Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
award for musicolosist Raja

ఈ సంచికలో >> సినిమా >>

రామ్మూర్తి గారికి నివాళి

rammorthy gariki nivali

-- రాజా (మ్యూజికాలజిస్ట్)

పి.బి. శ్రీనివాస్ కన్ను మూసిన మూడో రోజునే (ఏప్రిల్ 17న ) ఆయనతో ఎన్నో మంచి పాటలు పాడించిన సంగీత దర్శక ద్వయం విశ్వనాథన్- రామ్మూర్తి జంటలోని టి.కె. రామ్మూర్తి కూడా పరమపదించారు. సినీ సంగీత ప్రపంచానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఎంతో, ఏమిటో తమిళులకు తెలుసుకాని తెలుగు వారికి తెలియదు. విశ్వనాథన్ తో కలిసున్న రోజుల్లో ఆయన కాంట్రిబ్యూషన్ తెలిసే అవకాశం లేదు. ఆయనతో విడిపోయాక  దాదాపు 19 సినిమాలు చేశారు రామ్మూర్తి. అందులో 'నాన్' 'నేనంటే నేనే' గా, 'సాధు మిరండాల్' ' పట్టుకుంటే పదివేలు' గా తెలుగులోకి రీమేక్ అయ్యాయి. వీటిలో ఆయన సంగీతం సమకూర్చిన స్వరాల్ని మనం 'నేనంటే నేనే' లో తీసుకున్నాం.
 
'నాన్' లో 'రాజా కన్ను పోగాతడి' పాటలోని 'గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' అనే లైన్ ని ట్యూన్ తో సహా 'ఓ చిన్నదానా నన్ను విడిచి పోతావటే' పాటలోకి ఎడాప్ట్ చేసుకున్నాం. అది ఇవాళ్టికీ హిట్టు. అలాగే 'నేనంటే నేనే' లోని 'ఒకే ఒక గులాబి కై వాలిన తుమ్మెదలెన్నెన్నో' పాటలో బాలు, సుశీల తో విచిత్రంగా పలికించిన 'క్వా క్వా క్వా క్వా క్వా క్వా ' అనే సౌండు 'నాన్' లోని ' అదే ముగమ్ అదే గుణమ్' పాటలోంచి తీసుకున్నదే. (నెట్ లో ఈ పాట విని చూడండి - సౌందర్రాజన్ వాయిస్ లో ఈ సౌండు భలే కామిడీగా వుంటుంది).  ఇక అదే సినిమాలోని 'అమ్మనో సామియో' పాట ట్యూన్ ని చాలా వరకు  'అంబవో శక్తివో'  పాటకు తీసుకోక తప్పలేదు. ఎందుకంటే ఆ పాట తమిళ నాట నేటికీ హిట్టు. అదే విధంగా తెలుగులో కూడా 'అంబవో శక్తివో' ఘనవిజయాన్ని సాధించింది . ఇప్పటికీ కొందరిళ్ళలో తలస్నానం చేసిన తర్వాత ఆరబెట్టుకోకుండా విరబూసుకొని తిరుగుతుంటే "అంబవో శక్తివో లాగ ఏంటా వేషం ... త్వరగా తలారబెట్టుకో ... లేకపోతే జలుబు చేస్తుంది" అంటూ పెద్దవాళ్ళు మందలిస్తూ వుంటారు. ఒక విధంగా రామ్మూర్తి గారు తెలుగునాట సాధించిన పరోక్ష విజయానికి ఇవన్నీ తీపి గుర్తులు.

మరిన్ని సినిమా కబుర్లు