Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pratapabhavalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సంబరాల సంక్రాంతి వైశిష్ట్యం - సుజాత.పి.వి.ఎల్

sankranti speciality
తెలుగు సంస్కృతికి బ్రహ్మ రథం

సంక్రాతి సంబరం, సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటి రోజున భోగి' , రెండోరోజు 'మకర సంక్రాతి', మూడోరోజు 'కనుమ పండుగ.'! మకర సంక్రాంతినే' తిల సంక్రమణం' , ' పంటల పండుగ' 'ఆమని పండుగ', అల్లుళ్ళ పండుగ', జానపదుల పండుగ' వంటి పేర్లతోనూ పిలుస్తారు. సస్య లక్ష్మిని వెంటబెట్టుకు వచ్చే పండుగ ఇది. సర్వ సాధారణంగా సంక్రాంతి జనవరి 13, 14, 15 తేదీలలోనే వస్తుంటుంది.

'సంక్రాతి' అంటేనే ఒక కొత్తదనానికి స్వాగతం పలికే శుభతరుణంగా పేర్కొనవచ్చు. ఏడాదికొకసారి వచ్చే మకర సంక్రాంతి తెలుగు వారి విశిష్ట పండుగ. అన్ని పండుగల మాదిరిగానే ఈ పండుగకూ కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆంగ్ల సంవత్సర ప్రారంభంలోనే వచ్చే మొట్ట మొదటి తెలుగు పండుగ ఈ సంక్రాంతి. మరణానికి సైతం పనికిరాని చేదు కాలంగా భావించే దక్షిణా యుగానికి స్వస్తి పలికి పుణ్య కాలమైన ఉత్తరాయణానికి ' మకర సంక్రాంతి' పండుగే స్వాగతం పలుకుతుంది. ఆ రోజునుంచే మంచి రోజులకు శ్రీకారం. సూర్యుడు పన్నెండు రాశులలో సంచరించే సంక్రమణాను బట్టి ఒక్కో నెల ఏర్పడుతుంది. ఇలా సూర్యుడు ప్రతి రాశిలో ప్రవేశించే ప్రతి సమయాన్ని సంక్రాంతి అనవచ్చు. కాకపోతే వాటిని 'మాస సంక్రాంతు'లంటారు. ధనుస్సు రాశి తర్వాత వచ్చే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమైనట్టుగా చెబుతారు.

సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు, యువతీ యువకులు గాలిపటాల సంబరాలు మొదలవుతాయి. పండుగకు ముందు, తర్వాత కొన్నాళ్ల పాటు ఆకాశంలో పగటి నక్షత్రాల్లా పతంగులు విహరిస్తుంటాయి. పతంగులు గాలిలో ఎగరవేసే ఆచారం చాలా కాలంగా వస్తోంది. ఒకప్పుడు ఇది గ్రామీణ క్రీడగానే ఉండేది. కానీ ఇప్పుడు నగరాల్లోనూ, పట్టణాల్లోనూ గాలిపటాల విహంగం అధికమయ్యాయి. గాలిపటాలు ఎగుర వెయ్యటానికి ఇప్పుడు పిల్లలతో పాటు పెద్దలూ ఆసక్తి చూపిస్తున్నారు.

మిగిలిన అన్ని పర్వదినాల మాటెలా వున్నా ఈ సంక్రాంతి తెలుగు ఆడపడుచుల పండుగలా అభివర్ణించవచ్చు. ధనుర్మాస ప్రారంభం నుండే తెలుగు వాకిళ్లు పండుగ సంబరాల్ని సంతరించుకుంటాయి. పసుపు, కుంకుమలు, మామిడాకులు, పూలదండలతో ఇంటి గుమ్మాలని శోభాయమానంగా అలంకరిస్తారు. ప్రతివారి వాకిళ్ళ ముంగిట ''ముత్యాల ముగ్గులు'' ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు ...బంతిపూల అలంకరణలు గంగిరెద్దుల ఆటపాటలు...హరిదాసు కీర్తనలతో' సంక్రాంతి లక్ష్మి' కి స్వాగతం పలుకుతారు.
మరిన్ని శీర్షికలు
sambarala sankranti