Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinichuraka by bannu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrydayam by VN adtitya

నేను - నా నిర్'మాత'లు
ఏ ఉద్యోగంలో చేరినా, ఆ ఆఫీసువాళ్ళు మనకి జీతం ఇస్తారు. తర్వాత కొంత రేంజ్ పెరిగాక ఓ కారిస్తారు. ఉండడానికో ఇల్లు ఇస్తారు. ఇదంతా మన పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క సినిమా రంగంలో మాత్రం ఒక సినిమా మొదలుపెట్టాక నిర్మాత తన యూనిట్ మెంబర్లందరికీ పెర్ ఫార్మెన్స్ తో సంబంధం లేకుండా రోజూ కారు ఇవ్వాలి, నటీనటులకి, కొందరు అగ్రదర్శకులకి, ఇంకొందరు పెద్ద కెమెరామెన్ లకి లొకేషన్ లో కారాగనివ్వాలి.

రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ , మధ్యాహ్నం లంచ్ (హోటల్ లాగా కోరిన మెనూతో) మధ్య మధ్యలో జ్యూస్ లు, పళ్ళు , చిరు తిళ్ళు , అన్నీ క్రమం తప్పకుండా ఇవ్వాలి. ఇవన్నీ కాక ఆ చిత్రానికి పనిచేసిన నటీ నట వర్గానికి, సాంకేతిక నిపుణులకి జీతాలివ్వాలి. బైట ఉద్యోగాల్లో జీవితాంతం ఒక కెరీర్ వుండటం, అక్కడ ప్రతీ ఆర్నెల్లకో, ఏడాదికో ఒకసారి మన ప్రమేయం లేకుండానే నిరుద్యోగులైపోయే రిస్క్ అధికంగా వుండటం వల్ల కావచ్చు సినిమా లో పనిచెయ్యటం అంటే లైఫ్ ని రిస్క్ తీసుకోవటం అన్న భావన చాలామంది చదువుకున్న వాళ్ళల్లో వుంది. ఈ ఆరు నెలల్లో మనకింత లగ్జరీ ఇచ్చిన నిర్మాత, చాలా లాభాలొస్తే అందులో పనిచేసిన కొందరికి ఇళ్ళు కొనిచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. సో జీవితాంతం టెన్ టూ ఫైవ్ ఈవెన్ గా కష్టపడే కంటే, ఒక్కొక్క సినిమాకి అది రిలీజ్ అయ్యేవరకు ప్రాణం పెట్టి పనిచేస్తే, ప్రేక్షకుల్ని ప్రసన్నం చేసుకుంటే, ఏ వుద్యోగంలో లేని కిక్కు , మజా, జాబ్ & జేబు శాటిస్ఫాక్షన్  సినిమా పరిశ్రమలోనే వుంటుంది. అందుకే నటీ నట సాంకేతిక నిపుణుల వర్గంలో సినిమాలలోకి రావాలంటే అంత క్రేజు.

ఆ క్రేజుని క్యాష్ చేయటానికి, ముందు క్యాష్ పెట్టే దేవుడే నిర్మాత. క్యాష్ పెట్టి, రోజూ అన్నం కూడా పెడతాడు కాబట్టే నిర్'మాత'.

నేను పనిచేసిన నిర్మాతల్లో శ్రీ . బి . వెంకట్రామిరెడ్డి గారు, శ్రీ . డా ॥ డి . రామానాయుడు గారు, శ్రీ . డి . సురేష్ బాబు గారు , శ్రీ  కె . నాగబాబు గారు , శ్రీ కె . అశోక్ కుమార్ గారు, మరియు శ్రీ బూరుగపల్లి శివరామకృష్ణ గారు, శ్రీ అశ్వనీ దత్ గారు, శ్రీ చిలుముల శాంతి కుమార్ గారు (యు . ఎస్ .ఎ ) శ్రీ ఎమ్మెస్ రాజు గారు, శ్రీ డి . శివప్రసాదరెడ్డి గారు , శ్రీ పి . ఫణీంద్ర బాబు , శ్రీ కుమార్ బ్రదర్స్, శ్రీ రమేష్ గోగుల తదితరులు ఒక్కొక్కరిదీ ఒక్కో బాణి. ఒక్కో నిర్మాణ శైలి. వీరు కాక, ఇంకా సగం సినిమాలు తీసినవాళ్ళు , సినిమా స్టార్స్ అవ్వకుండానే కట్ అయిపోయినవాళ్ళు కొంతమంది. వీళ్ళతో నా అనుభవాలు రాయటం ద్వారా "సినిమా పరిశ్రమలోకి రావాలనుకుంటే , క్రియేటివిటీతో పాటు ఎకనామిక్ వయబిలిటీ కూడా ఖచ్చితంగా తెలిసుండాలయ్యా " అన్న మా 'బాస్' నాగార్జున గారి సూత్రానికి ప్రాక్టికల్స్ చూపించినట్టవుతుంది.

ఒకే హీరోతో ఒకే ప్రొడ్యూసర్ ఒక సినిమా సూపర్ హిట్ ఎలా తీస్తారు? ఇంకో సినిమాతో ఆస్తులమ్మేసే దా'ఋణ'మైన  పరిస్థితి లోకి ఎలా పడిపోతాడు? హీరో మార్కెట్ స్థిరం గానే ఉంటుంది కదా అనే ప్రశ్నలకి జవాబే ఈ రాబోయే కాలమ్స్, పార్టులు పార్టులుగా ఒక్కో ప్రొడ్యూసర్ గురించి, నా దృష్టిలో మంచి, చెడులను విశదీకరిస్తాను. దానిలో మంచిని తీసుకొని చెడుని వదిలి పెట్టేదాం. పరిశ్రమలోకి కొత్తగా వచ్చే ఏ నిర్మాత ఆర్థికంగా నష్టపోకుండా హార్థికంగా మనవంతు సాయం చేద్దాం.

(వచ్చేవారం: ప్రఖ్యాత నిర్మాత డా. బి. నాగిరెడ్డి గారి అబ్బాయి శ్రీ బి. వెంకట్రామిరెడ్డి గారి గురించి.... )





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
remakes are not suitable for telugu heros