Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue307/793/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి).....  కాత్యాయని నెమ్మదిగా నోరు..కాదు కాదు మనసు విప్పింది.

అమ్మానాన్నలవద్ద లేడికూనలాంటి తన అందమైన జీవితం, కమలాకర్ తో ముడిపడిన జీవితం, అనుకోకుండా తమ జీవితంలో అశనిపాతమై నిలిచిన కమలాకర్ కు వచ్చిన వ్యాధి, మనోహర్ ఆదుకోవడం, ఆపైన అతని ప్రపోజల్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కమలాకర్ ఇంట్లోంచి గెంటేయడం, పుట్టింటి గుమ్మం తొక్కడం ఇష్టం లేని  తనను, అయ్యవారు ఇక్కడికి పంపడం, సోమయాజులుగారి దంపతులు తనను కన్నవాళ్లలా ఆదుకోవడం అన్నీ పూస గుచ్చినట్టు వివరంగా చెప్పింది.

హేమ కళ్లలో సన్నటి నీటిపొర నిలిచింది. ఆనాటి సీత నుంచి ఈనాటి కాత్యాయని వరకు స్త్రీలు అబలలే! పరిస్థితిలు అనుకూలంగా ఉంటే సబలల్లా కనిపిస్తారంతే! సమాజంలో నిర్ణయాలెప్పుడూ మగవాళ్లవే, భరించాల్సింది ఆడవాళ్లే!

"సరే, కాత్యాయనిగారు బాగా పొద్దుపోయింది. మనం పడుకుందాం. అనవసరంగా నేను మిమ్మల్ని గతం అడిగి మీ మనసునొప్పించానని అనను. ఎందుకంటే, అది మీ మనసులో దాగున్న ముల్లు. అప్పుడప్పుడూ కలుక్కుమనిపిస్తూనే ఉంటుంది. దాన్ని శశ్వతంగా ఎలా తొలగించాలా? అని ఆలోచించాలి. మన జీవితం తెగిన గాలిపటం ఎన్నటికీ కాకూడదు. పదండి" అంది.

ఇద్దరూ గదికొచ్చి నిద్రపోయారు.

***

హేమ, కాత్యాయని ఉదయం పెందళాడే లేచారు.

కాత్యాయనితోపాటూ హేమ కూడా అన్ని పనులూ చేసింది. మొట్టమొదటిసారిగా, అలవాటు లేని పనులతో కాస్త అలసిపోయినప్పటికీ, పట్నపు కృత్రిమ వాతావరణం నుంచి ఎంతో సేద దీరినట్టుగా అనిపించింది హేమకి.

మధ్యాహ్నపు భోజనాలనంతరం సోమయాజులుగారి ఇంటికి ఆనుకుని ఉన్న అరెకరం పూల, పళ్ల తోటలో ఉన్న మట్టి దిబ్బ మీద కూర్చున్నారు ఇద్దరూ.

"కాత్యాయనీ, నీ జీవితం, అందులోని ఒడిదుడుకులు పిక్చరైజ్ చేసి టెలికాస్ట్ చేద్దామనుకుంటున్నాను. అందులో నువ్వుండవు, ఉన్నా ఆకారం తెలియకుండా మేనేజ్ చేస్తాను. నీకు ద్రోహం చేసిన వాళ్లెవరో వాళ్లను మాత్రం బల్లెంలా పొడుస్తుంది. ఇలాంటి చేదు అనుభవం పొంది జీవితాన్ని కోల్పోయామని బాధపడుతూండే వాళ్లకు, ఆత్మహత్యచేసుకుందామనుకునే వాళ్లకు ఒక స్ఫూర్తిమంత పాఠం. నువ్వంగీకరిస్తేనే నేను ముందడుగేస్తాను. లేకపోయినా నేను నీ స్నేహితురాల్నే. నువ్వు నాకు చాలా దగ్గరయ్యావు. నా స్వార్థం కోసం మాత్రం నేనిది టెలికాస్ట్ చెయ్యాఅనుకోవడం లేదు. నన్ను నమ్ము" అంది.

కాత్యాయని ‘తనకి అంగీకారమేనని, సోమయాజులుగారి అంగీకారం తీసుకుంటానని’ అంది.

హేమ సంతోషంగా ’సరే‘ అంది.

ఆ రాత్రి సమయాజులుగారి దగ్గర విషయం కదిపితే- "నీకు అభ్యంతరం లేకపోతే, నాకెందుకు ఉంటుందమ్మా? కానైతే కాస్త జాగ్రత్త. మమ్మల్ని మాత్రం టీవీలోకి లాగొద్దు దయచేసి" అన్నాడు.

"అలాగే అయ్యగారూ. మీకే సమస్యలూ రావు. నన్ను నమ్మండి" అంది హేమ.

*****

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్