Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prema enta madhram

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue312/804/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి).... "కాత్యాయని గారూ, ఈ జీవితం ఏముందండీ.. నా అనుకుంటే స్వార్థం, మన అనుకుంటే లోక కల్యాణం. చిన్నప్పట్నుంచీ డబ్బుకు దేబురించే కుటుంబంలో పుట్టడం చేత, కోరికలను అదుపుచేస్తూ పెరగడం చేత, డబ్బు మీద ఒక రకమైన కసి ఏర్పడింది. డబ్బును ఎలాగైనా సంపాదించి తద్వారా నాలో ఎప్పట్నుంచో అదిమిపెట్టి ఉంచిన కోరికల సెగలకి ఆజ్యం పోద్దామనుకున్నాను. అలాగే చేశాను కూడా! ఆలా విచ్చలవిడి తనంతో పేట్రేగి పోతున్న నా కళ్లకు మీ రూపం కనిపించి పిచ్చివాణ్ని చేసింది. సారీ..నేను జరిగింది యథావిధిగా చెబుతున్నాను కాబట్టి కొన్ని వివరాలు వినకూడనివిగా, పచ్చిగా అనిపించొచ్చు..అవి అప్పటి రోజుల్లోవి, ఈనాటి నేను కాల్చి పుటం పెట్టిన మేలిమి బంగారాన్ని. అంచేత మీరు వినొచ్చు. ఎంతవరకు వచ్చాం..ఆఁ , మీ రూపం పిచ్చివాణ్ని చేసింది. నేను అప్పటిదాకా పొందిన సుఖం ఒక ఎత్తు, మిమ్మల్ని పొందడం ఒక ఎత్తుగా అనిపించింది. ఇహ నా కాన్ సంట్రేషన్ మీరయ్యారు. తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేశాను, ఎలా దగ్గరయ్యానన్నది మీకు తెలిసిందే!

సరే, మీరు హోటల్ రూముకొచ్చి వెళ్లిపోయాక.. మీకిచ్చిన మాట ప్రకారం నేను ఊరు వదిలేశాను. అటు తర్వాత నాలో ఏదో చెప్పలేని మార్పు, ఏవిటో అర్థమయ్యేది కాదు. నాకు మీ రూపం పదే పదే గుర్తొచ్చేది, అయితే నా లోని వికారాన్ని రెచ్చగొట్టేదిగా కాదు. ముందు మీరు కనిపించి గుళ్లోని అమ్మవారి రూపం సంతరించుకుని అంతర్ధానమయ్యేవారు. అలాగే మీ రూపం మనసులో మెదిలి మా అమ్మ రూపంపొంది మాయమయ్యేవారు. లోకంలోని సుఖాల పట్ల వ్యామోహం సన్నగిల్లింది. అన్ని ఊళ్లు తిరిగి కోనేట్లలో మునిగి దైవ దర్శనాలు చేసుకున్నాను. అప్పుడు..అప్పుడు నాలోని భావ ఉద్విగ్నత తగ్గి మనసు ప్రశాంత సరోవరంగా రూపాంతరం చెందింది.

మనిషిని సుఖాల వెంట పరుగులు తీయించే డబ్బు ముఖ్యం కాదు. ప్రశాంతమైన మనసు ముఖ్యం అన్నది అనుభవం లోకి వచ్చింది. ప్రశాంతమైన మనసు ఉన్న మనిషికి తనున్నదే స్వర్గం. మన పెద్దవాళ్లు ఏవైనా ఊర్కే చెప్పలేదు. మనమే పెడచెవిన పెడతాం. ఉదాహరణకి భాగ్యం అంటే నిఘంటువు ప్రకారం అదృష్టము, ధనము. ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నది లోకోక్తి. ఆరోగ్యం ఏరకంగా అదృష్టం, ధనం అవుతుంది? అంటే ఆరోగ్యంగా ఉండడం అన్నది పూర్వ జన్మ సుకృతమే! అదృష్టమే!! జీన్స్ పరంగా మనకు వారసత్వంగా కొన్ని వ్యాధులు సంక్రమిస్తున్నాయంటే..అందుకు కారణమేమిటి? మనం వ్యాధిగ్రస్థుల ఇంట్లో పుట్టడం కేవలం యాదృచ్ఛికం కాదు. అలాగే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తన ఏకాగ్రతని చేసే పని మీద లగ్నం చేస్తాడు. పనిలో నిష్ణాతుడై..మంచి పేరు తెచ్చుకుని డబ్బు గడిస్తాడు. వ్యాధి పీడితుడు ఈ లోకంలో నరకం అనుభవించే బాధితుడన్నది నిర్వివాదాంశం. సరే అదలా ఉంచితే, నేను దారి తెన్నూ లేక కొంతకాలం తిరిగానన్నాను కదా! అలా తిరుగుతున్నప్పుడు ఎన్నో జీవితాలని దగ్గరగా చూశాను. చాలా దగ్గరగా చూశాను. బుద్ధుడిలా అన్నమాట! నాలో ఏదో తెలియని మార్పు.

ఈ లోకంలో అందరూ కష్టాలు పడరు..అలాగే అందరూ సుఖంగానూ ఉండరు. ఇదో కలగూరగంప. ఇది ఎందుకిలా ఉంది. ఎందుకంటే కష్టాల్లో..బాధల్లో ఉన్నవారిని ఊరడించి..సాంత్వన చేకూర్చే వాళ్లు కొంతమంది ఉండాలి కాబట్టి. మన సంప్రదాయంలో ధన సంపాదనతో పాటు దానానికి సరైన..నిజం చెప్పాలంటే ఎంతో ఎక్కువ విలువనిచ్చారు. భూరి దానాలు చేస్తే స్వర్గం పాదాక్రాంతమవుతుందని ప్రవచనాలుగా చెవినిల్లు కట్టుకుని చెప్పారు. దానర్థం కష్టాల్లో ఉన్నవారిని ఉన్నంతల్లో ఆదుకోమని. అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకోడమే సమాజ ఉద్దేశం.

నేనిదంతా ఎందుకు చెబుతున్నానంటే..నాలో ఎంతగా మార్పు వచ్చిందని మీకు తెలియజేయటానికి. మనసు ప్రక్షాళితమైతే మానవుడు సాక్షాత్తు భగవంతుడే. నేను ఆ దిశగా అడుగులేస్తున్నవాణ్ని.

ఒకరోజు టీ వీలో వస్తున్న మీమీది కార్యక్రమం చూశాను. అది కూడా కేవలం యాదృచ్ఛికం కాదు. తర్వాత నా మనసు మనసులో లేదు. ఈ ఊరొచ్చి, మీవారు మిమ్మల్ని ఇంట్లోంచి పంపేయడం, ఆయన మళ్లీ పెళ్లి చేసుకుని మిమ్మల్ని శాశ్వతంగా మర్చిపోవడం అన్నీ తెలుసుకున్నాను. మనసంతా వికలం అయిపోయింది. మీ ఆయనది ఒకప్పటి నా స్థితి. అదోగతి.

సరె సరె..ఇప్పుడూ నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలవడానికి ఒక కారణం ఉంది...

కాత్యాయని, హేమలు అతనివైపు చూస్తున్నారే గాని వారి మనసుల్లో ఏవేవో ఆలోచనలు.

*****

మనోహర్ ఏం కారణం చెప్పాడో తెలియాలంటే  వచ్చే శుక్రవారం దాకా ఎదురు చూడాల్సిందే....
 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్