Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
knee

ఈ సంచికలో >> శీర్షికలు >>

మరింత స్థిరంగా ఎలా ఉండాలి - ..

How to be more consistent

ఇలా ఈ పర్వతాల పాద ప్రాంతాలకు మళ్ళీ రావటం ఒక అద్భుతమైన అనుభవం. నా జీవితంలో మొదటి సగం ఈ ప్రాంతాలను వెతకటంలోనే గడిచింది. నా మీద ఉన్న ఒక పెద్ద బరువు దించుకొనేందుకు (ఈ ప్రస్తావన వెల్లియంగిరి కొండలలో సద్గురు, తన గురువుల ఆదేశం ప్రకారం, ధ్యాన లింగ ప్రతిష్ఠ చేసిన సందర్భానికి సంబంధించింది - సంపాదకులు) సరయిన స్థలం కోసం ఈ ప్రాంతాలన్నీనేను కలయదిరగటం జరిగింది. కానీ ఇప్పుడైతే ఇక్కడికి రావటానికే కుదరటం లేదు.

ఒక విధంగా చూస్తే ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే కూడా ఈ కొండలాగా మారి పోవటమే నిశ్చలంగా, నిశ్శబ్దంగా...! పునాది నిశ్చలంగా సుస్థిరంగా ఉంటే, మనిషి చాలా విషయాలు సాధించగలుగుతాడు. పూర్తి సుస్థిరత ఉంటేనే, జీవితంలో ఒక ఆనందాతిశయాన్ని అనుభవించటం సాధ్యమౌతుంది. స్థిరత్వం లేకపోతే అది ఉన్మాదానికి దారి తీస్తుంది, అందుకే కొంత సృజనాత్మకత, చురుకుతనం, ఉత్సాహం ఉన్నవాళ్ళు ముందు కొంత వెర్రి తనంగా వ్యవహరించటం, చివరికి దాదాపు పిచ్చి వాళ్ళుగా మారిపోవటం జరుగుతుంది. స్థిరమైన పునాది లేకపోతే, మీరొక తాండవ నృత్యం చేయలేరు.

అందుకే శివుడంటే ఒక వైపు సుస్థిరత్వం, నిశ్చలత్వం, మరొక వైపు శివుడంటే, ఒక అద్భుతమైన తాండవం.. ఆయన ఏ కదలికా లేని నిశ్చల సమాధిలో కూర్చొని అయినా ఉంటాడు, లేకపోతే, విస్ఫోటం లాంటి తాండవ కేళిలో విజృంభిస్తాడు. విధ్వంసం కలిగించని విస్ఫోటం స్థిరత్వం ఉన్నప్పుడే సాధ్యమౌతుంది.

మనుషులు స్థిరత్వం సాధించుకొనేందుకు, తమ జీవితాలను కొంచెం నియంత్రించటం, కుదించుకోవటం చేస్తూ ఉంటారు. మీ అమ్మమ్మ గారు మీకు అలానే గదా బోధించింది? 'కాస్త జోరు తగ్గించి, నియంత్రణలో ఉండగలిగితే, కుదురుగా ఉంటావు' అని. అసలు జీవమే లేకపోతే స్థిరంగాఉండచ్చు, కళేబరాల లాగా. ఇది నిజం, ఈ భరోసా మాత్రం మీకు నేనూ ఇస్తాను. ఈ నియంత్రణల చేతనే మనుషుల జీవితాలు మలబద్ధకంతో బాధ పడుతున్నట్టు గడుస్తాయి. అదేమిటో మీకు తెలుసు గదా? జరిగేదేదో కొంచెం కొంచెంగా, అప్పుడు కాస్త, అప్పుడు కాస్త జరుగుతుంది. వాళ్ళ ఆనందాతిశయం, వాళ్ళ ప్రేమా, వాళ్ళ పారవశ్యం అన్నీ అంతంత మాత్రంగా చిన్న చిన్న మోతాదులలోనే ఉండిపోతాయి. కాబట్టి జీవితాన్ని బాగా, కత్తిరించి, కుదించేసుకొని, నియంత్రించుకోవటం వల్ల కలిగే స్థిరత్వం స్థిరత్వం కాదు. అది నిష్ప్రయోజనం! అన్నింటినీ, సరిగ్గా, అతి స్పష్టంగా 'దర్శించ' గలిగితే అది స్థిరత్వం.

ఆదియోగిని గురించి చెప్పుకొంటున్నామంటే, మనం ఏక కాలంలో అటు నిశ్చల సమాధి గురించి, ఇటు తాండవ విజృంభణ గురించీ చెప్పుకొంటున్నామన్న మాట. అది ఆయనకు ఎలా సాధ్యమంటే ఆయనకు అందరిలా రెండు కళ్ళు కాకుండా, అంతకంటే ఎక్కువ కళ్ళు ఉన్నాయి గనక. అంటే మూడు కళ్లని కూడా కాదు, అంతకంటే కూడా ఎక్కువ. అందువల్ల ఆయన దృష్టి సామాన్యుల దృష్టి కంటే నిశితమైంది, వాళ్ళు చూడలేనివెన్నో ఆయన చూడగలడు. చాలా చాలా ఎక్కువ చూడగలడు. కనకే, ఆయన అంతటి స్థిరత్వాన్నీ నిశ్చలతనూ ప్రదర్శించ గలడు. మీది కేవలం పాక్షిక దృష్టి మాత్రమే అయితే, స్థిరంగా నిలబడటం చాలా కష్టం కనక మనం కూడా సవ్యమైన, చురుకైన దృష్టి కోసం ప్రయత్నించాలి. చూడటాన్ని మనం 'దర్శనం' అంటాం అని మీకు తెలుసు కదా. మన సంప్రదాయం అంతా ఈ దర్శనాన్ని గురించి ఎప్పుడూ చర్చిస్తూనే వస్తున్నది. మీరు దేవాలయానికి వెళ్ళేది అభ్యర్థన పత్రాలు ఇచ్చి రావటానికి కాదు! 'దర్శనం' కోసం వెళతారు! సరిగ్గా చూడగలగటం కోసం. మనుషులు తమ ఎదురుగా ఉన్న జీవితాన్ని సరియైన దృష్టితో చూడలేకపోవటానికి కారణం, వాళ్ళు తమను తాము ఎన్నో విషయాలతో గుర్తింపు ఏర్పరచుకున్నారు.

మొట్టమొదట 'ఈ శరీరం నాది' అన్న దానితో మొదలుపెట్టి మరెన్నో విషయాలతో గుర్తింపు ఏర్పరచుకుని, ఏవేవో గుర్తింపులు తగిలించుకోవటం. మీరు అలాంటి గుర్తింపు ఏదయినా ఏర్పరుచుకోగానే, మీ బుద్ధి ఇక దాన్ని పరిరక్షించే ప్రయత్నంలో పడిపోతుంది. మరి, 'నేను ఫలానా దేశస్థుడినీ, ఫలానా మతానికి చెందిన వాడినీ, ఫలానా జాతికి చెందిన వాడినీ, ఈ ఉన్న గుర్తింపులన్నీ వదిలించుకోవటం ఎలా?' అని మీరు ఈ విధంగా వెళ్లవలసిన పనే లేదు. 'ఈ శరీరం నాది' అన్న ఒక్క గుర్తింపును వదిలించుకొంటే చాలు. మిగిలినవన్నీ పోయినట్టే, ఎందుకంటే అన్నీ ఆ ఒక్క గుర్తింపు పునాది మీదే నిలుస్తున్నాయి. మీకు తగిలే గుర్తింపులన్నీ మీరు 'ఈ శరీరం నేను!' అనే పరిమితికి లొంగిపోవటంవల్ల కలుగుతున్నవే!

మరిన్ని శీర్షికలు
Good for grape