Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఎన్టీఆర్‌ - మహానాయకుడు చిత్ర సమీక్ష

NTR mahanayakudu movie review

చిత్రం: ఎన్టీఆర్‌ - మహానాయకుడు 
తారాగణం: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా దగ్గుబాటి, ఆమని, కళ్యాణ్‌రామ్‌, సుమంత్‌, భరత్‌ రెడ్డి, దగ్గుబాటి రాజా, సచిన్‌ ఖేడ్కర్‌, సుప్రియ వినోద్‌, పూనమ్‌ బజ్వా, మంజిమ మోహన్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు. 
సంగీతం: ఎంఎం కీరవాణి 
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్‌ వీఎస్‌ 
నిర్మాతలు: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి 
దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి 
నిర్మాణం: ఎన్‌బికె ఫిలింస్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా 
విడుదల తేదీ: 22 ఫిబ్రవరి 2019 
కుప్లంగా చెప్పాలంటే.. 
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితం గురించి తెలియనిదెవరికి? అయితే, స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితాన్ని ఆయన సతీమణి నందమూరి బసవతారకం కోణంలో చూపించేందుకు నడుం బిగించాడు దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి. ఈ మహత్కార్యాన్ని తన బాధ్యతగా భుజానికెత్తుకున్నారు నందమూరి బాలకృష్ణ. తన తండ్రి పాత్రలో నటిస్తూ, ఈ సినిమాని నిర్మించారాయన. ఇప్పటికే కథానాయకుడిగా స్వర్గీయ ఎన్టీఆర్‌ ప్రస్థానాన్ని చూపారు. ఇప్పుడు మహానాయకుడిగా ఎన్టీఆర్‌ ప్రస్థానాన్ని చూపిస్తున్నారు. ఆ మహానాయకుడి జీవితంలో ఎత్తుపల్లాలే ఎన్టీఆర్‌ బయోపిక్‌లోని సెకెండ్‌ పార్ట్‌. 

మొత్తంగా చెప్పాలంటే.. 
తొలి పార్ట్‌ కథానాయకుడితో పోల్చితే, రెండో పార్ట్‌ మహానాయకుడిలో నందమూరి బాలకృష్ణ నటన మరింత ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో స్వర్గీయ నందమూరి తారకరామారావునే చూస్తున్నామా? అనిపించగలిగారు బాలకృష్ణ. భార్య నందమూరి బసవతారకంతో స్వర్గీయ ఎన్టీఆర్‌ అనుబంధాన్ని చూపే క్రమంలో బాలయ్య నటన చాలా బాగుంది. ఆగ్రహం, ఆవేదన, ఆలోచన.. ఇలా అన్ని కోణాల్లోనూ బాలయ్య మెప్పిస్తారు. నటన పరంగా బాలకృష్ణకి వంకలెలా పెట్టగలం? ఆయన తనవరకు పూర్తి న్యాయం చేశారు. 

బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ మరోసారి మంచి మార్కులు కొట్టేసింది. బాలకృష్ణతో పోటీ పడింది చాలా సన్నివేశాల్లో. బసవతారకం ఇలాగే వుండేవారేమోనని అందరికీ అనిపిస్తుందంటే, ఆమె నటన అంత సహజంగా వుంది. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కి వచ్చిన విద్యాబాలన్‌, ఎక్కడా ఆ బెరుకు చూపలేదు. తనలోని నటనా ప్రతిభ మొత్తాన్నీ వెండితెరపై పరిచిందామె. 

బాలకృష్ణ, విద్యాబాలన్‌ తర్వాత రాణా దగ్గుబాటి నటన ఈ సినిమాకి మరింత కీలకం. అత్యంత కీలకమైన పాత్రలో రానా తనదైన నటనతో మెప్పించాడు. అచ్చం చంద్రబాబులా కన్పించే క్రమంలో ఎక్కడా తడబడలేదు. లో-డెప్త్‌ అనిపించిన సన్నివేశాల్లోనూ రానా తన తన నటనా ప్రతిభ చాటుకున్నాడు. ఓవరాల్‌గా రానాకి మరో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. కళ్యాణ్‌రామ్‌, సుమంత్‌ తదితరులకు పెద్దగా స్కోప్‌ లభించలేదు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. 

ఇది కథ కాదు, జీవితం. అయితే ఆ జీవితాన్ని కుదించేయడం చాలామందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే, స్వర్గీయ ఎన్టీఆర్‌ గురించి అందరికీ తెలుసు. దాచేందుకు ఎవరు ప్రయత్నించినా దాగని నిజాలు చాలా వున్నాయి ఆయన జీవితంలో. బసవ తారకం కోణంలో తారకరామారావు చరిత్రని మాత్రమే చూశాం. ఆ తర్వాతి కథని చెప్పకుండా అసంపూర్తిగా వదిలేశారు. మాటలు బాగున్నాయి. కథనం ఒకింత నీరసంగా సాగుతుంది. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్‌గా పనిచేసి వుంటే బావుండేదేమో. నిర్మాణపు విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కీరవాణి సంగీతం కొన్ని 'లో' సన్నివేశాల్నీ ఎలివేట్‌ చేయగలిగింది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ కీకలంగానే పనిచేశాయి. 

మొదటి పార్ట్‌ పూర్తిగా స్వర్గీయ ఎన్టీఆర్‌ సినిమా జీవితానికే పరిమితమైంది. రాజకీయ రంగ ప్రవేశంతో రెండో పార్ట్‌ మొదలైంది. ఇంటర్వెల్‌ వరకూ, ఆ తర్వాతా సినిమా దాదాపు ఒకే పేస్‌లో కొనసాగుతుంది. 'లో పేస్‌' సినిమాకి కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎక్కడ.? ఆ నిజం ఎక్కడ? అని ప్రేక్షకులు ఎదురు చూసే అవకాశమే లేకుండా, 'బసవతారకం శివైక్యంతో కథ ముగుస్తుంది' అని సినిమా విడుదలకు ముందే బాలయ్య చెప్పేసినా, ఆ లోటు మాత్రం అలాగే కన్పించింది. 'బలవంతంగా దాచేయబడ్డ' ఆ నిజం తెరపై కన్పించకపోవడంతో నిరాశ తప్పదు. కొన్ని సన్నివేశాలు అసంబద్ధంగా అన్పిస్తాయి. ఎన్టీఆర్‌ ఇమేజ్‌ పెంచే క్రమంలో అవి బోల్తా పడ్డాయి. ఓవరాల్‌గా సినిమా 'అంతకు మించి' అనే భావన మాత్రం కల్పించలేదు. 'కథానాయకుడి' పరాజయం తర్వాత, ఎన్టీఆర్‌ ఇమేజ్‌ని నిలబెట్టాల్సిన ఈ సినిమా కూడా 'మమ' అన్పించేస్తుందంతే. 
అంకెల్లో చెప్పాలంటే.. 
2.75/5 
ఒక్క మాటలో చెప్పాలంటే 
మహానాయకుడు - అసంపూర్ణమైన చరిత్ర  

మరిన్ని సినిమా కబుర్లు
churaka