Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalutelugu serial twenty fifth Part

ఈ సంచికలో >> సీరియల్స్

ఒకనాటి ప్రేమకథ - ఆకెళ్ళ శివప్రసాద్

okanati premakatha by akella shiva prasad

ఇది జరిగి యిరవై ఏళ్ళయింది. కాని నిన్నే జరిగినట్టు అనిపిస్తుంది. నా జ్ఞాపకాల్లో అంత పదిలంగా వుంది. ఆ రోజుల్లో వుండే చెలాకీతనం తెగువ ఈనాడు ఏమయ్యాయి? అనిపిస్తుంది నాకు.

అప్పట్లో మరో ఆలోచన లేకుండా, యవ్వనంలో ఉండే తెగింపే వుండేది. వెనకా ముందూ చూసుకునేవాళ్ళం కాదు. మనసు ఎటు చెప్తే అటు వెళ్ళిపోయేవాళ్ళం. కార్యరంగంలోకి దూకేవాళ్ళం.

ఓహ్! ఆ రోజులే వేరు. అందమైన వయస్సు, మూఢ విశ్వాసం జోడు గుర్రాల్లా సవారీ చేసేవి.

ఎప్పుడు ఆకలే... ఆకలి... దాహం... ఏదో ఆర్తి... ఎవరి మీదో... ఎందుకో కోపం... భయంకరమైన కోపం... వెర్రికోపం... పిచ్చికోపం!

ఆదర్శవాదం నీడలో సాగిపోయేవాళ్ళం... కాదు... ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేవాళ్ళం... ప్రతిదాన్నీ సరిదిద్దాలని, ఓ దారికి తేవాలనీ... ఏదో వెర్రి తపన!

ప్రపంచం మార్చేయాలి. చరిత్ర తిరగరాయాలి. లోకాన్ని నెత్తుట్లో స్నానం చేయించి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకునే వాళ్ళం.

మేం నాస్తిక వాదులం!

మేం తిరుగుబాటు బాటలో వెళ్తాం!!

ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని ఓ గుంపుకి నేను నాయకుణ్ణి!

ఉగ్రవాదం, కరకు ఖడ్గం గుండెల్లో సూటిగా గుళ్ళను దించే తుపాకీ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన రోజులవి. సలాం! సలాం!!

నా కలంలోంచి నిప్పుకణికలూ, అగ్నిజ్వాలలు వెలువడేవి!

దెబ్బకి దెబ్బ... ప్రాణానికి ప్రాణం... ఇవే మా ఆదర్శం... ఈ ఆదర్శాలే ఊపిరిగా పీల్చే, నాలాంటి మూడొందల మంది యువకులు అందరం కలిసి ఓ పత్రిక నడిపే వాళ్ళం... దానికి నేనే ఎడిటర్ని. అగ్గి పెట్టెలాంటి ఓ చిన్న గదే మా ఆఫీసు తెల్లవార్లు అక్కడే ఉండేవాళ్ళం. నేను చెప్పిందే వేదం. నన్ను బాగా గౌరవించేవాళ్ళు మా బృందంలోని సభ్యులు నేనే తిరుగులేని నాయకుడిని అయితే... నా మనసులో ఏదో వెలితి... ఏదో లోటు... ఏదో కొరత... ఏదో బాధ సుళ్ళు తిరిగేవి.

నిజానికి ఉగ్రవాద కార్యకలాపాలకు ఇలాంటి దృక్పథానికి పొంతన కుదరదు. అయినాసరే ఒక్కోసారి విషాద గీతాలు ఆలపిస్తూ గడిపేవాణ్ణి. రెండు రకాల భావాలు నా మనసులో ఘర్షణ పడేవి దాంతో ఉక్కిరి బిక్కిరి అయ్యేవాణ్ణి.

అలాంటప్పుడు నేను పెరట్లోకి నడిచేవాణ్ణి. గోడ దగ్గర నిలబడి విశాల ప్రపంచంలోకి చూసేవాడిని. ఓరోజు అలా చూస్తూ నిలబడ్డాను. అప్పుడే ఓ అందమైన ఆడపిల్లను చూశాను.

ఆహా! ఎంత అద్భుతంగా ఉంది.

తొలిచూపులోనే ప్రేమలో పడడానికి నాకు అట్టే సమయం పట్టలేదు.

ఓ ప్రణయాది దేవతా... నీ ముందు దాసోహమయ్యాను!

ఆమె వైపే చూస్తూ నిలబడ్డాను. నా హృదయం ఆనందగీతాలు ఆలపించింది. ఆమె పట్ల ఆరాధనతో నిండిపోయింది.

ఆమెకి నా పరిస్థితి తెలీదు... నన్ను చూడనేలేదు!! నేను ఆమెని చూడటం కేవలం యాదృచ్ఛికం. ఒకచోట నిలబడి ఏదో ఆలోచిస్తూ ఓ దిక్కు చూస్తుంటే ఆమె కనిపించింది. అంతే! ఆమెని చూసిన ప్రదేశం పవిత్ర ప్రదేశంలా అనిపించింది. నా మోచేతులు మా పెరట్లోని గోడమీద ఆనించి చేతి వేళ్ళు తలమీద ఉంచి తూర్పు వైపు చూస్తూ ఉండిపోయాను. అక్కడే ఎదురుగా ఓ అరటితోట కనిపించింది. ఆ తోటని ఆనుకొని ఓ పిట్టగోడ ఉంది. ఆ గోడకవతల ఉత్తరదక్షిణాలుగా మెయిన్ రోడ్డు ఉంది. ఆ రోడ్డుకిరువైపులా పలు అంతస్తుల భవనాలున్నాయి. నాకు ఎడంవైపున తూర్పునుండి పశ్చిమానికి విస్తరించి ఓ మురికి కాలువ  ప్రవహిస్తోంది. అది సరిగ్గా నగరానికి మధ్యగా ఉండి నగరాన్ని రెండుగా విభజిస్తోంది. ఆ కాలువకి రెండు పక్కలా ఎత్తు గోడలున్నాయి. అంతకుముందు అక్కడో కొబ్బరిచెట్టు ఉండేది. గోడని కొబ్బరి చెట్టుకి బాగా దగ్గరగా కట్టడంతో ఆ కొబ్బరి చెట్టుని కొట్టేశారు. దాంతో గోడలు బీటలు వచ్చాయి. బీటల వల్ల ఏర్పడిన సందులోంచి నేను ఆమెను చూశాను. మంచి బలిష్టంగా చక్కటి అంగ సౌష్టవంతో వుంది ఆమె. ఆమె కురులను వదులుగా వదిలేసింది. అవి ఆమె భుజాల మీదుగా అలవోకగా కదులుతున్నాయి. ఏదో కలల్లో విహరిస్తున్నట్టుంది. అంత తియ్యటి కలలు ఏం కంటోంది ఆమె?

నన్ను చూడట్లేదా? నా వైపు ఎందుకు చూడదు? నేను అక్కడే నిలబడి మెల్లగా దగ్గాను. ఒకసారి కాదు... రెండుసార్లు కాదు... తెరలు తెరలుగా దగ్గుతూనే వున్నాను!

ప్చ్! ప్రయోజనం లేదు! ఆమెకి నా దగ్గులు వినిపించలేదు. ఆమె ఎందుకు వినటం లేదు?

అప్పట్నించి న దగ్గుల పరంపర అలా కొనసాగింది - నా 'పవిత్ర ప్రదేశం' దగ్గర నిలబడటం - గోడ కన్నంలోంచి చూడటం - దగ్గడం - రకరకాల దగ్గులతో ఆమె దృష్టిని ఆకర్షించటానికి ప్రయత్నించేవాడిని.

ఒక్కోసారి మెరుపులా ప్రత్యక్షమయ్యేది - వెంటనే శరపరంపరగా దగ్గులతో దద్దరిల్లేట్టు చేసేవాడిని... ఏమీ లాభం లేకపోయింది... నా దగ్గులు ఆమె వినేది కాదు...! అలా ఓ నెలన్నర గడిచింది. ఆ యింటి గురించీ పరిసరాల గురించీ నాకు కాస్తో కూస్తో తెలిసింది. పెద్ద ప్రత్యేకతలు ఏమి లేని గౌరవ ప్రదమైన కుటుంబాలు వుంటున్నాయక్కడ - అంటే! నేను ఆరాధిస్తున్న మనిషి ఆ ఇళ్ళల్లో పనిచేసే ఓ పనిమనిషి!

అయితే ఏం?

గుడిసెలూ, భవంతులు అనే తేడాల్ని ప్రేమ గుర్తిస్తుందా?

ప్రేమ శాశ్వతమైనది... దైవికమైనది...!

అయినా... ఇంకా... ఆమె నన్ను చూడలేదు... ఆమె దృష్టిలో నేనింకా పడలేదు... మళ్ళీ దగ్గుల్తో ప్రయత్నించాను... లాభం లేకపోయింది.

విసిగిపోయాను... నా దగ్గులన్నీ బొగ్గులయ్యాయి... నేను చీకట్లో ఉండిపోయాను...! ఓ రోజు ఆశ్చర్యం...! అద్భుతాల్లోకే అద్భుతం జరిగింది. ఆమె నన్ను చూసింది... చంద్రుడి వెన్నెల ప్రసరించినట్టు అన్పించింది. ఆమె నావంక చూసింది. నేనూ ఆమె వంక చూశాను. ఆమె నవ్వింది. నేను వెంటనే నవ్వలేకపోయాను. చిరునవ్వు బలహీనతకు ప్రతీక కదా! నాలోకి ఏదో శక్తి ప్రవహించి నట్టయింది... ఏవో నిధినిక్షేపాలు దొరికినట్టనిపించింది నాకు... నా దేవత నన్ను కరుణించింది... ఆమె కటాక్షం నా మీద పడింది... నా మొరలు నా దేవతకి వినబడ్డాయి... నా నిర్వేదం మాయమైంది... రెట్టించిన ఉత్సాహంతో నా కార్యకలాపాలని కొనసాగించాను... ప్రతిరోజూ ఇద్దరం ఒకరినొకరం చూసుకునేవాళ్ళం... ఆమె నన్ను చూసి చిర్నవ్వునవ్వేది - నేను కూడా కాస్త నవ్వడం నేర్చుకున్నాను -

మా ప్రేమ అలా కొంతకాలం సాగింది...

ఓ రోజు సాయంత్రం...

సన్నగా తుంపర మొదలైంది...

నేను స్లీవ్ లెస్ వెస్ట్, షార్ట్స్ వేసుకుని నా నియమిత ప్రదేశంలో నుంచుని గోడ మధ్యలోని కన్నంలోంచి చూశాను -

నా నడుముకి ఓ కత్తి ధరించాను. ఉగ్రవాదికి మారణాయుధాలు ధరించడం తప్పనిసరికదా...

నా ప్రియనేస్తం కోసం ఎదురు చూస్తున్నాను... మా బసలోకి వచ్చిపోయే జనం గమనిస్తున్నారు. ఎవరైనా అటుగా వచ్చినప్పుడు మూత్రవిసర్జనకి వంగినట్లు నటించసాగాను. అలా కొంతసేపు వేచి చూశాను. ఉన్నట్టుండి గోడ మధ్యలోని కన్నాన్ని తెల్లవర్ణం నింపేసింది. మళ్ళీ నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. నా నోట్లో తడి ఆరిపోయింది. ఓ తియ్యటి స్వరం వినిపించింది.

"ఎందుకు వర్షంలో నిలబడ్డారు?"

"ఏం లేదు"

ఉద్విగ్న భరిత క్షణాలవి. ఇవేం పట్టించుకోకుండా విద్యుద్దీపాలతో ఆ రోడ్డు వెంబడి జనం నడుస్తోనే వున్నారు. ఆ వీధి మధ్యలో వున్న కాలవలో ఎక్కడో ఓ చోట ఓ పాము ఓ కప్పని కబళించిన శబ్దం... బాధతో విలవిల్లాడుతున్న కప్ప ఆక్రందన విన్పించింది నాకు. క్రమంగా చీకటి చిక్కబడుతోంది. చీకట్లో కనుచూపుమేరలో ఏమీ కన్పించకుండా పోతోంది...

"మీరు వెళ్ళిపోయారా?" అడిగిందామె.

"లేదు వెళ్ళలేదు... నేను అక్కడికి రానా?"

"ఎందుకు?"

"ఏం లేదు"

"వద్దు"

"నే వస్తాను"

"ఇక్కడో కుక్కవుంది..."

"ఏం ఫరవాలేదు"

"వాళ్ళు భోజనం చేయడానికి యిక్కడికి వచ్చే సమయం అయింది"

"ఏం ఫర్వాలేదు... నేను వస్తాను"

"అయ్యో... వద్దు..."ఆమె పారిపోయింది... గోడ మధ్యలో కన్నం మళ్ళీ నల్లబడింది...! నేను... గోడపైకి ఎక్కి కూర్చున్నాను... దీపపు కాంతి కాలవలోని నీళ్ళమీద, గోడలమీద క్రమంగా పరుచుకుంటోంది... నెమ్మదిగా కాలవలోకి దిగడానికి ప్రయత్నించాను... కాళ్ళు నేలకి అందడం లేదు... నెమ్మదిగా గోడ మీద పట్ట వదిలించికుని కిందకి దిగడానికి ప్రయత్నించాను... మోకాలిలోతున బురద... మొలలోతు నీళ్ళు... కాళ్ళకి ముళ్ళ కంచెలూ, గాజు ముక్కలూ గుచ్చుకుంటున్నాయి అనిపిస్తోంది... బురదలోకి కూరుకుపోయి కాళ్ళు, రాళ్ళు కట్టినంత బరువుగా అయ్యాయి... ముందుకు పాకాను... కాలవ మధ్యలోకి వచ్చాను... కాంతి బాగా ఉందా ప్రదేశంలో... ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాను... బురదలో పూర్తిగా కూరుకుపోయాను. జనాలకీ నేను స్పష్టంగా కన్పిస్తున్నాను. నేను ముందుకి కదలక తప్పదు... ఎలాగో కూడదీసుకొని ముందుకు సాగాను... నెమ్మదిగా అవతలి ఒడ్డుకి అడుగులోకి అడుగువేసుకుంటూ చేరుకున్నాను...

పైకి చూసి తెల్లబోయాను...

కాలువ అవతలి గట్టున ఓ గోడ లేచి వుంది... ఆకాశమంత ఎత్తు ఉందనిపించింది. ఏం చేయడం? ఆ గోడని ఎలా పైకెక్కగలను...? పోనీ... వెనక్కి వెళ్ళిపోతే... లేదు... ఆ గోడని ఎక్కాల్సిందే... చేతికి కాస్త దూరంలో మర్రిచెట్టు కొమ్మ ఒకటి గోడలోంచి మొలిచివుంది...

ముందుకు వంగాను ఆ మర్రికొమ్మ అందుకోవడానికి..! మళ్ళీ తెలివి వచ్చేసరికి గోడమీద కూర్చుని ఉన్నాను.

"ఓహ్" ఆమె ఆశ్చర్యంగా అరవడం విన్పించింది నాకు... నేను ఆమెకి ఇంకా దూరంలోనే ఉన్నాను. కిందికి దూకలేకపోయాను... కాస్త దూరంలో ఆ యింటికి పశ్చిమాన సగం ఎత్తులో పిట్టగోడ వుంది. నేనున్న గోడమీదే నెమ్మదిగా పిల్లిలాగా పాకాను. ఎలాగో పక్కనున్న యింటి పెరట్లోకి దూకగలిగాను. అక్కడో బందెలదొడ్డి కన్పిస్తోంది... అది దాటి వెళ్తుంటే ఎండుటాకులు నా కాళ్ల కింద పటపటలాడాయి. ఆ పిట్టగోడ చేరే వరకూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాను. ఆమె నెమ్మదిగా గోడకి అటువైపు వచ్చింది. నేను ఆమెను నెమ్మదిగా భుజాలు పట్టుకుని లేవనెత్తాను... కొసతేలివున్న ఒకరాయికి ఒరుసుకుని ఆమె రవికె పర్రుమంటూ చినిగింది. ఆమె కూడా చిర్రుమంటూ రెండుసార్లు నాచెంప ఛెళ్ళుమనిపించింది".

"...అయ్యో... వాళ్ళు భోజనానికి వచ్చే టైం అయ్యింది... వెళ్ళిపో..." అంది.

ఆ మాటలంటున్న ఆమె నోట్లోంచి దుర్వాసన నా ముఖాన్ని, నాసికను సోకాయి, ఆమె నన్ను కొట్టిన చెంపదెబ్బల్లాగే... ఆ దుర్గంధానికి టక్కున తల వాల్చేశాను...!

వీలైనంత దూరం జరిగాను. రెండు చెట్టు బెరళ్ళు నా కాళ్ళ కిందపడి శబ్దం అయ్యింది...

ఓ కుక్క మొరిగింది...

"వెళ్ళిపో..." అంటూ అరిచిందామె. గోడదూకి అవతలకి వెళ్ళిపోయింది. కుక్కలు అన్నీ ఒక్కసారిగా మొరగనారంభించాయి... కుక్కలు చాలా ఉన్నాయా? ఏమో?

నెమ్మదిగా నడిచి పిట్టగోడ ఎక్కాను... అక్కడ్నించి ఎత్తుగోడ ఎక్కాను... గొంతుకు కదిలాను.

నెమ్మదిగా ఆ గోడల మీదా, పెరట్లోనో మిరిమిట్లుగొలిపే కాంతి పరుచుకుంది...

నా ముందు ఓ అరటి ఆకు మాత్రమే వుంది... గాలికి అదీ కొట్టుకుపోతోంది... కాంతిలో నేనోక్కడ్ని మిగిలిపోయాను.

ఆ సమయంలోనే మా కామ్రేడ్లలో కొంతమంది మా గదికి వెళ్ళటం గమనించాను... నన్ను చూసే అవకాశం ఉంది... చిత్రంగా నన్ను గమనించలేదు... అయినా నన్ను ఎలా అనుమానించగలరు? ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు, మరో ఇద్దరు మగవాళ్ళు బైటకి వచ్చారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలో ఓ కుర్రాడు ముందుకువచ్చాడు. నేను గోడమీద కూర్చుని ఉన్న వైపుకు వచ్చాడు. నన్ను పట్టుకోవడానికే వస్తున్నాడా? నన్ను తప్పక చూసి వుంటాడు. ఛీ! ఎంత తలవంపు?

"ఒరేయ్ దొంగ వెధవా...? ఏం చేస్తున్నావక్కడ...? అంటూ నన్ను పట్టుకుంటే, క్రమంగా గుంపు జోగయితే, వీడే కదా ఆ న్యూస్ పేపర్ ఎడిటర్ అంటూ అరిస్తే...

అయ్యో భగవంతుడా..! యిప్పటిదాకా నీ గురించి నేను చెప్పిందంతా అబద్ధం... ఈ పరిస్థితి నుండి నన్ను కాపాడు..!

వాడికి నేను కనబడకుండా చెయ్యి...

నా కత్తి తీసుకున్నాను... వాడు నన్ను పట్టుకుంటే నా నాలుక కత్తిరించుకుంటాను.

ఓ భగవంతుడా వాడికి చూపు పోయేటట్టు చెయ్యి. కనీసం కాసేపు!

నా కోసం నా కామ్రేడ్లు పెద్దగా అరుస్తున్నారు... వాళ్ళ నాయకుడిని కలవాలని తహతహలాడుతున్నారు. హే భగవాన్... నన్ను అవమానంలో తలదించుకునేలా చేయకు...

నా కోసం వస్తున్నాడనుకున్నా కుర్రాడు గోడ దగ్గరకొచ్చి వంగి మూత్ర విసర్జన చేసి వెళ్ళిపోయాడు... అప్పటికే నాలో శక్తి అంతా నీరు కారినట్టయింది. శక్తి పూర్తిగా పోయింది.

ఆ తరువాత ఏం జరిగిందో నాకైతే స్పష్టంగా గుర్తులేదు. వళ్ళంతా కోసేసుకొని, గోడ ఎక్కి దూకటం, కాలవలోకి దూకటం, బురదలోకి కూరుకుపోవటం లోలగా గుర్తుంది.

నన్ను చూసేసరికి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. నేనేదో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుని వచ్చారనుకుంటారు.

నేను ప్రేమ యుద్ధంలో విజయం సాధించానని వాళ్ళూహించలేదు... దేవుడా! సాయపడు!!వళ్ళంతా సబ్బుతో రుద్దుకొని స్నానం చేశాను. ఉతికిన బట్టలు వేసుకుని తలదువ్వుకున్నాను. కుర్చీలో కూర్చుని నా అనుచరులకి జరిగిందంతా వివరించాను.

అంతా విన్న తరువాత వాళ్ళు "ఇక్కడ్నించి వెంటనే బయటపడదాం!! అన్నారు. అంతా అక్కడ్నించి కదిలాం.

ఆ నిశ్శబ్ద రాత్రి ప్రేమ సామ్రాజ్యం నుండి బైటకి అడుగులేశాను...

అలా... అలా... సాగిపోయాయ్...

ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయని ప్రేమించే ఆ వయసుకి జోహార్లు!!
 


 

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని సీరియల్స్