Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఎన్.టీ.ఆర్. కథానాయకుడు చిత్ర సమీక్ష

NTR kathanayakudu movie review

తారాగణం: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్‌, కళ్యాణ్‌రామ్‌, సుమంత్‌, రానా దగ్గుబాటి, రాజా దగ్గుబాటి, ప్రకాష్‌రాజ్‌, మురళీశర్మ, నిత్యామీనన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, క్రిష్‌, బుర్రా సాయిమాధవ్‌ తదితరులు 
సంగీతం: ఎం.ఎం.కీరవాణి 
సినిమాటోగ్రఫీ: వి.ఎస్‌. జ్ఞానశేఖర్‌ 
నిర్మాతలు: బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి 
దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి 
నిర్మాణం: ఎన్‌బీకే ఫిలిమ్స్‌ 
విడుదల తేదీ: 9 డిసెంబర్‌ 2019 

కుప్లంగా చెప్పాలంటే.. 
ఇది కల్పిత కథ కాదు, బయోపిక్‌. ఓ సామాన్యుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడెలా అయ్యాడు. సినీరంగం నుండి రాజకీయాల వైపు ఎలా అతని ఆలోచనలు మళ్లాయి. ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన సంఘటనల సమాహారమే ఈ సినిమా. స్వర్గీయ ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ, ఆయన సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ హరికృష్ణ పాత్రలో కళ్యాణ్‌రామ్‌.. ఇలా ఎన్టీఆర్‌ జీవితానికి సంబంధించి ముఖ్యమైన వ్యక్తులందరి పాత్రల్లో పలువురు ప్రముఖులు కనిపించారు. రాజకీయ పార్టీ ప్రకటనతో తొలి భాగం ముగుస్తుంది. 

మొత్తంగా చెప్పాలంటే.. 
తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవత చరిత్రను సినిమా తెరకెక్కించుకోవాలనుకోవడమే బాలకృష్ణ చేసిన అతిపెద్ద సాహసం. మహానటుడు ఎన్టీఆర్‌ పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నించిన బాలకృష్ణను అభినందించగలం తప్ప ఆ మహానటుడితో పోల్చడానికి వీల్లేదు. యంగ్‌ ఎన్టీఆర్‌ పాత్రలో కొంచెం ఇబ్బందికరంగా అనిపించిన బాలయ్య ఆ తర్వాత మాత్రం ఎన్టీఆర్‌ పాత్రలో ఒదిగిపోయారు. తెరపై ఆ మహనీయున్ని చూస్తున్నట్లే అనిపించిందంటే అందుకోసం బాలయ్య పడ్డ కష్టం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. 

సినిమా మొదలయ్యాక ఇది బసవతారకం బయోపిక్‌ అనిపిస్తుంది. బసవతారకం పాత్రకు పూర్తి న్యాయం చేసింది విద్యాబాలన్‌. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవర్నీ ఊహించుకోలేం. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్‌ నటించిన తీరు అద్భుతం. ఇద్దరికీ మధ్య సంభాషణలు ఎంత బాగుంటాయో, ఆయా సన్నివేశాల్లో సుమంత్‌ నటన కూడా అంత బాగా కుదిరింది. తండ్రి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్‌రామ్‌ చాలా బాగా చేశారు. అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. క్రిష్‌, సాయి మాధవ్‌ బుర్రా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. దగ్గుబాటి రాజా నటన మెప్పిస్తుంది. చివరిలో రానా, చంద్రబాబునాయుడి పాత్రలో తళుక్కున మెరుస్తాడు. 

అంకెల్లో చెప్పాలంటే.. 
ముందే చెప్పినట్లు ఇది జరిగిన కథ. జీవిత కథ. చాలా పెద్ద కథ. ఎంపిక చేసుకున్న సన్నివేశాలను మాత్రమే చూపించారు. తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. కేవలం కొన్ని సన్నివేశాలనే చూపించడం పూర్తి చరిత్ర తెలిసిన వారిని నిరాశపరుస్తుంది. కథనం బాగుంది. మాటలు కొన్ని చోట్ల బాగా పేలాయి. ఎడిటింగ్‌ బాగుంది. అయితే ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఒకే. పాటలు బాగున్నాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదు. సినిమాటో గ్రఫీ అద్భుతం. 

బసవతారకం అనారోగ్యం పాలవడం ఆమె తలపుల్లోంచి అసలు కథ రివీల్‌ అవడం ఇలా టేకాఫ్‌ బాగా కుదిరింది. స్వర్గీయ ఎన్టీఆర్‌ ఎదిగిన వైనం చాలా బాగా చూపించారు. అయితే బయోపిక్‌లో ఇంకో కోణం కూడా ఉటుంది. దాని జోలికి వెళ్లకపోవడం కొందరిని నిరాశపరుస్తోంది. అన్నీ కలగలిసి ఉన్నప్పుడే అది అసలు సిసలు బయోపిక్‌ అవుతుంది. సినిమా లెంగ్త్‌ ఎక్కువవడం అసలు సిసలు ఘట్టమైన రాజకీయాన్ని రెండో పార్ట్‌ కోసం వదిలేయడం ప్రేక్షకున్ని నిరాశకు గురి చేస్తుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు అతికినట్లుగా అనిపించవు. చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే, ఓ గొప్ప ప్రయత్నమైతే జరిగింది. దానికి ప్రశంసలూ దక్కుతున్నాయి. ఖచ్చితంగా ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన చరిత్ర 'ఎన్టీఆర్‌'. ఈ తరానికి ఆ మహనీయుడి ఘనతను చాటి చెప్పడం నిజంగా అద్భుతం. సంక్రాంతి సీజన్‌లో ఇలాంటి క్లీన్‌ సినిమా వసూళ్ల పంట పండించే అవకాశాలున్నాయి. 

3.25/5 
ఒక్క మాటలో చెప్పాలంటే 
అసలు సిసలు 'కథానాయకుడు'  

మరిన్ని సినిమా కబుర్లు
churaka