంలోకి వెళ్ళేదారి దాదాపూ అయిదు కిలోమీటర్లు ఉంటుంది. దారి పొడవునా ఎత్తైన టేకు తోట. ఆ తరువాత  చిక్కటి అడవి. ఎప్పుడూ పచ్చగా, చల్లగా... చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఆ అడవి మధ్యనుండి వేసిన నల్లని తారురోడ్డు మీదనుండి ప్రయాణిస్తుంది ఇనోవా...! అమరవరం లో ఫ్రెష్ అయి, అంతా అరగంట క్రితమే అక్కడ నుండి బయలుదేరి వచ్చేసారు.

“వావ్... ఎంత అందంగా ఉంది కదా... ఈ ఫారెస్ట్...!” పరవశంగా చెప్పింది రెజినా. రాత్రి కలనుండి తేరుకున్న సరయు కూడా ఆ ప్రకృతిని చూసి ప్రసన్నంగా మారింది. సాధిక్ తప్ప మిగిలిన అందరూ... ఆ అడవి అందాలను ఎంజాయ్ చేస్తున్నారు.

ఉన్నట్లుండి కీర్తి అరచింది “సాధిక్ ఇక్కడ ఆపు... అందరం ఈ ప్లేస్ లో ఫోటోలు తీసుకుందాం.” అందరూ క్రిందకి దిగారు. టేకు తోటలో కొన్ని ఫోటోలు దిగారు. అక్కడ... గొర్రెలను కాస్తున్న ఒక అతడిని చూసి... అతడితోనూ ఫోటోలు దిగారు. కాస్సేపటి తరువాత... తిరిగి కారు దగ్గరకు వస్తుండగా కీర్తి కాలికి ఏదో తగిలి క్రిందకి చూసింది. ఒక చిన్న సీసా... ఆశ్చర్యంగా చూస్తూ దాన్ని పైకి తీసింది కీర్తి. సీసా లోపల మూడంగులాల నులకతాడు ముక్క ఒకటి దానిలో వేసి, గట్టిగా మూత బిగించి పెట్టి ఈ అడవిలో పడేసారెవరో...!

విచిత్రంగా ఉందే... అనుకుంటూ దాని మూత తెరవడానికి ప్రయత్నించింది. దూరంగా నిలబడి వారినే చూస్తున్న గొర్రెల కాపరి అది చూసి కంగారుతో.... “అమ్మా... దాన్ని తెరవకూ... క్రింద పడేయ్...!” గట్టిగా అరుస్తూ వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. కానీ, ఈ లోపే దాని మూత తెరవడం... అందులో అప్పటివరకూ బంధించబడి ఉన్న వాయువేదో స్ట్రెయిట్ గా కీర్తి నుదుటిని తాకడం... జరిగిపోయాయి.
“ఏమైంది...? ఎందుకు...??”  అందరూ ఆశ్చర్యంగా అడిగారు.

“అది చేతబడి చేసినవాళ్ళకు బాగుచేసి, ఆ శక్తిని బంధించి ఈ సీసాలో ఉంచి అడవిలో పడేస్తారమ్మా...! దాన్ని ఎవరు తెరిస్తే... ఆ శక్తి వాళ్ళను పట్టుకుంటుంది.” చెప్పాడతను.

అది విని కీర్తితో సహా అందరూ ఘొల్లున నవ్వేసారు. “వీటినే మూఢనమ్మకాలు అంటారు” అనుకుంటూ నవ్వుకుంటూ వచ్చి కారు ఎక్కి బయలుదేరారు. ఎగతాళి చేసి వెళుతున్న వారివంకే బాధగా చూస్తూ ఉండిపోయాడా గొర్రెలను కాసే వ్యక్తి.

ఊరిలోకి వస్తూనే... రెజినా అంకుల్ వాళ్ళకోసం ఏర్పాటు చేయబడిన మనిషికి ఫోన్ చేసింది. నిమిషాల్లో అక్కడకు వచ్చేసాడు నగేష్.
“నమస్కారం అమ్మగారు... అయ్యగారు ఫోన్ చేసి చెప్పారమ్మ... ఊరి పెద్దనొకసారి కలుద్దాం రండి.” అంటూ ముందుకు నడిచాడు. అతడిని అనుసరించారంతా. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఓ ఎత్తైన ఇంటి ముందు ఆగాడు. వీళ్ళంతా వస్తున్నారని తెలిసి ఊరిలోని వారందరూ అక్కడే గుమి గూడి ఉన్నారు. వీళ్ళను, వీరి ఆధునిక వేషధారణనూ చూసి ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంటూ, నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూండిపోయారు.

వాళ్ళను చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ముందుకు కదిలింది రెజినా. ఆమెవెంటే మిగిలిన వాళ్ళు. ఊరిపెద్ద పైదయ్య వారిని సాదరంగా ఆహ్వానించాడు.

మర్యాదలన్నీ అయ్యాక, ముత్తి గురించి తనకు తెలిసినదంతా చెప్పాడు పైదయ్య. అదంతా వీడియోలో రికార్డు చేసుకుని, కొన్నిప్రశ్నలు అడిగి రాసుకున్నారంతా. అక్కడే మధ్యాహ్నమవడంతో... భోజనాలు పూర్తిచేసుకుని గోదావరి ఒడ్డుకు బయలుదేరారు. చివరగా చెప్పాడు పైదయ్య. ”మీరంతా చదువుకున్నోళ్ళు. పట్నం నుండి వచ్చారు. ఆ ముసలవ్వను చూడండి. ఆమె ఏదైనా చెబితే... వినండి. ఆమె అనుమతిస్తేనే ఏదైనా అడగండి. లేదంటే... ఇంక అవ్వను పలకరించొద్దు. గుర్తుపెట్టుకోండి. మీ వలన అవ్వ ఇబ్బంది పడితే, మా ఊరిలో ఎవ్వరూ ఒప్పుకోరు. జాగ్రత్త.”

సరేనంటూ కదిలారు. సరిగ్గా అప్పుడు చూసాడు సాధిక్ కీర్తిని. మనిషి చూపులో, ఆమె నడకలో ఏదో తేడా కనిపించింది. అందరినీ అబగా... ఆశగా చూస్తోంది. అందరూ వచ్చి కారు ఎక్కి గోదావరి ఒడ్డుకు బయలుదేరారు. ఇనోవా ఊరిలోంచి గోదావరి వైపుకు వెళుతుంటే... కీర్తి విండోనుంచి, రవి ఇంటి వైపు తీక్షణంగా చూస్తుండడం... సాధిక్ దృష్టిని దాటిపోలేదు. ఊరి చివరన కారు కొంతదూరం వరకు మాత్రమే వెళ్ళగలిగింది. అక్కడనుండి...అందరూ దిగి, నగేష్ దారి చూపిస్తుంటే మట్టిదారిలో నడవడం మొదలెట్టారు.

దారిలో నగేష్... ఊరి గురించి ఏదో ఒకటి చెపుతూనే ఉన్నాడు. ఇంతలో శివాలయం ఉన్న గుట్టను చేరుకున్నారు. గుట్ట ఎక్కుతుండగానే ఎవరో స్త్రీ ఏడుపు వినబడింది. అందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. గబ గబా... ఎక్కి గుడిలోకి వెళ్ళారు.
“ముత్తి” ధ్యానంలో ఉంది. రాత్రి  బిడ్డను ప్రసవించిన పద్మ, నడికట్టుతో ఆమె ముందు కూలబడి శోకాలు పెడుతూ ఏడుస్తుంది. బిడ్డను ముత్తి ఒడిలో పడుకోబెట్టారు. రవి ఆమెను ఓదార్చుతూ ఆ పక్కనే కూర్చుని ఉన్నాడు. రవి తల్లిదండ్రి కొందరు బంధువులు చుట్టూ నిలబడి ఉన్నారు.

“చెప్పవ్వా...? ఎందుకు నా బిడ్డ ఎందుకు మాకు దక్కడో చెప్పు. రాత్రి పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపే... ఆ తరువాత నిద్రలోకి పోయాడు. ఇప్పటిదాకా, కన్ను తెరవలేదు. నోరు విప్పలేదు. నా బిడ్డ బ్రతికి ఉన్నాడా? చచ్చిపోయాడా...? చెప్పవ్వా...! చెప్పు.”  నేల మీద చేతులు బాదుతూ ఏడుస్తోంది. రవి కూడా “చెప్పవ్వా... నా బిడ్డను బతికించి ఇచ్చి, నువ్వే మాకివ్వాలి. లేక లేక పుట్టిన బిడ్డ. ఎవరి గండానో పుట్టాడన్నావు. మా కెందుకీ  ఖర్మ...! నా బిడ్డకు అంత చెడ్డపేరు ఎందుకు...?” అడుగుతున్నాడు.

ఎవరు ఎంత అడిగినా... ఎంత ఏడ్చి మొత్తుకున్నా... ముత్తి ధ్యానం నుండి బయటకు రాలేదు. ఇది చూసిన  కార్తీక్, సాధిక్, రెజీనా, సరయులకు గుండె రగిలిపోయింది. అప్పటివరకూ ముత్తిని చూడాలన్న తపన స్థానంలో... ఏమీ పట్టనట్లు ధ్యానం పేరుతో కళ్ళుమూసుకుని ఉన్న ముసలమ్మ అంటే ఎక్కడా లేని విపరీతమైన కోపం వచ్చింది వాళ్లకి.  అక్కడ ఏం జరిగిందో తెలియకపోయినా... ఆ తల్లిదండ్రుల శోకం చూసి... తట్టుకోలేక పోయారు. “దేవత... దేవత...” అంటూ ప్రాణాపాయంలో ఉన్న బిడ్డను ఈ మూర్ఖురాలి ఒడిలో పడుకోబెట్టి కాలయాపన చేస్తున్నారు.

ఈ లోపు... బాబు ఎక్కిళ్ళు పడడం ప్రారంభమైంది. పరిస్థితి సీరియస్ అని అందరికీ అర్ధమైంది. కార్తీక్ చూస్తూ ఉండలేకపోయాడు. “ఏం చేస్తున్నారు...మీరు...? బిడ్డ ప్రమాదంలో ఉంటే... ఈ పిచ్చిదానికి అప్పజెప్పి తమాషా చూస్తున్నారు. ముందు హాస్పిటల్ కి తీసుకెళదాం పదా...!” గట్టిగా అరిచాడు. ఆ మాటలు వినగానే అందరూ విస్తుపోయి చూసారు.

ముందుగా రెజినా కదిలి ముత్తి ఒడిలో ఉన్న బిడ్డను తీసుకుంది. ముక్కు దగ్గర చేయిపెట్టి చూసి, గుండె దగ్గర చెవి పెట్టి విని చెప్పింది. “బాబు ఇంకా బతికే ఉన్నాడు. పదండీ... దగ్గరలో ఏదైనా హాస్పిటల్  ఉందేమో చెప్పండి. అక్కడి వెళదాం.” పాపను ఎత్తుకుని బయటకి నడిచింది. మిగిలిన అందరూ...బయటకు వచ్చేసారు. అప్పుడు కూడా ముత్తి కళ్ళు తెరవలేదు. చేతిలో ఉన్న రుద్రాక్షమాలను వ్రేళ్ళతో జరుపుకుంటూ... ధ్యానం చేస్తూనే ఉంది.

*******

కార్తీక్ డ్రైవ్ చేస్తుంటే... ఇనోవా కౌండిన్యముక్తి దాటి, అడవిలోకి ప్రవేశించింది. బాబును సరయు ఒడిలో పడుకోబెట్టుకుని కూర్చుంది. పక్కనే రెజీనా. ముందు సీట్లో... బాబు తండ్రి రవి. వెనుక సాధిక్ కూర్చున్నాడు. కొంత దూరం వచ్చేసాక, కీర్తి తమతో రావడం లేదని గమనించారు.
“కీర్తి ఎక్కడికి పోయింది...?” అడిగింది సరయు.

“అక్కడే ఉండి ఉంటుంది. మళ్ళీ వెనక్కి వస్తాము కదా... అప్పుడు పికప్ చేసుకుందాంలే.” చెప్పింది రెజీనా.

కార్తీక్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు. అతని ఆలోచనంతా... ఎంత త్వరగా బిడ్డను హాస్పిటల్ కి చేరిస్తే... అంత త్వరగా కాపాడుకోవచ్చు.
హఠాత్తుగా సరయు చేతిలో ఉన్న బిడ్డ ఎక్కిళ్ళు ఆగిపోయాయి. “రెజీ...బాబు ఎక్కిళ్ళు ఆగిపోయాయే...!” కంగారుగా చెప్పింది సరయు.

“అవునా...” కార్తీక్  వెనక్కి తిరిగి బాబు వంక చూడబోతూండగా... సాధిక్ గట్టిగా అరిచాడు. “కార్తీక్... ముందు చూడు.... కీర్తీ....”

ఎక్కడినుండి వచ్చిందో... ఊహించని విధంగా రోడ్డు మధ్యలో నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్న కీర్తిని, ఆఖరి క్షణంలో చూసాడు కార్తీక్. అప్పటికే పరిస్థితి అతని చేయి దాటిపోయింది. ఇనోవా ఆమెను గుద్దేయడం... అదే వేగంలో రోడ్డుపక్కన ఉన్న టేకుతోటలోకి దూసుకుపోయి, ఓ చెట్టుకు బలంగా గుద్దుకుని తుక్కు తుక్కు అవడం జరిగిపోయాయి.

చాలా సేపటి తర్వాత... రవి... కళ్ళు తెరిచాడు. కారు చెట్టుకు గుద్దుకోవడం వలన సడెన్ గా డోర్ ఓపెన్ అయి, తాను ఎగిరొచ్చి పక్కనున్న తుప్పల్లో పడిపోయాడు. వీళ్ళంతా ఎలా ఉన్నారు? కంగారుతో గబ గబా లేచి, కారు దగ్గరకు వచ్చాడు.  కార్తీక్ స్టీరింగ్ మీదే తలవాల్చి చనిపోయి ఉన్నాడు. భయంగా మిగిలిన వాళ్ళను చూసాడు. ఎక్కడి వాళ్ళక్కడే విగతజీవులై పడిపోయి ఉన్నారు. “నా కొడుకు” ఆరాటంగా... ఇటువైపు వచ్చి విండోలోంచి, సరయు ఒడిలోని బిడ్డను చూసాడు. వాడి శ్వాస ఆగిపోయి, చాలా సేపయింది. తల గట్టిగా పట్టుకుని రోడ్డువైపు చూసాడు. ఇందాక ఇనోవా క్రింద నలిగిపోయిన కీర్తి శరీరం రక్తం మడుగులో అక్కడే పడివుంది.

“అయ్యో....నా కొడుకును కాపాడబోయి... మీరంతా చచ్చిపోయారా...” అక్కడే కూలబడి బోరు బోరున ఏడ్వసాగాడు. అతనికి ముత్తి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ’నీ ఇంట పుట్టేది నీ బిడ్డ కాదురా... కొన్ని ప్రాణాలను తీసుకుని పోయే యమదూత పుడుతున్నాడు. ఆ ప్రాణాలను తీసుకుని వాడు కూడా వాటితో వెళ్ళిపోతాడు.”

కొంచెం సేపటికి కళ్ళు తుడుచుకుని, రోడ్డు మీదకు రాబోతుండగా... అతని దృష్టి అక్కడికి కాస్త దూరంలో ఉన్న ఓ సీసా మీద పడింది. దాని మూత తెరవబడి అందులోని నులకతాడు బయటకు వచ్చి ఉంది. అది ఉదయం కీర్తి తెరచిన సీసా...!

******

అక్కడ కౌండిన్యముక్తి శివాలయం ఎదురుగా ఉన్న వెలగచెట్టుమీద ఆ అడవిపక్షి చిత్రంగా కూసింది. అది విన్న ముత్తి తన ధ్యానం ముగించి, అడవిలోకి వెళ్ళిపోయింది.

మరిన్ని శీర్షికలు
pratapabhavalu