Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు! - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

సమస్య!

నిద్రలేచింది మొదలు మనను ఏదో సమస్య చుట్టు ముడుతుంది(అఫ్కోర్స్ కొంతమందికి నిద్ర పట్టకపోవడం కూడా ఒక సమస్య అనుకోండి). కొన్ని చిన్నవైతే మరికొన్ని జీవితాలని అల్లకల్లోలం చేసేవి. ఏదేమైన పుట్టింది మొదలు గిట్టే వరకు, సమస్య మనని అంటి పెట్టుకుని ఉంటుందన్నది వాస్తవం.

సమస్యని చూసే విధానం (దృక్పథం)ముఖ్యమైనది. కొంతమంది చిన్న సమస్యను భూతద్దంలో చూసి బెంబేలు పడిపోతారు. మరికొంతమంది మిన్ను విరిగి మీద పడుతున్నా, తొణకరు, బెణకరు.

ఎవరైనా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆత్మ హత్య చేసుకున్న ఉదంతాలు పేపర్లలో చూసినప్పుడు, ’అరె, అన్నీ ఉన్న వాళ్లు ఆత్మహత్య చేసుకోవలసిన అగత్యం ఎందుకొచ్చిందో’ అనుకుంటాం. అయితే అవతలి వాళ్లు ఆ సమస్యను ఎలా తీసుకున్నారో, ఎంతలా మదనపడి పోయారో మాత్రం మనకు తెలీదు. చావెన్నటికీ, దేనికీ పరిష్కారం కాదన్న విషయం వాళ్లకు మాత్రం తెలీదూ, తెలుసు అయినా ఒక బలహీన క్షణంలో, క్షణికావేశంలో అలాంటి నిర్ణయం తీసుకుంటారు. బలహీనతను అధిగమించాలి.

మనమో విషయం గ్రహించాలి. మన చుట్టూ జరిగేవన్నీ మానసిక సాంత్వన కలిగించేవే. పూజలు, పునస్కారాలు, సజ్జన సాంగత్యం, పురాణ ప్రవచణాలు వినడం, దేవాలయ సందర్శనలు, అన్న, అవయవదానాలు, శుభాశుభకార్యక్రమాలు ఇత్యాదివి. మనసు ఎప్పుడు బలం పుంజుకుంటుందో అప్పుడే మనిషి శక్తివంతుడవుతాడు.

మనలో చాలామంది శరీరానికిచ్చే విలువను మనసుకు ఇవ్వరు. శరీరాన్నిఎలాగైతే వ్యాయామాలతో దృఢంగా ఉంచుకుంటారో, ముస్తాబు చేసుకుంటారో, మనసును కూడా అలాగే బలంగా చేసుకోవాలి. నిజానికి శరీరం కన్న మనసే ముఖ్యమైనదన్నది గ్రహింపుకు రావాలి. దురదృష్టవశాత్తు అతిముఖ్యమైన మనసు విషయంలో అందరం నిర్లక్ష్యంగా ఉంటాం. శారీరక లోపం ఏర్పడితే, బయటకు కనిపిస్తుంది, సరి చేసుకుంటాం. మానసిక బలహీనత ఏర్పడితే, అది ఆ వ్యక్తికే తెలుస్తుంది. తగిన చర్యలు తీసుకుని సరి చేసుకోవలసింది అతడే! కొంతమంది తమకు దగ్గరైన వాళ్లతో బాధను పంచుకుని ఊరట చెందుతారు. కాని చాలామంది మాత్రం దిక్కుతోచని అయోమయ పరిస్థితిలో ఉంటారన్నది వాస్తవం.

దురదృష్టవశాత్తు మానసిక వైద్యానికి అవసరమయ్యే కౌన్సిలింగ్ సెంటర్లు మన దగ్గర లేవు. వేళ్ల మీద లెక్కపెట్టుకునేన్ని ఉన్నా, వెళ్లడానికి సంకోచం. జంకు. ఎందుకంటే ఎదుటివాళ్లు పిచ్చివాళ్లనుకుంటారేమో నన్న అపోహ.

మనందరం తెలుసుకోవలసినదేమిటంటే, సమస్యలేని మనిషంటూ ఉండడు. ఏదో సమస్యలో కొట్టుమిట్టాడుతుంటాడు. మన చుట్టూ నవ్వుతూ, తుళ్లుతూ కనిపించే ప్రపంచం నిజం కాదు. లోపలి లోతుల్లోకి చూస్తే అసలు విషయం అవగతమవుతుంది. అందుచేత మనసు విషయంలో అప్రమత్తంగా ఉంటూ, సరైన దిశానిర్దేశం చేయగలిగితే సమస్యలన్నీ దూదిపింజలే!

మనిషిగా పుట్టడం ఓ వరం అన్నది నిజం కావాలంటే, మనసుదే ప్రధాన పాత్రన్నది తెలుసుకోవాలి. ఆ మనసును బలోపేతం చేసుకోవాలి. దట్సాల్!!!

మరిన్ని శీర్షికలు
Kothimeera Pachhadi