Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
these studies dont want

ఈ సంచికలో >> యువతరం >>

రక్త(మోడుతున్న)సంబంధాలు

blood relation

సుపారీలిచ్చి లేపించేసే కిరాయి హత్యలు....

అయిన వాళ్ళని కూడా చూడకుండా అనంత లోకాలకు పంపించేసే ఆస్తి హత్యలు....

పట్టపగలు నడిరోడ్ల మీద నరికి చంపే ఫ్యాక్షన్ హత్యలు....

అధికారం, అవకాశం, సానుభూతి కోసం చేసే రాజకీయ హత్యలు.....

ఇవన్నీ ఎక్కడోచోట చూస్తున్నవే.....

కానీ, ఈమధ్య సంచలనం సృష్టిస్తూ, ఆలోచనలని రేకెత్తిస్తోన్నవి

పరువు హత్యలు.....

నిజానికివేం కొత్త కాదు. కానీ, ఎక్కడో తండాల్లోనో, కొన్ని కొన్ని వర్గాల్లోనో గుట్టు చప్పుడు కాకుండా జరిగి, ఎప్పటికో వెలుగులోకొచ్చే ఈ పరువు హత్యలు, ఇప్పుడు నడి రోడ్ల మీద నరికి చంపేసే దాకా వచ్చి సమాజాన్ని హడలెత్తిస్తున్నాయి...

ప్రత్యక్షంగా వీటిని చూసిన వాళ్ళకు, వార్తల్లో చదివిన వాళ్ళకు, తక్షణం కలిగే ఆగ్రహం మాత్రం ఆయుధం కలిగున్న వారిపైనే. అది సహజం. ఎందుకంటే, వాళ్ళలో కిరాయి హంతకుల కంటే, కన్న వారే ఉండడం అతి పెద్ద కారణం....పిల్లల్ని కనడం ప్రకృతి ధర్మం, పెంచడం తల్లిదండ్రులుగా బాధ్యత, ఎదిగిన తర్వాత తమ జీవిత భాగస్వాములను ఎంచుకోవడం పిల్లల హక్కు. వాళ్ళ ఇష్టమొచ్చిన వారితో కలిసి నడిచినంత మాత్రాన, అది తమకు నచ్చనంత మాత్రాన, నరికి చంపెయ్యాలా? కన్నప్రేమ ఏమైంది? పెంచిన ప్రేమ మాయమైందా?
అందరి మనసులనూ తొలిచేస్తున్న ప్రశ్నలివే.

మా కులం తీసిపోయిందా అని కుల సంఘాల వాళ్ళు నిలదీస్తున్నారు. ప్రేమించే హక్కు మాకు లేదా అని యువత ప్రశ్నిస్తున్నారు. మా భావాలకు స్వేచ్చ లేదా అని ప్రేమికులు ఆక్రోశిస్తున్నారు. ఇందులో ఏ ఒక్క వాదనలోనూ బలం లేక పోలేదు. ఇవన్నీ బలమైన వాదనలే అయితే బలహీనమైన కోణం ఏది? తల్లిదండ్రులదేనా? తమ పెద్దరికాన్ని కోల్పోయినా కన్న ప్రేమ కోసం  రాజీ పడాల్సింది కన్నవారేనా? అవుననే అనుకోవాల్సి వస్తోంది....

అయితే, ఈ కోణంలో ఆలోచించే ముందు తమకు నచ్చిన వారితో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్న నేటి యువత గమనించాల్సిన సున్నితమైన కోణం మరొకటుంది.

పాశ్చాత్య దేశాల్లో పౌరులకు స్వేచ్చ ఎక్కువ. పదహారేళ్ళ తర్వాత ఇక పిల్లలపై తల్లిదండ్రులకెలాంటి హక్కూ ఉండదు. వారికి నచ్చిన దారిలో నడవొచ్చు..ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అలాగే పెళ్ళిళ్ళ విషయంలోనూ. కానీ, మన దేశంలో అలా కాదు. జీవితంలోని ప్రతి దశకూ మన సంస్కృతీ, సంప్రదాయాలకూ ముడిపడి ఉంది..జీవితం మనదే అయినా, సమాజం కోసం ఆలోచించాల్సిన కట్టుబాట్లు కొన్నున్నాయి.. వాటి కోసమే మన అలవాట్లనూ, అభిరుచులనూ కుదించుకోవాల్సిన అవసరం పూర్తిగా లేకున్నా, పట్టించుకోవాల్సిన అవసరం మాత్రం బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరిపై ఉంది. ఉంటుంది.

ఒక జంటను కలపాలని పెద్దలు ఆలోచించినపుడు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అన్నిటి పరమార్థం ఒక్కటే. తమ పిల్లలు కలిసి నిండు నూరేళ్ళూ సంతోషంగా ఉండాలనే, ఆ జంట మరి కొందరికి ఆదర్శంగా నిలవాలనే...ఆ క్రమంలోనే చూసేవి అర్హతలూ, జాతకాలూ, తల్లిదండ్రుల నేపథ్యం, కులం, గోత్రం..వంశం.

ఇవన్నీ చూసి జరిపించిన పెళ్ళిళ్ళన్నీ విజయవంతం అవుతున్నాయాంటే, కొన్ని పెటాకులవడమూ ఉంది...

ఈ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ తర్వాత స్థానం ప్రేమ వివాహాలదే. వీటిలో పైన చెప్పుకున్న ఏ అంశాలకీ ప్రాధాన్యం ఉండదు..మనసూ మనసూ కలవడం...కలిసి చదువుకోవడం వల్లనో, కలిసి ఒక్కచోట పని చేయడం వల్లనో ఒకరితో మరొకరి భావ సారూప్యత కలిగిందన్న నమ్మకమే ఏడడుగులు నడిచేందుకు దారి తీస్తాయి....ఇవీ ఆదర్శ వివాహాలే....తమ ప్రేమ పెద్దలు అంగీకరించక పోతే, కలిసి ప్రాణ త్యాగాలు చేసిన, చేస్తున్న సంఘటనలు కోకొల్లలు...ఇలాంటి ప్రేమ జంటల పట్ల పెద్దల వైఖరి మారాల్సిన అవసరం ఉంది....

తెలిసీతెలియని యుక్త వయసులో ప్రేమ అనుకునే మోహవేశాల వల్ల కలుగుతోన్న దుష్పరిణామాలే తీవ్రమైనవి....చిన్నప్పుడు తమకేం కావాలో తెలియని వయసులో, ఆకలవుతున్నా చెప్పలేని, తింటే కడుపు నిండుతుందన్న సంగతి తెలియని వయస్సులో తమ ఆకలి తెలిసి గోరు ముద్దలు తినిపించి, తమకేం కావాలో గ్రహించి అన్నీ అందించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు తమ జీవిత భాగస్వామిగా ఎన్నుకున్న వ్యక్తి తగిన యోగ్యతలు కలిగుంటే, వారితో తమ జీవితం బాగుంటుందని వారి వయసూ, అనుభవం చెబితే...ఎందుకు వద్దంటారు? ఆ అభ్యంతరాలు సహేతుకమైనవేనా? వారికి తెలియని, అర్థం కాని యోగ్యతలు తాము ఎన్నుకున్న వారిలో ఏమైనా ఉన్నాయా? అవన్నీ యువత ఆలోచించాల్సిన విషయాలే.. ఒక వేళ తల్లిదండ్రులు వద్దని అంటే, తమ వయసుకు అర్థం కాని అయోగ్యతలు వారిలో ఉన్నాయా, లేదా అని సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు....అంతే కానీ ప్రేమ గుడ్డిది, తొలి చూపు లోనే ప్రేమించాం...ప్రేమకు కావాల్సింది మనసు... అర్హతలను పట్టించుకుంటే ప్రేమెలా అవుతుందీ.. అనే డైలాగులన్నీ సినిమాల్లోనే బాగుంటాయి...వాస్తవంలో బెడిసి కొట్టే ప్రమాదాలే ఎక్కువ....

ఇక్కడ తల్లిదండ్రుల స్పందన తీరు చూస్తే, చిన్నప్పుడు...అన్నం తిననని మారాం చేస్తుంటే గట్టిగా నాలుగు తగిలించి, తినిపిస్తారు... తాత్కాలికంగా ఏడ్చినా, వాళ్ళ కడుపు నిండడమే కావాల్సింది...ఆరోగ్యంగా ఎదగడమే తల్లిదండ్రులకు తృప్తినిచ్చేది..అదే విధంగా యుక్త వయసొచ్చాక అయోగ్యులతో ప్రేమ వద్దని వారిస్తే తమ దారి లోకి వస్తారని తల్లిదండ్రుల ఆలోచన...చిన్నతనంతో, అపరిపక్వమైన నిర్ణయంతో తప్పు దారిలో నడిచి, జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటారని వాళ్ళ భవిష్యత్తు పట్ల భయం...ఇవన్నీ కాదని, తమ పెద్దరికాన్ని ప్రశ్నించి, నిర్ణయాన్ని కాదని అప్పుడప్పుడే పరిచయమైన వ్యక్తితో ప్రేమ పేరుతో తమను వదిలి పోయిన ప్రతి పిల్లల తల్లిదండ్రుల మనస్సూ ఖచ్చితంగా ఆగ్రహావేశాలతో రగిలి పోతుంది...అది తగ్గడం, దగ్గరకు చేర్చుకోవడం కాలానుగుణ పరిస్థితులపై ఆధార పడి ఉంటుంది.....కానీ అప్పటికప్పుడు రగిలే ఆవేశమే కట్టలు తెంచుకున్నప్పుడే ఇలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకుంటాయి. మానవ సంబంధాలను ప్రశ్నిస్తాయి....కన్నప్రేమను శంకిస్తాయి..రక్త సంబంధాలను కాస్త రక్తమోడేలా చేస్తాయి...

వీటి నేపథ్యం గురించి లోతుగా ఆలోచిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడగలది తల్లిదండ్రులా పిల్లలా అని ఆలోచిస్తే కచ్చితంగా చెప్పొచ్చు...కొత్తగా రెక్కలొచ్చిన పిల్లలకు లోకమంతా అందంగా...రంగుల మయం గానే కనిపిస్తుంది.. కానీ ఆ రంగుల వెనకున్న వాస్తవాలు కనిపించడానికి అనుభవమూ, వయసూ కావాల్సిందే....ప్రేమంటే ఫ్యాషన్ కాదు, జీవితం....అది గ్రహించాలి...అలా గ్రహించకుండా రంగులవలలో చిక్కుకున్నప్పుడే తల్లిదండ్రుల, పిల్లల ఆలోచనలూ, దారులూ వేరయి, కన్న ప్రేమలు కాస్తా కఠిన పాషాణ హృదయాలవుతాయి.... తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి....

మరిన్ని యువతరం