Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue310/800/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)..... ఉదయం పదకొండు గంటలు.

సోమయాజులు గారి ఇంటి ముందు ఆగిన క్యాబ్ లోంచి దిగిన హేమ గబ గబ ఇంట్లోకి వెళ్లి అప్పటికే సిద్ధంగా ఉన్న కాత్యాయనిని బయల్దేరదీసి, సోమయజులుగారి దంపతులకు తాము వెళుతున్నామని, మళ్లీ కాత్యాయనిని జాగ్రత్తగా ఇంట్లో దింపే బాధ్యత తనదేననని చెప్పి బయటకొచ్చి కాత్యాయనితో సహా కారెక్కింది.

కార్ స్మూత్ గా సాగిపోతోంది.

"కాత్యాయనీ, గతాన్ని తలచుకోకు. మనకు వర్తమానం ముఖ్యం. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందన్నది మనకు తెలియదు. అందుకే శష భిషలతో కాలం వృధాచేయకూడదన్నది నా పాలసీ. మన కార్యక్రమం అంతటి బిజీ మనిషి కంట్లో పడడం కేవలం యాథృచ్ఛికం కాదు. మరేదో దైవ సంకల్పిత నిర్ణయం ఉందని నాకనిపిస్తోంది. నువ్వూ అదే నమ్ము"అంది.

కాత్యాయని తలూపింది. ఆమె మనసు మాత్రం గతాన్ని ఒక్కసారిగా వేగంగా స్పృశించి, ఇప్పుడే పరిణామాలు జరగబోతున్నాయో అన్న సంధిగ్ధ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

కారు ఛానల్ టీ వీ కార్యాలయం ముందు ఆగింది. ఖరీదైన మనుషులతో, ఖరీదైన కార్య కలాపాలు జరిగే అతి ఖరీదైన ప్రాంతమది. అక్కడ కొలువైన ప్యాలెస్ లాంటి ఛానల్ సంస్థను కళ్లింతలు జేసుకుని ఆశ్చర్యంతో చూస్తోంది కాత్యాయని. ఇంత గొప్ప సంస్థలోనా హేమ పనిచేస్తున్నది? అన్న విస్మయం ఒకవైపు, అయినా ఏ రకమైన భేషజాలు లేకుండా తమతో కలిసిపోయిందన్న ఉదాత్త భావన మరోవైపు.
లోపలి కెళ్లాక రిసెఫ్షన్ లో ఏం చెప్పకుండానే సరాసరి తన సీట్ కి తీసుకుపోయి, కాత్యాయనికి సీట్ చూపించి, కూర్చోమని, తనూ కూర్చుని ఇంటర్ కామ్ లో రెండు స్టాంగ్ కాఫీలు ఆర్డర్ ఇచ్చి, "నువ్వు ఏం ఎగ్జయిట్ అవ్వకు కాత్యాయనీ, నీతోపాటూ నేనూ ఉంటాను. మరి ఆయన్ని పిలవనా?" అంది. పిలవమన్నట్టుగా చిన్నగా తలూపింది.

హేమ తన సెల్ నుంచి అతనికి కాల్ చేసి ఛానల్ ఆఫీసుకు రమ్మని చెప్పింది.

కాఫీ తాగుతుండగానే రిసెప్షనిస్ట్ ‘మనోహర్ అనే అతను హేమను కలవాలనుకుంటున్నట్టు’ చెప్పింది.

‘అప్పుడే వచ్చేశాడా?’ అన్న ఆలోచన ఇద్దరి మనసుల్లోనూ మెదిలింది. దాంతో అతను కాత్యాయనిని కలుసుకోవాలని ఎంతగా తహ తహలాడుతూందీ కూడా తెలిసింది.

అతన్ని వెయిట్ చేయమని చెప్పి, కాఫీ తాగాక కాత్యాయనిని కాన్ఫరెన్స్ హాలులో కూర్చోపెట్టి ఆమెతో తనూ కూర్చుని రిసెప్షనిస్ట్ కి అతన్ని కాన్ఫరెన్స్ హాల్ కి పంపమని చెప్పింది.

ఇద్దరి మనసుల్లోనూ ఉద్వేగం. ఇన్నాళ్లకి తనను కలుసుకోవాలనుకుంటున్నదెందుకో అన్నది కాత్యాయనిదైతే, వాళ్లిద్దరి మధ్య ఏం జరగబోతోందన్నది హేమది. అద్దాల్లోంచి మనోహర్ వస్తూ కనిపించాడు. అతనిలో పెద్ద మార్పేమీ లేకపోవడం గమనించింది కాత్యాయని.
అతను కాన్ఫరెన్స్ హాల్ డోర్ వద్దకు వచ్చి పుష్ చేశాడు.

"ప్లీజ్ కం"అంది హేమ నవ్వుతూ అతన్ని లోపలకి ఇన్వైట్ చేస్తూ.

మనోహర్ హుందాగా వచ్చి తనకు ఆఫర్ చేసిన సీట్లో కూర్చున్నాడు.

కాత్యాయనిని చూసి "బాగున్నారా కాత్యాయనీ" అన్నాడు.

కాత్యాయని ‘బాగున్నానన్నట్టు’గా తలూపింది.

అతను చిన్నగా దగ్గాడు..తను ఏదో చెప్పడానికి ఉపోద్ఘాతంగా..

కాత్యాయనితో , మనోహర్ ఏం మాట్లాడాలనుకున్నాడో తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం దాకా ఎదురు చూడాల్సిందే....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
prema enta madhram