Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

కవితలు - ..

"వెన్నెల  కన్నియ"

రాతిరంతా వెన్నెల
మత్తులో జోగుతుంది

వెన్నలరూపంలో
నువ్వు

మబ్బుల్ని పరవశింపజేసి
అడవినంతా ఆక్రమించి
కొలనులో కలువలకు
ప్రాణదానం చేస్తావు !

నీ తలపుల్లో బందీనై
పెరటిలో జామచెట్టుకింద
నిదురిస్తూ నేను !
జామాకుల్ని తాకుతూ
బంధనాలు తెంపేస్తూ
నన్ను ఆక్రమిస్తూ నువ్వు !

వెన్నెలంతా మన మత్తులో
జోగుతుంది !!

 

 

- నాగ్రాజ్

.....

గోవిందా...గోవిందసామాన్యులం మెము..........
సమస్య ఉన్న సందుని వదిలేసి
పక్కసందులోనుండి వెళ్ళిపోతాం
మరికొంతమంది సామాన్యులతో కలిసి
ఆ సమస్య గురించి చర్చిస్తాం
కారణమైన వాళ్ళని తిడతాం
పరిష్కారాన్ని ఆ సమస్యకు
వినబడనంత దూరంగా వెళ్ళి చెపుతాం.

సామాన్యులం మెము..........
పక్కింలో దొంగలుపడ్డారని తెలిసినా
ఏమి ఎరగనట్టు తలుపులేసుకుని కూర్చుంటాం
మా ఇంట్లో దొంగలు పడితే పట్టించుకోని
పక్కింటోణ్ణి పచ్చి బూతులు తిట్టెస్తాం
వాడి సొమ్ముపోతే పాపపు సొమ్ము
అలగే పోతుందంటాం..
మా సొమ్ము పోతే కష్టపడి కూడబెట్టుకున్నది
ఎత్తుకెళ్ళినోడు సర్వనాశనమైపోతాడంటాం.
సామాన్యులం మెము..........
పదిమందీ ఒకడిపైన రాళ్ళు వేస్తుంటే
మేమూ ఒక చెయ్యివేస్తాం
పదిమందీ మామీద రాళ్ళేస్తే
మాతోపాటు ఇంకొకడిని లాగేస్తాం.

సామాన్యులం మెము..........
ఓట్ల అమ్ముకున్నంతకాలం
బాగుపడమని లెక్చర్లిస్తాం
సరైన రేటొస్తే మా ఓటు
ఖచ్చితంగా అమ్మేస్తాం
అదేమంటే....
అందరితోపాటే మేము అంటాం
ఏవడొచ్చినా ఉద్దరించేది ఏముందిలే అంటాం
తప్పేముంది....???
నలుగురితో నారాయణా
పది మందితో గోవిందా.....

వాసుదేవమూర్తి శ్రీపతి
.....

| అవకాశమిస్తావా..? ||

చివురాకుల నడుమ
సిరి మల్లె విరిసినట్టు
పెదవులపై ఆ దరహాసం..
చిరునవ్వుల వరమిస్తావా ?
చిన్ని చిన్ని రాళ్ళ మధ్య
హొయలతో ప్రవహించినట్టు
జలతరంగిణీ పలుకులు..
మాటల ముత్యాలు ఏరుకొనిస్తావా?
కదలికలో విరుపులు
మేని ఒంపులో మెరుపులు
కరి మబ్బుల నడుమ
తళుక్కుమన్న విద్యుల్లతలా
నీ వెలుగు జిలుగుల్ని..
కన్నార్పకుండా చూడనిస్తావా?
నీ సాన్నిహిత్యం అనుభూతులకి
అత్తరద్దుతుంది ..
అనుక్షణం నీ సమక్షoలో
సేదతీరే భాగ్యమిస్తావా?

నాతో నీ జీవితం
ఏడురంగుల చిత్రoలా ఉంటుందని
నిరూపించే అవకాశమిస్తావా?.


- సుజాత .పి .వి.ఎల్

.....

ఓటరు

ఆంబోతులు రంకెలు వేస్తున్నాయి
వరాలజల్లు సొల్లు జొల్లు కారుస్తున్నాయి
అవి నేలను తడిపే చినుకులు కావు
నిన్ను ఆశల తేల్చే ఎండమావులు
సారా సీసాకు శరీరాన్ని తార్చకు
పచ్చనోటుకు ఓటు తాకట్టు పెట్టకు
అది నీకు హక్కే కాదు బాధ్యత కూడా
నీ ఎజెండాకు తలవంచిన జెండాకు
నీ సహకారం ఉంటుందని చెప్పు
అయినా ఎంతకాలం జెండాల మార్పు నీ జెండాకు నీవే జీవం పోసుకో
ఓటు అంటే గొప్పోడి చేతి ఊతకర్ర కాదు
పేదవాడి పిడికిలి దెబ్బ అని చూపు
ఓటు విలువ ఓటరు బలిమి చాటు
మౌనంగా ఉంటే అది నీ ప్రగతికి చేటు


-శింగరాజు శ్రీనివాసరావు

మరిన్ని శీర్షికలు
mrutyukeli