Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrydayam

ఈ సంచికలో >> సినిమా >>

అలా ఈ సినిమాలు తీసారు!

alaa ee cinemalu teesaru

ఒక భాషలో ఏదైనా సినిమా విజయం సాధించడం, దాని రీమేక్ హక్కులు తీసుకుని మళ్ళీ తీయడం అనేది సర్వసాధారణ విషయమే! ఈ రీమేక్ హక్కులు అనేవి హీరోలు, దర్శకులకు తగ్గట్టుగా లక్షల్లో, కోట్లలో ఉంటాయ్. ఇలా హక్కుల కోసం కొంత ఖర్చు, సినిమా తీయడం కోసం ఇంకొంత ఖర్చు కలిపి భారీగా అవుతుంది. ఇంత చేసినా సినిమా విజయం సాధిస్తుంది అన్న నమ్మకం లేదు. ఎందుకంటే రీమేక్ చేసిన సినిమాల విజయం శాతం చాలా తక్కువ కాబట్టి. కానీ కొంతమంది దర్శకులు తెలివిగా ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాల రీమేక్ హక్కులు పొందకుండా ఆ సినిమాల్లోని మూలకథను మాత్రం తీసుకుని ఏ భాషలో ఆ సినిమా తీయాలనుకుంటారో ఆ నేటివిటీకి దగ్గరగా భారీగా మార్పులు చేర్పులు చేసి సినిమాను తీస్తారు. అంటే ఇతర సినిమాల ఆధారంగా సినిమాలు తీయడమన్న మాట.

అలాంటి సినిమాల గురించి కొన్ని సంగతులు...

'పోకిరి' సినిమా మహేష్ బాబునే కాక దర్శకుడు పూరీ జగన్నాథ్ ను కూడా అగ్రస్థాయికి తీసుకెళ్ళింది. అంత పెద్ద విజయం సాధించింది ఈ సినిమా. నిజానికి ఈ 'పోకిరి' సినిమా ఒక హాలీవుడ్ సినిమా ఆధారంగా తీసింది. ఆ సినిమా ఏమిటంటే 'టైటానిక్' ఫేం లియోనార్డో డికాప్రియో నటించిన 'ది డిపార్టెడ్' సినిమా మూలకథను తీసుకుని 'పోకిరి' తీసారు. 'ది డిపార్టెడ్' సినిమా ఆధారంగానే జె.డి. చక్రవర్తి 'హోమం' ను, రవితేజ నటించిన 'ఖతర్నాక్' ను తీసారు.

నాగార్జున నటించిన 'శివమణి' కూడా హాలీవుడ్ లో వచ్చిన 'ఏ మెసేజ్ ఇన్ ది బాటల్' సినిమా ఆధారంగా వచ్చిందే. అలాగే గత సంవత్సరం వచ్చిన రవితేజ, ఇలియానాల 'దేవుడు చేసిన మనుషులు' కూడా ఒక హాలీవుడ్ సినిమా ఆధారంగా తీసారు.

పవన్ కళ్యాణ్, అరుణ్ ప్రసాద్ కాంబినేషన్ లలో వచ్చిన 'తమ్ముడు' సినిమా విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈ 'తమ్ముడు' సినిమా బాలీవుడ్ లో హిట్టైన అమీర్ ఖాన్ చిత్రం 'జో జీతా వహీ సికిందర్' ఆధారంగా తీసారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'ఆర్య' సూపర్ హిట్. తరుణ్, అనితల తో కొండా దర్శకత్వంలో దుర్గా ఆర్ట్స్ నిర్మించిన 'నిన్నే ఇష్టపడ్డాను' ఆడియో హిట్ సినిమా ఫ్లాప్. సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' సినిమా ఆధారంగానే 'ఆర్య', 'నిన్నే ఇష్టపడ్డాను' సినిమాలు తీసారు. అలానే తమిళంలో విజయం సాధించిన 'కాదల్ కొండేన్' సినిమా కూడా 'మహర్షి' ఆధారంగానే వచ్చింది.

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఆదుర్తి సుబ్బారావుల కాంబినేషన్ లో పెద్ద హిట్టైనది 'మూగ మనసులు' సినిమా. పునర్జన్మల నేపధ్యంలో వచ్చింది ఈ సినిమా. 'మూగ మనసులు' మూలకథ ఆధారంగా కె. రాఘవేంద్రరావు, నాగార్జున, విజయశాంతి ల కాంబినేషన్ లో వచ్చిన 'జానకి రాముడు' కూడా హిట్టే. అలాగే అల్లరి నరేష్, సదా కాంబినేషన్ లో వచ్చిన 'ప్రాణం' కూడా 'మూగ మనసులు' చిత్రం ఆధారంగానే వచ్చింది.

వెంకటేష్, మీనా, జయచిత్రల కాంబినేషన్ లో ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో 'రాశి మూవీస్' సంస్థ తీసిన 'అబ్బాయిగారు' సినిమా విజయం సాధించింది. ఈ సినిమా హిందీలో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ లతో వచ్చిన 'బేటా' సినిమాకు రీమేకు. నిజానికి ఈ 'బేటా', 'అబ్బాయిగారు' సినిమాలు ఒక తెలుగు సినిమా ఆధారంగానే వచ్చినవే. ఆ సినిమా ఏదో కాదు! అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య ల కాంబినేషన్ లో విజయం సాధించిన అలనాటి 'అర్ధాంగి' సినిమానే.

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం 'నాయగన్'. తెలుగులో 'నాయకుడు' గా డబ్బింగ్ చేయబడింది. 'నాయగన్' సినిమా ఘనవిజయం సాధించడమే గాక ఏకంగా కమల్ హాసన్ కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సైతం వచ్చింది. అలాగే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జె.డి. చక్రవర్తి హీరోగా వచ్చిన చిత్రం 'సత్య' విజయం సాధించింది. నిజానికి 'నాయకుడు', 'సత్య' సినిమాలు హాలీవుడ్ లో సూపర్ హిట్టైన అలనాటి మేటి చిత్రం 'గాడ్ ఫాదర్' ఆధారంగా తీసినవే.

తమిళంలో సూపర్ హిట్టైన 'అణ్ణామలై' రీమేకు గా తెలుగులో వెంకటేష్, నగ్మా, సుమన్ లతో దర్శకుడు రవిరాజా పినిశెట్టి తీసిన చిత్రం 'కొండపల్లి రాజా'. నిజానికి 'అణ్ణామలై' సినిమా తెలుగులో పాతికేళ్ళ కిందట కృష్ణంరాజు, రాధలతో వచ్చిన 'ప్రాణ స్నేహితులు' సినిమా ఆధారంగా వచ్చిందే!

s.v. కృష్ణారెడ్డి, శ్రీకాంత్, రమ్యకృష్ణ ల కాంబినేషన్ లో విజయం సాధించిన సినిమా 'ఆహ్వానం'. నిజానికి ఈ సినిమాకు ఆధారం కె.వి. రెడ్డి దర్శకత్వంలో అక్కినేని, జమునలు నటించిన 'పెళ్ళినాటి ప్రమాణాలు' సినిమా.

'పెదరాయుడు' సినిమా మోహన్ బాబు హీరోగా వచ్చి ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకు ఆధారం కృష్ణంరాజు, కె.రాఘవేంద్రరావు ల కాంబినేషన్ లో సూపర్ హిట్టైన 'బొబ్బిలి బ్రహ్మన్న' సినిమా.

'ఏక్ దో తీన్' అంటూ కుర్రకారును హుషారెత్తించిన పాట హిందీలో ఘనవిజయం సాధించిన అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ లు నటించిన 'తేజాబ్' సినిమాలోది. ఈ 'తేజాబ్' ఆధారంగా వచ్చి ఘనవిజయం సాధించడమే గాక ఏకంగా ప్రభాస్ కు స్టార్ డమ్ సంపాదించిన సినిమా 'వర్షం'.

చిరంజీవికి స్టార్ డమ్ తెచ్చిన చిత్రం 'ఖైదీ'. 1983 లో వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించి చిరంజీవిని అగ్రస్థాయికి తీసుకెళ్ళింది. ఈ 'ఖైదీ' సినిమాకు ఆధారం హాలీవుడ్ లో సూపర్ హిట్టైన సిల్వర్ స్టాలోన్ నటించిన 'ఫస్ట్ బ్లడ్' సినిమా. గుణశేఖర్, చిరంజీవి కాంబినేషన్ లో దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ తీసిన చిత్రం 'మృగరాజు' భారీ డిజాస్టర్ మూవీగా మిగిలింది. ఈ సినిమా హాలీవుడ్ లో సింహం ముఖ్య నేపధ్యంలో వచ్చిన ఓ సినిమా ఆధారంగా వచ్చింది.

నాగార్జున, ఇ.వి.వి. సత్యనారాయణల కాంబినేషన్ లో ఘనవిజయం సాధించిన 'హలో బ్రదర్' సినిమా కూడా హాలీవుడ్ సినిమా 'ట్విన్ బ్రదర్స్' స్ఫూర్తితో తీసినదే. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో ఆమని, నాగార్జున చిన్న కొడుకు 'అఖిల్' లతో వచ్చి విజయం సాధించిన సినిమా 'సిసింద్రీ'. ఇది హాలీవుడ్ సినిమా 'బేబీస్ డే అవుట్' ఆధారంగా తీసిందే.

గిరిబాబు దర్శకత్వంలో బోసుబాబు (గిరిబాబు చిన్నకొడుకు) హీరోగా వచ్చిన సినిమా 'ఇంద్రజిత్'. ఈ సినిమా చిరంజీవి హీరోగా వచ్చిన కౌబాయ్ సినిమా 'కొదమ సింహం' ఆధారంగా వచ్చిందే. అలాగే s.v. కృష్ణారెడ్డి దర్శకత్వంలో 'ఒరేయ్ పండు' అని ఒక సినిమా వచ్చి అపజయం పొందింది. ఈ సినిమా హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'కోయీ మిల్ గయా' సినిమా ఆధారంగా వచ్చింది.

సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ కాంబినేషన్ లో సూపర్ హిట్టైన సినిమా 'సాజన్'. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయ్. ఈ సాజన్ స్ఫూర్తితో ఇరవై ఏళ్ళ కిందట కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాలలు నటించిన 'అల్లరి ప్రియుడు' సినిమా ఘనవిజయం సాధించింది.

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఘనవిజయం సాధించిన చిత్రం 'పెళ్ళి సందడి'. శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమాల్లో ఈ 'పెళ్ళిసందడి' కలెక్షన్స్ పరంగా ముందుంటుంది. ఈ సినిమా హిందీలో సూపర్ డూపర్ హిట్టైన సల్మాన్ ఖాన్, మాధురీదీక్షిత్ లు నటించిన 'హమ్ ఆప్ హై కౌన్' ఆధారంగా వచ్చిందే.

షారుక్ ఖాన్, కాజోల్ లతో వచ్చిన 'దిల్ వాలే దుల్హనియా లేజాయెంగె' సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆధారంగానే కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జె.డి. చక్రవర్తి, రంభ ల కాంబినేషన్ లో 'బొంబాయి ప్రియుడు' సినిమా వచ్చింది.

ఇంకా 'ఛత్రపతి', 'మగధీర', 'మర్యాద రామన్న' (ఈ మూడూ హాలీవుడ్ చిత్రాల ఆధారంతో), ఛార్మి 'సుందరకాండ' (బాపు 'ముత్యాలముగ్గు' ఆధారం), నరేష్, దివ్యవాణి ల 'పెళ్ళికొడుకు' (బాపు 'బంగారు పిచుక' ఆధారం), భద్ర (మహేష్ 'ఒక్కడు' ఆధారం), జోష్ (వర్మ 'శివ' ఆధారం), జగపతిబాబు, కళ్యాణి ల 'కబడ్డీ కబడ్డీ' ('లగాన్' ఆధారం), రాజశేఖర్ 'గోరింటాకు' (అలనాటి 'రక్త సంబంధం' ఆధారం), ఓ మై ఫ్రెండ్ (చిరంజీవి 'ఇద్దరు మిత్రులు' ఆధారం), యమదొంగ ('యముడికి మొగుడు', 'యమగోల' ఆధారం), ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఇతర సినిమాల ఆధారంగా వచ్చాయి. వస్తున్నాయి!

-- కె. సతీష్ బాబు

మరిన్ని సినిమా కబుర్లు
murisipoyina seetarama sastry