Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> వేప పువ్వు

vepa puvvu

 " ఎక్కడైనా బావా అంటే ఒప్పుకొంటానే, వంగతోటకాడన్నావంటే తప్పుకొంటానే' అన్నట్లుంది " అన్నాడు అఖిల్.

" ఏంట్రా అలా అంటున్నావు " కోపంగా కొడుకు వైపు చూస్తూ అన్నాడు శ్రీనివాసులు.

"ఆ పెళ్ళికొడుకు ఆకాష్ గురించి బాగా విచారించారన్నావు. చేసేది ప్రభుత్వోద్యోగమైనా చాలా నిజాయితీగా ఉన్నట్లు చెప్పారు . లంచాలు తీసుకొనే అవకాశం ఉన్నా , వాటి జోలికి పోకుండా ‘అభినవ గాంధీజీ’ అన్న పేరు తెచ్చుకున్నారని చెప్పారు . నేనూ మీరు చెప్పింది విని ఎంతగానో మెచ్చుకున్నాను.పెళ్లి చూపుల కార్యక్రమంలో అసలు సంగతి తెలిసింది.ఇంత కట్నం అడుగుతాడని కలలో కూడా ఊహించలేదు. అతనూ మామూలు మనిషే ....ప్చ్ " నిర్లక్ష్యంగా అంటూ వెళ్తున్న అఖిల్ వైపు చూస్తూ "అదేమిట్రా నీ సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు"కాస్తా బిగ్గరగా అన్నాడు శ్రీనివాసులు

" ఎవరికీ నచ్చక పోయినా నాకు  అల్లుడు నచ్చాడు.మన అమ్మాయి పావనికి ఆకాష్ నచ్చాడు. ఈ పెళ్లి జరగాలి " అంది శ్రీనివాసులు భార్య పార్వతమ్మ .

“ఇక చెప్పడానికి ఏముంది.ఎవరికీ నచ్చకపోయినా ఈ వివాహం జరిపించాలని అమ్మ చెప్పిందిగా.....అయినా అడిగారు కాబట్టి చెబుతున్నాను.నాకు ఈ వివాహం నచ్చలేదు . ఇంట్లో ఒక వేషం వీధిలో ఒక వేషం వేసే వాడిని నేను నమ్మను. "అన్నాడు అఖిల్.

 "ముందూ వెనుకలు తెలుసుకోకుండా నువ్వు అధికంగా మాట్లాడు తున్నావు.ఆ తరువాత నువ్వే బాధపడుతావురా " పార్వతమ్మ కోపంగా అంది.

"నువ్వు బాధపడతావో……… నేను బాధ పడుతానో పావని పెండ్లి అయ్యాక తెలుస్తుంది.  పావని  ఆ పెళ్ళికొడుకుని చేసుకొనడానికి ఇష్టపడ్డాక  నేను అడ్డు చెప్పదలచుకోలేదు .మీ ఇష్టం .పెండ్లిలో మీ కొడుకుగా, పావనికి అన్నగా నా  బాధ్యతలు నిర్వహిస్తాను ."అంటూ వెళ్ళాడు  

ఒక శుభముహూర్తాన పావని ,ఆకాష్ దంపతులయ్యారు .

***         ***          ***

పావని ఆకాష్ ల కొత్త కాపురం మొదలయ్యింది.ప్రతిరోజూ తల్లి తండ్రులతో పావని ఫోన్ ద్వారా పలకరించేది.

"అమ్మా మా పెళ్లయి  ఒక నెల రోజులయింది వారితో అన్నయ్య ఇంతవరకు మాట్లాడలేదు.ఆయన ప్రతిరోజూ అన్నయ్య గురించి అడుగుతారు "

"అఖిల్ కు ఇంకా  మీ ఆయన మీద కోపం అలాగే ఉంది . అఖిల్ గురించి అల్లుడు అడిగితె ఏమని చెప్పావు" అడిగింది పార్వతమ్మ

"మా అన్నయ్యకు తన సంపాదనలోనే సెల్ ఫోన్ కొనాలని నిర్ణయించుకున్నాడు.ఇంటిలో ఉండే సమయం చాలా తక్కువ అని సర్ది చెప్పాను "అంది పావని

"వాడికెందుకు దేవుడు ఇలాంటి బుద్ది కలిగించాడో ....అసలు నీతో ప్రతిరోజూ  ఫోన్ చేసి మాట్లాడుతున్న సమయాన ఎక్కువగా వాడు పక్కనే ఉండీ..... నేను లేనట్లు చెప్పు అని సైగ చేస్తాడు .....వీడెప్పుడు మారుతాడో ... అమ్మా నిన్ను చూసి చాలా రోజులయిందమ్మా ఎప్పుడు వస్తావు "బాధగా అంది

“మీ అల్లుడికి ఏప్రిల్ నెల వరకు సెలవులు దొరకడం కష్టం."

“  అదేమిటే అలా అంటున్నావు కనీసం ఉగాది కయినా వస్తారా “

"తప్పకుండా వస్తాము అమ్మా . పదిహేను  గంటల ప్రయాణం  జనరల్ నందు రద్దీ ఎక్కువుగా ఉంటుందని ఎపుడో టికెట్స్ బుక్ చేశారు. ఉగాది రోజు ఉదయం ఐదుగంటలకంతా అక్కడ ఉంటాము .." అంది

***             ***              ***  

ఆటో నుండి దిగుతున్నకూతురు అల్లుడిని చూసి సంతోషముతో ఆప్యాయముతో ఆహ్వానిస్తుంటే .....అఖిల్ మాటవరసకు ఆహ్వానించి టీ వీ ఆన్ చేసి ఎన్నికల వార్తలను చూడసాగాడు.

“అదేమిటన్నయ్యా రాక రాక పెళ్ళైయినాక మొదటిసారివస్తే మాట్లాడకుండా టీ వీ ముందు కూర్చున్నావు .” అడిగింది పావని

“పావనీ  అనవసరంగా అపార్థము చేసుకోవద్దు.ఈ సారి ప్రజలు ఎవరికీ ఓటు వేస్తారో ... ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటుందో అని తెలుగు రాష్ట్రాలన్నీ ఆత్రుతతో  చూస్తోంది.అభ్యర్థులందరూ గెలుపు తమదే అన్నట్లు పోటీ చేస్తున్నారు " అంటూ టీ వీ చూస్తూనే సమాధానం ఇచ్చాడు   

“అఖిల్ నీవు ఏ పార్టీ వారికి మద్దతు ఇస్తున్నావు” అడిగాడు ఆకాష్

“మీకు నచ్చని పార్టీకి “

“ నాకు నచ్చని పార్టీనా .....అదేమీ పార్టీ ....."

పార్టీ పేరు చెప్పాడు అఖిల్

“ ఆ పార్టీ నా డిపాజిట్ కూడా దక్కదు "అంది పావని

“ మాకు ఆ విషయం తెలుసు  డిపాజిట్ కోసం ప్రయత్నిస్తున్నాము. అందరూ డబ్బు మనుషులుగా మారినప్పుడు ఓటుకు నోటివ్వని మాకు ఎలా ఓటేస్తారు "మరలా టీ వీ చూస్తూనే సమాధానం చెప్పాడు .

“అల్లుడూ మీరు వెళ్లి స్నానం చేసిరండి "అంది పార్వతమ్మ. ఆకాష్ స్నానానికి వెళ్ళగానే "ఒరే అఖిల్ వెళ్లి వేప పువ్వు కోసుకొనిరా ....."  “అమ్మా ,వేప పువ్వు ఇంటిలోనే ఉందిగా "వ్యంగంగా అంటూ ఆకాష్ వెళ్లిన వైపు చూపించాడు. టవల్ కోసం తిరిగి వస్తున్న ఆకాష్ ను చూడగానే తల్లీ కూతుళ్లు ఉలిక్కి పడ్డారు .పార్వతమ్మ అఖిల్ వైపు చూస్తూ "నిన్నటి రోజున ఉగాది పచ్చడికి కావలసిన  వేప పువ్వు తప్ప అన్నీ తీసుకొని వచ్చానని చెప్పానుగా, చెబుతున్నప్పుడు టీ వీ చూస్తూ సరిగ్గా వినిపించుకోవు "కోపంగా సర్ది చెప్పింది.

మరి కాస్సేపటికి వేపపువ్వు తెచ్చి ఇస్తూ” పార్టీ పని వుంది,టిఫన్ టైం కు వస్తాను”  అంటూ వెళ్ళాడు అఖిల్.పావని ఆకాష్ లు అఖిల్ కోసం కొంత సమయం ఎదురు చూసారు .శ్రీనివాసులు బలవంతం మీద ఉగాది పచ్చడి తీసుకొని ఆ తరువాత టిఫన్ చేశారు .

అఖిల్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఏడుస్తున్న పావనిని చూసాడు.

“ నాకు తెలుసు నీవిలా ఏడుస్తావని ...ఇంతకూ మేక తోలు కప్పుకున్న పులి ...అదే నీ భర్త  ఏమి చేసాడు "అడిగాడు చెంప చెళ్లుమంది. మొదటి సారి తన చెల్లెలు తనను కొట్టడం.”నువ్వు నన్నుఎన్ని అన్నా నేను క్షమించుతాను ఆయనకు ఎవరేమన్నా నేను సహించను. ఆయన దేవుడు….. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నావు అసలు మీ బావ మీద నీకు కోపం ఎందుకో నాకు తెలుసు. కట్నం ఎక్కువ అడిగారని కాదా ...అమ్మను అడుగు వివరంగా చెపుతుంది "అంది

“అవునురా వారింటికి నేను మీ నాన్న వెళ్లి కట్నం ఎక్కువగా అడిగి తీసుకోమన్నా ము “

“  ఎందుకూ   "అయోమయంతో ప్రశ్నించాడు

“లంచం ఇస్తే వచ్చే ఉద్యోగాన్ని వదులుకొన్నావు, ఒక్కొక్క సారి వ్యాపారం పెడతాను ఉన్నఇండ్లను అమ్మమని చెప్పావు . బాధ్యత తెలీకుండా పార్టీ పార్టీ అంటూ తిరిగితే ఎలాగా ...ఒక ఉద్యోగంలో చేరి నీవు ఎలా తిరిగినా మేము వద్దంటామా. మీ నాన్న ఉద్యోగ జీవితంలో సంపాదించిన ఇండ్లను అమ్మమంటే…….. ఇండ్లను డబ్బును కాపాడాలన్న ఉద్దేశ్యంతో వారిని కట్నంగా అడగమని వేడుకున్నా మొదట వారు అంగీకరించలేదు.  ఇండ్లు అతని పేరు మీద వ్రాస్తున్నట్లు చెప్పినా ఇంతవరకు  అతని మీద వ్రాయలేదు . కట్నం డబ్బులు పూర్తిగా పావని పేరు మీద  ఫిక్స డ్ లో వేశారు. అందులో పైసా కూడా అంటలేదు  '

“అమ్మా ఇదంతా ఎందుకు నాకు ముందుగా చెప్పలేదు

“ నీవు బాధ్యతతో ప్రవర్తించి నీలో మార్పు వచ్చిన రోజు చెబుతామనుకొన్నాను .నీవు మారవురా ....నీవు అల్లుడిని వేప పువ్వు అంటూ ఎగతాళిగా అనడం అల్లుడు అర్థం చేసుకొని చిరునవ్వుతో పావనితో చెప్పాడంట ...కానీ పావని మనసు చాలా బాధపడింది .అల్లుడుమిత్రుడి ఇంటికి  వెళ్ళాక పావని జరిగిన అవమానం తలచుకొని ఒకటే ఏడుపు . పెళ్ళై మొదటి సారి ఉగాది పండుగ  రోజు ఇంటికి వచ్చిన ఆడబిడ్డను ఏడిపించావు కదరా "అంది పార్వతమ్మ

***      ***     ***  

ఒక పార్టీ వారు ఎన్నికలు ఇంకా ఐదు రోజులు ఉన్నా ఉగాది పండుగ రోజున  ఓటుకు నోట్లు ఇవ్వడం ప్రారంభించారు.

తమ అభ్యర్థి ఓటు కోసం పార్టీ వారితో కలసి వెళ్ళసాగాడు అఖిల్ .' బావ మీద కోపంతో టిఫన్ కు వెళ్ళలేదు మధ్యాహ్నం భోజన సమయానికి వస్తానని వెళ్లారు .భోజనం సమయానికి ముందుగా వెళ్లి క్షమాపణలు చెప్పాలి ఉదయాన్నే వేపపువ్వు అంటూ మనసు బాధపెట్టాను వెంటనే ఏదో ఒక ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నించాలి ' అనుకొన్నాడు .

ఒకచోట గుంపుగా ఉండటం చూసి ఏమిటా అని వెళ్ళాడు.

ఒక బిచ్చగాడి ముందు ఒక బోర్డు వుంది . దానిపై  "నేను నోట్లు ఇచ్చి ఓటువేయమని అడిగే బిచ్చగాడిని కాను.మంచి మనిషికి ఓటు వెయ్యమని యాచించే బిక్షగాడిని "అంటూ వ్రాసి వుంది .అందరూ సంతోషంతో ఆ బిచ్చగాడిని మనసులో మెచ్చుకొంటూ చూడసాగారు .     నోట్లు ఇచ్చి ఓట్లు అడిగే పార్టీ వారు అక్కడకు వచ్చి ఆ బిక్షగాడివైపు చూస్తూ "రేయ్ బిచ్చగాడా ఇంకొక రెండు నిమిషాల్లో ఇక్కడి నుండి వెళ్తావా తన్న మంటావా" అన్నారు.

“రెండు నిమిషాలు చాలు సార్ "అంటూ సెల్ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి “ఇక్కడ ఒక పార్టీ వారు గొడవ చేస్తూ భయపెడుతున్నారు " అన్నాడు.

"మీరెవరు తరమడానికి  " కోపంగా అన్నాడు అఖిల్ మాటా మాటా పెరిగింది ఘర్షణ పెద్దది కాబోతున్న సమయాన పోలీసులు వచ్చారు

“చూడండీ ఆయన ప్రజలలో అవగాహన కలిగించడానికిముందుగా మా దగ్గర అనుమతి తీసుకొని  అలా వేషం వేశారు.ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి.  మీరు వెళ్ళిపోతే మంచిది .గొడవచేస్తే మీకు మీ పార్టీకి  నష్టం కలుగుతుంది " అన్నారు 

ఆ పార్టీ వారు పోలీసుల వైపు, బిక్షగాడి వైపు కోపంగా చూస్తూ వెళ్లారు.

“ఆకాష్ సార్ మీలాంటి వారు ఊరికి ఒక్కరుంటే  దేశమంతా మంచి వారికి ఓటు వేసి దేశాన్ని కాపాడుతారు " అన్న పోలీసు మాటలు విని ఉలిక్కి పడ్డాడు అఖిల్. పరీక్షించి చూడగా అతను ప్రజలలో ఓటుపై అవగాహన కలిపించడానికి బిక్షగాడి వేషం వేసిన తన బావ అని గుర్తించగానే  ఒక్కసారిగా ఆకాష్ చేతులు పెట్టుకొంటూ "బావా నన్నుక్షమించు బావా ,ఉదయం కూడా మిమ్మల్ని వేపపువ్వు అంటూ ఎగతాళి చేసాను. వేపపువ్వు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేప పువ్వులాంటి మీ మాటలు ఈ సమాజం వింటే మంచి నాయకులను ఎన్ను కొంటారు " అన్నాడు

“మొత్తం మీద ఉగాది రోజు నాకు వేపపువ్వు అని పేరుపెట్టావు ....ఇంకా నయం భిక్షగాడు అని పెట్టలేదు " అని చెవిలో మెల్లగా చెబుతూ నవ్వాడు  ఆకాష్.

మరిన్ని కథలు
enni kalala ugadi