Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ఇరవై ఆరవ భాగం

Anubandhaalutelugu serial twenty sixth Part

"అంతేగాని విషయం ఏమిటో చెప్పనంటావ్."

భారంగా నిట్టూర్చి చెమర్చిన కళ్ళు తుడుచుకుంది శివానీ.

"ఏం చెప్పను బావా! డాడీని చూసినప్పట్నించి మనసు బాగాలేదు. ఎప్పుడూ పెద్దపులిలా తిరిగే డాడీ ఇప్పుడిలా డబ్బు పోగొట్టుకుని తనే పేషెంట్ లా మారడం చూస్తే గుండె తరుక్కుపోతోంది. సమయానికి నన్ను కాపాడటమే కాదు.

ఆ విషయం ఎవ్వరికీ తెలియకుండా నువ్వు రక్షించకపోతే పరిస్థితి ఏమిటి? డాడీ నన్నెంత అసహ్యించుకునేవారు. ఇప్పుడాలోచిస్తుంటే అన్నయ్య నేను ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించామో తెలిసి సిగ్గు పడేలా చేస్తోంది. డాడీని తలుచుకుంటే నాకు దుఃఖం ఆగడం లేదు" అంది బాధగా.

"తెలివైనవాళ్లు గతాన్ని తలుచుకొని బాధపడరు. చేసిన తప్పులు సరిదిద్దుకొనే దిశగా ఆలోచిస్తారు. నీలో ఆత్మవిమర్శ మొదలవడం శుభపరిణామం. మీ డాడీ ఆలోచించేది పోయిన డబ్బు గురించి కాదు. మీ గురించి. మీకెందుకు డాడీ దిగులు?"

మీకు అండగా మేం ఉన్నాంగదా అని మీ అన్నాచెల్లెళ్ళు ఒక్క మాటంటే చాలు. ఆయనకి కొండంత ధైర్యం వస్తుంది. పోయిన డబ్బు తిరిగి దొరికినంతగా ఆనందం కల్గుతుంది. మీరు మారి చూపండి. ఆయన సంతోషిస్తాడు."

"నీకు తెలీదు బావా? చిన్నప్పటినుండి అమెరికా సంస్కృతిలో పెరిగాం. ఇప్పటికిప్పుడు మారిపోగలమా? అయినా ఏం మారాలి? ఎలా మారాలి?"

ఆమె ప్రశ్నకి విచిత్రంగా నవ్వాడు నవీన్.

"అవును. ఎలా మారడం? ఇది అమెరికాలో ఉంటున్న డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ ఒక్కడి కుటుంబ సమస్య కాదు. సంపాదన కోసం దేశం వదిలి పరాయి దేశాల్లో నివసిస్తున్న అనేక భారతీయ కుటుంబాల సమస్య.

విదేశీ సంస్కృతిలో నివసిస్తూ మన సంస్కృతిని కాపాడుకోవాలనే తాపత్రయంతో పెద్దవాళ్లు, అక్కడి సంస్కృతిలో లీనమైపోతూ మన సంస్కృతిని మరిచే పిల్లలు, కొంతకాలం పోయేసరికి తమది ఆంధ్రజాతి అని తాము తెలుగువాళ్ళమనే సంగతే కొందరు మర్చిపోతున్నారు.

వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్పజాతికి గొప్ప సంస్కృతికి మనం వారసులం. దాన్ని పోగొట్టుకుంటే చరిత్ర మనల్ని క్షమించదు" అంటూ పెద్దగా నిట్టూర్చాడు.

"బాగుంది. వింటుంటే నువ్వే నన్ను క్షమించేలా లేవు. నువ్విలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకు అర్ధం కాదు బావా! కాస్త వివరంగా చెప్పు" అంది శివానీ.

ఒక్కక్షణం ఆలోచించాడు నవీన్.

"వివరంగా చెప్పాలిగదా! ఓ.కే. నీటిలో చేపల్ని ఎప్పుడన్నా గమనించావా?" అడిగాడు.

"ఓ... చాలాసార్లు చూసాను."

"సముద్రంలోని చేపల్ని చూసావా?"

"చూసాను బావా... కోరల్ ఐలాండ్ వద్ద ఆక్సిజన్ సూట్ లో నీటి అడుగుకు వెళ్లి గుంపులు గుంపులుగా తిరిగే ఎన్నో చేపల్ని చూసాను తెలుసా?"

"అవన్నీ కలిసే తిరుగుతాయా? విడివిడిగా తిరుగుతాయా?"

"చచ్చినా కలవ్వు తెలుసా? ఏ జాతికి ఆ జాతి చేపలే గుంపు కట్టి తిరుగుతాయి. కొత్త ఇతర జాతి చేపలు పొరపాటున వీటితో కలిసి తిరిగినా కూడా చిన్న అలికిడైతే చాలా వేగంగా ఈ గుంపును వదిలి తమ సొంత గుంపులోకి పారిపోతాయి. సముద్రంలోకి వెళితే అదో స్వప్నలోకంగా చాలా బాగుంటుంది బావా" అంటూ ఉత్సాహంగా చెప్పుకువచ్చింది శివాని.

"శివానీ చేపలే కాదు. వలస పక్షులు చూడు. సైబీరియా ఎడారి ప్రాంతాల నుండి, ఇతర దేశాల నుండి అనేక పక్షి జాతులు ఆయా కాలాల్లో ఇక్కడికి వలస వస్తుంటాయి. ఉన్నంతకాలం అవి ఇక్కడి పక్షులతో సహా జీవనం చేస్తాయి. అలాగని అవి ఇక్కడి పక్షి జాతుల్లో కలిసిపోతాయా? లేదా సీజను మారగానే గుంపు కట్టి తమ స్వస్థలానికి ఎగిరిపోతున్నాయి.

వలసలు వెళ్లే చేపలుగాని, పక్షులు గాని తమ జాతినో, తమ అలవాట్లనో, తమ సొంత స్థలాలనో మర్చిపోవడం లేదు, మార్చుకోవడం లేదు. మరి అన్నీ తెలిసిన మనిషి మాత్రం దేశం మారినంత మాత్రాన తన మాతృభూమిని, తమ జాతిని, సంస్కృతిని అన్నీ మర్చిపోయి తన ఉనికిని కోల్పోయి పరాయి గుంపులో కల్సిపోవడం ఎంత వరకు న్యాయం చెప్పు? ఇవన్నీ విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయాలు. ఈ రోజు ఇంగ్లీషు చదువులో పడి తెలుగును అశ్రద్ధ చేస్తున్న వాళ్లని చూస్తే అసహ్యం వేస్తుంది.

తెలుగు మాట్లాడటమే నామోషీగా భావించే వాళ్లని చూస్తే చితకతన్నాలన్పిస్తుంది. మనిషి ఎన్ని భాషలు నేర్చుకున్నా తప్పు లేదు. మాతృభాషను మర్చిపోవడం మహాతప్పు. నేను విదేశాలకు వెళ్లలేదు. కానీ అక్కడి పరిస్థితి ఊహించగలను. నా ఊహ కరెక్టో కాదో నాకు తెలియదు గానీ విదేశీయులు సైతం ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని కీర్తించిన భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పొగిడిన భాష మనది.

ప్రవాసాంధ్రులు ఎక్కడ ఉన్నా మాతృభాషను మర్చిపోకూడదు. తమ మూలాలు ఇండియాలో ఉన్నాయి. ఇక్కడ బంధువులున్నారు. మనకో జాతి ఉంది. చక్కని భాష ఉంది. వాజ్మయం ఉంది. గొప్పవారసత్వ సంస్కృతి, ఆచార వ్యవహారాలున్నాయి. విదేశాల్లో కూడా మన భాషా సంస్కృతిని కాపాడుకున్న వాళ్లే మేము తెలుగువాళ్ళమని సగర్వంగా చెప్పుకోగల్గుతారు. మన సాహితీ సంపదల్ని ముందు తరాలకు అందించిన వాళ్ళవుతారు" అంటూ విపులీకరించారు.

అందులో కొన్ని శివానీకి అర్ధమయ్యాయి. మరి కొన్ని అర్ధమవ్వలేదు. కానీ అతని మాటలు ఆమెను ఆలోచింపజేసాయి. అలా బావామరదళ్లు చాలాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. చివరకు శివానీ అడిగింది.

"ఇంతకీ బావా నేను ఎలా ఉంటే బాగుంటుందంటావ్?" అని.

ఆ ప్రశ్నకి పెద్దగా నవ్వుతాడు నవీన్.

ఎందుకు నవ్వుతావు అంటూ అడిగింది శివాని.

"శివానీ రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగిందంట నీలాంటి బుల్లెమ్మే. మరి నవ్వక ఏం చేయను. సరే ఈ విషయం నన్నడిగేకన్నా మా మహేశ్వరిని అడిగితే బాగుంటుంది. కొన్ని విషయాల్లో నువ్వు మా చెల్లాయిలా ఉంటే అంతా సంతోషిస్తారు. ముఖ్యంగా వంటావార్పు, కట్టూ-బొట్టూ. నీ అందానికి చీర కడితే చూసేవాళ్లు మూర్ఛపోతారు తెలుసా?" అన్నాడు.

"అబ్బో నువ్వు మూర్ఛపోకుండా ఉంటే చాల్లే." అంది తనూ నవ్వేస్తూ.

ఇంతలో మండువా లోగిలి నుండి డాబా ఇంటివైపు పోతున్న మేనమామ గోపాల్ ని గమనించాడు నవీన్.

"శివానీ మీ నాన్నగారు..." తిన్నె దిగాడు నవీన్.

"ఎక్కడ బావా...?" లేచి చూస్తూ అడిగింది.

"భుజాల మీదుగా శాలువా కప్పుకుని ఇప్పుడే డాబా ఇంట్లోకి వెళ్లడం చూశాను. మీకోసమే అయి వుంటుంది. పద."

నువ్వూ రావచ్చు కదా!"

"ఇప్పుడా వద్దులే... నువ్వెళ్ళు..." అంటూ ఆమెను పంపించేసి, కాసేపు ఆగి తాను బయల్దేరాడు నవీన్.

"ఓ షిట్... స్టాపిట్... ప్లీజ్... మంట... ఓహ్..." బాధతో పెద్దగా అరిచాడు అనంతసాయి.

అతని గాయాలకి టించరు వేసి అద్దుతున్న మహేశ్వరి కోపంతో మరి కాస్త గట్టిగా అదిమింది.

"ఏం బీరు తాగి బోర్లా పడ్డప్పుడు తెలీలేదా మంట? కొంచెం ఓర్చుకో అదే తగ్గిపోతుంది" అంటూ చేస్తున్న పని ముగించి, కట్టు కట్టింది.

గణపతి బృందం కొట్టిన మిగిలిన దెబ్బలు తగ్గిపోయినా, మోకాలి మీద పుండు మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతోంది.

ఇది తాగి పడ్డ దెబ్బ కాదని అరిచి చెప్పాలని నోటిచివరకు వచ్చిన మాటల్ని బలవంతంగా మింగేశాడు.

"ఏయ్ మహీ..." అంటూ సోఫాకి జేరబడ్డాడు.

"ఏమిటి బావా...?" ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సర్దుతూ అతడి వంక చూసింది.

"ఇంట్లో ఎవరికీ నా గురించి పట్టదు. నీకుమాత్రం నామీద ఎందుకంత శ్రద్ధ?" కుతూహలంగా అడిగాడు.

ఆమె చురచురా చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకొని వెళ్లిపోవడానికి లేచింది.

"ఏమిటి నాకు బదులు చెప్పకుండా వెళ్ళిపోతున్నావ్...?" అడిగాడు.

"ఎవరికీ పట్టదని ఎందుకనుకుంటున్నావ్. నీకేం కావాలన్నా చూసుకోవడానికి నేనున్నాను. అందుకే వాళ్లు పట్టించుకోరు. ఇది కూడా తెలీదా?" అంది కోపంగా.

"ఏదో చిన్న ప్రశ్న అడిగాను. దానికే ఇంత కోపంగా చూడాలా? నిన్ను నేను పట్టించుకోవడం లేదుగా. అయినా నీకింత శ్రద్ధ దేనికి? ప్రతి విషయంలోనూ నువ్వు నన్ను దబాయించడం నచ్చలేదు."

"అందుకు నన్నేం చేయమంటావ్? నీ పద్ధతి కూడా నాకు నచ్చట్లేదు. నచ్చనప్పుడు దబాయిస్తాను.

"నా పద్ధతి ఏం నచ్చలేదు?"

"ఏం నచ్చలేదా? అంతదూరం నుంచి మావయ్య వస్తే, డబ్బు షేర్ల మీద పెట్టి నాశనం చేసావంటూ, అసలే బాధల్లో ఉన్న ఆయన్ని మరింత బాధపెడతావా? బుద్ధున్నవాళ్లు ఎవరన్నా అడగాల్సిన మాటలేనా అవి? అడగటానిక్కూడా ఓ సమయం సందర్భం ఉండక్కర్లేదా? ఆయన గాబట్టి వూరుకున్నారు. నేనయితే చెంప పగలగొట్టేదాన్ని."

"ఓరి దేవుడా. ఇంత గయ్యాళివేమిటే నువ్వు. నా చెంప పగలగొడతావా?

"తప్పు చేస్తే ఊరుకుంటారా? అమ్మమ్మ చేతి దెబ్బలు రుచి చూసాం గాబట్టే మా అన్నయ్య, నేనూ ఇలా వున్నాం. మావయ్య మిమ్మల్ని అతి గారాబంగా పెంచారు కాబట్టి మీరు అలా ఉన్నారు. లేకపోతే ఇంత వయసు వచ్చినా మీరు బాధ్యత లేకుండా, బీర్లు తాగి గంతులేస్తూ ఆకతాయిల్లా ఎందుకు తయారవుతారు?

నిప్పుల్లో కాల్చి సుత్తితో కొడితేగాని బంగారమైనా నగ అవదు. పెద్దల చేతిలో దెబ్బలు తింటేనే పిల్లలు పద్ధతిగా పెరుగుతారు."

"చంపావ్ పో... నీ వరస చూస్తే, ఇప్పుడు నన్ను కొట్టి బుద్ధి చెప్పేలా ఉన్నావ్. సరే ఇకనుంచి నా అవసరాలు నేను చూసుకుంటాను. నువ్వు పట్టించుకోవద్దు."

"చూద్దామా? ఆ మాటమీదే వుండు" అంటూ కోపంగా నాలుగు అడుగులు వేసింది.

అంతలోనే "ఏయ్ మహీ" అంటూ పిలిచాడు అనంత్.

"మళ్ళీ ఏమిటి?" తిరిగి చూసి అడిగింది.

"ఏం లేదు. బోర్ కొడుతుంది. కొంచెం టి.వి ఆన్ చేసి వెళ్ళు" అన్నాడు.

అంతే ఆమెకు తన్నుకొచ్చేసింది కోపం.

"బోర్ కొడుతుందా? టివి ఆన్ చెయ్యాలా? ఇప్పుడేగా పట్టించుకోవద్దని బడాయి కబుర్లు చెప్పావు. నీ కంటికి ఎలా కనబడుతున్నాను?" అంటూ చేతిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని విసిరి కొట్టింది కోపంగా.

సమయానికి పట్టుకున్నాడు గాని లేకపోతే ముఖం పగిలేది. ఆమె ఉడుక్కోవడం చూసి పెద్దగా నవ్వేసాడు. ఆ నవ్వును చూసి నిజంగానే మీదపడి కొట్టేయాలన్నంత కోపంతో వెనక్కి వచ్చింది గాని, ఎవరో లోనకు వస్తున్న అడుగుల చప్పుడు వినబడి ఆగిపోయి అటు చూసింది. మావయ్య లోనకొస్తూ కన్పించాడు.

"ఏమ్మా మహేశ్వరి! ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. ఏమైంది?" అంటూ లోనకొచ్చాడాయన.

"ఛూడు మావయ్యా! అనంత్ బావ ఎప్పుడు చూడు నన్ను ఉడికించి ఏడిపిస్తూనే వున్నాడు..." అంటూ గబగబా ఎదురువెళ్ళి పిర్యాదు చేసింది.

"ఓసినీ నిన్ను ఏడిపించానా? ఆగు చెప్తా" అనుకుంటూ తండ్రిని చూసి లేచి నిలబడ్డాడు అనంతసాయి.

"ఏమిట్రా అనంత్, ఏంపనిది?" కొడుకును అడిగాడు.

"అబ్బే అదేంలేదు డాడీ" అన్నాడు బుద్ధిమంతుడిలా.

"బావ మాటలు నమ్మకు మావయ్యా. ఇప్పుడే... మీరు వచ్చే ముందే నీకు వంట చేయడంరాదని ఉడికిస్తూ వెకిలినవ్వు నవ్వాడు"

"ముందు వాడికి మన వంటలు తినడం వచ్చో రాదో అడుగు" అంటూ సోఫాలో కూర్చున్నాడు గోపాల్.

"నన్నిరికించాలని చూస్తావా!" అన్నట్టు కళ్లతోనే బెదిరిస్తూ ఆయన చూడకుండా మహేశ్వరి నడుం మీద గిల్లాడు అనంత్.

కీచుగా అరిచింది మహేశ్వరి.

"ఏమైంది? చటుక్కున తలెత్తి చూసాడు గోపాల్.

"అబ్బె ఏం లేదు మావయ్యా! బొద్దింక... పాడు బొద్దింక... అదంటే నాకు భయం. నే వస్తాను" అంటూ చిమచిమలాడుతున్న నడుం మీద చేతితో రుద్దుకుంటూ అనంత్ ని కొరకొరా చూసి వేగంగా బయటకెళ్లిపోయింది.

వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు అనంత్.

"ఏరా! శివానీ ఎక్కడ?" అంటూ తండ్రి పిలవడంతో వెళుతున్న మహేశ్వరి నుంచి చూపులు తిప్పుకున్నాడు.

"ఇక్కడే ఎక్కడో ఉంటుంది డాడీ. వచ్చేస్తుంది" చెప్పాడు.

"కూర్చో! మీతో మాట్లాడాలి."

ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు అనంత్.

అంతలో శివానీ లోపలికొచ్చింది.

"డాడీ! ఇంకా మీరు నిద్రపోలేదా?" అంటూ ఆయన పక్కన కూర్చుంది.

"ఇంకాలేదు. ఇంతసేపూ ఎక్కడున్నావ్?"

"పెరట్లో వెన్నెల్లో కూర్చున్నాను. మీరు రావడం చూసివచ్చాను."

"అలాగా... ఏరా అనంత్! ఇక్కడ మీకు ఇబ్బందేమీ లేదుగా?"

"లేదు... డాడీ..."

"సరి సరి ఒక విషయం మిమ్మల్ని అడగాలి. అందుకే ఇలా వచ్చాను. ఇప్పుడున్న పరిస్థితిలో నేను వెంట డబ్బులేమీ తెచ్చుకోలేకపోయాన్రా. మీ దగ్గర డబ్బులేమన్నా ఉన్నాయా?"

ఆయన అలా అడగ్గానే అన్నాచెల్లెళ్ళు ముఖాలు చూసుకున్నారు. తమ దగ్గర డబ్బుంది.

హైదరాబాద్ లో గణపతి నుంచి తమ బాకీ డబ్బు వసూలు చేసి తెచ్చిన మూడు లక్షల నలభైవేలతో బ్రీఫ్ కేస్ అలానే ఉంది. ఆ డబ్బు తండ్రికి ఇచ్చేస్తే ఇక తమ దగ్గర
డబ్బుండదు. కాని తమకు చిన్నప్పట్నుంచి ఏది కోరితే అది ఇచ్చిన తండ్రి ఆయన. తమ పాకెట్ మనీగా లక్షలకు లక్షలు ఇచ్చిన తండ్రి.

ఎప్పుడూ ఇవ్వడమేగాని చేయి సాచి అడగని వ్యక్తి. ఇవాళ తమనే అడగడం ఇద్దరికీ చాలా బాధన్పించింది.

క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోనకెళ్ళి బ్రీఫ్ కేస్ తెచ్చి తండ్రి ఎదురుగా టీపాయ్ మీద ఉంచాడు అనంతసాయి.

"ఏమిట్రా ఇది?" బ్రీఫ్ కేస్ చూస్తూ అడిగాడు గోపాల్.

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
duradrustapu dongalu