Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue294/767/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)...

ఉదయం లేచి చక్కగా ముస్తాబయి, లేత నీలం రంగు చీర జాకెట్టుతో ఆకాశ సుందరిలా ఉంది. అన్నం వండి అత్తగారికి ఇంతపెట్టి తనూ ఇంత తిని, పక్కింటి రాధమ్మకి అత్తగారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి హాస్పిటల్ కి వెళదామని బయటకి రాగానే ఎప్పటి నుంచి ఉందో ఒక కారు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమెకి అతను ‘కార్ రెడీగా ఉంచుతా’ అన్న విషయం గుర్తుకొచ్చి, వెళ్లి ఎక్కి కూర్చుంది. కారు వెళుతూ ఉండగా ఆమెకి తమకంత సహాయం చేసిన వ్యక్తి పేరు తెలుసుకోలేదన్న విషయం గుర్తుకొచ్చింది. కార్ డ్రైవర్ని ‘తన కోసం కార్ అరెంజ్ చేసింది ఎవరని’ అడిగింది. అతను సీరియస్ గా ముందుకు చూస్తూ డ్రైవ్ చేస్తూనే ‘మనోహర్ సాబ్’ అన్నాడు. ‘ఓహ్!’విండోలోంచి బయటకు చూడసాగింది.

కారు హాస్పిటల్ గేటులోకి దూసుకెళ్లి పోర్టికోలో ఆగి, కాత్యాయని దిగంగానే సర్రున వెళ్లిపోయింది.

కాత్యాయని మొదట ఎటు వెళ్లాలో కాస్త కన్ఫ్యూజ్ అయి తర్వాత నిదానంగా అన్నీ గుర్తు తెచ్చుకుని తను వెళ్లాల్సిన బ్లాక్ కి వెళ్లి లిఫ్ట్ ఎక్కి తమ గదికి వెళ్లింది. రూం లో అచ్యుతరామయ్యగారు పేపర్ చదువుకుంటున్నాడు.

కాత్యాయనిని చూడంగానే గబ గబ లేచి "ఇంత చక్కటి గదిలో ఇంతవరకూ నా జీవితంలో ఉండలేదమ్మా. అస్సలు హాస్పిటల్లో ఉన్నట్లే లేదమ్మా. లగ్జరీ హోటల్ గదిలో ఉన్నట్టు ఎంత సౌకర్యవంతంగా ఉందో! ఇదిగో పొద్దున్నే ఇంగ్లీష్, తెలుగు పేపర్లు కూడా తెచ్చిచ్చారు చదువుకోడానికి, అన్నట్టు నేను వేడి వేడి ఇడ్లీలు తిన్నాను. నువ్వు టిఫిన్ చేశావా?" అన్నాడు ఆనందంగా.

తండ్రి సంతోషానికి కారణమైన మనోహర్ కి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. టిఫిన్ చేశానన్నట్టుగా తలాడించింది.
బాయ్ రూం కి తెచ్చిన కాఫీ తాగి ఇద్దరూ అలా కూర్చున్నారో లేదో.

డాక్టర్ వాళ్ల రుమ్ డోర్ నాక్ చేసి, కాత్యాయని తలుపు తీశాక లోపలికి వచ్చి అక్కడున్న ఈజీచైర్ లో కూర్చుని, ‘శాంపిల్స్ సేకరించి టెస్ట్ లకు పంపారని, బహుశా రెండూ మూడూ రోజుల్లో డాక్టర్స్ అవైలబిలిటీని బట్టి కమలాకర్ కు ఆపరేషన్ చేసే అవకాశం ఉందని’ నమ్రతగా చెప్పాడు.
కాత్యాయని మౌనంగా విని తలాడించింది.

***

మూడురోజుల పాటు అన్ని రకాల పరీక్షలూ చేసి సంతృప్తి చెందాక మరో రెండు రోజుల తర్వత ఆపరేషన్ డేట్, టైమ్ ఫిక్స్ చేశారు.
అన్ని రోజులూ పొద్దున్నా సాయంత్రం రక రకాల పళ్లతో పరామర్శకన్నట్టుగా వచ్చి కూర్చుని కాత్యాయనితో మాట్లాడి వెళుతున్నాడు మనోహర్.

మరుసటిరోజే ఆపరేషన్.

కాత్యాయని ఉదయానే తలంటోసుకుని హాస్పిటల్ ప్రాంగణం లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్లింది. హాస్పిటల్ లో ఎత్తైన ప్రదేశంలో కట్టడంతో అద్భుత కట్టడంలా భాసిస్తూ తెల్లగా మెరిసిపోతోంది. అక్కడే పక్కగా ఉన్న  షాపులో పూలూ, కొబ్బరి కాయలూ తీసుకుని గర్భ గుడిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని కళ్లారా చూసింది. ప్రశాంతమైన మోముతో ఆపద్భాంధవుడిలా కనిపించాడాయన కాత్యాయని కళ్లకి. గర్భగుడినుంచి తన ముందుకొచ్చిన పూజారికి తమ గోత్రం, పేర్లు చెప్పి అర్చన చేయమని చెప్పింది. తీసుకునికమలాకర్ కి ఆపరేషన్ సవ్యంగా జరిగి అతను కోలుకుంటే తిరుపతి వస్తానని కళ్లు మూసుకుని మనస్ఫూర్తిగా మొక్కుకుంది. అర్చన పూర్తయ్యాక పూజారిచ్చిన తీర్థ, ప్రసాదాలు, కొబ్బరి చిప్ప, పూలు తీసుకుని పూలు తలలో తురుముకుని, అక్కడే ఉన్న ఒక స్తంబానికి ఆనుకుని కూర్చుని కొబ్బరి చిప్పని నేలపై ముక్కలుగా కొట్టుకుని ప్రసాదం తింటూ తనకు కొద్దిదూరంలో కన్నీరు మున్నీరవుతున్న దంపతులను చూసింది. ఆయనది తన తండ్రి వయసే, వెళ్లి ఓదార్చలనిపించింది.

నెమ్మదిగా లేచి వాళ్లదగ్గరకు వెళ్లింది. తనను తను పరిచయం చేసుకుని ‘ఎందుకు బాధ పడుతున్నారని’ అడిగింది.

తనపేరు పరశురామ్ అని భార్య అనుపమ అని పరిచయం చేసుకుని, అనుపమకు లివర్ ప్రాబ్లం ఉందనీ, ఈ హాస్పిటల్ ఆ వ్యాధికి చక్కగా చికిత్స చేస్తారని తెలిసి ఊర్నుంచి వచ్చి జాయిన్ చేశామనీ, ఇప్పటికే బోల్డు డబ్బు కర్చయిందని, ఇప్పుడు ఆపరేషన్ అంటున్నారని, దానికి డబ్బు సమకూర్చుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని..కళ్ల నీళ్లు నింపుకుంటూ చెప్పాడు పరశురాం.

"దానికంత ఇబ్బంది ఎందుకు? ఈ హాస్పిటల్లో ఛారిటీ ట్రీట్ మెంట్స్ జరుగుతాయి కదా! మీకు తెలియదా? ప్రయత్నించలేదా?"అంది.
పరశురాం తెల్లబోయి తర్వాత " ఇక్కడ అట్లాంటివేమీ లేవమ్మా..ఉచితం అనేమాట పక్కన బెట్టండి. కనీసం కాస్త డిస్కౌంట్ కూడా ఇవ్వరు. పక్కా కమర్షియల్" అన్నాడు కొంచెం కోపం, కొంచెం బాధ మిళితం చేస్తూ.

"మీరు సరిగ్గా కనుక్కోలేదేమో, మా ఆయనకి రేపు ఆపరేషన్, అంతా ఛారిటీతోటే జరుగుతోంది. ఇంతవరకూ ఒక్క పైసా పెట్టలేదు. అంతా భగవంతుడి దయ" అంది కాత్యాయని శ్రీ వేంకటేశ్వరస్వామి వైపు తిరిగి చేతులు జోడిస్తూ.

"అలాంటిదేమీ లేదు తల్లీ" అన్నాడు నింపాదిగా.

"అయ్యో, అయితే పదండి. రిసెప్షన్ లో చెప్పిస్తా"అంటూ లేచింది. వాళ్లలో ఆశ ఉత్సాహం నింపింది. ఆమెతో పాటూ వాళ్లూ లేచారు.
రిసెప్షన్ కి వెళ్ళాక కాత్యాయని"మేడం, ఇక్కడ నెలకి పది ఛారిటీ ట్రీట్ మెంట్స్ జరుగుతాయి కదండీ..చెబితే వీళ్లు నమ్మడం లేదు. కొంచెం మీరైనా చెప్పండి" అండి.

"అలాంటివేం లేవండి. అన్నీ కమర్షియల్ యాస్పెక్ట్ లోనే జరుగుతాయి" సౌమ్యంగా, మధురంగా చెప్పింది రిసెప్షనిస్ట్.

"మాకు ఛారిటీ త్రూ నే ట్రీట్ మెంట్ జరుగుతోంది. ఇంతవరకూ ఒక్క పైసా మేం స్పెండ్ చేయలేదు"

"ఇట్స్ ఇంపాసిబుల్..పేషెంట్ డిటేయిల్స్ చెప్పండి" అంది.

అక్కడ జరిగేది విచిత్రంగా చూస్తున్నాడు పరశురాం.

కమలాకర్ పేరు చెప్పింది. ఆమె కంప్యూటర్ లో యాక్సెస్ చేసి "సో ఫార్ టు అండ్ హాఫ్ లాక్ అయింది మేడమ్. మిస్టర్ మనోహర్ వన్ లాక్ పే చేశారు. రిమెయినింగ్ ఇవాళ ఆన్ లైన్లో పే చేస్తారు" అంది.

రెండున్నర లక్షలైందా? మనోహర్ పే చేశాడా? ఎందుకు? అతనెవరో కూడా తమకు తెలియదే! కాత్యాయనికి కళ్లు తిరిగాయి. మెదడు మొద్దుబారిపోయింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్