Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu
( రామేశ్వరం )

ఈ వారం మనం మధురై నుంచి రామేశ్వరం వెడదాం , రామేశ్వరం గురించి మనమందరం చాలా సార్లు విన్నాం . రామాయణంలో రామేశ్వరంగురించిన వివరణ వుంది . పురాణాలలో రామేశ్వరం గురించిన వివరణ వుంది , పురాణాల ప్రకారం రామేశ్వరాన్ని ‘ గంధమాదనం ‘ అనేవారు , రామునిచే యిక్కడ శివలింగం ప్రతిష్టించబడింది అని చెప్తారు కాని వేదకాలం నుంచి యిక్కడ శివకోవెల వున్నట్లుగా చెప్పబడింది . రామేశ్వరం శైవులకి , వైష్ణవులకు కూడా పుణ్య క్షేత్రమే .రామేశ్వరం తమిళనాడుకి చెందిన రామనాథ్ పురం జిల్లాలో వుంది . దేశం లోని అన్ని ముఖ్యపట్టణాలనుంచి రైలు సౌకర్యం వుంది , తమిళనాడు రాష్ట్రం లోని అన్ని ముఖ్య నగరాలనుంచి బస్సు సౌకర్యం వుంది

పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో యిదివొకటి . , అలాగే తమిళనయనార్లచే గుర్తింపబడ్డ 274 పాదాళ పేత్ర స్థలాలలో ఒకటి .చెన్నై నుంచి సుమారు 600 కిలోమీటర్ల దూరం లో వుంది రామేశ్వరం .వానరుల సహాయంతో హనుమంతుడు వారధి నిర్మించడం , ఆ వారధిని దాటి రాముడు లంకలో ప్రవేశించి రావణుని హతమార్చి సీతమ్మను చెరనుంచి విడిపించడం , అనంతరం శివలింగాన్ని ప్రతిష్టించడం లాంటివి యెన్నో సార్లు చదివేం , విన్నాం కూడా , ఆ ప్రదేశాన్ని చూడ్డం అంటే ఓహ్ కలనిజమవడం కాదూ ? .

రామేశ్వరం , పూరి , ద్వారక , బదరీనాథ్ ( ఉత్తరా ఖండ్ ) లను చార్ధామ్ యాత్రలని అంటారు , ఏ యాత్రలు చేసినా చెయ్యకపోయినా యీ నాలుగు యాత్రలు చెయ్యాలనేది ప్రతీ హిందువు కోరిక . ఈ నాలుగు యాత్రలు చేస్తే దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలనూ దర్శించుకున్న పుణ్యం వస్తుందని పెద్దలు చెప్తారు .

రామేశ్వరం నిజానికి ఓ ద్వీపం దీనిని పాంబం ద్వీపమని , రామేశ్వరం ద్వీపమని పిలిస్తారు . యీ ద్వీపాన్ని మనదేశంతో కలుపుతున్న బ్రిడ్జ్ ని పాంబం బ్రిడ్జ్ అని అంటారు , యీ బ్రిడ్జ్ మొదలయే స్టేషన్ ని పాంబం స్టేషనని అంటారు .

మధురై నుంచి ట్రైనులో బయలుదేరేం , మా ప్రయాణం పగటిపూట కాబట్టి సముద్రం మీది బ్రిడ్జి మీద ప్రయాణం చూడగలిగేం . ‘ పాంబం ‘ నుంచి రామేశ్వరం వరకు సముద్రం మీద ప్రయాణం , అద్భుతమనిపిస్తుంది . అంటే అప్పుడు మొదటిమారు సముద్రం మీద బ్రిడ్జి , దాని మీద ప్రయాణం అంటే చాలా వుత్సాహం అని పించింది , ఇప్పుడైతే అంతకుతూహలం వుండకపోవచ్చు  , యెందుకంటే హాంకాంగ్ లో సముద్రం కిందనుంచి ప్రయాణించడం , మలేషియాలో సముద్రం మీద బ్రిడ్జి పై ప్రయాణించడం , క్రూజ్ లో విహరించడం వల్ల ఉత్సుకత తగ్గిందేమో మరి అప్పుడు మాత్రం ఓ అద్భుతాన్ని చూస్తున్న అనుభూతికి లోనయ్యాం .

రామేశ్వరంలో పధ్దతి ప్రకారం సముద్ర స్నానం ముందుగా చెయ్యాలి , సముద్రానికి వెళితే బంగాళాఖాతం అలవాటైన మాకు హిందుమహాసముద్రం అలలు లేకుండా కనిపించేసరికి నిజంగా సముద్రానికే వచ్చేమా ? అనే అనుమానం కలిగింది . నురుగలు కక్కే అలలు లేవు , నీలం రంగు నీరూ లేదు , బురద నీటిలో దిగడానికే మనసురాలేదు , అందరూ దిగుతూ వుంటే నేను కూడా దిగేను , అనుమాన నివృత్తి కోసం నోట్లో నీళ్లు పోసుకుంటే చెప్పలేనంత వుప్పు , అక్కడ స్నానం అయేక దగ్గరగానే వున్న మందిరం లోకి వెళ్లేం . అక్కడ తమిళం లో మాతోపాటు వచ్చిన వాళ్లు యేదో చెప్పటం మేము వారిని అనుసరించేం .

పెద్ద పురాతనమైన రాతి మందిరం ముందుగా ఓ బావి దగ్గరకి వెళ్లేం అక్కడ వున్న వారు బకెట్లతో నీరు తోడి మా తలల పైనుంచి పోసేరు , అలా 21 బావులలోని నీరు మా తలలపైనుంచి పోసేరు .

ప్రపంచం లోనే అతి పొడవైన మందిరంగా పేరు పడ్డ మందిరం , మందిరమంతా తిరిగేసరికి కాళ్లు పుళ్లే . యెత్తుగా పొడవుగా వున్న నడావాలలో నడుస్తూ గర్భగుడి వైపు వెళ్లేం . ఈ కోవెలలో పెద్దరాతిలింగం కాక చిన్న లింగం వుంటాయి . చిన్న లింగం యిసుకతో చేసినది కావటం వల్ల యీ లింగానికి అభిషేకాలు చెయ్యరు , కాని యీ చిన్న యిసుక లింగమే రామరావణ యుద్దానంతరము సీతారాములచే ప్రతిష్టించబడినది . పెద్ద రాతిలింగం హనుమంతుడు రాముని ఆజ్ఞ మేరకు హిమాలయాలనుండి తెచ్చినదట .

12 వ శతాబ్దం లో రామేశ్వరాన్ని పరిపాలించిన పాండ్యరాజులు మందిరంలో యెన్నో కట్టడాలను జోడించి సత్రములు కట్టించేరట . శ్రీలంకలోని జాఫ్నా ని పరిపాలించిన రాజులు రామేశ్వర మందిరానికి మరమ్మత్తులు చేసి యెన్నో కానుకలను యిచ్చేరట .

ఇప్పటికే పాండ్యరాజులులకట్టించిన మందిరాలలోని శిల్పకళను మీకు పరిచయం చేసేను , వాటిని మించి వుంటుంది యీ మందిరంలోని శిల్పకళ , ముఖ్యంగా పైకప్పులపైన , యే కాలమైనా విపరీతంగా చెమటలు పట్టి చాలా చికాకు పరుస్తుంది యిక్కడి వాతావరణం , భోజనాలు వగైరాలు అంతబాగుండవు , శరణార్ధులు యెక్కువగా నివసించే ప్రాంతం కాబట్టి గొడవలు , మోసాలు , దొంగతనాలు కూడా యెక్కువగానే వుంటాయు జాగ్రత్త .

స్థలపురాణానికి వస్తే హనుమంతుడు సీతాన్వేషణలో గంధమాదన పర్వతానికి వచ్చి అక్కడినుంచి లంకకు చేరి సీతను కనుగొని ఆమెను రావణాసపరుని చెరనుండి విముక్తను చేయుటకు రాముని తోడ్కొని సముద్రతీరానికి వస్తాడు . సముద్రం దాటడం మానవులైన రామలక్ష్మణులకు వానరసేనకు సాధ్యం కాదు కాబట్టి వంతెన నిర్మించ తలపెడతాడు , యెన్ని రాళ్లు వేసినా అవి సముద్రంలో మునిపోతూ వుంటాయి , అప్పుడు నీలుడు అనే వానరం తన వరప్రభావంతో రాళ్లు సముద్రంపై తేలియాడేటట్లు చేయగా వాటిపై నడుస్తూ రామలక్ష్మణులు సముద్రాన్ని దాటి లంకకు చేరి రావణుని యుధ్దంలో ఓడించి సీతాసమేతుడై గంధమాదనం చేరుకొని యుద్దం వల్ల కలిగిన పాపనివారణార్దం లింగ ప్రతిష్ట చెయ్య సంకల్పిస్తాడు .

హనుమను హిమాలయాలనుంచి శివలింగాన్ని తెమ్మని కోరుతాడు , హనుమ పెద్దలింగాన్ని తేవాలనే తపనతో సమయాన్ని పట్టించుకోక వెతకుతూ వుండిపోతాడు , ముహూర్తకాలం దాటిపోతూ వుండడంతో సముద్రపు యిసుకతో లింగాన్ని చేసి ముహూర్త సమయంలో లింగ ప్రతిష్ట చేస్తారు సీతారాములు . హనుమ తెచ్చిన శివలింగమే జ్యోతిర్లింగమని శ్రీరాముడు చెప్తాడు , హనుమంతుడు తెచ్చిన లింగానికే నిత్యాభిషేకాలు జరపాలని శ్రీరాముడు చెప్పినట్లుగా చెప్తారు కొందరు , కాదు రాముడు ప్రతిష్టించిన లింగం సైకత ( ఇసుక ) లింగం కాబట్టి దానికి అభిషేకాలు చేస్తే లింగం కరిగిపోతుంది కాబట్టి హనుమంతుడు తెచ్చిన రాతి లింగానికే అభిషేకాలు జరుపుతున్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు .

రామేశ్వరం సముద్ర స్నానం తో ముడిపడి వున్న మరో నమ్మకం యేమిటంటే బహిస్టులు ఆగిపోయినవారు రామేశ్వరంలో స్నానం చేస్తే బహిస్టు లో చేసిన పాపం నుంచి విముక్తులౌతారని అంటారు .

సంపూర్ణయాత్ర గురించి మీరు వినేవుంటారు , ఓ నిముషం సంపూర్ణ యాత్రఅంటే యేమిటో తెలుసుకుందాం .

కాశి గంగనీరు తెచ్చి రామేశ్వరం సముద్రంలో కలపాలి , రామేశ్వరం సముద్రంలోని ఇసుకను తెచ్చి కాశీ గంగానదిలో కలపాలి దాంతో సంపూర్ణ యాత్ర పూర్తవుతుంది , యిక్కడో ముఖ్య విషయం గురించి కూడా చెప్పుకోవాలి , ఈ సంపూర్ణ యాత్ర పూర్తయేవరకు యింటికి వెళ్లకూడదు అని కొందరంటారు , అంటే కాశియాత్ర చేసుకొని యింటికి వచ్చి కొన్నాళ్ల తరువాత రామేశ్వరం వెళ్లి తిరిగి యింటికి వచ్చి కాశి వెళ్లడం చెయ్యకూడదు మొత్తం యాత్ర పూర్తయేకే యింటికి వెళ్లాలి , కాదు మొత్తం యాత్ర ఒకే సంవత్సరం లో పూర్తి చెయ్యాలని కొందరంటారు ,

అయితే ఈ నమ్మకాల వెనకాల యింట్లో యేదైనా అశుచి వచ్చి తెచ్చిన కాశి గంగ , రామేశ్వరం ఇసుక మైలపడిపోతాయని యాత్ర వీలైనంత తొందరగా ముగించాలని అంటారని నాకనిపించింది . ఏది యేమైనా యెంత తొందరగా ముగిస్తే అంత మంచిది .

రామేశ్వరం గురించి చెప్పుకున్నాం కదా ? రామేశ్వరంలో మిగతా చూడదగ్గ ప్రదేశాల గురించి కూడా తెలుసుకుందాం .

ధనుష్ కోటి  —-

ధనుష్కోటి రామేశ్వరానికి సుమారు 4,5 కిలోమీటర్ల దూరంలో పాంబం ద్వీపం లోనే వుంది , శ్రీలంకలోని ‘ వవూనియ ‘ కి సుమారు 25 కిలోమీటర్ల దూరం . సముద్రతీరం వెంట రామేశ్వరం నుంచి నడుస్తూ కూడా చేరుకోవచ్చని అంటారు . చెన్నై ఎగ్మూరు నుంచి ధనుష్కోటి వరకు మీటరు గేజ్ రైలు సౌకర్యం కూడా వుండేది . ప్రస్తుతం ధనుష్కోటి లో జనావాసం లేదు . 1955 నుంచి తరచు వచ్చే తుఫానులలో ధనప్రాణ నష్టాలు జరుగుతూ వుండేవి , 1964 లో వచ్చిన పెద్ద తుఫానులో ధనుష్కోటిలోని చాలా భూబాగం సముద్రంలో మునిగిపోయింది , ఆ తుఫాను తరువాత ప్రభుత్వం యీ ప్రాంతం నివాసయోగ్యం కాదని ప్రకటించేరు . 1964 తరువాత ధనుష్కోటి నిర్మానుష్యమైంది . ప్రస్తుతం సొంతవాహనాలలో వచ్చేవాళ్లు మాత్రమే ధనుష్కోటిని చూడగలుగుతున్నారు . మరీ బ్రతిమాలితేగాని రిక్షా వాళ్లుకూడా రావడానికి యిష్టపడరు . 2010 లో ధనుష్కోటి రైల్వే స్టేషను పునఃనిర్మించడానికి నిర్ణయం తీసుకోబడింది . కాని యింతవరకు పని మొదలుకాలేదు .   హిందూ పురాణాల ప్రకారం ధనుష్కోటికి చాలా ప్రాముఖ్యత వుంది . ఆకధేమిటో తెలుసుకుందాం .

సీతా స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివధనస్సును యెక్కుపెట్టగా అది ఫెళ ఫెళ మని విరిగి మూడు ముక్కలయింది , క్రిందభాగం జనకపూర్ ( నేపాల్ ) లో పాతాళానికి చొచ్చుకుపోయి ఆ ప్రదేశంలో గంగబయటకు వచ్చిందట ఈ ప్రదేశం ‘ గంగాసాగర్ ‘ గా పిలువబడుతోంది , మధ్య భాగం జనకపూర్ కి కొద్ది దూరం లో వున్న ధనుషా ధామ్ లో పడగా పై భాగం రామేశ్వరం దగ్గరవున్న ధనుష్కోటిలో పడిందని అంటారు . ధనుష్కోటిని దర్శించుకుంటే సాక్షాత్తు శివుణ్ని దర్శించుకున్నట్లే .

రామేశ్వరంలో మరో చూడదగ్గ ప్రదేశం అబ్దుల్ కలామ్ మెమోరియల్ , 2017 జూలై లో దీనిని ప్రధాని మోడీగారిచే ప్రారంభించబడింది . ఇందులో కలామ్ గారి జీవితానికి సంబంధించన విశేషాలు , ఫొటోలు భద్రపరిచేరు . ఇక్కడ కలాంగారి సమాధి , నిలువెత్తు కలామ్ గారి విగ్రహం , జీవకళతో వున్న కలాంగారి వీణవాయిస్తున్నట్లున్న విగ్రహం చూడదగ్గవి . ఈ మెమోరియల్ యువతరానికి మార్గదర్శకం అని చెప్పక తప్పదు .

ఈ ప్రదేశంలో యెక్కువగా శ్రీలంక తమిళ శరణార్ధుల శిబిరాలు వుండడం వల్ల లా అండ్ ఆర్డరు తక్కువగా వుంటుంది , మనుషులు కాస్త మొరటుగా వుంటారు ( మాట , ప్రవర్తన ) , దొంగతనాలు యెక్కువగా వుంటాయి . యాత్రీకులు జాగ్రత్తగా వుండాలి .

వచ్చేవారం మరో యాత్రాస్థలంగురించి తెలుసుకుందాం , అంతవరకు శలవు .
మరిన్ని శీర్షికలు
weekly-horoscope may 10th to may 16th