Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue301/781/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)... "కాత్యాయని గారూ, మీకు నేను మొదట్లో చెప్పినట్టుగా నేననుకున్నది సాధించే వరకు నిద్రపోకపోవడం నా మనస్తత్వం. అలాంటి పట్టుదల స్వభావంతో ఇదిగో ఈ స్థాయికి చేరాను. నేను మిమ్మల్ని చూసిన మొదటి క్షణం నుంచి మిమ్మల్ని పొందడం మీదే నా ధ్యాస. దాని కోసం ఎంత కసరత్తు చేశానో మీకు తెలియదు. మీ ఆయనకు హెల్త్ ప్రాబ్లం ఉండకపోతే నా పని అంత సులువయ్యేది కాదు. ఎందుకంటే మీరు పెరిగిన పద్ధతి, మీ వ్యక్తిత్వం నాకు తెలుసు. ఏదేమైనా మీరొచ్చారు. నాకు పండగొచ్చింది." అన్నాడు.

ఆమె తలదించుకుని అతని మాటల్ని వింటోంది.

"మీరెళ్లి ఆ వార్డ్ రోబ్ లో ఉన్న చీర తీసుకుని స్నానం చేసిరండి"అన్నాడు.

ఆమె అన్యమనస్కంగా అది తీసుకుని స్నానం చేసి వచ్చింది.

"ఓహ్! కుందనపు బొమ్మ. చిదిమి దీపం పెట్టుకోవచ్చు లాంటి మాటల్ని కొంతమంది అలవోకగా అనేస్తుంటారు. వాళ్లకు మిమ్మల్ని చూపించాలి. అప్పుడు వాళ్లకు తెలుస్తుంది పోల్చడం కూడా ఖచ్చితంగా ఉండాలని. సరె, అలా కుర్చీలో కూర్చోండి" అని దూరంగా ఒక బ్యాగ్ లో ఉన్న ప్యాకెట్ తీసి అందులోంచి కొంత డబ్బు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, పూలు ఆమె చేతిలో పెట్టాడు.

‘కొంతకాలం వరకు మిమ్మల్ని పొందాలన్న తీవ్ర వాంఛలో ఉన్న నేను, నిజం మీకు తెలిసి మళ్లీ ఇదిగో ఈ రోజు వరకు మిమ్మల్ని కలవను’ అన్నాక నాలో ఆలోచన మొదలయ్యింది. విదేశాల్లో లాగా మనదేశంలో సెక్స్ అనేది ఆ నిముషానికి కోరిక తీర్చుకుని మరిచిపోయేది కాదు. అది మానసికంగా నాటుకుపోతుంది. ముఖ్యంగా ఆడవాళ్లలో. రావడం వచ్చారు గాని, మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. మీ మనసులో ఎంత భావసంచలనం కలుగుతోందో. కొన్ని క్షణాల నా తృప్తి కోసం మిమ్మల్ని యావజ్జీవిత జీవచ్ఛవాన్ని చేయలేను. మలిన పరచదలచుకోలేదు. మీ ఆయనకి ప్రాణం పోసిన నేను మీ ప్రాణం తీయలేను. మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఒక స్త్రీని గౌరవిస్తున్నాను. ఇవి తీసుకుని మీరు మీ ఇంటికి వెళ్లిపోండి. నేను మీకు మాటిచ్చినట్టుగా, ఈ ఊళ్లో ఉండను. ఇహ కనిపించను. హోటల్ పోర్టికోకు మీరు చేరగానే కారు సిద్ధంగా ఉంటుంది. డ్రైవర్ మిమ్మల్ని ఎక్కడ దింపమంటే అక్కడ దింపేస్తాడు. వెళ్లిరండి" అన్నాడు.

ఆమెకు మనసులోఆశ్చర్యంతో పాటు మరెన్నో భావాలు కలగాపులగంగా కలిగాయి. ఆమె వెంటనే లేచి ఏం చేయాలో తెలీక అతని కాళ్లపై పడింది. అతను ఆమెని పైకి లేపి తలుపు దగ్గరగా తీసుకెళ్లి ఆమెని బైటకి పంపి తలుపు వేశాడు.

కాత్యాయని నడుచుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్లి దాన్లో కిందకు చేరి అక్కడ నుంచి పోర్టికోకు రాగానే ఆమె కోసం కారు సిద్ధంగా ఉంది. ఆమె కార్ ఎక్కంగానే బయలుదేరింది.

దారిలో పెద్దమ్మ తల్లి గుడి కనబడంగానే డ్రైవర్ ను కార్ ఆపమని చెప్పి అతను ఆపాక డ్రైవర్తో ‘ఓ అరగంటలో వస్తాన’ని చెప్పి గుడి లోకి వెళ్లింది.

గుడిలోకి వెళ్లి అక్కడి ఆఫీసులో మాట్లాడి ఒక రూం లోకెళ్లి తలారా స్నానం చేసి మానసిక మాలిన్యాన్ని వదుల్చుకుని, అమ్మవారి ముందుకొచ్చి అక్కడి కుంకం ధరించి మనోహర్ కు సంబంధించిన ఆలోచనల మనో మాలిన్యాన్ని వదిలించుకుని తన జీవితం పెడదోవ పట్టకుండా కాపాడినందుకు ఆ తల్లికి కృతజ్ఞతలు చెప్పి, కారెక్కి తమ ఇంటికి రెండు సందుల అవతల కారు దిగి ఇంట్లోకెళ్లింది.
అప్పటికీ కమలాకర్ రాలేదు.

కాత్యాయనికి ఎందుకో చాలా ఉత్సాహంగా అనిపించింది. మనసు మీంచి టన్నుల బరువు తొలగిపోయిన అనుభూతి. గబ గబ ఇంట్లో పనులన్నీ పూర్తిచేసి కమలాకర్ వచ్చేసరికి అందంగా ముస్తాబై ఎదురు చూడసాగింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana