Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue309/797/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/ 

 

(గత సంచిక తరువాయి)..... మరునాడు కంప్యూటర్ క్లాసుకు బయులదేరింది మిత్రవింద. స్నేహితురాలికి కాల్ చేద్దామని సెల్ ఫోన్ కోసం బ్యాగ్ లో చూసింది. సెల్ ఫోన్ కనిపించలేదు. కంగారుగా బ్యాగ్ మొత్తం వెతికింది. కాని సెల్ ఫోన్ జాడలేదు. ఎక్కడ మరిచిపోయానా అని ఆలోచనలో పడింది. ఆమెకు వెంటనే గుర్తుకువచ్చింది. కంగారులో సెల్ ఫోన్ గుహలో మరిచిపోయింది. అదే సమయంలో జహీర్ అబ్బాస్ చేసిన హెచ్చరిక కూడా గుర్తుకువచ్చింది.

ఎట్టిపరిస్ధితిలోను మళ్ళి అటువైపు రావద్దని మరిమరి చెప్పాడు అతను.

ఇప్పుడు ఏం చెయ్యాలో మిత్రవిందకు గుర్తుకురాలేదు. అది మాములు సెల్ ఫోన్ కాదు. ఆ సెల్ ఫోన్ పోయిన మిత్రవింద పుట్టినరోజునాడు చక్రపాణి దాన్ని కానుకగా కూతురికి ఇచ్చాడు. అప్పటినుంచి ఆసెల్ ఫోన్ ను చాల జాగ్రర్తగా చూసుకుంటుంది మిత్రవింద. తను తప్ప ఆ సెల్ ఫోన్ ను ఎవరు వాడనివ్వదు. చివరకు చెల్లెలు వసంతసేనకు కూడా ఇవ్వది. అలాంటి సెల్ ఫోన్ ఇప్పుడు పాకిస్దాన్ భూభాగంలో ఉన్న గుహలో ఉంది.

ఇంతకంటే విచిత్రమైన సంఘటన ఇంకేం ఉండదు.

ఏం చెయ్యాలా అని తర్జనభర్జన పడింది మిత్రవింద. వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో పడింది. చివరకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆటోలో అక్కడికి చేరుకుంది. కంచె కు కొద్ది దూరంలో ఆటోను ఆపి దిగింది. ఆటోవాడికి ఫేర్ ఇచ్చి మెల్లగా అటువైపు నడిచింది. సరిగ్గా కంచెకు పదడుగుల దూరంలోకి వచ్చి చుట్టు చూసింది. ఆశ్చర్యం ఆ రోజు కూడా ఒక్కసెక్యురిటి గార్డ్ కూడా కనిపించలేదు. చుట్టు నిశబ్ధంగా నిస్తేజంగా ఉంది.

అయిన మిత్రవింద తొందరపడలేదు. ఒకసారి మృత్యుమొహంలోకి వెళ్ళి తిరిగివచ్చింది. మళ్ళి అలాంటి సాహసం చెయ్యటం ఆమెకు ఇష్టంలేదు. అందుకే అయిదునిమిషాల పాటు కాచుకుంది. అప్పటికి ఎవరు రాలేదు. దాంతో ఆమెకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఎందుకైన మంచిదని అటుఇటు చూసింది.  రోడ్డు మీద పెద్దగా ట్రాఫిక్ లేదు. లారీలు బస్సులు మాత్రం వేగంగా దూసుకుపోతున్నాయి.
    క్షణంలో కంచెలోంచి అవతలకు వెళ్ళింది మిత్రవింద. తరువాత పరుగులాంటి నడకతో గుహ వైపు దూసుకుపోయింది. అప్పుడే ఆమె ఎంతమాత్రం ఊహించని అనుహ్యమైన సంఘటన జరిగింది. లోపలనుంచి అప్పుడే జహీర్ అబ్బాస్ వస్తున్నాడు. అతనిచేతిలో మిత్రవింద సెల్ ఉంది.  ఆ సమయంలో అతన్ని చూసి ఆమె చాల ఆశ్చర్యపోయింది. నిజానికి అదిరిపోయింది. కాని అబ్బాస్ మిత్రవిందను చూసి కొంచం కూడా రియాక్ట్ కాలేదు. చాల క్యాజువల్ గా రిలాక్స్ గా ఉన్నాడు.

“మీరు దీనికోసం వస్తారని నాకు తెలుసు”అన్నాడు అతను నవ్వుతూ.

“ఎలా తెలుసు”అంది మిత్రవింద.

“ఫోన్ చూస్తే అర్ధమైంది. ఈ రోజు నాకు సెలవు. ఏం తోచక సరదాగా ఇలా వచ్చాను. క్యాజువల్ గా గుహలోపలికి వెళ్ళాను. అక్కడ నేలమీద ఈ సెల్ ఫోన్ కనిపించింది. తీసి చూశాను. అందులో మీ నాన్నగారి ఫోటో కనిపించింది. మీకు మీ నాన్నగారంటే చాల ఇష్టమని అప్పుడే గ్రహించాను. దీన్ని ఎలాగైన మీకు అందచెయ్యాలని ప్రయత్నిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ కు కాల్ చేద్దామని భావించాను. కాని ఈ లోగా మీరే వచ్చారు. ఇదిగో మీ సెల్ ఫోన్”అన్నాడు అబ్బాస్.

మెల్లగా వెళ్ళి తన సెల్ ఫోన్ అందుకుంది మిత్రవింద.

“మీరు ఊహించింది నిజమే. ఈ సెల్ ఫోన్ నాకు ఎంతో అమూల్యమైంది. దీన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. పోయన సంవత్సరం పుట్టిన రోజు నాడు మా నాన్నగారు దీన్నినాకు గిఫ్ట్ గా ఇచ్చారు. అప్పుటినుంచి దీన్ని ఎంతో జాగ్రర్తగా చూసుకుంటున్నాను”అంది మిత్రవింద.

“ఇప్పుడు మీకు అర్జంట్ పని ఉందా”అడిగాడు అబ్బాస్.

“లేదు ఎందుకు అడిగారు”ఆశ్చర్యంగా అడిగింది మిత్రవింద.

“ఈ రోజు మాకు సెలవు. అందరితో పాటు సెక్యురిటికి కూడా సెలవు. నాకేం తోచటం లేదు. మీకు అభ్యంతరంలేకపోతే కొంచంసేపు కబుర్లు చెప్పుకుందాం”అన్నాడు అతను.

అతను ఎంతో స్వచ్ఛంగాతెలగు మాట్లాడుతున్నాడు. అది గమనించి మిత్రవింద ఆశ్చర్యపోయింది.

“రండి ఆ బండరాయిమీద కూర్చుందాం”అంటు అబ్బాస్ ముందుకు దారితీశాడు. మిత్రవింద అతన్ని అనుసరించింది. ఇద్దరు ఆ బండమీద పక్క పక్కన కూర్చున్నారు. సమయం ఎంతయిందో తెలియదు. సూర్యుడు మాత్రం తన ప్రతాపాన్ని పూర్తిగా చూపిస్తున్నాడు. బయట ఎండ మండిపోతుంది. కాని కంచె అవతల మాత్రం కొంచం చల్లగా ఉంది. ముఖ్యంగా బండరాయి దగ్గర అంతగా ఎండలేదు. చుట్టుపక్కల పెద్దపెద్ద చెట్లు ఏపుగా పెరిగిఉన్నాయి. అవి ఎండనుంచి ఇద్దరినికాపాడుతున్నాయి.

“మీకు నిజంగా అర్జంట్ పనిలేదా”అడిగాడు తిరిగి అబ్బాస్.

“ఉంటే ఇక్కడ ఎందుకు కూర్చుంటాను. ఎప్పుడో సెల్ తీసుకుని వెళ్ళిపోయేదాన్ని”అంది మిత్రవింద.

“మీ నవ్వు చాల బాగుంటుంది మిత్రవిందగారు”అన్నాడు అబ్బాస్ నవ్వి.

“అలా అని నేను ఎప్పుడు నవ్వుతూ ఉండలేను. అలాచేస్తే నన్ను పొగిడినవాళ్ళే నవ్వు నాలుగువిధాల చేటు అని కూడా అంటారు”అంది మిత్రవింద.

అబ్బాస్ పెద్దగా నవ్వాడు.

“మీరు చాల బాగా మాట్లాడతారు సరే ఆ విషయం పక్కన పెట్టండి. డిగ్రీ పూర్తిచేశారు కదూ.”

“అవును.”

“ఇంకేం చదవాలనుకుంటున్నారు.”

“నాకు సివిల్ సర్వీస్ చెయ్యాలని ఉంది. అది వీలుకాకపోతే విదేశాంగ శాఖలో మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని ఉంది.”

“మంచి ఆలోచన. మీ లాంటి తెలివైన అమ్మాయికి అలాంటి ఉద్యోగం బాగుంటుంది. మీ కోరికతప్పకుండ నెరవేరుతుంది. గట్టిగా ప్రయత్నించండి. తప్పకుండ విజయం సాధిస్తారు.”

“నా కోరిక కూడా అదే. మా నాన్నకు మగపిల్లలు లేరు. ఇద్దరం ఆడపిల్లలమే. నా కంటే వసంతసేన చిన్నది. తను డిగ్రి మొదటిసంవత్సరం చదువుతోంది. ఇంకో రెండు సంవత్సరాలలో నాన్నగారు రిటైర్ అయిపోతారు. ఈ లోగా నేను మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. నాన్నగారితో పాటు కుటుంబ బాధ్యతను తీసుకోవాలి. తరువాత చెల్లెల్ని బాగాచదివించి ప్రయోజకురాలిని చెయ్యాలి. తరువాత మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యాలి. ఇవి నా లక్ష్యం” అంది మిత్రవింద.

చివరి మాట అంటున్నప్పుడు ఆమె కళ్ళలో వింత వెలుగుకనిపించింది అబ్బాస్ కు. ఆమె ప్రవర్తన ఆశయం అతన్ని ఎంతో మెస్మరైజ్ చేశాయి. ఈ కాలంలో చాల మంది ఎవరి స్వార్ధం వాళ్ళు  చూసుకుంటున్నారు. కుటుంబం గురించి కాని కన్నవాళ్ళ గురించి కాని ఆలోచించటం లేదు. కాని మిత్రవింద వాళ్ళందరికి బిన్నంగా ఉంది. తన కుటుంబపరిస్ధితుల గురించి ఆమెకు బాగా తెలుసు. అందుకే తనకంటు ఒక లక్ష్యం ఏర్పరచుకుంది.  ఆ లక్ష్యం సాధించే దిశగా వెళుతుంది. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది.

“చాల మంచి ఆశయం మిత్రవిందగారు. మీ మాటలు విన్నతరువాత మీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. జీవితంలో ఖచ్చితంగా మీరు ఉన్నతస్ధితికి చేరుకుంటారు. ఇది ఖచ్చితంగా జరిగితీరుతుంది”అన్నాడు అబ్బాస్.

“ద్యాంక్యు అబ్బాస్ గారు”అంది మిత్రవింద.

ఆ తరువాత వాళ్ళు చాల విషయాలు మాట్లాడుకున్నారు. అబ్బాస్ మాట్లాడుతుంటే ఆమెకు సమయం తెలియటంలేదు. గంటలు క్షణాల్లా గడిచిపోతున్నాయి. గంట తరువాత మిత్రవింద బయలుదేరింది. ఇద్దరు తరుచు అక్కడే కలుసుకోవటానికి తీర్మానించుకున్నారు.

“శనివారం ఆదివారం ఇక్కడ ఎవరు ఉండరు. సెక్యురిటి అందరికి సెలవు. మనం నిరభ్యంతరంగా కలుసుకోవచ్చు”అన్నాడు అబ్బాస్.
అలాగే అని తలూపింది మిత్రవింద.తరువాత అబ్బాస్ ఆమెను కంచె దాటించాడు. రోడ్డు మీద నడుస్తూ వెనక్కి తిరిగి చూసింది. అబ్బాస్ ఇంకా కంచె అవతల ఉన్నాడు. ఆమె తిరగగానే గట్టిగా చెయ్యి ఊపాడు. తను కూడా ఊపింది మిత్రవింద. తరువాత అబ్బాస్ మెల్లగా నడుచుకుంటు లోపలికి వెళ్ళిపోయాడు.

మిత్రవింద ఆటోలో కంప్యూటర్ ఇన్ స్ట్యూట్ చేరుకుంది.

ఆ రోజు నుంచి అబ్బాస్ తో పరిచయం మొదలైంది. ఇద్దరు వారానికి రెండు సార్లు కంచె దగ్గర కలుసుకునేవారు. ఎన్నో విషయాల గురించి మాట్లాడుకునేవారు. మాటల సందర్భంలో అబ్బాస్ తన కుటుంబం గురించి చెప్పాడు. అతనికి తండ్రి లేడు. తల్లి మాత్రమే ఉంది. తోడబుట్టినవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇద్దరు తరుచు కలుసుకోవటం వల్ల ఒకరి మీద ఒకరికి సహజంగానే ప్రేమ ఏర్పడింది. కాని ఎవరు బయటపడలేదు. అతను ముందు ప్రపోజ్ చేస్తాడని మిత్రవింద, మిత్రవింద ప్రపోజ్ చేస్తుందని అతను ఎదురుచూశారు. కాని ఎవరు ముందుకు రాలేదు.

ఒక పాకిస్ధాన్ అధికారితో తనకు పరిచయం ఉందని మిత్రవింద ఎవరితోను చెప్పలేదు. చివరకు తన గాఢ స్నేహితురాలైన లలితతో కూడా చెప్పలేదు. ప్రతి వారం రెండురోజులు అబ్బాస్ ను కలుసుకోవటానికి వెళుతుంది. ఎవరికి తెలియకుండ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ రహస్యం ఎన్నో రోజులు దాగదు. ఈ రోజు కాకపోయిన రేపయిన తెలుస్తుంది. ఈ లోగా అందరి నోట్లో నానకముందే తండ్రికి చెప్పాలని మిత్రవింద ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ప్రతి రోజు తన ప్రేమ విషయం తండ్రికి చెప్పాలని ప్రయత్నిస్తోంది. కాని చెప్పలేకపోతుంది. ఆయన కనిపించగానే ఆమె నోట్లో తడిఆరిపోతుంది. గొంతులోంచి మాటలు పెగిలి రాదు. గొంతుకు ఏదో అడ్డంపడినట్టు మూగబోతుంది.

ఈ మద్య కాలంలో రెండు విషయాలు జరిగాయి. మిత్రవింద కోరుకున్నట్టుగా జరిగింది. విదేశాంగ శాఖలో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఆ సంస్ధలో పొలిటికల్ అటాచిగా పనిచెయ్యటానికి అభ్యర్ధులు కావాలి. అడఅయిన మగఅయిన ఎవరైన దరఖాస్తులు పంపించుకోవచ్చు. ముందు రిటర్న్ పరీక్షలు ఉంటాయి. అందులో మెరిట్ లో పాసయ్యిన వాళ్ళను ట్రయినింగ్ కు పిలుస్తారు. ఆ రోజే అప్లయ్ చేసి పోస్ట్ చేసింది మిత్రవింద. తరువాత అదే రోజు మార్కెట్టుకు వెళ్ళింది. పరీక్షకు కావల్సిన పుస్తకాలు గైడ్స్ కొనుక్కుంది. రేపటినుంచి చదవు మొదలు పెట్టాలని తీర్మానించుకుంది. మరునాడు శనివారం. కంచె దగ్గరకు వెళ్ళి అబ్బాస్ ను కలిసే రోజు. ఉదయం నాలుగు గంటలు చదివింది మిత్రవింద. కూతరు చేస్తున్న ప్రయత్నాలను చక్రపాణి హర్షించాడు.

“నువ్వు తప్పకుండ విజయం సాధిస్తావు”అని ఆశీర్వదించాడు. ఆదే రోజు సాయంత్రం మిత్రవింద కంచె దగ్గరకు వెళ్ళింది. ఆ రోజు వాతావరణం కొంచం ఆహ్లాదకరంగా ఉంది. ప్రతి రోజు ఆ సమయంలో ఎర్రని ఎండగా ఉండేది. కాని ఆ రోజు విచిత్రంగా ఎండ కొంచం కూడా లేదు. ఆకాశంలో నల్లని మేఘాలు క్రమ్ముకున్నాయి. పూర్తిగా నలచీరతో కప్పినట్టు ఆకాశంలో కారు మేఘాలు క్రమ్ముకున్నాయి. ఏ క్షణంలో అయిన వర్షం వచ్చే సూచన కనిపిస్తోంది.

అందుకే ఆటోలో కంచె దగ్గరకు చేరుకుంది మిత్రవింద.ఆటోవాడికి డబ్బు ఇచ్చి అటు ఇటు చూసింది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ చాల తక్కువ. కార్లు బస్సులు లారీలు మాత్రం తరుచు వెళుతుంటాయి. కాని నడిచే మనుష్యులు సాధారణంగా కనిపించరు. మెల్లగా కంచె దాటి లోపలికి ప్రవేశించింది మిత్రవింద. ఆమెకోసం సిద్దంగా ఉన్నాడు జహీర్ అబ్బాస్. బండమీద కూర్చుని ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు.

“వర్షం వచ్చేలా ఉంది”అంది మిత్రవింద.

“వర్షం వచ్చేంతవరకు కూర్చుందాం. ఒక వేళ వర్షం వస్తే గుహలోకి వెళ్ళి కూర్చుందాం”అన్నాడు అబ్బాస్..

మిత్రవింద మెల్లగా వెళ్ళి అతని పక్కన కూర్చుంది. వాళ్ళ పరిచయం అయి మూడు నెలలు దాటింది. ఎన్నోసార్లు ఇద్దరు పక్కపక్కన కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. కాని అబ్బాస్ ఎప్పుడు హద్దు దాటలేదు. కనీసం తన చేతి వేలితో కూడా ఆమెను తాకలేదు. ఒక ఫర్ ఫెక్ట్ జంటిల్మన్ లా ప్రవర్తించాడు. అతని స్ధానంలో ఇంకేవరైన ఉంటే వాళ్ళ ప్రవర్తన వేరే విధంగా ఉండేది.

“ఈ రోజు మా గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను మిత్రవింద”అన్నాడు అబ్బాస్ సంభాషణ మొదలుపెడ్తూ.

“ఎందుకు చెప్పాలనుకుంటున్నావు. ప్రత్యేకమైన కారణం ఏమైన ఉందా” అడిగింది మిత్రవింద.

“ప్రత్యేకమైన కారణం అంటు ఏం లేదు. నా గురించి పూర్తిగా చెప్పాలని ఎన్నోరోజులనుంచి అనుకుంటున్నాను. కాని అవకాశం రాలేదు. ఈ రోజు అవకాశం వచ్చింది. అందుకే చెప్పాలనుకుంటున్నాను.”

“ఏమిటా అవకాశం”ఆశ్చర్యంగా అడిగింది మిత్రవింద.

“నువ్వు త్వరలో విదేశాంగశాఖ వాళ్ళు నిర్వహించే పరీక్షలు రాయబోతున్నావు. నువ్వు ఈ పాటికే చదవటం మొదలుపెట్టిఉంటావు. తప్పకుండ నువ్వు విజయం సాధిస్తావని నాకు నమ్మకం ఉంది. కాని నా కధ వింటే నువ్వు ఇంకా మోటివేట్ అవుతావు. నా చదువు కోసం మా అమ్మ ఎంతో కష్టపడింది. అది వింటే నీకు జీవితం పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. అదే నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నువ్వు సరే అంటే చెప్తాను. లేదంటే మానేస్తాను. ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం”అన్నాడు.

“వద్దు అబ్బాస్ మీ కధ చెప్పు వింటాను”అంటు సర్దుకుని కూర్చుంది మిత్రవింద.

అబ్బాస్ చెప్పటం మొదలుపెట్టాడు. అతని గొంతు గంభీరంగా లయబద్దంగా సాగిపోతుంది.

“మాది చాల దిగువ మద్యతరగతి కుటుంబం. నాన్నగారు గవర్నమెంట్ స్కూలులో టీచరుగా పనిచేసేవారు. నేను తప్పఅయనకు ఇంకో సంతానం లేదు. మా నాన్నగారు చాల నిజాయితిపరుడు. అంతే కాదు ఆయనకు దేశభక్తి ఎక్కువ. ఎప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని దేశభక్తుల కధలు చెప్పేవారు. అవినాకు ఎంతో అసక్తిగా ఉండేవి. నాన్నగారికి మిలిట్రిలో చేరి దేశానికి సేవచెయ్యాలని ఎంతో కోరిక ఉండేది. కాని ఆయన ఇంటి ఆర్ధికపరిస్ధితులు చాల అద్వాన్నంగా ఉండేది. అందుకే ఆయన పై చదువు చదవలేకపోయాడు. పొట్టకోసం స్కూల్ లో టీచరుగా చేరారు. “

“మాకు కొంచం కూడా ఆస్ధిపాస్తులు లేవు. ఎప్పుడో తాతలనాటి ఇల్లు మాత్రం ఉంది. అది చాల పాతకాలం నాటి ఇల్లు. గోడలు పెచ్చులు ఊడిపోయాయి. రంగు పూర్తిగా వెలిసిపోయింది.  అక్కడక్కడ బీటలు వారిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకచిన్న సైజు బూత్ బంగళాలా ఉంటుంది. మాకు మా నాన్నగారి జీతం తప్ప ఇంకో ఆదాయం లేదు. అయిన నాన్నగారు బాధపడేవారు కాదు. అమ్మ కూడా నాన్న మాటకు ఎదురుచెప్పేది కాదు. అందరిలా ఇది లేదు అది లేదు అని సాధించేది కాదు. నాన్న ఎంత తెస్తే అంతలో సర్దుకునేది. తనకు లేని వాటి గురించి అసలు బాధపడేది కాదు. “

“నాన్నగారికి నేనంటే చాల ఇష్టం. అప్పుడు నాకు పద్నాలుగు సంవత్సరాలు. ఆ సంవత్సరం టెన్త్ క్లాసు పరీక్షలు రాయబోతున్నాను. రోజు రాత్రి నన్నుపక్కన కూర్చోపెట్టుకుని దేశభక్తుల కధలను చెప్పేవాడు. అంతే కాదు కన్నా నువ్వు బాగాచదువుకుని పెద్ద మిలిట్రి అఫీసర్ కావాలి. దేశాన్ని కాపాడాలి. నీ దేశానికి మాత్రమే కాకుండ నీ కుటుంబానికి కూడా మంచి పేరు తీసుకురావాలి అని రోజు చెప్పేవాడు. “  “పదేపదే ఆ మాటలు చెప్పటం వల్ల అవి నాలో బలంగా నాటుకుపోయాయి. ఎలాగైన నాన్నగారి కోరిక తీర్చాలని దృఢసంకల్పం కలిగింది. నాన్నగారి కోరిక పూర్తిచెయ్యాలంటే నేను బాగా  చదువుకోవాలి. అంతే కాదు మిలిట్రి ఆఫీసర్ కావాలంటే చాల ఖర్చుఅవుతుంది.  నిజానికి నాన్నగారికి నన్ను అంత పెద్ద చదువుచెప్పించటానికి తాహతు లేదు.అయిన నాన్నగారు వెనుకడగు వెయ్యలేదు. స్సూల్ నుంచి వచ్చిన తరువాత పదిమంది పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. వాళ్ళిచ్చిన జీతం పెద్దగా ఉండేది కాదు. కాని ఆయన జీతానికి అవి తోడుఅయ్యేవి. “
    “నేను కూడా కష్టపడి చదవసాగాను. ఆ వయస్సులో నా తోటి పిల్లలు సరదాగా ఆడుతూ ఉండేవారు. సినిమాలు షికార్లకు వెళ్ళేవారు. మంచి మంచి బట్టలు కట్టుకుని జాలిగా ఉండేవారు. కాని నేను మాత్రం ఒంటరిగా గదిలో కూర్చుని చదువుకుంటుఉండేవాడిని. నా మనస్సులో నాన్నగారి ఆశయం తప్ప ఇంకో విషయం ఉండేది కాదు. అన్నిసుఖాలు సరదాలు వదులుకుని పూర్తిగా నా దృష్టినిచదువుమీద కేంద్రికరించాను. “

“ఉంటే తినేవాళ్ళం లేని రోజు పస్తులు ఉండేవాళ్ళం. అమ్మనాన్న ఇద్దరు పస్తులు ఉండి నాకు పెట్టేవారు. ఈ విషయం నాకు తెలియనివ్వకుండ చాల జాగ్రర్త పడ్డారు. కాని ఆ విషయం నేను ఒకరోజు అనుకోకుండ గమనించాను. నాకు ఏడుపు ఆగలేదు. నా కోసం నా తల్లితండ్రి పడుతున్న కష్టం చూసి చలించిపోయాను. ఆరునూరైన వాళ్ళ కోరిక తీర్చాలని కంకణం కట్టుకున్నాను. ఆ రోజు నుంచి నా దృష్టి అంతా పూర్తిగాచదువుమీద కేంద్రికరించాను. ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండ పూర్తిగా చదువులో లీనమయ్యాను. ప్రతి రోజు రాత్రి పన్నెండుగంటలవరకు చదువుకునేవాడిని. ప్రతి క్లాసులో మెరిట్ లో పాసవుతూ నేను సెకండరి లెవల్ కు వచ్చాను. మీ దేశంలో దాన్ని ఇంటర్మీడియట్ అంటారు.  మొదటి సంవత్సరం మంచి మార్కులతో పాసయ్యాను. రెండో సంవత్సంలోకి వచ్చాను. అది పూర్తయిన తరువాత నేషనల్ డిఫెన్స్ ఎకడమీ పరీక్షలు రాయాలి.అందులో మంచి ర్యాంకు సంపాదిస్తే మిలిట్రిలో నాకు ఆఫీసర్ ఉద్యోగం వస్తుంది. “

“రెండో సంవత్సరం మొదలైంది. రెండునెలలు సాఫిగా గడిచిపోయాయి. అప్పుడే మా జీవితంలో భయంకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన మా బతుకులను అతలాకుతలం చేసింది. ఆ రోజు నాకు ఇంకా గుర్తు ఉంది. ఆ రోజు నాన్నగారు స్కూల్ అయిన తరువాత ఇంటికి బయలుదేరారు. ఆయన రోడ్డు దాటుతుంటే ఒక లారీ వేగంగా వచ్చి ఆయనను గుద్దేసి వెళ్ళిపోయింది. ఆ ఇంపాక్ట్ కు నాన్నగారు అక్కడికి అక్కడే రక్తపుమడుగులో చనిపోయారు. ఆయన మొహం గుర్తుపట్టటానికి వీలులేకుండ లారి టైర్ పచ్చడిచేసింది.

“విషయం విని నేను అమ్మ హుటాహుటిన స్పాట్ కు చేరుకున్నాం. అక్కడ నాన్నగారి శవం చూసి అమ్మ తట్టుకోలేకపోయింది. బోరున ఏడుస్తూ నాన్నగారి శవం మీద పడిపోయింది. నాకు కూడా దుఖ్ఖం అగలేదు. ఆ షాక్ నుంచి తేరుకోవటానికి అమ్మకు నెలరోజులు పట్టింది. నాకైతే దుఖ్ఖం అగటంలేదు. ప్రతి క్షణం నాన్నను తలుచుకుంటు ఏడ్చేవాడిని. “

“నాన్నకు సంబంథించిన ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ సాంక్షన్ అయ్యాయి. ఆ డబ్బు నా చదువుకు ఏ మాలకు సరిపోదు. అర్ధాంతరంగా నా చదువు ఆపవలసివస్తుందేమో అని భయం వేసింది నాకు. నాన్న సంపాదిస్తున్నప్పుడే మాకు ఆ డబ్బు సరిపోయేది కాదు. ఇప్పుడు నాన్నపోయాడు. సంపాదన పోయింది.ఏం చెయ్యాలో నాకు తోచలేదు. చదవు మానేసి ఏదైన ఉద్యోగం చూసుకుంటే మంచిదనిపించింది. అమ్మ కూడా పెద్దగా చదవుకోలేదు.అంతా వానకాలం చదవు. అయిన పరిస్ధితులు చూసి అమ్మ ఏమాత్రం భయపడలేదు. పైగా నాకు ధైర్యం నూరిపోసింది. “

“ఆమె ఏ ధైర్యంతో అలా మాట్లాడుతుందో నాకు అర్ధం కాలేదు. కాని రెండు రోజుల తరువాత నాకు అసలు విషయం అర్ధమైంది. అమ్మకు ఒక పనిమనిషి తెలుసు. ఆమె పదిమంది ప్రభుత్వ ఉద్యోగుల ఇంట్లో పని చేసేది. ఇప్పుడు ఆమె కొడుకుకు మంచి ఉద్యోగం వచ్చింది. అందుకే పని మానేసి వెళ్ళిపోతుంది. ఆ పనులు తనకు ఇప్పించమని అమ్మ కోరింది. ఆ పనిమనిషి అమ్మను తీసుకువెళ్ళి ఆ పదిమందికి పరిచయం చేసింది.అలా అమ్మ ఆ ఇంట్లో పాచిపనికి కుదిరింది. “

“పాచిపని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. అది కూడా మాములు పనే అనుకున్నాను. దాని కష్టనష్టాలు కాని నాకు తెలియవు. ప్రస్ధుతం అయితే నా చదువుకు వచ్చిన ఆటంకం తొలగిపోయింది. నేను దీక్షగా చదువుకోవటం ప్రారంభించాను. టైం ప్రకారం అమ్మ ఫీజు కట్టేది. నేను కాలేజికి వెళ్ళిన వెంటనే తను పనికి వెళ్ళిపోయేది. ఎప్పుడో సాయంత్రం ఆరుగుంటలకు తిరిగివచ్చేది. తరువాత నాకు వంటచేసి పెట్టేది. భోజనం చేసిన తరువాత కూడా నేను కొన్ని గంటలు చదువుకునేవాడిని.”

“ఆరునెలలు గడిచాయి. ఒక రోజు రాత్రి పన్నెండుగంటలవరకు చదువుకున్నాను. తరువాత నిద్రవస్తే పడుకున్నాను. అర్ధరాత్రి దాహం వేసి మేలుకున్నాను. పక్కన ఉన్న కూజా కోసం చూశాను. నీళ్ళకూజా కనిపించలేదు. ఎప్పుడు అమ్మ కూజాని మంచి నీళ్ళతో నింపి నా పక్కన పెట్టేది. ఆ రోజు మరిచిపోయిందనుకుంటాను. అందుకే మెల్లగా లేచి వంటింట్లోకి వెళ్ళాను. కడుపునిండా నీళ్ళు తాగి వస్తుంటే అమ్మ గదిలో వెలుతురు కనిపించింది. ఆ గదిలో లైటు వెలుగుతోంది. “

“అంత రాత్రి వేళ గదిలో లైట్లు ఎందుకు వెలుగుతుందో నాకు అర్ధం కాలేదు. ఆఫ్ చేద్దామని లోపలికి వెళ్ళాను. అక్కడ అమ్మ కనిపించింది. నేలమీద కూర్చుని తన కాళ్ళకు చేతులకు కొబ్బరి నూనే రాసుకుంటోంది. నాకేం అర్ధంకాలేదు. చప్పున వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకుని చూశాను. రెండు చేతుల మీద కాయలు కాచి ఉన్నాయి. కొన్ని కాయలు ఎర్రగా పుండ్లుగా మారిపోయాయి. ఇక కాళ్ళ గురించి చెప్పటానికి వీలులేదు.”

“నాకు దుఖ్ఖం ఆగలేదు. బోరుమని ఏడస్తూ అమ్మను చుట్టుకుపోయాను. పాచి పని అంటే ఎలా ఉంటుందో ఆ రోజు నాకు తెలిసింది. నా కోసం నా చదువుకోసం అమ్మ పడరాని కష్టాలు పడుతోంది. నేను కొడుకునై ఉండి ఆమెకు ఏం చెయ్యలేకపోతున్నాను. ప్రెక్షకుడిలా చూస్తూ ఉండిపోతున్నాను. ఇంత జరిగిన తరువాత అమ్మను కష్టపెట్టటం నాకు ఇష్టం లేదు. అందుకే నేనుచదువు ఆపేసి ఏదైన ఉద్యోగం చూసుకుంటానని చెప్పాను. అమ్మ చల్లగా నవ్వింది. నా తలనిమిరి అంది.

“ఒక మనిషి తన లక్ష్య సాధనకోసం ఎంతో కష్టపడాలి. మద్యలో ఎన్నో అడ్డంకులు బాధలు సమస్యలు వస్తాయి. వాటికి భయపడి వెనక్కి తిరిగివెళ్ళకూడదు. తన లక్ష్యాన్ని మరిచిపోకూడదు. ధైర్యంతో అన్ని ఎదురుకుని ముందుకు సాగాలి. అలా జరగాలంటే ఆ మనిషికి లక్ష్య శుద్ధి ఉండాలి. అప్పుడే ఆ మనిషి తన ప్రయత్నంలో విజయం సాధించగలడు. ఇది నీకు వర్తిస్తుంది. మీ నాన్నగారి ఆశయం గుర్తుతెచ్చుకో. నేను పడుతున్న కష్టాలు బాధలు పట్టించుకోకు. వాటిని మరిచిపో. నీ ఆశయం వైపు దృష్టిని సారించు. అప్పుడే నువ్వు విజయం సాధించగలవు. ఇంకా ఎన్నోరోజులు ఉండదు ఈ కష్టం. మహఅయితే ఇంకో మూడు సంవత్సరాలు. ఆ  తరువాత నీ చదువు పూర్తయిపోతుంది. నువ్వు తప్పకుండ మిలిట్రి ఆఫీసర్ అవుతావు. ఆ క్షణం నుంచి నేను పని మానేస్తాను. మహారాణిలా కుర్చిలో కూర్చుంటాను. సరేనా. జరిగింది మరిచిపో. వెళ్ళి పడుకో. నిద్రరాకపోతే చదువుకో”అంది. “

“ఆ మాటలు నాలో విశేషమైన ప్రభావం చూపించాయి. నా కర్తవ్యం గుర్తుచేశాయి. వెంటనే కళ్ళుతుడుచుకుని నా గదిలోకి వెళ్ళాను. పుస్తకాలు ముందు పెట్టుకుని చదవాను. ఆ రోజు తరువాత నేను వెనక్కి తిరిగిచూసుకోలేదు. ప్రతిరోజు అమ్మ నా కోసం పడుతున్న కష్టాలు గమనిస్తునే ఉన్నాను. కాని ముందులాగా స్పందించటం మానేశాను. దాని స్ధానంలో దృఢ నిశ్చయం పెంపోదించుకున్నాను. “

“డిగ్రీ మంచి మార్కులతో పాసయ్యాను. కాలేజి ఫస్ట్  వచ్చాను. స్టేట్ లో నాలుగవ ర్యాంకు సంపాదించుకున్నాను. ఆ రోజు నేను పడిన సంతోషం అంతా ఇంతా కాదు. అమ్మ కూడా సంతోషపడుతుందని అనుకున్నాను. కాని తను కొంచం కూడా రియాక్ట్ కాలేదు. మిలిట్రి ఉద్యోగానికి ఏం చెయ్యాలి “అని మాత్రం అడిగింది.

ఆమె ఉద్దేశం నాకు అర్ధమైంది. నేను మిలిట్రి ఆఫీసర్ అయితే కానిఆమె సంతోషంగా ఉండదని నాకు అర్ధమైంది. వెంటనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలకు కూర్చున్నాను. రాత్రి పగలు అని తేడా లేకుండ కష్టపడి చదివాను. అందులో కూడా మంచి ర్యాంకు సంపాదించుకున్నాను. క్యాప్టన్ ఉద్యోగం తెచ్చుకున్నాను. ఇది నా కధ మిత్రవింద. నేను ఇలా ఉండటానికి నా అభివృద్ధికి కారకురాలు నా కన్న తల్లి. ఆమె లేకపోతే నేను ఇంత గొప్పవాడిని అయ్యేవాడిని కాను. అవిడ విశిష్టమైన వ్యక్తిత్వ ప్రభావం నా మీద ఎంతో ఉంది. అది నాకు ఎంతో గర్వకారణం”అంటు పూర్తిచేశాడు అబ్బాస్.

అంతా విన్న మిత్రవింద వెంటనే ఏం మాట్లాడలేకపోయింది. ఆమె మనస్సు బాధతో తల్లిడిల్లిపోయింది. అబ్బాస్ వెనుక ఇంత కధ ఉంటుందని ఆమె ఊహించలేదు. తల్లి గురించిచెప్పుతున్నప్పుడు అతని కళ్ళు కాంతితో మెరవటం ఆమె గమనించింది. దాన్ని బట్టి తన తల్లిని అతను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్ధమవుతుంది. అబ్బాస్ తల్లి షబ్నమ్ లాంటి వాళ్ళు చాల అరుదుగా ఉంటారు. అబ్బాస్ పని గట్టుకుని తన కధ ఎందుకు చెప్పాడో మిత్రవిందకు అర్ధమైంది. అతని ఉద్దేశం కూడా తెలిసింది.

“ఇప్పుడు మీ అమ్మగారు ఎలా ఉన్నారు”నిశబ్ధాన్ని ఛిద్రం చేస్తూ అడిగింది మిత్రవింద.

“బాగున్నారు. కాని ఎవరితోను ఎక్కువగా మాట్లాడదు. ఎప్పుడు తన గదిలో ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా నమాజ్ చేస్తూ ఉంటుంది. అన్ని పనులు చెయ్యటానికి ఇంట్లో నలుగురు ఆర్డర్లీలు ఉన్నారు. ఒకరు వంటచెయ్యటానికి, ఇంకోకరు ఇంటిపని చెయ్యటానికి ఇంకోకరు నా పర్సనల్ పని చెయ్యటానికి ఉన్నారు. మా అమ్మని ఒక్క పని చెయ్యనివ్వరు. అలా అని మా అమ్మచేతులు ముడుచుకుని ఊరికే కూర్చోదు. నాకు ఇష్టమైన వంటకం తనే స్వయంగా చేస్తుంది. అలా చెయ్యటం ఆవిడకు ఎంతో తృప్తి. కాని నాకు మాత్రం ఆమె ప్రవర్తన చూస్తే చాల బాధ కలుగుతుంది”అన్నాడు అబ్బాస్.

“ఎందుకని”ఆశ్చర్యంగా అడిగింది మిత్రవింద.

“నా హోదా కాని నా అధికారం కాని ఆవిడకు కొంచం కూడా సంతోషం కలిగించటంలేదు. ఎప్పుడు గదిలోనే ఉంటుంది. బయటకు రానేరాదు. అందరితోను కలవదు. మిలిట్రిలో పనిచేస్తున్నవాళ్ళు తరుచు పార్టీలు చేసుకుంటారు. అందకు ఒకచోట కలుసుకుని సరదాగా మాట్లాడుకుంటారు. ఇది ప్రతి దేశంలో ప్రతి మిలిట్రి డిపార్ట్ మెంట్ లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. నా స్నేహితలు ప్రతిసారితమ తల్లితండ్రులను తీసుకువస్తారు. వాళ్ళు కూడా మాతో సమానంగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళంతా మంచి బట్టలు కట్టుకుంటారు. ఖరీదైన నగలు అలంకరించుకుంటారు. కాని మా అమ్మ మాత్రం వాటికి పూర్తిగా విరుద్దం. తను నాతో ఒక్కసారి కూడా పార్టీకి రాలేదు. కనీసం ఇంటినుంచి బయటకు రాలేదు. ఎప్పుడు తన గదిలో ఒంటరిగా గడుపుతుంది. వీలుఉన్నప్పుడల్లా నమాజ్ చేస్తుంది. లేకపోతే ఏదో పుస్తకం చదువుకుంటు ఉంటుంది. నాతో తప్ప ఇంకేవరితోను మాట్లాడదు. చాల సాధారణమైన బట్టలు కట్టుకుంటుంది. నగలు అసలు పెట్టుకోదు. ఆమె కోసం నేను ఎన్నో ఖరీదైన నగలు కొన్నాను. అవి ఎలా కొన్నానో అలాగే ఉన్నాయి. ఒక్కసారి కూడా వాటిని పెట్టుకోలేదు. బలవంతం చేస్తే నా కెందుకు బాబు రాబోయే కోడలకోసం ఆ నగలు దాచాను అంటుంది.  నాకేం మాట్లాడాలో అర్ధం కాదు. ఏమైన అంటే నొచ్చుకుంటుందని నా భయం. అందుకే ఏం మాట్లాడలేకపోయేవాడిని.”

“నా చిన్నతనం నుంచి ఆవిడ ఎంతో కష్టపడింది. ఒక పూట తింటే ఇంకో పూట పస్తులు ఉండేది. నా చదువుకోసం ఆవిడ పడిన కష్టాలు ఇంకా నాకు గుర్తు ఉన్నాయి. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైన ఆనందంగా ఉండమని చాల సార్లు చెప్పాను. జవాబు చెప్పకుండ నవ్వి ఊరుకునేది. ఒక్కోక్కోసారి ఆమెను చూస్తుంటే నాకుఎంతో బాధ కలుగుతుంది. కాని నేను మాత్రం ఏం చెయ్యను. అవిడకు అలా ఉండటం ఇష్టం. నేను ఎవరిని దాన్ని కాదనటానికి”అన్నాడు అబ్బాస్.

“బాధపడకు అబ్బాస్. అంతా సర్దుకుంటుంది”అంది మిత్రవింద.గంట తరువాత మిత్రవింద ఇంటికిచేరుకుంది. ఆమె మనస్సంతా బాధతో నిండిపోయింది. అబ్బాస్ తల్లి షబ్నమ్ పడిన కష్టాలు ఆమె కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఆమె కనుక ఆ కష్టాలను తట్టుకుంది. ఆమె స్ధానంలో ఇంకేవరైన ఉంటే తట్టుకోలేకపోయేవారు. ఏది ఏమైన షబ్నమ్ ఒక విశిష్టమైన వ్యకిత్వం ఉన్న స్ర్తీ. అలాంటి స్త్రీని కన్నతల్లిగా పొందిన అబ్బాస్ ఎంతో అదృష్టవంతుడు.

తల్లి భోజనానికి పిలిచేంతవరకు ఆలోచనలతో సతమతమైంది మిత్రవింద. భోజనం చేసిన తరువాత మిత్రవింద తన గదిలోకి వెళ్ళింది. ఆమె చెల్లెలు వసంతసేన ఏదో తెలుగు నవల చదువుతూ మంచం మీద ఉంది.

మెల్లగా పుస్తకం తెరిచింది. షబ్నమ్ ను తలుచకుంది. ఆమె తన కొడుకుతో చెప్పిన మాటలను గుర్తుకుచేసుకుంది. తరువాత చదవటం మొదలుపెట్టింది. దాదాపు మూడు గంటలు ఏకాగ్రతతో చదివింది. రాత్రి ఒంటిగంటవరకు ఆ గదిలో లైట్లు వెలుగుతునే ఉన్నాయి.

మిత్రవింద ఆలోచనలు మున్ముందుకు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం దాకా ఎదురు చూడాల్సిందే....) 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani