Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue294/766/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)‘‘కూర్చోండి.’’ హుందాగా రాజదర్బార్‌లా ఉన్న హాల్లో సింహాసనంలా ఉన్న కుర్చీలో కూర్చుని ఎదురుగా కుర్చీలో ఎస్సై అక్బర్‌ఖాన్‌ని కూర్చోమంటూ జారిపోబోతున్న కాశ్మీరీ శాలువాని సర్దుకుంటూ చెప్పింది శోభాదేవి.
చేతిలో ఉన్న బ్రీప్‌కేస్‌ ప్రక్కన పెట్టి చేతిలో ఉన్న ఏటిఎమ్‌ కార్డు శోభాదేవికి కనిపించేలా పట్టుకుని కూర్చున్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
‘‘ఈ కార్డు....’’ అని ఎస్సై అక్బర్‌ఖాన్‌ ఇంకా ఏదో చెప్పబోయే లోపలే.

‘‘పోయింది. కొత్త కార్డు కూడా తీసేసుకున్నాం కదా! దీని కోసమే వచ్చారా?’’ ఆశ్చర్యంగా అడిగింది శోభాదేవి.

‘‘కాదు మేడమ్‌! కార్డు పోయి ఎన్నాళ్లయిందో కనుక్కుందామని....’’ శోభాదేవి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
ఎస్సై అక్బర్‌ఖాన్‌ మాట వింటూనే తను కూర్చున్న కుర్చీ ప్రక్కనే ఉన్న బజర్‌ నొక్కింది శోభాదేవి.

‘‘చెప్పండమ్మా!’’ ఎక్కడ నుండి వచ్చాడో క్షణాల్లో ప్రత్యక్షమై వినయంగా చేతులు కట్టుకుని నిలబడి అడిగాడు సర్వెంట్‌.

‘‘మనోరమ దగ్గర నా పేర ఉన్న ఏటిఎమ్‌ కార్డులన్నీ అడిగి తీసుకురా.’’ అంది శోభాదేవి చాలా హుందాగా. క్షణంలో అతను హాలు బయట పోర్టికోలో ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్లి ఏటిఎమ్‌ కార్డులన్నీ పేకదస్తాలా పేర్చి పట్టుకువచ్చాడు.

శోభాదేవి చేతికివ్వగానే అవన్నీ వారి మధ్య ఉన్న పెద్ద ‘టీపాయ్‌’ మీద పేక ముక్కల్లానే సర్రున పరిచింది.

‘దాదాపు పదిహేనో....ఇరవయ్యో....ఉంటా’యనుకున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘చెప్పండి! ఇన్ని కార్డుల్లో ఏది ఎప్పుడు... ఎక్కడ... మర్చిపోయామో... ఎలా గుర్తుంటుంది?’’ చిన్నగా నవ్వుతూనే అడిగింది శోభాదేవి.
‘‘కార్డు పోయింది. సరే. మరి, పిన్‌ నెంబర్‌ ఎలా పోతుంది మేడమ్‌?’’తన మనసులో ఉన్న అనుమానం బయట పెట్టాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
ఆ ప్రశ్నకు ఉలిక్కిపడింది శోభాదేవి.

‘‘మేమెప్పుడూ ఏటిఎమ్‌ సెంటర్‌కెళ్ళము. ఎప్పుడన్నా విహారయాత్ర కెళ్లినప్పుడు...ఎక్కడి కన్నా పనుండి పై ప్రాంతాలకెళ్లినప్పుడు ఈ ఏటిఎమ్‌ను వెంటపెట్టుకెళ్తాము. ఎప్పుడన్నా...ఎక్కడన్నా జారిపోయి ఉండొచ్చు. గుర్తు కోసం ఏటిఎమ్‌ నెంబర్లు చిన్న పేపరు మీద రాసుకెళ్తూ ఉంటాను. అది కూడా ఈ కార్డుతో పోయి ఉండొచ్చు. అయినా, నాకు కలగని ఆందోళన....బాధ మీకెందుకండి.’’ సీరియస్‌గా అంది శోభాదేవి.

‘‘పోలీసులు కదండి. ఇది మా బాధ్యత. మీ డబ్బుపోతే ఫర్వాలేదు. కొందరి ప్రాణాలకే ముప్పు తెచ్చిన కార్డు. ఇది హత్యలకు సంబంధించిన ఎంక్వయిరీ.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘హత్యలు?.... ఎవరు? ఎప్పుడు హత్య చేయబడ్డారు?!’’ ఒక్క ఉదుటున కుర్చీలో నుండి లేచి ఆందోళనగా అడిగింది శోభాదేవి.

‘‘ఇదిగోనండి. ఈమె....?’’ అంటూ జేబులో ఉన్న ఫొటో తీసి చూపించాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

ఆతృతగా ఎస్సై అక్బర్‌ఖాన్‌ దగ్గర ఫొటో తీసుకుని చూసి టక్కున క్రింద పెట్టింది శోభాదేవి. ఆందోళనగా కుర్చీలో కూలబడిపోయింది.

‘‘అయ్యో!.... ఇది మా మహాశ్వేత ఫొటో కదా? మీకెలా వచ్చింది?’’ తేరుకొని బాధగా అడిగింది శోభాదేవి.

‘‘మహాశ్వేతా?! ఈమె మీకేమౌతుంది?’’ ఉత్సుకతగా అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌..

‘‘నా మేనకోడలు...!’’ కళ్ళలో నీళ్ళు దించుకుంటూ అంది.

‘‘ఇప్పుడు....ఇప్పుడు ఎక్కడున్నారు?’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘ఇప్పుడు ఎక్కడుంటుంది.... స్వర్గంలో ఉంటుంది. మా మహాతల్లి బహుశా స్వర్గం లోనే ఉండి ఉంటుంది.’’ కళ్ళల్లో ధారగా కారుతున్న కన్నీళ్లని కుర్చీ దండెం మీద ఉన్న చిన్న కర్ఛీఫ్‌తో తుడుచుకుంటూ అంది శోభాదేవి.

‘‘వ్వాట్‌.... మీరంటున్నది నాకు అర్థం కావటం లేదు. కొంచెం వివరంగా చెప్పండి.’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘నెలరోజుల క్రితమే చనిపోయింది బాబూ!’’ వేదనగా అంది శోభాదేవి.

‘‘నిజమా?’’ ఎస్సై అక్బర్‌ఖాన్‌కి మతిపోయింది.

‘‘ఆ ఫొటోలో ఉన్నది?!’’ కుతూహలంగా అడిగాడు.

‘‘మహాశ్వేత తల్లితండ్రులు.’’ తల త్రిప్పి ఫొటోకేసి చూస్తూ చెప్పింది శోభాదేవి.

‘‘మీ మేనకోడలు మహాశ్వేత చనిపోలేదు.’’ స్థిరంగా అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘చనిపోలేదా?’’ ఒక్కసారే దిగ్గున తల ఎత్తి ఎస్సై అక్బర్‌ఖాన్‌ కేసి చూస్తూ అడిగింది శోభాదేవి.

‘‘ఎస్‌!.... బ్రతికే ఉంది ఆమె’’ నొక్కి చెప్పాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘మీకు పిచ్చా?...’’ అంటూనే మళ్ళీ కుర్చీ ప్రక్కనే ఉన్న బజర్‌ నొక్కింది శోభాదేవి.

మళ్లీ క్షణంలో  సర్వెంట్‌ చేతులు కట్టుకుని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ‘ఇంతసేపు ఎక్కడ నిలబడ్డాడో... ఏ మూల దాక్కున్నాడో... బెల్‌ కొట్టగానే రెక్కలు కట్టుకుని వాలిపోతున్నాడు’ మనసులోనే అనుకున్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘మనోరమని అడిగి ‘అమ్మగారు’ చనిపోయినప్పుడు పేపర్లలో వచ్చిన వార్తలన్నీ అడిగి పట్రా!’’ హుకుం జారీ చేసింది శోభాదేవి.
అర క్షణంలో ఒక ఫైలు చేత్తో పట్టుకుని పరుగున వచ్చాడు సర్వెంటు.

‘‘అదిగో! ఆయనకివ్వు.’’ అంది శోభాదేవి.

సర్వెంటు తెచ్చిన ఫైలు ఎస్సై అక్బర్‌ఖాన్‌ ముందున్న టీపాయ్‌ మీద వినయంగా ఉంచి అంతే వినయంగా వెనక్కి వెళ్లిపోయాడు.
ఆతృతగా ఫైలు తీసి చూస్తూనే షాక్‌ తగిలిన వాడిలా కుర్చీకి జారగిలబడిపోయాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

నెల రోజుల క్రింద నాటి స్థానిక పేపర్లు ప్రముఖంగా మొదటి పేజీల్లోనే రాసారు.

‘‘యలమంచిలి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్‌ పర్సన్‌ శ్రీమతి మహాశ్వేతాదేవి ఆంధ్రప్రదేశ్‌లో గల అరకు లోయకు విహారానికి వెళ్ళి అక్కడ జరిగిన ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె భర్త యలమంచిలి గ్రూప్‌ఆఫ్‌కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తాళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్‌ కూడా అరకులోయ లోనే ఆమెతో పాటు విహారానికి వెళ్ళారని తెలిసింది.

భార్యాభర్తలు విహారయాత్రకి అరకులోయకు వెళ్లి రెండు రోజులు అయింది. ఛైర్‌పర్సన్‌ శ్వేతాదేవి ఒక్కరే ట్యాక్షీలో వెళ్లారని కారు అదుపు తప్పి లోయలో పడిపోయిందని తెలుస్తోంది. ఆ ప్రమాదంలో కారుతో పాటు ఛైర్‌పర్సన్‌ శ్వేతాదేవి కారు డ్రయివర్‌ కూడా కాలిపోయి ఇద్దరి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా మాడి మసైపోయాయని తెలిసింది.  అయితే ఇది నిజంగా రోడ్డు ప్రమాదమేనా లేదా కావాలనే ఎవరైనా మహాశ్వేతా దేవిని ప్రమాదానికి గురి చేసి చంపేసారా? అన్న కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.’’
వార్త అంతా చదివి అదిరిపడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌. వార్తతో పాటు ఆమె బ్రతికి ఉన్నప్పుడు చైర్‌పర్సన్‌గా హుందాగా కుర్చీలో కూర్చున్న ఫొటో ప్రచురించారు.

ఎస్సై అక్బర్‌ఖాన్‌కి తల గిర్రున తిరిగిపోయింది. కేసు ముడి విడిపోయిందనుకుంటున్న తరుణంలో ఆ వార్త చదవగానే మెదడు మొద్దుబారిపోయింది.

‘‘ఎస్సైగారు మీకీ ఏటిఎమ్‌కార్డు ఎక్కడ దొరికింది? ఎవరి దగ్గర దొరికింది?’’ కుతూహలంగా ఎస్సై అక్బర్‌ఖాన్‌ కేసి చూస్తూ అనుమానంగా అడిగింది శోభాదేవి.

‘‘ఒక యాచక కుర్రాడి దగ్గర దొరికింది మేడమ్‌.’’ అన్నాడు నిర్లిప్తంగా. ‘ఆమె’ ఎవరో తను చూడలేదు. చూసిన సాక్షులు చెప్పిందే నిజమని నమ్మి పరిశోధనలో ఇంతవరకూ వచ్చాడు. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani