Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mrutyukeli

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

గురువు

శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. అనుక్షణం రాక్షసుల క్షేమం కోరుతూ, వారికి శ్రేయోదాయిగా ఉండాల్సిన వ్యక్తి. బృహస్పతి దేవతల గురువు. దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధాలలో మరణించిన రాక్షసులను బతికించడానికి శుక్రాచార్యుడి వద్ద మృత సంజీవని విద్య ఉందని తెలిసి, తన కొడుకైన కచుని మృత సంజీవని విద్య నేర్చుకు రమ్మని శుక్రాచార్యుడి వద్దకు పంపుతాడు. బృహస్పతి తమ శత్రువుల పక్షమని, కచునికి మృత సంజీవని విద్య నేర్పితే రాక్షస జాతికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆలోచించలేదు శుక్రాచార్యుడు. విద్య నేర్పుతానని అంటాడు. కచుని విద్యాభ్యాసంలో, రాక్షసులు తమ హింసా ప్రవృత్తితో కచుణ్ని ఎన్నిసార్లు మట్టుబెట్టాలని చూసినా శుక్రాచార్యుడు బతికిస్తాడు. కచునికి మృత సంజీవని విద్య బోధిస్తాడు.

దేవతలు సకల గుణ సంపన్నులు. ధర్మం, న్యాయం తెలిసిన వాళ్లు. ఆరాధనీయులు. అమృత సాధన కోసం క్షీర సాధన మథనంలో దేవతలతో సమానంగా, రాక్షసులూ కష్టపడ్దారు. అమృతపాన సమయం ఆసన్నమయ్యేసరికీ విష్ణువు మాయా మోహినిగా అవతరించి రాక్షసులను మోహంలో పడేసి, అమృతం దేవతలకు మాత్రమే దక్కేలా చేశాడు. బృహస్పతితో సహా ఏ ఒక్కరూ దాన్ని తప్పనలేదు.
ఏకలవ్యునకు విలువిద్యను నేర్పనని పంపించిన ద్రోణుణ్ని, మట్టి బొమ్మ గురువుగా నిలుపుకుని తనంతట తానుగా విలువిద్యను నేర్చితే, ‘ఆ విద్య అర్జునుని ఎదుగుదలకు, ఖ్యాతికీ ఎక్కడ ప్రతిబంధకం అవుతుందో’ అని ఏకలవ్యుని బొటన వేలు గురుదక్షిణగా అడిగి తీసుకున్నాడు ద్రోణుడు. ద్రోణుడు ఎంతగొప్ప విలువిద్య పారంగతుడైనా ఏకలవ్యుని ఉదంతం వల్ల, నల్ల మచ్చతో చరిత్రలో నిలిచిపోయాడు.

గురువు విద్య నేర్పడంలో వివక్షత చూపడు. శిష్యుడు సకల విద్యల్లో గురువును మించిపోయాడని లోకం అంటుంటే ఈర్ష్య వహించక మురిసిపోయేవాడు గురువు. అలాంటి గురువు కీర్తి ఆచంద్రతారార్కం.

*****

మరిన్ని శీర్షికలు
lady cartoonist -vagdevi