Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue305/790/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)..... హైదరాబాద్...

ఉప్పల్ దగ్గర మారుమూల ప్రాంతం. అక్కడక్కడా ఇప్పుడిప్పుడే మొలుస్తున్న మొక్కల్లా కడుతున్న కట్టడాలు. వాటి మధ్యలో మదగజంలా ఎత్తుగా మూడంతస్థుల భవనం ఉంది. చూడచక్కగా కనిపిస్తోంది.

భవనాన్ని రంగురంగుల జెండాలతో అలంకరించారు. బిల్డింగ్ ముందర పెద్దపెద్ద అక్షరాలతో బోర్డురాసి ఉంది. అమ్మానాన్న అనాధ శరణాలయం అని బోర్డు రాసి ఉంది. ఆ భవనం ముందు ద్వజస్థంభంలా పెద్ద రాట పాతి ఉంది. ఆ రాటకి చిట్ట చివర జాతీయ జెండా కట్టి ఉంది. అప్పుడే ప్రార్ధన ముగించి జెండా ఆవిష్కరించి పిల్లలు ఆ భవనంలోకి వెళ్తున్నారు.

జెండావందనం చేసిన రాము సోములు ఉత్సాహంగా తమముందున్న పాతిక మంది పిల్లలని ఒక్కొక్కర్ని వరుసగా దగ్గరుండి గదుల్లోకి పంపిస్తున్నారు.

అదే సమయంలో అక్కడకు రెండు పోలీస్ జీపులు వచ్చి ఆగాయి.అందులో నుండి ఏసీపీ రేంక్ అధికారి దిగాడు. ఆయన వెనక ఎస్సై, సీఇ లు వారితోబాటు ఆరుగురు పోలీసులు బిలబిలమంటూ దిగారు.

ఆ భవనం ముందు పోలీసు జీపులు వచ్చి ఆగడంతోనే రామూసోమూలు భయంతో లోపలకు పరుగులు పెట్టి మహాశ్వేతను వెంటబెట్టుకు వచ్చారు.

యలమంచిలి గ్రూప్ ఆఫ్ చైర్ పర్సన్ మహాశ్వేతాదేవి హుందాగా వచ్చి మెట్లమీద ఠీవిగా నిలబడింది. సాదాసీదాగా సాధారణ స్త్రీలా తయారైనా అందంగా అందంగా నాజూగ్గా మారువేషంలో ఉన్న మహారాణిలా కనిపిస్తోంది.

" మీరు యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్ పర్సన్ మహాశ్వేతాదేవిగారే కదా మేడం..మీకు ప్రమాదం ఉందని ఆంధ్రాపోలీసుల నుండి మాకు సమాచారం అందింది. మీకు రక్షణ  ఏర్పాటు చేయవలసిందిగా తెలంగాణా ప్రభుత్వం ఆర్డర్. " ఏసీపీ స్థాయి అధికారి ఆమెని విష్ చేసి చెప్పాడు.

" నేనిక్కడున్న విషయం మీకెలా తెలిసింది సార్..?" ఆశ్చర్యంగా అడిగింది మహాశ్వేత.

" మాకు తెలిసిన విషయం మీకు రక్షణ కల్పించమని మాత్రమే మేడం." అంటూనే తన సిబ్బంది కేసి చూస్తూ " మీ ఆరుగురు ఇక్కడే ఉండండి.. ఎస్సై గారూ మీరు కూడా.మనకి ఫర్ దర్ ఆర్డర్స్ వచ్చేవరకు మేడం మహాశ్వేతాదేవి గారి రక్షణ మనదే. బీ కేర్ ఫుల్." అంటూ ఏసీపీ తను వచ్చిన జీపు ఎక్కి కూర్చున్నాడు. ఆయన వెంటనే సీఐ కూడా వెళ్ళి జీపులో ఎక్కి కూర్చున్నాడు. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది పోలీసు జీప్.

పోలీసులు ఆరుగురు బిల్డింగ్ నలుమూలలా కాపలా కాస్తూ నిలబడ్డారు. ఎస్సై దూరంగా వెళ్ళి మూడంతస్థుల భవనాన్ని పరిశీలిస్తూ కూర్చున్నాడు.

అదే సమయంలో

రెండు స్క్కార్పియోలు మట్టిరోడ్డులో దుమ్మురేపుకుంటూ వచ్చి అక్కడ ఆగాయి. ఒక స్కార్పియోలో నల్లదుస్తుల్లో ఉన్న బౌన్సర్లను చూస్తూనే పోలీసులు అలర్ట్ అయ్యారు.

పోలీసులతో మాట్లాడి తిరిగి లోపలికి వెళ్ళబోతున్న మహాశ్వేత కూడా స్కార్పియోలను చూస్తూనే అనుమానంగా ఆగి గుమ్మం దగ్గర నిలబడి చూసింది.

స్కార్పియోలు దుమ్మురేపుకుంటూ బిల్డింగ్ ముందు ఆగగానే ముందు స్కార్పియోలో నుండి బిలబిలమంటూ ఆరుగురు బౌన్సర్ లు గెంతుతూ దిగారు. చకచకా ఆరుగురు వలయంలా నిలబడి చేతులు రెండూ వెనుక పెట్టుకుని కాళ్ళు దూరంగా పెట్టుకుని స్టడీగా నిలబడ్డారు.
రెండో స్కార్పియోలో నుండి దిగుతున్న భర్త హరిశ్చంద్ర ప్రసాద్ ని, అతని వెంట చిన్న లెటర్ పేడ్ పట్టుకుని దిగుతున్న వ్యక్తిని చూస్తూనే ఒక్కసారిగా వ్యక్తిని చూస్తూనే ఒక్కసారే సిగ్గుతో ముడుచుకుపోయింది మహాశ్వేత.

వారిద్దరితోబాటు మేనత్త శోభాదేవి, మేనమామ, ఆఫీస్ అసిస్టెంట్ మనోరమతోబాటు ముసలి వేషంలో ఉన్న ఎవరో కొత్తవ్యక్తి కూడా దిగడం చూసి ఆశ్చర్యపోయింది.

ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడే వారితో కలిసాడు ఎస్సై అక్బర్ ఖాన్. అక్కడే అందరూ కలుసుకున్నారు. శమ్షాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే వారికోసం యలమంచిలి గ్రూప్ హాస్పిటల్ నుండి రెండు స్కార్పియోలు వచ్చి సిద్ధంగా ఉన్నాయి.

మనోరమ మేనమామగా పరిచయమైన ఎస్సై అక్బర్ ఖాన్ కూడా స్కార్పియోలో డ్రాప్ చేస్తాము రమ్మని మహాశ్వేత భర్త హరిశ్చంద్రప్రసాద్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించాడు.

' ఉప్పల్ ' వెళ్ళాలని ఎస్సై అక్బర్ ఖాన్ చెప్పడంతో మేమూ ఉప్పల్ వెళ్తున్నామని తమతో తీసుకు వచ్చారు.

భర్త వెనుక వచ్చిన అతని పి.ఏ ని చూస్తూనే మహాశ్వేతాదేవి ఏదో తెలియని అయోమయానికి గురై నిలబడిపోయింది.

స్కార్పియోలొ దిగిన శోభాదేవి పరుగున వెళ్ళి అప్ప్యాయంగా మహాశ్వేతని పట్టుకుని వలవల ఏడ్చేసింది.

ఆరుగురు బౌన్సర్లు చుట్టూ యమకింకరుల్లా నిలబడ్డారు. పోలీసులు కూడా అప్రమత్తమై మహా శ్వేత చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు.
ముసలివేషంలో ఉన్న ఎస్సై అక్బర్ ఖాన్ మహాశ్వేత భర్త, అతని పి.ఏ.ల మెనుక ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో అప్రమత్తంగా నిలబడ్డాడు.

ఎదురుగా రాక్షసుల్లా నిలబడ్డ నల్లదుస్తుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డుల్ని చూసి రామూసోమూలు ఇద్దరూ భయంగా మహాశ్వేత పక్కకి వచ్చి నిలబడ్డారు. క్షణాలు యుగాల్లా దొర్లుతున్నాయి.

ఎదురుగా నిలబడ్డ వాళ్ళందర్నీ ఒక్కొక్కర్ని పరీక్షగా చూస్తూ హరిశ్చంద్రప్రసాద్ ప్రక్కనే నిలబడ్డ అతని పి.ఏ. ని చూస్తూనే రామూసోమూ ఉలిక్కిపడ్డారు.

" అమ్మగారూ....అమ్మగారూ...మా శ్యాం ని దత్తత తీసుకున్నది అతనే...." అంటూ గట్టిగా అరిచారిద్దరూ. ఆ పిల్లలిద్దరి మాటలు వింటూనే మహాశ్వేత ఆశ్చర్యంగా ఆ వ్యక్తికేసి చూసింది.తండ్రి చనిపోయిన ఆరునెలలుగా ఏ వ్యక్తికి తారసపడకూడదని దాకుంటూ తిరిగిందో....ఏ వ్యక్తి ముందు దోషిగా నిలబడాల్సివచ్చిందని ఇన్నాళ్ళూ భయపడిందో అతడే ఇప్పుడు తన కళ్ళముందున్నాడు. తన కొడుకుని దత్తత పేరుతో దగ్గర చేసుకున్నాడు. అని మనసులో అనుకుంటూనే ఇక ఉపేక్షించలేకపోయింది. ఉన్నట్టుండి ఏడుస్తూ పరుగుపరుగున వెళ్ళింది మహాశ్వేత.

" మదన్! నన్ను క్షమించు...నిన్ను మోసం చేసాను...నాన్న మాటకి ఎదురు చెప్పలేక...నిన్ను దూరం చేసుకున్నాను."
అంటూ భోరున ఏడుస్తూ పి.ఏ. దగ్గరకు వెళ్ళి కాళ్ళమీద పడింది. అందరూ ఒక్కసారే అదిరిపడి అవాక్కయిపోయారు. ఆ హఠాత్పరిణామానికి ఎవరికీ నోట్మాట రాలేదు. ఇన్నాళ్ళు సాధారణ ఉద్యోగిలా...చైర్మన్ పర్సనల్ అసిస్టంట్ లా పని చేసింది మహాశ్వేతాదేవి ప్రియుడా?
ఎస్సై అక్బర్ ఖాన్ కి కూడా తల గిర్రున తిరిగిపోయింది.

అంతవరకు వినయంగా...అమాయకుడిలా నటిస్తూ నిలబడ్డ మదన్ ఒక్కసారే ఉగ్రుడై మృగంలా టక్కున చేతిలో ఉన్న పేపర్ పేడ్ విసిరేసి మహాశ్వేతాదేవి కంఠం పట్టుకున్నాడు. అదిచూసి అందరూ ఒక్కసారే అదిరిపడ్డారు. ఒక్క క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. శిలల్లా చూస్తూ ఉండిపోయారు.

" నిన్ను క్షమించాలా? రాక్షసీ...నన్ను పిచ్చోడ్ని చేసి పారిపోయినదానివి...నిన్ను క్షమించాలా?" అంటూ పిచ్చిపిచ్చిగా ఏదేదో మాట్లాడుతూ మహాశ్వేతాదేవి మెడచుట్టూ చెయ్యేసి పైకెత్తి టక్కున జేబులోనుండి పిస్టోల్ తీసాడు పి.ఏ.మదన్. స్కార్పియోలో డ్రైవర్ ప్రక్కన కూర్చున్నప్పుడే రహస్యంగా డ్రైవర్ దగ్గర మదన్ గన్ తీసుకోవడం ఎవరూ గమనించలేదు.

అతను అలా మహాశ్వేత మీద దాడి చేసే సరికి పోలీసులు అందరూ ఉలిక్కిపడి గబాలున ఎదురుతిరగబోయారు.. అప్పటికే సెక్యూరిటీ సిబ్బందిలా వచ్చిన బౌన్సర్లు ఆరుగురూ అక్కడున్న శోభాదేవిని, మనోరమను, శోభాదేవి భర్తను మహాశ్వేత భర్తను రౌండప్ చేసి కత్తులు పట్టుకొని నిలబడేసరికి పోలీసులకి ఏంచేయ్యాలో పాలుపోలేదు. ఎలా ముందుకెళ్ళాలో అర్థం కాలేదు.

పి.ఏ. మదన్ వెనుకే ముసలివేషంలో ఉన్న ఎస్సై అక్బర్ ఖాన్ పరిస్థితంతా చురుగ్గా గమనిస్తూనే ఉన్నాడు. బౌన్సర్లు కూడా ముసలాడని అక్బర్ ఖాన్ ని పట్టించుకోలేదు. అంతే....పి.ఏ. మదన్ వెనకే ఉన్న ఎస్సై అక్బర్ ఖాన్ ఒక్క ఉదుటన మదన్ మెడ పట్టుకుని అతని చేతిలో ఉన్న గన్ గబాలున లాక్కుని తిరిగి మదన్ కే గురిపెట్టి స్టడీగా నిలబడ్డాడు. " ఖబడ్దార్....మీరంతా వాళ్ళకి దూరంగా వెళ్ళండి...లేదా మీ బాస్ తల ముక్కలైపోతుంది..." అంటూ పిస్టల్ పి.ఏ. మదన్ తలకి గురిపెట్టి తలకి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గురిపెట్టి గట్టిగా అరిచాడు.
ముసలివేషంలో ఉన్నది పోలీసు ఆఫీసరేనని తెలివిగా శతృవుని అదుపులోకి తీసుకున్నాడని గ్రహించగానే పోలీసులందరూ బౌన్సర్లని పట్టి బంధించారు.

పోలీసు కంట్రోల్ రూం కి కాల్ చెయ్యగానే పెద్ద వ్యాన్ లో పోలీసులు క్షణాల్లో అక్కడకు వస్తూనే పి.ఏ. మదన్, అతనికి సహకరించిన బౌన్సర్లని బంధించి వ్యాన్ ఎక్కించారు...

పి.ఏ. గా ఉన్న మదన్ నిజంగానే మహాశ్వేత ప్రియుడా? అతని అరెస్టు ఎలాంటి రహస్యాలని చేధించబోతోంది????వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా వెయిట్ చెయ్యండి.....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్