Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue313/805/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

 

(గత సంచిక తరువాయి)..... “అమ్మ నీకో శుభవార్త”అన్నాడు అబ్బాస్.

అప్పుడే షబ్నమ్ నమాజ్ పూర్తిచేసింది. అర్డర్లీ ఇచ్చిన టీ తాగబోతుంటే అప్పుడే అబ్బాస్ గదిలోకి వచ్చాడు.అతని మొహం ఆనందంతో వెలిగిపోతుంది. ఒక అనుహ్యమైన విజయం సాధించినట్టు అతని కళ్ళు సెర్చిలైట్లలా వెలిగిపోతున్నాయి.

“ఏమిటి బాబు అంత సంతోషంగా ఉన్నావు. ఏమిటి విషయం”చిరునవ్వుతో అడిగింది షబ్నమ్.

“నేను చెప్పబోయే వార్త వింటే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు”అన్నాడు అబ్బాస్.

“అంత సంతోషం కలిగించే వార్త ఏమిటి బాబు.?

“నేను ఎల్లుండి ఇండియా వెళుతున్నాను”అన్నాడు అబ్బాస్.

“నిజంగానా.

“అవును. క్యాప్టన్ జహీర్ అబ్బాస్ గా కాదు. రక్షణమంత్రి బృందానికి చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ గా. “అంటు అంతా వివిరంగా చెప్పాడు.

“చాల సంతోషం బాబు. మీ నాన్నగారి కోరిక తీరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విషయం కోడలు పిల్లకు చెప్పావా”అడిగింది షబ్నమ్.
    “ఇంకా లేదు. రాత్రి కాల్ చేసి చెప్తాను”అన్నాడు అబ్బాస్.

“అంతా కోడలు పిల్ల వేళా విశేషం”అంది షబ్నమ్.

అదే రోజు రాత్రి అబ్బాస్  మిత్రవిందకు కాల్ చేసి ఈ వార్త చెప్పాడు.

“ఎక్స్ లెంట్ అబ్బాస్. చాల సంతోషంగా ఉంది”అంది మిత్రవింద.

“నాకు మాత్రం సంతోషంగా లేదు”అన్నాడు అబ్బాస్.

“ఎందుకని.”

“నువ్వు ఇంకా మన విషయం మీ నాన్నగారికి చెప్పలేదు. నీకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. నేను ఎల్లుండి ఢిల్లీ వెళుతున్నాను. ఎందుకు ఏమిటి అని అడగవద్దు. ఆది చెప్పను. చాల రహస్యం. పైగా నేను అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కు కట్టుబడి ఉన్నాను. అదివారం పదిగంటల లోగా నీ దగ్గర నుంచి నాకు కాల్ రావాలి. మన విషయం మీ నాన్నగారితో చెప్పావో లేదో నాకు తెలియాలి. ఒక వేళ కాల్ రాకపోతే నువ్వు చెప్పలేదని నాకు తెలుస్తుంది. అదే టైంకు నేను మీ ఇంటికి వస్తాను. మీ నాన్నగారితో మన విషయం మాట్లాడతాను. ఎలాగైన కష్టపడి ఆయనను ఒప్పిస్తాను. ఇది మాత్రం నిజం.

“ప్లీజ్ అబ్బాస్ దయచేసి నువ్వు మాత్రం రాకు. నేనే ఎలోగో నాన్నగారితో మాట్లాడతాను”అంది మిత్రవింద భయంగా.

“అందుకేగా నీకు గడవు ఇచ్చాను. ఉంటాను. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలి బై”అని లైన్ కట్ చేశాడు అబ్బాస్.

XXXX

అబ్బాస్ హెచ్చరిక విని మరింత డీలాపడిపోయింది మిత్రవింద. ఏం చెయ్యాలో ఆమెకు అర్ధం కావటంలేదు. తండ్రితో తన ప్రేమ విషయం చెప్పటానికి ఆమెకు ధైర్యం చాలటంలేదు. అలాగని అబ్బాస్ ఇంటికి రావటం ఆమెకు ఇష్టంలేదు. ఎలా చూసిన ఏది జరిగిన ఇంట్లో దుమారం తప్పకుండ లేస్తుంది. దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఆమె ఊహించలేకపోతుంది.

ఆ రోజు శనివారం. ఈ రోజే అబ్బాస్ సెక్యురిటి ఏర్పాట్లు చూడటానికి ఢిల్లీ వెళుతున్నాడు. ఆ రోజంతా ఆ పనిలో బిజీగా ఉంటాడు. తరువాత ఆదివారం తిరిగి ఇస్లామాబాద్ బయలుదేరుతాడు.మద్యలో శ్రీనగర్ లో దిగి ఆమె ఇంటికి వస్తాడు. చక్రపాణితో తన పెళ్ళి విషయం మాట్లాడతాడు. తరువాత ఏం జరుగుతుందో మిత్రవింద ఊహకు అందటం లేదు.

ఈ రోజు రెండో శనివారం. చక్రపాణికి ఆఫీసు సెలవు. ఈ రోజు పూర్తి అయ్యేలోగా ఆమె అబ్బాస్ విషయం అతనికి చెప్పాలి. తరువాత ఆ అవకాశం ఉండదు. ఏకంగా అబ్బాస్ ఇంటికి వస్తాడు. తమ ప్రేమ విషయం చెప్తాడు. తరువాత ఇంట్లో పెద్ద విస్పోటనం జరుగుతుంది. ఇదే విషయం ఆమె చెప్పిన పర్యావసానం ఒక్కటే.

ఏం చెయ్యాలో మిత్రవిందకు భోదపడటంలేదు. ఆమె చెప్పకపోతే అబ్బాస్ చెప్తాడు. ఎవరు చెప్పిన ఇంట్లో దుమారం లేవటం ఖాయం. అందుకే చాల అన్యమనస్కంగా ఉంది మిత్రవింద. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదని ఆమెకు అర్ధమైంది.

“ఏమిటమ్మా అలా ఉన్నావు”కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్న మిత్రవిందను అడిగింది తల్లి.

తల్లి ఆప్యాయంగా అడిగేసరికి బాగా కదిలిపోయింది మిత్రవింద. తన బాధ తల్లితో చెప్పుకోవాలని అనిపించింది. కాని దానివల్ల లాభం ఉండదు నష్టం తప్ప. తన విషయంలో తల్లి ఏ రకంగాను సహయం చెయ్యలేదు. ఆ విషయం మిత్రవిందకు తెలుసు. అందుకే అసలు విషయం చెప్పలేదు.

“ఏం లేదమ్మా. తోచక అలా తిరుగుతున్నాను”అంది మిత్రవింద.

తల్లి నమ్మిందో లేదో తెలియదు. కాని ఇంకేం మాట్లాడకుండ అవతలకు వెళ్ళిపోయింది.

తల్లి వెళ్ళిపోయిన తరువాత గదిలోంచి బయటకు వచ్చింది మిత్రవింద. తండ్రి ఏం చేస్తున్నాడో చూద్దామని ఆయన గదిలోకి వెళ్ళింది. మంచంమీద పడుకుని పేపర్ చదువుతున్నాడు చక్రపాణి. మొహం వైపు చూసింది. ప్రశాంతంగానే ఉంది. అంటే ఆయన మంచి మూడ్ లో ఉన్నాడని మిత్రవిందకు అర్ధమైంది. మెల్లగా లోపలికి వెళ్ళబోయింది. కాని ఎందుకో ఆమె కాళ్ళు ముందుకు కదలనని మొరాయించాయి. కాళ్ళు నేలకు అతుక్కుపోయినట్టు ఒక్క అడుగుకూడా ముందుకు కదలలేదు. పైగా గుండెలు విపరీతమైన వేగంతో కొట్టుకుంటున్నాయి. ఈ పరిస్ధితిలో తను ఏం చెప్పలేనని మిత్రవిందకు అర్ధమైంది. మెల్లగా వెనక్కి తిరిగి వచ్చేసింది. ఇలాంటి ప్రయత్నం ఆ రోజు చాల సార్లు చేసింది మిత్రవింద. కాని ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. తండ్రి దగ్గరకు వెళ్ళి ఒక ముక్కకూడా మాట్లాడలేకపోయింది.

తండ్రికి తన ప్రేమ విషయం చెప్పలేని మిత్రవింద ప్రేమను గెలిపించడం లో ఓడిపోతుందా..గెలుస్తుందా... తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం దాకా ఎదురు చూడాల్సిందే....     

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్