Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sankranti poems

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaram

  ఏసా భీ హోతాహై…. एसा भी होता है…

గుర్తుందా మన చిన్నప్పుడు , అంటే 50-60 లలో, బర్త్ సర్టిఫికెట్లూ వగైరా ఉండేవి కావు. హైస్కూలుకి రాగానే,  మొదటిపేజీలో రాసిన తేదీనే  ఋజువుగా తీసుకునేవారు… పోనీ అవైనా సరీగ్గా ఉండేవా , అబ్బే అలాటిదేమీ ఉండేదికాదు. రాసేటప్పుడు ఏది గుర్తొస్తే అదే రాసేసేవారు. దానివలన కాలక్రమంలో కొన్ని లాభాలూ ఉండేవి, నష్టాలూ ఉండేవి. ఉదాహరణకి ఓ నాలుగైదు నెలలు అటూఇటూగా వేస్తే, ప్రభుత్వ సర్వీసులో  రిటైర్మెంట్ కొంచం ఆలశ్యంగా జరిగేది. కానీ సంవత్సరాల్లో తేడా వచ్చిందంటే, నానా గొడవా అయేది. ఆమధ్యన ఎప్పుడో , ఓ సైన్యాద్యక్షుడి విషయంలో జరిగినట్టు. ఈ పుట్టినరోజులకి  Birth Certificate  లు లేనట్టే, పెళ్ళిళ్ళకి కూడా సర్టిఫికేట్లు ఉండేవి కావు. ఏదో తాళి కడుతూంటే, ఓ ఫొటో తీసేస్తే,  సరిపోయేది,  ఏదైనా సమస్య వచ్చినా, పెళ్ళి శుభలేఖా, ఆ ఫోటో చూపించినా కోర్టులు నమ్మేవి.. అయినా ఆరోజుల్లో ఈ విడాకులూ గొడవా అంతగా ఉండేవి కావు.. ఏదో పెద్దమనిషి మధ్యవర్తిత్వం వహించి, సద్దేసేవాడు… పైగా పెళ్ళిళ్ళకి కూడా , అబ్బాయి వయసింతుండాలీ, అమ్మాయివయసింతుండాలీ అనే  గొడవలు కూడా ఉండేవి కావు… ఏ గుళ్ళోనో దండలు మార్చుకున్నా, పెళ్ళైపోయినట్టే, సినిమాల్లో చూపిస్తూంటారు అలాగన్నమాట… అందుకే బాల్యవివాహాలు కూడా ఉండేవి, పిల్ల పెద్దమనిషయేలోపల పెళ్ళి చేయాలని కొందరికి సాంప్రదాయం కూడా ఉండేది… ఇంట్లో ఉండే, ఏ పెద్దావిడకో, పెద్దాయనకో  అస్వస్థత చేసినప్పుడు, కుటుంబంలో వరసైనవాళ్ళకి ముడిపెట్టిన సంఘటనలు కూడా ఉండేవి. ఏది ఏమైనా దేంట్లోనూ ఎలాటి  controversy  ఉండేది కాదు..

రోజులన్నీ ఒకేలా ఉండవుగా, మనకీ ఓ రాజ్యాంగం, దాంట్లో కొన్ని చట్టాలూ వగైరా వచ్చాయి. అందులో భాగంగా , ఆడపిల్ల పెళ్ళికి 18  సంవత్సరాలు నిండాలనీ, మగపిల్లాడికి 21 సంవత్సరాలు నిండాలనీ ఓ చట్టం చేసేసారు.  ఇవన్నీ 1978 లో చేసారు.  వాటితోపాటు  జనన మరణాలు, పెళ్ళిళ్ళ కీకూడా, ఓ సర్టిఫికేట్ ఉండాలని చట్టం చేసారు. అందుకే ఈరోజుల్లో ఇంట్లో ఎవరైనా, పుట్టినా, మరణించినా, పెళ్ళి  అయినా, ఆ ఊరి పంచాయితీ, మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఆఫీసుకి వెళ్ళి తేదీని రిజిస్టర్ చేసుకుని,  దాఖలాగా ఓ సర్టిఫికేట్ తీసుకోవడం ఓ ఆనవాయితీగా మారిపోయింది… దానికి సాయం , ఏదైనా స్కూల్లో చేరేటప్పుడో, ఉద్యోగంలో చేరేటప్పుడో   Birth Certificate  ని  compulsory  చేసేసారు.

అక్కడి వరకూ బాగానే ఉంది.  ఈ చట్టాలు రాకముందు పుట్టినవారి సంగతేమిటి మరి? పెళ్ళిళ్ళయిన వారి విషయమేమిటి? ఇదివరకటి కంటే, ఈరోజుల్లో విదేశాలకి వెళ్ళేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దానికి ఓ  Passport, Visa  కావాలే కదా.. ఆరోజుల్లో ఈ సర్టిఫికేట్లూ వగైరాలుండకపోబట్టి, కొన్ని కష్టాలు ఎదురవడం మొదలయింది. చట్టం వచ్చిన తరవాతివారికి పరవాలేదు. కానీ అంతకుముందువారి విషయంలోనే సమస్యంతా. ఆడపిల్లకి పెళ్ళవడంతోటే  మొట్టమొదట, ఆ పిల్ల ఇంటిపేరు మారుతుంది, మన సాంప్రదాయం ప్రకారం… బాగానే ఉంది, ఈ  Passport  తీసుకునేటప్పుడు, ఇంటిపేరు మార్పుకి కారణమైన పెళ్ళికి, ఓ  affidavit  సమర్పించేస్తే, పనైపోయేది… ఎప్పుడో నలభై ఏళ్ళపూర్వం జరిగిన పెళ్ళికి ఇప్పుడు సర్టిఫికేట్ తెమ్మంటే కష్టం కాదూ మరి?
  ఈరోజుల్లో విదేశాల్లో ఉండే పిల్లలదగ్గరకి వెళ్ళాల్సొచ్చినప్పుడు, కొన్ని దేశాలైతే, వీసా సంపాదించుకోవడానికి, ఆనాటి  Marriage Certificate  కూడా ఉండాలంటున్నారు… 

అదికూడా పెద్ద సమస్య కాదు, అవేవో ఫారాలు నింపి  passport  కోసం తయారుచేసిన  affidavit  జోడించి, కంప్యూటర్ లో  feed  చేయగానే, ఓ సర్టిఫికేట్   generate  అవుతుంది, మనకు  Visa  ఇచ్చేస్తారు. ఈ మధ్యన ఈ తతంగానికి నేను ప్రత్యక్ష సాక్షినయాను.. మా స్నేహితుడొకరు, కెనడా వెళ్ళే ప్రయత్నంలో,  Visa  కోసం , వారి పెళ్ళి సర్టిఫికేట్ కోసం , ఆఫీసుకెళ్ళి, సాక్షిసంతకాలూ, వగైరా అన్నీ సమర్పించిన తరువాత, ఆ  Certificate  ని  generate  చేసే సమయంలో, సమస్య ఎదురయింది.. ఆ కంప్యూటరు ముందుకు కదల్దే.. కారణం ఏమిటా అని వెదికితే తేలిందేమిటంటే, వీళ్ళ పెళ్ళయిన నాటికి అంటే 1982, కి, ఆవిడకి 18 ఏళ్ళునిండలేదూ, చట్టవిరుధ్ధమూ అని తేలింది… తేడా ఎంతా జస్ట్ 2 నెలలు. అయినా రూల్ రూలే.. ఆ కంప్యూటర్ లో   Programming  18 ఏళ్ళకి చేసారాయె… యాదాలాపంగా వేసిన జన్మతేదీ, 40 ఏళ్ళ తరువాత ఎన్ని సమస్యలు తెచ్చిందో?.. 

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
sarasadarahasam