Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
take care at computer

ఈ సంచికలో >> యువతరం >>

నవయువ సంక్రాంతి.!

navayuva sankranti

ఒకప్పుడు సంక్రాంతి అంటే ఇంటి ముందు అతివల అందమైన ముగ్గులు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు, గంగిరెద్దుల వన్నెలు, పగటి వేషగాళ్ల సందడి, హరిదాసు స్వచ్చమైన గీతాలహరి.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో మరెన్నో. అయితే గత కొద్ది కాలంగా ఈ సందడి కనిపించడం లేదు. చదువులు, ఉద్యోగాల నిమిత్తం యువత పల్లెటూళ్లను వదిలి పట్నంలో స్ధిరపడడం, ఏడాదికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండక్కి కూడా సొంతూరికి వెళ్లలేని పని ఒత్తిడిలో మునిగిపోవడం. తద్వారా మన తెలుగు పండగలను మర్చిపోవడం చాలా తొందరగా జరిగిపోయాయి. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లే. కాలానుగుణంగా మనుషుల్లో మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ముఖ్యంగా యువతలో సరికొత్త మార్పు వచ్చింది. పండగలకు ముఖ్యంగా మన తెలుగువారి పెద్ద పండగగా అభివర్ణించుకునే సంక్రాంతికి విదేశాల నుండి ప్రత్యేకంగా సొంతూళ్లకు తిరిగి వస్తున్నారు.

కాంక్రీట్‌ జంగిల్‌లో ఉండి ఉండి విసుగు పుట్టి, పల్లెటూరి మట్టి వాసనను ఆస్వాదించడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా సొంతూరులో పండగ జరుపుకునేందుకు కాస్త టైం కేటాయిస్తున్నారు. పిల్లలకు పండగ గొప్పతనాన్ని వివరించి చెబుతున్నారు. మన సంస్కృతీ సాంప్రదాయాలివి అంటూ విజువల్‌గా చూపిస్తున్నారు. యూత్‌ అంటేనే ట్రెండ్‌. ట్రెండ్‌కి తగ్గట్లు తమని తాము మలచుకోవడంలో ముందుంటారు. కానీ ఈ మధ్య యువత ట్రెండ్‌ని ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్‌ని సెట్‌ చేస్తున్నారు. మన పూర్వీకుల ఆచార, సాంప్రదాయాల్ని ట్రెండీగా బయటికి తీసుకొచ్చేస్తున్నారు. సాంప్రదాయ వస్త్రాలంకరణపై ఆశక్తి పెంచుకుంటూ ట్రెండ్‌కి కొత్తర్ధం చెబుతున్నారు. పండగ అంటే సెలబ్రేషన్‌ మాత్రమే కాదు, సంస్కృతీ సాంప్రదాయాలకు నెలవు అని తెలుసుకుంటున్నారు. పిజ్జాలు, బర్గర్‌లు వంటి జంక్‌ ఫుడ్‌ని పక్కన పెట్టేసి, సాంప్రదాయ వంటకాలను ఇష్టపడుతున్నారు. వస్త్రాలంకరణ, వంటకాలే కాదు, క్రీడల్లో కూడా ట్రెడిషన్‌ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సాంప్రదాయ క్రీడల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. సంక్రాంతి అంటే ముఖ్యంగా గుర్తొచ్చే క్రీడ కోడి పందాలు. సిటీల్లో ఉండే యువత కోడిపందాలు తిలకించేందుకు ముఖ్యంగా పల్లెబాట పడుతున్నారు. ప్రధానంగా కోడిపందాలకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు ఎప్పటినుండో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆ లొకేషన్స్‌ వైపు యూత్‌ పరుగులు పెడుతోంది ఈ సంక్రాంతి సీజన్‌లో. 
బలమైన కారణాలతో సొంతూళ్లకు వెళ్లలేని వాళ్లు ఉన్నచోటనే సంక్రాంతిని సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటున్నారు. ఆర్టిఫిషియల్‌ అయినా, ఎంతో కొంత ఆ వాతావరణాన్ని క్రియేట్‌ చేసుకుని సంక్రాంతి సంతృప్తిని ఫీలవుతున్నారు. ఈవెంట్స్‌ పేరు చెప్పి అందరూ ఒక చోట ఫామ్‌ అయ్యి, సందడిగా సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నారు. పండగలు, వాటి విశిష్టతను గురించి పెద్దవాళ్లను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఏది ఏమైనా యువతలో వచ్చిన ఈ నూతన మార్పు ఆహ్వానించదగ్గదే. 

మరిన్ని యువతరం