Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

జెర్సీ చిత్రసమీక్ష

jersee movie reView

చిత్రం: జెర్సీ 
నటీనటులు: నాని, శ్రద్ధా శ్రీనాథ్‌, సత్యరాజ్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ, సంపత్‌ రాజ్‌, ప్రవీణ్‌ తదితరులు. 
సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌ 
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌ 
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి 
దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి 
నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ 
విడుదల తేదీ: 19 ఏప్రిల్‌ 2019

కుప్లంగా చెప్పాలంటే.. 
క్రికెటర్‌ అర్జున్‌ (నాని), సారా (శ్రద్ధా శ్రీనాథ్‌)ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. జాతీయ జట్టులో స్థానం రాకపోవడంతో 26 ఏళ్ళ వయసులోనే క్రికెట్‌కి దూరం అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అర్జున్‌కి స్పోర్ట్స్‌ కోటాలో వచ్చిన జాబ్‌ కూడా పోయేసరికి, అతని భార& సారా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. అర్జున్‌ - సారాలకు ఓ కొడుకు (నాని) పుడతాడు. నాని తన పుట్టినరోజున అర్జున్‌ని జెర్సీ గిఫ్ట్‌గా అడుగుతాడు. అయితే కేవలం 500 రూపాయల విలువైన జెర్సీని కొనేందుకు అర్జున్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరదు. మరోపక్క అర్జున్‌ - సారా మధ్య అభిప్రాయబేధాలు పెరుగుతాయి. కొడుకు కోరిక తీర్చలేకపోయానన్న కసితో మళ్ళీ క్రికెటర్‌గా అవతారమెత్తుతాడు. 36 ఏళ్ళ వయసులో జాతీయ జట్టులో స్థానం కోసం అర్జున్‌ పడ్డ కష్టం ఏమయ్యింది? అన్నది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే.. 
నాని మంచి నటుడు, నాని చాలా మంచి నటుడు, నాని చాలా చాలా మంచి నటుడు అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం, చెప్పుకుంటూనే వున్నాం. ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవాల్సిందే. అయినా అతను తెరపై నటిస్తున్నాడని ఎలా అనుకోగలం? పాత్రల్లో అంతలా జీవించేస్తాడు మరి. ఈ సినిమాలోనూ అదే చేశాడు. అర్జున్‌ అనే ఓ వ్యక్తి తప్ప, నాని ఎక్కడా కన్పించడు ప్రేక్షకుడికి. నాని నటన గురించి ఇంతకన్నా గొప్పగా ఏం చెప్పగలం! ప్రతి ఫ్రేమ్‌లోనూ నాని తన నటనతో ఆయా సీన్స్‌ని ఎలివేట్‌ చేసేశాడు. భావోద్వేగాల విషయానికొస్తే, నానికి సాటి ఇంకెవరూ లేరనేంతలా కన్పించాడు.

గ్లామర్‌ కోసం కాకుండా, తాను రాసుకున్న పాత్రకి న్యాయం చేయగల నటి కోసమే ఆలోచించిన దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా సారా పాత్రలో ఒదిగిపోయింది శ్రద్ధా శ్రీనాథ్‌. ఒక్క మాటలో చెప్పాలంటే హీరో నానితో పోటీ పడింది. ఆమె హావభావాలు సినిమాకి అదనపు అడ్వాంటేజ్‌. అర్జున్‌ తనయుడిగా చేసిన బాల నటుడు కూడా బాగా చేశాడు. కోచ్‌ పాత్రలో సత్యరాజ్‌, తన కెరీర్‌లో మరో బెస్ట్‌ రోల్‌ చేశాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.

అనుకున్న కథని అనుకున్నట్టుగా తెరకెక్కించినందుకు తొలుత దర్శకుడ్ని అభినందించాలి. కథ, కథనం, మాటలు ఇలా అన్ని విషయాల్లోనూ దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. నేపథ్య సంగీతం సినిమాకి ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్‌. సినిమాటోగ్రఫీ చాలా సీన్స్‌ని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళుతుంది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌.. ఇలా అన్ని విభాగాలూ దర్శకుడికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాయి.

సినిమాటిక్‌ లిబర్టీ పేరుతో దర్శకుడు తాను అనుకున్న కథని ఇంకో దారిలోకి తీసుకెళ్ళలేదు. ఎమోషనల్‌ సీన్స్‌ని బాగా హ్యాండిల్‌ చేశాడు, అందుకు నటీనటుల నుంచీ సంపూర్ణ సహకారం దక్కింది. సగటు కమర్షియల్‌ అంశాల్ని ఆశించేవారికి మాత్రం ఈ సినిమా కొంత నిరాశపర్చవచ్చు. కొత్తదనం కోరుకునేవారికి మాత్రం మంచి ఫీల్‌ని మిగుల్చుతుంది. నటీ నటుల ప్రతిభ, దర్శకుడి పనితనం ఇలా అన్నీ సినిమాలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేశాయి. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌.. ఇలా సినిమా అంతా ఓ మంచి పేస్‌తో నడుస్తుంది. ఓవరాల్‌గా ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని అయితే ఖచ్చితంగా మిగుల్చుతుంది ఇది.

అంకెల్లో చెప్పాలంటే..
3.75/5

ఒక్క మాటలో చెప్పాలంటే
జెర్సీ.. బంతి బౌండరీ దాటిందోచ్‌

మరిన్ని సినిమా కబుర్లు
churaka