Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nammakam

ఈ సంచికలో >> కథలు >> నవ వసంతం

nava vasantam

" బ్రోచే వారెవరురా...నినువినా...రఘువరా...నను బ్రోచేవారెవరురా...." పక్కింట్లోంచి మథురమైన కంఠంతో శ్రావ్యంగా  త్యాగరాజకృతి వినవస్తూంటే స్నానాలగది కుళాయి దగ్గర స్నానం చేస్తున్న భాస్కర్ ముగ్దుడయాడు.

స్నానం చేసి బట్టలు మార్చుకుని టిఫిన్ ప్లేటు అందుకుంటూ " పిన్నీ , ఎవరే త్యాగరాజకృతి అంత లయ బద్ధంగా ఆలపిస్తున్నారు"
ఆతృతగా అడిగాడు.

" అదా, పక్క పోర్షన్ లో ఉన్న ఊరి పురోహితులు సుందరం గారి కోడలు శారద సంగీత సాధన చేసుకుంటోంది.ఉదయాన్నే కీర్తనలు,
 రాగాలు, జావళీలు పాడుకుంటుంది.దురదృష్టవంతురాలు, పెళ్లైన సంవత్సరానికే మాంగల్యం పోగొట్టుకుంది.వాళ్లది రాజమండ్రి. తండ్రి శేషాద్రి సంగీతం టీచర్. తండ్రి దగ్గరే సంగీతం నేర్చుకుని డిగ్రీతో పాటు మ్యూజిక్ డిప్లమా పూర్తి చేసింది. చక్కటి పిల్ల.దేవుడు అన్యాయం చేసాడు " చెప్పుకు పోతోంది పార్వతి పిన్ని.

" మంచి వాళ్లకే దేవుడు కస్టాలు తెచ్చి పెడతాడు. మరి ,  ఆ అమ్మాయి భర్త ఎలా చనిపోయాడు ? " కాఫీ గ్లాసు అందుకుంటు
ఉత్సుకతో అడిగాడు భాస్కర్.

" శేషాద్రి గారు , సుందరం గారు చిన్నప్పటి స్నేహితులు. ఆ  స్నేహ బంధాన్ని కుటుంబ బాంధవ్యంగా మార్చుకున్నారు.టీచర్ గా ఉధ్యోగం చేస్తున్న ఏకైక కొడుకు సూర్యానికి శారద నిచ్చి పెళ్ళి చేసారు సుందరం.కొడుక్కి చిన్నప్పటి నుంచి ఆస్తమా జబ్బు  ఉందని తెలిసికూడా పెళ్లి జరిపించారు. తెలిసి కూడా ఆర్థిక పరిస్థితి శేషాద్రి గారిని అశక్తుడిని చేసింది. భార్య గతించడంతో శారదని మేనత్త పెంచి పెద్ద చేసింది.

శారద , సూర్యంల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. వెయ్యి ఆశలతో శారద అత్తవారింట్లో అడుగు పెట్టింది. కొత్త కోడలు అత్తగారికి ఇంటి పనుల్లో సహాయపడుతూ అణకువగా ఉంటోంది.సూర్యం రోజంతా దగ్గు ఆయాసంతో నీర్సంగా కనిపిస్తాడు.శారద తెల్లగా, బొద్దుగా అందంగా కనపడుతుంది. కాకి ముక్కుకి దొండపండులా ఉంటుంది వారి జంట.కొద్ది నెలల తర్వాత సూర్యం ఎలక్షన్ డ్యూటీ మీద పక్క ఊరు వెళ్ల
వలసి వచ్చింది. సాయంకాలం డ్యూటీ పూర్తవుతుండగా అలసట ఎక్కువై బాగా ఆస్తమా వచ్చి ఊపిరందక బాధ పడుతుంటే దగ్గరున్న
హాస్పిటల్ కి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. రాత్రి హాస్పిటల్లో కన్నుమూసాడు సూర్యం.

శారదకు కుజదోషం ఉందనీ , అందువల్లే తమ కొడుకు దక్కకుండా పోయాడని అత్తగారు సూటీపోటీ మాటలనడం మొదలు పెట్టింది. ఎవరే మాటలన్నా మౌనంగా మనసులోనే దిగమింగుతూ రోజులు వెళ్లదీస్తోంది.

సుందరం గారిది సనాతన సంప్రదాయ వైదిక కుటుంబం. ఆచార వ్యవహారాలతో పాటు మూఢ నమకాలు ఎక్కువ. శారదకు మళ్లీ పెళ్లి
చేద్దామని శేషాద్రి  ప్రస్తావన తేగా,  ససేమిరా వద్దు అన్నారు సుందరం. పెళ్లైన ఆడవాళ్లకి రెండోసారి పెళ్లి జరపడం అపచారం. అటువంటిది మా వంశంలో లేదని ఖరాకండిగా చెప్పేసారు. చేసేదేమీలేక ఊరుకున్నారు శేషాద్రి " ముగింపు పలికింది పార్వతి పిన్ని.

*                *

అగ్రహారం గ్రామం ఇంకా పాత సాంప్రదాయేల్నే పాటిస్తోంది.కట్టుబాట్లు ఎక్కువ. నిరక్షరాస్యత స్పష్టంగా కనబడుతుంది. జాతీయరహదారికి ఐదు కిలోమీటర్లు ఉంది.ఇంకా సైకిళ్లు, రిక్షాలే ప్రయాణ సాధనాలుగా ఉపయోగిస్తున్నారు.కొద్ది వ్యాపారం చేసుకునేవారికి మోపెడ్లు, మోటరు సైకిళ్లు ఉన్నాయి.

గ్రామం చుట్టూ పచ్చని పైరు పొలాలు ,చెరువులు ,అరటి కొబ్బరి తోటలతో, రకరకాల పక్షుల కిలకిలారావాలతో కళకళలాడుతుంటుంది.
బ్రాహ్మణ, వైశ్య ,సూద్ర ,హరిజన కులాలుగా విభజింపబడి అన్ని కుల వృత్తులవారు నివసిస్తున్నారు.ఊళ్లో పంచాయతీ ఆఫీసు, పక్కన చేపల చెరువు, దాని చుట్టూ పచ్చని కొబ్బరి మొక్కలు, చెరువు గట్టు మీద కొత్తగా నిర్మించిన సాయిబాబా గుడి, సంతోషిమాత ఆలయం దర్సనమిస్తాయి.రామాలయం, శివాలయం ఊరి పొలిమేరలో గ్రామ దేవత దుర్గాలమ్మ గుడి పండగలప్పుడు పర్వ దినాలప్పడు సందడిగా కనబడతాయి.ఊరి జనం ఏ అవసరం వచ్చినా పట్నానికి పోవల్సిందే.రాఘవరావు గారు పట్నంలో వకీలుగా ప్రాక్టీసు చేస్తూ స్వంత ఊళ్లో
భూములు, వ్యవసాయం చూసుకునేవారు లేక భార్య పార్వతితో అగ్రహారానికి నివాసం మార్చారు.కొడుకు సాఫ్టువేర్ ఇంజినీరుగా
అమెరికాలో ఉంటున్నాడు తండ్రి కట్టించిన పాత ఇంటిని రెండు భాగాలుగా సగం డాబాగాను

మిగతాది పెంకుటింటిగా ఉంచి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.

మద్యలో హద్దుగోడ కట్టించి గుమ్మం తలుపులు ఉంచారు.

రాఘవరావు పట్టణంలో ఉన్నప్పుడు అగ్రహారంలో ఇంటిని ఊరి పురోహితుడు సుందరం గారికి అప్పగించారు. ప్రస్తుతం పెంకుటింట్లో
సుందరంగారి కుటుంబం ఉంటే, డాబా ఇంట్లో వకీలు గారు ఉంటున్నారు. రాఘవరావు గారి కుటుంబం అగ్రహారం వచ్చి రెండు
సంవత్సరాలైంది.ఆయన ప్రకృతి ప్రేమికుడు. చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే మక్కువ.అందుకే పట్నం వదిలి పుట్టి పెరిగిన ఊరికి వచ్చి నివాసం ఉంటున్నారు. ఇంటి ముందు భాగంలో రకరకాల క్రోటన్సు, పూలమొక్కలు దర్సనమిస్తే పెరట్లో అన్ని రకాల కూరగాయలు , ఫలవృక్షాలు పలకరిస్తాయి. భాస్కర్ తల్లి అనసూయ, రాఘవరావు భార్య పార్వతి అక్కచెళ్లెళ్లు. అనసూయ భర్త గుండె పోటుతో చనిపోవడం వల్ల కొడుకు భాస్కర్, కూతురు సురేఖ బాబయ్యవద్దే పెరిగి పెద్దవాళ్లయారు. సురేఖకు పెళ్లవగా భర్తతో ముంబైలో ఉంటోంది.ప్రస్తుతం అనసూయ కూతురు దగ్గరకెళ్లింది. భాస్కర్ చదువు పూర్తయి హైదరాబాదు కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ గా  ఉధ్యోగం చేస్తున్నాడు. అబ్యుదయ భావాలు గల యువకుడు. శాస్త్రీయ సంగీతం, చిత్రకళతో పాటు పర్యావరణానికి ప్రాముఖ్య మిస్తాడు.

అందుకే శలవులొస్తే అగ్రహారం వచ్చి పిన్ని , బాబాయిల వద్ద గడిపి వెల్తూంటాడు. తమ కొడుకు విదేశంలో దూరంగా ఉన్నందున
రాఘవరావు దంపతులు భాస్కరాన్ని ఆప్యాయంగా చూసుకుంటున్నారు.  అనసూయ పెళ్లి చేసుకుని కోడల్ని తెమ్మంటే అలాగే నంటూ కాలయాపన చేస్తున్నాడు.

సెలవుల్లో అగ్రహారం వచ్చిన భాస్కర్ ఒకరోజు డాబా ఎక్కిస్మార్టు ఫోన్లో పాటలు వింటున్నాడు. పక్క వాటాలోని వాకిట్లో శారద తడి
బట్టలు ఆరవేస్తూ కనబడింది.

సాదా చీరలో నుదుట బొట్టు లేకుండా వదులుగా బారెడు జడతో అందంగా ఉంది. ఇంత అందమైన అమ్మాయికి దేవుడు అన్యాయం
చేసాడనుకున్నాడు. పైనున్న భాస్కర్ని చూసి తలవంచుకుని ఖాళీ బకెట్ తీసుకుని లోపలి కెళ్లింది. మరొక రోజు భాస్కర్ డాబా మీద వ్యాయామం చేస్తూ విశ్రాంతి కోసం నిలబడి కిందకు చూస్తూంటే శారద ముందు వాకిట్లో రెండు గుమ్మాల ముందు ముగ్గులు వేస్తూ కనబడింది. ఎందుకో పైకి చూస్తే తదేకంగా తననే చూస్తున్న భాస్కరాన్ని గమనించి కంగారు పడింది. అనేక సందర్భాలలో ఒకరి కొకరు ఎదురు పడినా కళ్లతో పలకరింపులు , మూగభాషలో మాటలు జరిగేవి.ఇంతకు ముందు మద్య తలుపులు తెరుచుకుని పార్వతమ్మ దగ్గరకు కాలక్షేపానికొచ్చే శారద, భాస్కర్ వచ్చి నప్పటినుండి రావడం మానేసింది.

సుందరం గారి భార్య శ్యామల మడి, ఆచారం, పూజలతో సందడిగా ఉంటే, ఆయన రోజంతా పురోహిత కార్యక్రమాలతో ఊపిరి సలపకుండా
ఉంటారు. శారద మాత్రం ఆధ్యాత్మిక , సాహిత్య పుస్తకాలతో కాలక్షేపం చేస్తుంది. అప్పుడప్పుడు రాఘవరావు దంపతులు శారద స్థితిని తలుచుకుని బాధ పడుతూంటారు.  ఒక రోజు మధ్యాహ్నం శ్యామలమ్మ మద్య తలుపులు తెరుచుకుని వచ్చి " వదినా ! వచ్చిన అబ్బాయి భాస్కరేనా? ఎంత ఎదిగిపోయాడు. చదువుకునే రోజుల్లో చూసాను. క్రితంసారి శలవుల్లో వచ్చినప్పుడు నేను తీర్థయాత్రల్లో ఉన్నాను." అంది. పక్క గదిలో పుస్తకం చదువుతున్న  భాస్కరానికి వాళ్ల మాటలు వినబడుతున్నాయి.

భాస్కర్ వచ్చి వారం రోజులైంది. పగలంతా బాబాయి పిన్నితో కబుర్లు, సాయంకాలమైతే పాలేరుతో కెమేరా తీసుకుని ఒకరోజు పొలానికి, మరో రోజు కొబ్బరి తోట , ఇంకోరోజు ఊరవతల పెద్దచెరువు దగ్గరకెళ్లి రకరకాల పక్షుల ఫోటోలతో రోజులు గడిచిపోయాయి. ఆ రోజు పాలేరుకి పనుండి ఇంటికి రాలేదు. సాయంకాలం వరకు గడిపిన భాస్కరానికి  టైమ్ పాసవడం లేదు. పిన్ని పూజలో ఉంది. బాబయ్ ఆఫీసు పని మీద టౌనుకి వేళ్లేరు. ఊరి మద్యనున్న పంచాయతీ చేపల చెరువు గట్టు మీదకు షికారు కెల్తున్నట్టు పార్వతి పిన్నికి కేకవేసి  చెప్పి బయలుదేరాడు. చెరువు గట్టుమీదున్న గుడిలో సాయిబాబాను దర్సించుకుని వెనక ఉన్న సిమ్మెంటు దిమ్మ మీద చేతి రుమాలు పరుచుకుని కూర్చున్నాడు. నీటితో నిండుగా ఉన్న చెరువు అందాన్ని, నీటి మద్యలో లోతుని తెలిపే రాట మీద కూర్చున్న పాలపిట్టను తదేకంగా చూస్తున్నాడు. భక్తుల రాక మొదలైంది. కొద్ది సేపటి తర్వాత శారద సంతోషిమాత గుడి వెనక  కొబ్బరి చెక్క కొడుతూ కనిపించింది.
   ఏకాగ్రతగా శారదని గమనిస్తున్నాడు భాస్కర్.అకస్మాత్తుగా శారద చూపు భాస్కర్ మీద పడింది.

భాస్కర్ ధృష్టి మరల్చుకున్నాడు.చిరుచీకట్లు అలుముకున్నాయి. దగ్గర్లో ఉన్న శివాలయం గంట స్తంబం మీద గాలికి చిరుగంటల సవ్వడి వినిపిస్తోంది. కార్తీక మాసంలో దీపపు ప్రమిదలతో పాటు ఆకాశదీపం వెలుగులు నలుదిశలా ప్రసరించేవి. బాగా చీకటి పడటంతో ఇంటి ముఖం పట్టేడు భాస్కర్." ఇదిగోరా, నీ చేతి రుమాలు. చెరువు గట్టు సాయిబాబా గుడి దగ్గర మరచి పోయావట. శారద తెచ్చిచ్చింది " అని పిన్ని రుమాలు ఇచ్చింది. తను సిమ్మెంటు దిమ్మ మీద రుమాలు మరచిపోయిన సంగతి జ్ఞప్తికి వచ్చింది. రాత్రంతా ఆలోచనలతో సతమతమయ్యాడు భాస్కర్. తెల్లారింది. కాఫీ గ్లాసు అందుకుంటు " పిన్నీ , నీకు బాబయ్యకు అబ్యంతరం లేకపోతే శారదను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.

చిన్న వయసులో ఆ అమ్మాయి జీవితంలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. అంధకారమైన ఆమె జీవితం లో వెలుగులు నింపాలనుకుంటున్నాను. మీరు సుందరం గారితో మాట్లాడి ఒప్పించండి. శారదతో మాట్లాడి ఆమె అంగీకారం తీసుకుంటాను. తర్వాత అమ్మ, అక్కతో సంప్రదిస్తాను." అన్నాడు భాస్కర్. పార్వతమ్మ భాస్కర్ మాటలు విని ఆశ్చర్యం కనపర్చినా శారద వినయ విధేయతలు , అమాయకత్వం తలుచుకుని భాస్కరం వ్యక్తి త్వానికి సరిజోడి అనుకుంది.వాడి ఆదర్స భావాలను అభినందించింది. విషయం భర్తకు తెలియచేసి సుందరం గారికి నచ్చచెప్పి ఎలాగైనా శారద జీవితంలో వెలుగులు నింపాలనుకుంది. రాఘవరావు కూడా
భాస్కరం అభిప్రాయం తెలిసి ఆలోచనలో పడి చివరకు సుందరం గారితో మాట్లాడాలనుకున్నారు.

ఒక మంచి రోజున సుందరం గారితో సంప్రదింపులు ప్రారంభించారు.పరమ ఛాందసుడైన సుందరం రాఘవరావు గారి ప్రతిపాదన విని అగ్గి మీద గుగ్గిల మయారు. రాఘవరావు శాంతంగా ఆయనకు నచ్చ చెప్పారు. కాలంతో పాటు మనము మారాలని , చనిపోయిన మీ అబ్బాయి తిరిగి రాలేడు. భాస్కరే మీ అబ్బాయిలా తిరిగి వచ్చాడనుకుని శారద నిచ్చి మళ్లీ పెళ్ళి చేసి సుమంగళిగా పంపండి.  ఆ అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇవ్వండి. భాస్కర్ తరఫున మా దంపతులం  పీటల మీద కూర్చుంటే మీ దంపతులు శారదకు కన్యాదానం చెయ్యండి. ఆయనకు నిదానంగా అన్ని విషయాలు విడమర్చి చెప్పారు రాఘవరావు. చివరకు సుందరం గారు శారద , భాస్కరంల పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. భాస్కర్ ‌, శారద పరస్పరం మాట్లాడుకుని పెళ్లి చేసుకోడానికి అంగీకరించారు.

మోడు వారిన తన జీవితానికి నీరుపోసి చిగురింప చేస్తున్న భాస్కరానికి మనసులో కృతజజ్ఞతలు తెలుపుకుంది శారద. రాత్రి డాబా మీద వెన్నెల్లో మొబైల్ ఫోన్లో పాటలు వింటూపున్నమి చంద్రుణ్ణి  తదేకంగా  చూస్తున్నాడు భాస్కర్..చీకటిని పారదోలుతూ ఆకాశదీపంలా నిండు చందమామ తన వెండి వెలుగుల్లో భూమండలాన్ని కాంతిమయం చేస్తున్నాడు.

మరిన్ని కథలు