Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Gifts are multiple ways.

ఈ సంచికలో >> యువతరం >>

అగ్గిపెట్టె కొబ్బరిచిప్ప ఏదైనా ఓకే.!

The matchstick is a coconut

ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే ఏమొస్తుందిరా.? బయటికెళ్లి సాధించాలి ఏదైనా అని మన పెద్దవాళ్లు అనేవారు. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు నెట్టింట్లో కూర్చొని ఆలోచిస్తే చాలు ప్రపంచం మొత్తం చుట్టేసి రావచ్చు. అద్భుతాలు సాధించేయొచ్చు. ఆర్ధికంగా అనూహ్య స్థాయిలో నిలదొక్కుకోవచ్చు. అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా, ఆడపిల్లా కాదేదీ కవిత కనర్హం. కానీ ఇప్పుడు అగ్గిపెట్టే, అట్టపెట్టే, కొబ్బరి చిప్పా, ఆవు పిడకా.. కాదేదీ వ్యాపారానికనర్హం అనడం అతిశయోక్తి కాదు. మగవారు బయటికెళ్లి కష్టపడి డబ్బు సంపాదించాలి. ఆడవారు ఇంటి పట్టున ఉండి గరిటె తిప్పాలి. ఇదీ మన సాంప్రదాయం. కానీ ఆడవారు కూడా బయటికి రావడం ఎప్పుడో మొదలైంది. ఇక ఇప్పుడు బయటికెళ్లకుండానే మహిళలు ఇంట్లో కూర్చొనే అద్భుతాలు సృష్టించేస్తున్నారు. అంతా గూగుల్‌ మహాతల్లి దయ.

వయసుతో సంబంధం లేదు. కాటికి కాళ్లు చాపుకుని కూర్చున్న బామ్మ కూడా తన చేతి వంటలతో వేల సంఖ్యలో సంపాదన ఆర్జిస్తోంది. నిండా ఆరేళ్లైనా లేని పిల్లాడి బొమ్మలాటే సంపాదనకు మూల మార్గమవుతోంది. ఇలా ఒక్కటేమిటీ, ఆర్ట్‌, క్రాప్ట్‌, వంటా వార్పు, అందం, చందం ఇలా అనేక రకాలుగా నెట్టింట్లో కూర్చొని వ్యాపారం చేసేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో కొబ్బరి చిప్ప సేల్స్‌కి పెట్టాడు. దానికి ఆయన నిర్ణయించిన ధర 1400 రూపాయలు. ఆ కొబ్బరిచిప్పలో ఏముందో అంటూ దాన్ని కొనేందుకు జనం క్యూ కట్టారు. గతంలో కరక్కాయల బిజినెస్‌ సంచలనం సంగతి తెలిసిందే కదా. ఇలా ఇప్పుడు ఈ కొబ్బరి చిప్ప ట్రెండింగ్‌ అయిపోయింది.

గతేడాది కన్ను గీటిన పడుచమ్మాయి ప్రియా వారియర్‌ ఏ రేంజ్‌లో సంచలనమైందో తెలుసు కదా. ఇలా ఒక్కటేమిటి, ఏ చెత్త పడితే ఆ చెత్త సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అయిపోతోంది. అయితే ఏది ఎప్పుడు ఎలా ట్రెండింగ్‌ అవుతుందనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకు అంత ట్రెండింగ్‌ అవుతుందనేది కూడా మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది. సంక్రాంతి సీజన్‌ని క్యాష్‌ చేసుకోవడానికి నెట్టింటినే వేదికగా చేసుకున్నారు. భోగి పండ్లు, ఆవు పేడ, పిడకలు కూడా రేటు ఫిక్స్‌ చేసి ఎంచక్కా అమ్మేశారు. ఇలా ఒక్కటేమిటీ అందుకే కాదేదీ నెట్టింట్లో వ్యాపారానికనర్హం అనాల్సి వస్తోంది. అయితే నాణానికి బొమ్మా బొరుసు ఉన్నట్లే, ఏ పనిలోనైనా మంచీ చెడూ తప్పనిసరిగా ఉంటాయ్‌. ట్రెండింగ్‌ అయ్యింది కదా అన్నింటికీ వెంపర్లాడితే అపాయం తప్పదు. దేనికైనా కొన్ని లిమిట్స్‌ ఉంటాయి. అది గమనించుకుంటే ఏ పనిలోనైనా సక్సెస్‌ అవ్వొచ్చు. 

మరిన్ని యువతరం