Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఫ్లాప్ ఓ పీడ‌క‌ల‌... - వెంక‌టేష్‌

flop oka peedakala - venkatesh

ఫ్లాప్ ఓ పీడ‌క‌ల‌... దాన్ని గుర్తుకు తెచ్చుకోవ‌డం ఎందుకు??

వెంక‌టేష్ ఆలోచ‌న‌లు వైవిధ్యంగా ఉంటాయి. ఆయ‌న ఎప్పుడూ ఓ స్టార్ లా ఆలోచించ‌రు. అస‌లు స్టార్‌లానే క‌నిపించ‌రు. మ‌న‌లో ఒక‌డిగా, మామూలు మ‌నిషిలా క‌నిపిస్తుంటారు. కానీ... ఆయ‌న‌లో ఓ త‌త్వ‌వేత్త ఉన్నాడు. ఆధ్యాత్మిక వేత్త దాగున్నాడు. సినిమాని సినిమాగా చూసే ఓ స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఉన్నాడు. పాతికేళ్లుగా ఆయ‌న కెరీర్ ఎప్పుడూ ఒకేలా సాగుతోంది. హిట్లు వ‌చ్చాయ‌ని ఆయ‌న వేగం అమాంతం పెంచేయ‌లేదు. ఫ్లాపుల వ‌ల్ల‌... ఆయ‌న గ్రాఫ్ ప‌డిపోనూ లేదు. అందుకే మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకొన్నాడు. ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు ఆయ‌నే పెద్ద దిక్కు. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌కు కొత్త ఊపిరి పోశారు. త్వ‌ర‌లో రామ్ చ‌ర‌ణ్‌తోనూ క‌ల‌సి న‌టించ‌బోతున్నారు. ఇప్పుడు రామ్‌తో జ‌త క‌ట్టిన మ‌సాలా సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సంద‌ర్భంగా వెంక‌టేష్‌తో ముఖాముఖీ ఇది.

మీ నుంచి మ‌రో మ‌ల్టీస్టార‌ర్ వ‌స్తోంది. ఆ త‌ర‌హా చిత్రాల‌కు అంకితం అయిపోయిన‌ట్టేనా?
ఇలాంటి క‌థ‌ల‌కు వెంక‌టేష్ అందుబాటులో ఉన్నాడు.... అని ద‌ర్శ‌కులు భావిస్తున్నారంటే అది అదృష్ట‌మే క‌దా..?  మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు ఇమేజ్ గోడ‌లు అడ్డొస్తాయి అనుకొనేవారు. ఇప్పుడు వాటిని బ‌ద్ద‌ల కొట్టుకొని క‌థానాయ‌కులు న‌టించ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మంచి ప‌రిణామ‌మే క‌దా..?

మ‌రి మ‌రో హీరో ఉంటే... హీరోయిజం త‌గ్గిపోతుందేమో...?  అనేభ‌యం ఎప్పుడూ వేయ‌లేదా?
నా కెరీర్‌ని చూస్తూనే ఉన్నారు క‌దా..?  హీరోయిజం కోసం ఎప్పుడూ పాకులాడ‌లేదు. చంటిలో హీరోయిజం ఎక్క‌డ ఉంది?  సుంద‌రకాండ‌లో ఫైట్లు చేశానా?  శీనులో కూడా అంతే క‌దా..?  నాకు క‌థ న‌చ్చాలి. అంతే. ఎవ‌రు ఎక్కువ ఎవ‌రు త‌క్కువ అనే లెక్క‌లేసుకొంటే మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు రావు.

ఇంత‌కీ మ‌సాలా ఎలాంటి సినిమా?
వినోదాత్మ‌క చిత్రాల కోసం ఇప్ప‌టి ప్రేక్ష‌కులు చాలా ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అలాంటివారంద‌రికీ మ‌సాలా బాగా న‌చ్చుతుంది. యాక్ష‌న్ స‌న్నివేశాలూ ఉన్నాయ‌నుకోండి. అయితే... అవి కుటుంబ ప్రేక్ష‌కుల‌కు నచ్చేలా డిజైన్ చేశాం.

ఈ సినిమాలో రామ్ న‌టిస్తున్నాడు అన‌గానే మీలో క‌లిగిన మొద‌టి ఫీలింగ్..?
బోల్ బ‌చ్చ‌న్ సినిమా ఇది రీమేక్‌. అందులో ఈ పాత్ర‌... అభిషేక్ చేశాడు. రామ్ న‌టిస్తున్నాడు అన‌గానే - ఆ పాత్ర‌కి నూటికి నూరుపాళ్లూ రామ్ న్యాయం చేస్తాడ‌నిపించింది. అనుకొన్న‌ట్టుగానే రామ్ ఆ పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయాడు. పాట‌లు, కెమెరా ప‌నిత‌నం అన్నీ బాగా కుదిరాయి. అలీ, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, కోవై స‌ర‌ళ‌.... వీళ్లంద‌రి పాత్ర‌లు కూడా త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకొంటాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది.

విజ‌య‌భాస్క‌ర్‌తో హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నార‌న్న‌మాట‌?
స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు విజ‌య‌భాస్క‌ర్‌. నువ్వు నాకు న‌చ్చావ్, మ‌ల్లీశ్వ‌రి సినిమాలు బాగా ఆడాయి. ఇప్ప‌టికీ ఆ సినిమాల్ని టీవీల్లో మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తుంటారు. ఫ్యామిలీ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు. ఈమ‌ధ్య విజ‌యాల్లేవు. కానీ మ‌సాలా సినిమాతో మ‌ళ్లీ గాడిలో ప‌డిపోతాడు. ఇక హిట్ అంటారా..?  ఆ విష‌యం గురించి ఇప్పుడే మాట్లాడ‌కూడ‌దు. సినిమా చూసిన త‌ర‌వాత ప్రేక్ష‌కులే చెప్పాలి.

ఈత‌రం ప్రేక్ష‌కుల అభిరుచుల్ని ప‌సిగ‌ట్టారా?
త‌రం ఏదైనా స‌రే.. మంచి సినిమాల‌నే చూస్తున్నారు. ఓ సినిమాకి వెళ్లే ముందు చాలా ర‌కాలుగా ఆలోచిస్తున్నారు. అందుకే ప్ర‌చారంలో కూడా కొత్త పోక‌డ‌ల‌ను అన్వేషించాలి.

మ‌సాలా ప్రచారం కోసం కొత్త‌గా ఏం చేస్తున్నారు?
ఓ కామెడీ స్కిట్ షూట్ చేశాం. అది ప్ర‌చార చిత్రంగా బాగా ప‌నికొచ్చింది. ఈ సినిమా ఎంత స‌ర‌దాగా ఉండ‌బోతోంది అనేదానికి అదే ఉదాహ‌ర‌ణ‌.

తెలుగు సినిమా వంద కోట్ల మార్క్ చేరుకొంది. ఓ క‌థానాయ‌కుడిగా మీ ఫీలింగ్ ఏమిటి?
చాలా సంతోషంగా ఉంది. సినిమా బ‌డ్జెట్ పై ఏమైనా బెంగ‌లు ఉంటే త‌గ్గించుకొంటారు. ఓ సినిమాకి ఎంతైనా పెట్టుబ‌డి పెట్టొచ్చు... అనే న‌మ్మ‌కం క‌లుగుతోంది. ప్ర‌యోగాలు చేయ‌డానికి ఎవ‌రూ వెనుకాడ‌రు.

మీ ఇంట్లో ఇద్ద‌రు నిర్మాత‌లున్నారు. మీరూ నిర్మాత‌గా మారే ఆలోచ‌న ఏమైనా ఉందా?
నా సినిమాల‌కు నేను నిర్మాత‌గానే ఆలోచిస్తా. ఎక్క‌డ డ‌బ్బును కంట్రోల్ చేయాలి, ఇంకెక్కడ ఖ‌ర్చుపెట్టాలి.?  ఈ విష‌యాల‌పై స‌ల‌హాలు ఇస్తుంటాను. సురేష్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌కు ఎప్పుడూ నేనొక వ‌ర్క‌ర్ లానే క‌ష్ట‌ప‌డ‌తా.

షాడో ఫలితం మిమ్మ‌ల్ని బాగా నిరాశ ప‌రిచిందా?
గెలుపు ఓట‌ముల గురించి నేనెప్పుడూ ఆలోచింను. బాధ‌ప‌డితే ఫ్లాప్ హిట్ గా మారిపోతుందా?  లేదు క‌దా..?  ఫ్లాప్ ఒక పీడ‌క‌ల అయితే దాన్ని మ‌ర్చిపోవ‌డానికే ప్ర‌య‌త్నించాలి. ప‌ని చేయ‌డం వ‌ర‌కే మ‌న బాధ్య‌త. ఫ‌లితం గురించి ప‌ట్టించుకోకూడ‌దు.

మీలో ఓ ఆధ్యాత్మిక వేత్త కూడా ఉంటాడు. కార‌ణం ఏమిటి?
అంద‌రిలోనూ ఉంటాడు. కాక‌పోతే ఎవ‌రూ మాట్లాడ‌రు. మ‌నం చూస్తున్న‌దంతా క‌ల‌. అబ‌ద్ధం. నిజం ఏదో ఉంది. అది తెలిసిన రోజు.. అంద‌రూ నాలానే ఆలోచిస్తారు.

మ‌రి మీకు తెలిసిన నిజం ఏమిటి?
మ‌నం అబ‌ద్ధంలో బ‌తుకుతున్నాం. మ‌న‌వి గ్యారెంటీ లేని జీవితాలు. రాత్రి ప‌డుకొంటే.. తెల్లారి లేస్తామా?  గ్యారెంటీ లేదు. నిన్న బాగా క‌నిపించిన వాడు ఈరోజు మ‌న మ‌ధ్య ఉండ‌డం లేదు. ఎవ‌రికి గ్యారెంటీ ఉంది?  ఏదీ మ‌న చేతుల్లో లేదు. అంతా మ‌న‌మే చేస్తున్నాం, ఇదంతా మ‌న‌దే అనుకొనే భ్ర‌మ‌ల్లో ఉంటాం. అందులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రోజే నిజాలు తెలుస్తాయి.

మీరు హిమాల‌యాల‌కు వెళ్లార‌ట‌..?
అవును. కానీ అక్క‌డ కూడా నా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌క‌లేదు.

మీ అభిమానుల‌కు మీరిచ్చే స‌ల‌హా..?
ధ్యానం చేయండి. స‌త్యం కోసం అన్వేషించండి. అంతే.

మీ త‌దుప‌రి సినిమాలేమిటి?
కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాను. మారుతి సినిమా ఒక‌టి ఉంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ తెర‌కెక్కించే చిత్రంలో న‌టిస్తా. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది ఇంకా తేల‌లేదు.

--కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
satya - 2: movie review