Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> నమ్మకం

nammakam

అబ్బబ..! ఎంతసేపు...త్వరగా రా..నాకు ఆఫీస్ కి లేటవుతుంది...'' విసుగ్గా అన్నాడు కౌశిక్.

''వచ్చేస్తున్నాను...ఒక్క నిమిషం...''అంటూ హడావిడిగా పూలబుట్ట కొబ్బరికాయలు చేతపట్టుకుని బయటికొచ్చింది విశాలి.విశాలికి భక్తి ఎక్కువ. ఆ రోజు శ్రావణ శుక్రవారం కావడం మూలాన పొద్దున్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసి ...ఇంట్లో తులసి కోటకు పూజ చేసి..ఉపవాసంతో గుడికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ..అందుకే ముందురోజు రాత్రి భర్త కౌశిక్ ని అడిగింది. "రేపు నన్ను గుడి దగ్గర డ్రాప్ చేస్తారా" అని. సరేలే అన్నట్టు తలూపాడు కౌశిక్ .

కౌశిక్ సాఫ్ట్ వెర్ ఇంజనీర్ ... విశాలితో పెళ్ళైయ్యి మూడేళ్లయింది. ఎంతో అన్యోన్యం గానే ఉంటారు కానీ. ఒక్క దేవుడి విషయం లోనే చిన్న చిన్న అలకలు. విశాలికి మడి, ఆచారం, భక్తి జాస్తి. కౌశిక్ ఇందుకు పూర్తి వ్యతిరేకం.

''నేను గుడికి రానని తెలిసి కూడా నన్ను డ్రాప్ చేయమమంటావేంటీ''? బైక్ స్టార్ట్ చేస్తూ కోట్ల ఆస్తి నష్టమొచ్చినవాడిలా ఫేస్ పెట్టి అన్నాడు కౌశిక్.

''అయ్యో..! అదేంలేదు గుళ్లో పూజచేయించి మీ చేత్తో అక్షింతలు వేయించుకుందామని.'' అంది వైశాలి గోముగా.

"డ్రాప్‌చేసి వెళ్ళిపోతాను. నీ పూజలూ పునస్కారాలు అయ్యి నీకు అక్షంతలు వేసేంత టైమ్‌లేదు నాకు. ఆ కార్యక్రమాలన్నీ సాయంత్రం నేను ఇంటికొచ్చినాక పెట్టుకో" అన్నాడు కౌశిక్‌ సరే అన్నట్టు విశాలి బుధ్ధిగా తలూపడం సైడ్‌మిర్రర్‌లో చూసి చిరునవ్వు నవుతూ..

"నన్నెప్పుడు గుళ్ళోకి రమ్మని బలవంతం చేయవు. కొంచెం మంచి దానివే. మెచ్చుకోలుగా అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ.

*        *

అప్పటికే గుడి ముందు జనం 'క్యూ ' లో దాదాపు వెయ్యిమందికి పైనే ఉన్నారు. ఎప్పుడొచ్చి నిలబడ్డారో కానీ ఒక్కొక్కరి మొహాలు తోటకూర కాడల్లా వాడిపోయి వున్నాయి. కాళ్ళకి చెప్పులు లేకుండా ఎర్రటి ఎండని కూడా లెఖ్ఖ చేయకుండా 'భక్తి ' అనే బోర్డు ముఖానికి తగిలించుకుని గుడికి రెండు కిలోమీటర్ల దూరం వరకు లైన్ లో నిలబడి ఉన్నారు. కౌశిక్‌కి వాళ్ళంతా ఫూల్స్ లా అనిపించారు. వాళ్లందరినీ చూసి వెటకారంగా నవ్వుకున్నాడు. అలా నిలబడ్డవాళ్ళ ఓపికని చూస్తే కాస్త ఈర్ష్యగా కూడా అనిపించింది. జాలి కూడా వేసింది కానీ ఎటువంటి డివైన్ ఫీలింగ్ మాత్రం కలగలేదు! ఎందుకంటె అందులో ఖచ్చితంగా నాకంటే తెలివైన వాళ్ళుండచ్చు, బిజినెస్ మాగ్నెట్స్ ఉండొచ్చు, బిజీ పీపుల్ అయివుండొచ్చు ప్రతి నిమిషం వాళ్లకి ఇంపార్టెంట్ అయుండొచ్చు. వాళ్ళంతా ఇలా టైం వేస్ట్ చేసుకోవడం నచ్చలేదు "స్టుపిడ్స్‌''అనుకున్నాడు మనసులో.విశాలిని గుడి దగ్గర దింపేసి బైక్ ని స్పీడ్ గా టర్న్ చేసుకుని ఆఫీస్ కి బయలుదేరాడు కౌశిక్.

"అసలే లేట్, ఈ ట్రాఫిక్ పైగా ఈ వెధవ సిగ్నల్స్‌ఛీ.." అనుకుంటూ స్పీడ్‌గా ఒక సిగ్నల్ జంప్ చేశాడు కౌశిక్. అంతలో అటుగా సైకిల్ పై ఎదురొస్తున్న వినయ్ కౌశిక్ బైక్ కి అడ్డొచ్చాడు. కౌశిక్ సడన్ బ్రేక్ వేసినప్పటికీ వినయ్ బాలెన్స్‌చేసుకోలేక స్కిడ్‌అయ్యి పడిపోయాడు.
ఒక్క సెకన్‌పాటు కౌశిక్‌మెదడు మొద్దుబారిపోయింది. అంతవేగంలో ఆ కుర్రాడిని గుద్దుంటే.... తలుచుకుంటేనే అతని ఒళ్ళు జలదరించింది.
వెనకనుంచి హారన్ సౌండ్తో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు కౌశిక్‌.

''ఏంట్రా సైకిల్ నడపడం రానివాడివి ఇలా ట్రాఫిక్ ఉన్న చోటుకి ఎందుకొచ్చావ్"? అంటూ గట్టిగా ఆ కుర్రాడిపై అరిచాడు కౌశిక్‌.
జనాలు తనేమన్నా అంటారేమోనని ముందు జాగ్రత్తతో తెలివిగా అలా అరిచేశాడు. ఇప్పుడు జనాలు గుమి గూడతారు, వాగ్వివాదం.... ఇలా చాలా ఊహించాడు. కానీ అలా ఏమీ జరగలేదు. ఎవరి బిజీలో వాళ్ళున్నారు. ఆ కుర్రాడు లేచి నిలబడి ఒంటికి అంటిన దుమ్ము దులుపుకుని, సైకిల్‌లేపి తోసుకుంటూ కౌశిక్‌దగ్గరికి వచ్చి "సారీ అంకుల్‌" అని చెప్పి మోచేతికి తగిలిన దెబ్బని చూసుకుంటూ వెళ్ళిపోయాడు. తన తప్పు లేకపోయినా ఏగొడవా చెయ్యకుండా సారీ చెప్పి వెళ్ళీపోతున్న నిండా పదిహేనేళ్ళు లేని ఆ పిల్లాడి సంస్కారానికి ఆశ్చర్యం వేసింది కౌశిక్‌కి. ఆ కుర్రాడిని ఆపి "తప్పు నీది కాదు బాబు నాదే ఐయామ్‌సారీ." అని చెప్పమని అతని అంతరాత్మ ఘోషించింది కానీ అహంకారం దాని నోరు నొక్కేసింది.

'ఏంటి ఇలా జరిగింది ఇవాళ... వాడికేమన్నా జరిగుంటే అపరాధ భావంతో మనసు కుంచించుకుపోయింది. ఎంత ప్రమాదం తప్పింది ఆలోచిస్తేనే ఏదోలా అనిపిస్తుంది. ఆలశ్యానికి కారణమైన భార్యమీద, దేవుడిమీద కూడా కోపం వచ్చింది. అన్యమనస్కం గానే బైక్‌స్టార్ట్‌చేసి ముందుకి కదిలాడు కౌశిక్.

కౌశిక్‌కి భార్యంటే చాలా ఇష్టం. ఉద్యోగం అంటే పంచ ప్రాణాలు. ఈ రెంటికన్నా అతని అంహంకారం అంటే అతనికి ఎక్కువ ఇష్టం. అతనిలో ఉన్న మంచితనం, మానవత్వాలని ఆ అహంకారం కప్పేస్తూ ఉంటుంది. ఆఫీస్ కి వచ్చేశాకకూడా చిరునవ్వుతో సారీ చెప్పి వెళ్ళిపోయిన ఆ పిల్లాడి ముఖమే పదే పదే కళ్ళ ముందు కదలాడుతోంది. వచ్చిందే లేటు అంతలోనే రెండు మీటింగ్స్ కంప్లీట్ చేసి అలా సీట్లో కూర్చున్నాడో లేదో లంచ్ బ్రేక్ అందరూ రౌండ్ టేబుల్ సమావేశమయ్యారు.

ఇంట్లో వారి వారి పెళ్ళాల పూజలు పునస్కారాలు, శ్రావణమాసం చీరలు, నగలు వగైరా... మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు కౌశిక్‌కి చిరాకుగా అనిపించినాయి.

లంచ్‌అయిపోయినాక తన కాబిన్‌లోకి వచ్చి పనిలో నిమగ్నమైపోయాడు కౌశిక్‌. ఇంతలో అటెండర్ ఆగయ్య ఆఘమేఘాలమీద వచ్చి. కౌశిక్ ముందు నిలబడి ..''సార్ !..నాకు నాలుగు రోజులు లీవ్ కావాలి." అతివినయాన్ని అభినయిస్తూ అడిగాడు.

'ఎందుకు'' అడిగాడు కౌశిక్‌గొంతులో కోపాన్ని మిళితం చేస్తూ.

''షిర్డీ వెళ్ళాలి సర్..''

''అదేంటి పోయిన్నెలేగా వెళ్ళావ్..?''

అవును సర్ కానీ పోయిన సారి రెండ్రోజులే లీవ్ తీసుకోవడం మూలాన కేవలం బాబా నే చూసొచ్చాను. అక్కడి దాకా వెళ్లి చుట్టూ వున్న గుళ్ళు., ఔరంగాబాద్ , అజంతా ఎల్లోరా గుహలు ముఖ్యంగా శని సింగణాపూర్ చూడకుండా ఉండకూడదంటా. అం..దు..కె..మళ్ళీ వెళదామని.... చెప్పుకుంటూ పోతున్నాడు ఆగయ్య.

''ఒక పని చెయ్యి ఆగయ్యా..! వాలెంటరీ రిటైర్‌మెంట్‌తీసుకుని, వచ్చినడబ్బుతో నీకు నచ్చిన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి శేషజీవితాన్ని కృష్ణా రామా అంటూ గడిపై" అన్నాడు కౌశిక్‌వెటకారంగా.

ఆగయ్య ఏంమాట్లాడాలో తెలియక తలవంచుకుని నిలబడ్డాడు.

"ఇంకెఫ్ఫుడూ ఇటువంటీ సిల్లీ రీజన్స్‌తో నాదగ్గరికి వెచ్చి లీవ్‌ఆడక్కు. వెళ్ళు వెళ్ళి పని చూసుకో" అన్నాడు.

ఆగయ్య మారు మాట్లాడకుంటా తలవంచుకుని అక్కడినుండి వెళ్ళిపోయాడు. కౌశిక్‌పనిలో నిమగ్నమైపోయాడు.

*    *

సుమారు నాలుగున్నర గంటలు ఎండలో, క్యూలో నిలబడి తనవంతు రాగానే పూజ ముగించుకుని ఇంటిదారి పట్టింది విశాలి. హాండ్‌బాగ్‌లోనుండి ఫోన్‌తీసి టైమ్‌చూసుకుంది. మూడు కావొస్తొంది. ఏదైనా ఆటో వస్తే ఆపి ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటూ నడుస్తూ ముందుకు వెళుతోంది. ఎండ తీవ్రత వల్ల, పొద్దుటినుండి ఉపవాసం ఉండటం వల్ల కళ్ళు తిరుగుతున్నాయి. మరో నాలుగు అడుగులు ముందుకి వెళ్ళగానే కళ్ళు చీకట్లు కమ్మేసి ఒళ్ళు తూలింది. వేగంగా వస్తున్న కారు ఆమెకి డాషిచ్చి ఆగకుండా వెళ్ళిపోయింది. ఏం జరిగిందో ఆమెకి తెలిసేలోపు ఆమె ఐదడుగులు గాలిలోకి ఎగిరి క్రిందపడడం, తల బలంగా ఫుట్‌పాత్‌కి తగలడం ఆమె స్పృహ కోల్పోవడం అన్నీ జరిగిపోయినాయి.

విశాలిని కారు గుద్దడం, ఆమె స్పృహ తప్పి పడిపోవడం చూసిన వినయ్‌వేగంగా అక్కడికి పరిగెత్తుకువచ్చాడు. అతనితోపాటు మరికొంతమంది గుమిగూడారు. వినయ్‌విశాలి పోన్‌లో నుండి క్రిందపడిన ఫోన్‌తీసుకుని 108 కి ఫోన్‌చేశాడు. ఆగమేఘాలమీద ఆంబులెన్స్‌అక్కడికి వచ్చింది. విశాలిని అందులో ఎక్కించి ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారు. వినయ్‌మాత్రం విశాలితో పాటు ఆంబులెన్స్‌ఎక్కి కూర్చుని విశాలి కాంటాక్ట్స్‌లో "హబ్బీ" అని రాసున్న నంబర్‌‌కి కాల్‌చేశాడు.

*      *

పనిలో తలమునకలై ఉన్న కౌశిక్‌ఫోన్‌రింగయ్యింది. కౌశిక్‌ఫోన్‌ఎత్తి "చెప్పు విశు." అన్నాడు. ఫోన్‌లో అవతలి వ్యక్తి చెపుతున్న మాటలు వినేసరికి కౌశిక్‌గుండె ఆగినంత పనయ్యింది. కంగారుగా బయటికి పరిగెత్తుకువచ్చి, బైక్‌స్టార్ట్‌చేసి ముందుకి పరిగెత్తించాడు.
కౌశిక్‌హాస్పిటల్‌చేరేసరికి విశాలికి ట్రీట్‌మెంట్‌నడుస్తోంది. ఆ వార్డ్‌పక్కనే వినయ్‌రక్తం అంటిన బట్టలతో కూర్చుని ఉన్నాడు. వినయ్‌, కౌశిక్‌ఒకరిని ఒకరు గుర్తుపట్టారు.

ఇద్దరూ చాలా సేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత కౌశిక్‌వినయ్‌పక్కన కూర్చుంటూ "సారీ.... పొద్దున.." అన్నాడు గొంతు పెగుల్చుకుంటూ.

"అయ్యో ఫరవాలేదంకుల్‌మీరు కావాలని అలా చెయ్యలేదు కదా." అతని సంస్కారం ముందు అప్పటికే బలహీనపడ్డ కౌశిక్‌అహంకారం పూర్తిగా చచ్చిపోయింది.

ఇంతలో ఒక నర్స్‌బయటికి వచ్చి ఒక పేపర్‌ముక్క వినయ్‌చేతిలో పెడుతూ "అర్జంట్‌గా ఈ ఇంజక్షన్‌తీసుకురా." అని చెప్పి లోపలికి వెళ్ళిపోబోయింది.

కౌశిక్‌ఆమెని ఆపి "సిస్టర్‌ఎలా వుంది అని అడిగింది?" అని అడిగాడు.

ఆ నర్స్‌కౌశిక్‌కళ్ళల్లోకి సూటిగా చూస్తూ "మీరు ఆవిడకి ఏమౌతారు?" అన్ని అడిగింది.

"షీ ఇస్‌మై వైఫ్‌." సమాధానం ఇచ్చాడు కౌశిక్‌.

"హెడ్‌ఇంజూరీ, చెయ్యి ఫాక్చర్‌పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఆవిడ ట్రీట్‌మెంట్‌కి రెస్పాండ్‌అవ్వడంలేదు. ఆ ఇంజక్షన్‌తొందరగా తీసుకురండి. దానికి కూడా ఆవిడ రెస్పాండ్‌అవ్వకపోతే..." అని మేము ఏమీ చెయ్యలేము అన్నట్టు భుజాలు ఎగరేస్తూ లోపలికి వెళ్ళిపోయింది. కౌశిక్‌కి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా అతనిని నిస్సత్తువ ఆవహించేసింది. వినయ్‌చేతిలో ఉన్న స్లిప్‌అందుకుని ఫార్మసీ వైపు నడుస్తూ శక్తిని కూడదీసుకుని నడుస్తూ... "భగవంతుడా... నేనెప్పుడూ నిన్ను నమ్మలేదు కానీ విశు నీకెప్పుడూ పూజలు చేస్తూనే వుంది. నిజంగా నువ్వు ఉంటే నా భార్యని కాపాడు." అని మనసులో అనుకున్నాడు.

చాలామంది మనుషులు సహజంగా అవకాశవాదులు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు గుర్తురాడు. దేవుడు, భక్తీ అంతా ఉత్త ట్రాష్‌అంటారు. పరిస్థితులు తమ చెయ్యి దాటిపోగానే భగవంతుడు గుర్తొస్తాడు. అలాంటి చాలామందిలో తనుకూడా ఒకడినని కౌశిక్‌కి అర్థం అయ్యింది. వినయ్‌వల్ల చచ్చిపోయిన అతని అహంకారం భగవంతుడివి వేడుకోవడంతో కాలి బూడిదయ్యిపోయింది. వేగంగా వెళ్ళి ఇంజక్షన్‌తెచ్చి నర్స్‌ని బయటికి పిలిచి ఆమెకి అందించాడు. ఆ తరువాత ఆగయ్యకి ఫోన్‌చేసి శిరిడీ వెళ్ళడానికి లీవ్‌కావాలి అన్నావుగా తీసుకో అని చెప్పాడు.

ఇంతలో వినయ్‌కౌశిక్‌దగ్గరికి వచ్చి "అంకుల్‌చాలా టైం అయిపోయింది ఇంట్లో కంగారు పడతారు." అన్నాడు మొహమాటంగా.

"ఓకే ఒకే... నువ్వెళ్ళు చాలా థ్యాంక్స్‌." అన్నాడు కౌశిక్‌.వినయ్‌ఏదైనా అవసరం ఉంటే ఫోన్‌చెయ్యండంకుల్‌మాయిల్లు పక్కనే వేంఠనే వచ్చేస్తా." అని తన ఫోన్‌నంబర్‌చెప్పాడు వినయ్‌.కౌశిక్‌ఆ నంబర్‌సేవ్‌చేసుకుంటూ "పేరు..?" అన్నాడు కౌశిక్‌

"వినయ్‌అంకుల్‌" చెప్పాడు వినయ్‌.

కౌశిక్‌సేవ్‌చేసుకున్నాక వినయ్‌అక్కడినుండి బయలు దేరాడు.

హాస్పిటల్‌ద్వారంలోకి ప్రవేశిస్తున్న వెలుగులో కలిసిపోయేవరుకూ వినయ్‌వంకే చూస్తూ ఉండిపోయాడు. వెలుగులో కలిసిపోతున్న వినయ్‌ఒక్క క్షణం దేవదూతలా అనిపించాడు కౌశిక్‌కి.

*     *     *

రెండేళ్ళ తరువాత.........

ఇల్లంతా కోలాహలంగా ఉంది. చాలా మంది చుట్టాలు స్నేహితులతో కళకళ లాడిపోతోంది. నూనుగు మీసాల వినయ్‌హాడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా అతనినే పిలుస్తున్నారు. ఓపికగా అందరికీ సమాధానం చెపుతూ కావాల్సినవి చూస్తున్నాడు. ఇప్పుడు వినయ్‌కూడా ఆ ఇంట్లో సభ్యుడే. వేదమంత్రాలతో, సువాసనా భరితమైన ధూపంతో కౌశిక్‌, విశాలీల ఇల్లు ఒక పుణ్యక్షేత్రంలా ఉంది. ఆ రోజు వాళ్ళ కూతురికి నామకరణం చేస్తున్నారు. పూజలో భార్యా భర్తలు కూర్చుని ఉంటే, వినయ్‌అతిధి సత్కారాలు చూసుకుంటున్నాడు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదోగానీ ఒక మాట లేదా ఒక సంఘటన ఖచ్చితంగా మనుషులలో మార్పు తీసుకొస్తుంది. రెండు నెలల వైద్యం తరువాత విశాలి మామూలు మనిషయ్యింది. ఆ రెండు నెలలో కౌశిక్‌కొన్ని వేలసార్లు దేవుణ్ణి తలుచుకున్నాడు. ఆమె కోలుకోంగానే ఇదరూ కలిసి తీర్థయాత్రలకీ పనిలో పనిగా సెకండ్‌హానీమూన్‌కీ కూడా వెళ్ళొచ్చారు. కౌశిక్‌లో చాలా మార్పు వచ్చేసింది. దేవుణ్ణి తలుచుకోకుండా ఏపనీ మొదలు పెట్టడంలేదు. గతంలో ఆఫీసులో ఇగోయిస్ట్‌, శాడిస్ట్‌అని నిక్‌నేమ్స్‌ఉండేవి కౌశిక్‌కి ఇప్పుడు ఆవి మారిపోయి "సార్‌దేవుడు" అనుకుంటున్నారు.

మరిన్ని కథలు
nava vasantam