Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

హ్యూమరసం - వారణాసి రామకృష్ణ

 

అదనం
పొద్దున్నే తల్లి పిల్లాడ్ని నిద్రలేపి అన్ని పనులు చేయించి టిఫిన్ బాక్స్ రెడీచేసి పాలుతాగించి స్కూల్ ఆటోఎక్కిస్తుంది! అయినా తృప్తి కలగక అదనం గాఇంకాఎదో చేయాలిఅనుకునిఆటో ఎక్కించే ముందు పిల్లాడి జేబులో రెండుచాక్లెట్లు పెడుతుంది! అప్పుడుతల్లికి లభించేసంతృప్తి పెదవుల మీద‘ అదనపు’ చిరునవ్వైపూస్తుంది!పిల్లాడూపొద్దునించితల్లిచేసిన సపర్యలు మౌనంగా చూస్తాడే గానీ స్పందన ఉండదు!ఎప్పుడైతే అదనంగా చాక్లెట్లు జేబులోకొచ్చి పడ్డాయో అప్పుడోస్తుంది హుషారు! అదిచ్చే కిక్కే కిక్కు! ‘అదనం’ ఇచ్చె కిక్కు మరుపు రానిది, మరువలేనిది! వన్నె తగ్గనిది!

***    ****   ****

కొన్ని ‘అదనాలు’ జనాల వీపు విమానం మోత మోగిస్తాయి! పిల్లాడ్ని స్కూల్లో చేర్చాక ఫీజులు గట్రా కట్టెక డొనేషన్లు, బిల్గింగ్ ఫండ్లు అంటూ బోలెడన్ని అదనాలు చెల్లించాలి. సరే పేరెంట్ అని ఇంగ్లిష్ లో పేరెట్టాక  పే చెయ్యక తప్పదు గనక పే చేసి పిల్లాడ్ని స్కూల్ కి పంపితే ఇక అప్పటినుంచి వాడు బ్యాగు బాటిలు బాక్స్ లతో బాటు అదనపు పుస్తకాల భారం అదనంగా మొయ్యాలి,తప్పదు! ఇల్లాలికి వంట వార్పూ పనులతో  బాటు పక్కలు ఎక్కి చుట్టలు కాలుస్తూ కాఫీటీ లు అదనం గా అడుగుతారు చుట్టాలుపక్కాలు (వాళ్ళని అందుకే చుట్టాలు పక్కాలు అనేది) దాంతో గృహిణి అదనపు బరువు బాధ్యతల్నిభుజం మీద వేసు కుంటుంది. ఇంటి బరువు మోసే గృహస్థు ప్రభుత్వం వేసే పన్నులు కట్టడoతో సరిపోదు ,ప్రపంచబ్యాంకు నుండి తెచ్చే అప్పులకి వడ్డీలు అదనంగా చెల్లించాలి. ఇలా అదనంగా వచ్చి పడే బోలెడన్ని ఖర్చుల ధాటికి తట్టుకోవాలంటే మళ్ళీ అదనపు సంపాదన ప్రారంభించాలి.‘అదనం’ ఒక విష వలయం!   

*****    ******      *****   

సినేమాకతకి ఒక హీరోయిన్ సరిపోదు. అదనంగా ఇంకో హీరొయిన్ ఉంటేనే తెల్గు పిచ్చెర్ కలర్ ఫుల్లుఅయ్యేది.ఐతే ఒక్కోసారి రచైత సెప్పిన కత ఇన్నాక హీరో ‘అబ్బేఇద్దరుహీరోయిన్ల కి తోడు అదనంమూడో హీరోయిన్ ఉంటేనే సిన్మా సూపరు హిట్టు’ అంటాడు.అదనంగాఇంకో హిరోయిన్నా?ఇద్దరే దండగ! నిర్మాత గింజుకొని కనీసం కాస్ట్యుమ్ ఖర్చులు మిగిలిద్దామని వాళ్లలో ఒకరికి చెడ్డి ఇంకొరికి మిడ్డి తొడిగి మూడో హీరొయిన్ బట్టలు కూడా కొనలేని దీన స్థితి లో వున్నట్టు కతఅల్లిసిన్మాలాగిస్తాడు.ఇది అర్ధంచేసుకోకుండా హీరోఇన్లు బట్టలు లేకుండాఅర్ధనగ్నంగానటిస్తున్నారని విమ ర్శలు వస్తాయి.రసిక ప్రేక్షకుడు మాత్రం హీరోయిన్లు సూపరోసూపరు అనుకుంటాడు.ఇవన్నీ’అదనం’ తోవచ్చిన సిక్కులని  క్రిటిక్కులు ఆత్తం చేసుకోవాలి.

****    *****    *****

అదనం కొందరికి మోదం కొందరికి ఖేదం! హైడ్రాబ్యాడ్ లో మెట్రోలొచ్చాక జనంబస్సులు ఎక్కడంలేదని ఘన సెరిత్ర గల ఆర్టీసీ వాళ్ళు అదనపు సౌకర్యం కల్పిస్తామని దానికి గానూ యాప్ తెస్తామని అంటున్నారు. ఏంటయ్యా యాపు అంటే నువ్వు ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో ఎంతసేపటికి స్టాపుకి చేరుకుంటుందో సెప్తుందట! ఇది ప్రయాణీకులకి’అదనపు’ సౌకర్యం! అప్పట్లో ఇదే ఆర్టీసీ వాళ్ళు శానా రోజుల కిందట మీరు బస్సుఎక్కండి చాలులోన ఎయిర్ బస్సులో లేనన్నిఅదనపుసౌకర్యాలు ఎర్రబస్సులో వుంటాయని సెప్పారు.ఏంటి ఆ అదనపు సౌకర్యలూ అంటేబస్సులో ప్రయాణిస్తూహాయిగా ఎఫ్ఎంరేడియో వినోచ్చునట. అసలు సిటీబస్సులోప్రయాణమే ఓ శాపo!ఇక వాళ్ళు కల్పిoచే సౌకర్యాలుఅదనపునరకం! ఒకరికొకరు అతుక్కుని ప్రయాణించే బస్సులోఎఫ్ ఎం రేడియోఉండిఅందులోంచిమనతెల్గు పిచ్చెర్ పాటలు వస్తుంటే? ‘నీ పైటకొంగు పొంగుచూస్తా చిన్నదానా, నీజామతోటకొచ్చి కాయకోస్తా కుర్రదానా’ ఈ టైపులో పెద్ద సౌండులో పాటవస్తుంటే అసలే మన నరజాతి కుర్ర కుంకలు కల్లు తాగిన వానరుల్లా ప్రవర్తిస్తుంటే ఇక ఈ పాటలు విన్నాక  పరిస్థితి అదనంగా ఎంత అద్వాన్నంగా తయారవుతుంది?దీనికి తోడు బస్ లోనే ఫోన్ చేసుకునే సౌకర్యమొకటి అదనంగా కల్పిస్తామని అధికార్లు సెలవిచ్చారు! అప్పుడేమవ్వుద్దీ? కుర్రకుంకలు డైరేట్టుగా బస్లోంచే కుర్రదానికి రింగ్ చేసి ఈవుటీజింగు అదనంగా మొదలెట్టరూ?బాబ్బాబూ ఈ అదనo తద్దినంవద్దుగానీ నడిపే ఆ బస్సులేవో కాస్త తిన్నగా నడిపిరోడ్డెక్కాక మొరాయిoచకుండా  టైంకివచ్చేలా నడపండి జహాపనా! అనిజనం నెత్తినోరు బాదుకునిమరీ వాపోతున్నారు! ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు  ‘అదనం’ అంటే జడుసుకునే  ‘స్టేజి’ లో కొచ్చిజనం ఇంకేం వినలేక  ‘బస్’ అనేలా ఉన్నారు. 

****     *****    *******

అదనం కొందరికి కొండకచో ప్రభుత్వాలకి ఎప్పుడూ ఉల్లాసభరితం! అదనపు ఆదాయం ఎంత ఎక్కువ వస్తే అంత ఆనందదాయకం! అదనం అనేది మూలిగే నక్క మీద పడే తాటిపండు లాంటిది! మనం హోటల్ కెళ్ళి ఇరవై రూపాయిల ఇడ్లీ తింటే ముప్పైరూపాయల GST  అదనం! మంచినీళ్ళ కీ టాక్సు అదనం.ఉప్పునిప్పుతో బాటు సమస్తదినుసులకీ అసలు రేటుకి తోడు పన్నులు అదనం! కట్టక పోతే తన్నులు అదనం! బండికి పెట్రోల్ కొట్టిస్తే పన్నులు అదనం! పెళ్ళిలో కట్నానికి కానుకలు అదనం! వియ్యాలవారికి చీరలతో సారె అదనం! పండగ పూట మొగుడుకి పెళ్ళానికి పట్టుచీరతో బాటు మల్లెపూలు కొనడం అదనం! కోడళ్ళు అత్త గారి మీద పంతం పూని కొనే రవ్వల నెక్లేసుకి తయారీఖర్చుతో బాటు మజూరీ అదనం!కోడలు మీద క్షాత్ర పరీక్షలు పెట్టె అత్తగారు గుడ్లు మిటకరిస్తే కళ్ళుదొబ్బినేత్ర పరీక్షల ఖర్చులు అదనం! ముచ్చట పడి కొన్నమొరిగే కుక్కకి మెళ్ళో గొలుసు అదనం!

***      ****

అదనం రెండు వైపులా పదునున్న కత్తి! అది జోకులు పేల్చి నవ్విస్తుంది సర్రున గుచ్చుకుని   గాటు పెడుతుంది.ఒకసినిమాలో కోటశ్రీనివాసరావుగారు “నాకేంటి?” అనికుడిచెయ్యిబిగించి మరోచేతిలో కొడుతూ అడిగిన అదిరేటి డైలాగ్ లో ఉన్న ఈ నాకేంటి అన్న నాకేసే కాన్సెప్ట్ సిన్నఇసియం కాదు.దానికి బోలెడంత సెరిత్ర ఉంది.మడిసి పుట్టిన్నప్పటి నుంచి మడిసికి నీడలాఅదనం వెంటాడుతూoది!అదనం మనకి వచ్చినపుడు నవ్వుతాం పక్కోడికిఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏడుస్తాం! సెప్పాలంటే ప్రభుత్వం మనఆరోగ్యంగురించి పట్టించుకోకపోతే సరే, ఎవడిగోల వాళ్ళు పడదాం పాలసీ తీసుకుందాం అనుకునిముందుకు పోతే ఇన్స్యురెన్స్ ఏజెంట్  GST’ అదనం’ గా కట్టాలని గూడచారి ఏజెంట్ 007 లెవిల్లో బుల్లెట్ పేలుస్తాడు! మా కాలనీ లో మొన్నో సీనియర్ సిటిజెన్ బాల్చితన్నేస్తే పేపర్లో సంతాప ప్రకటన వేయిద్దామని వెళ్తే ‘మూడు వేలు అవుతుంది సార్ దీనికి GST అదనం’ అని పేపర్ ఏజెంట్ చెప్పాడు ఆహా!ఆఖరికి చావు ప్రకటనకీ అదనమా? తెల్లబోతే‘ చావుధనం’ ప్రభుత్వాలకి ‘అదనం’ అన్నాడు కన్ను కొట్టి నవ్వుతూ! 

***      ****     ****

‘అదనం’ పుండు మీద కారంలాంటిది!ఎలాగూ అంటే పనిమీద ఊరెల్తూ ఆటోఅతనితో ‘ఏమయ్యావస్తావా’ అడిగితే ‘మీటరు మీద యాబైఇవ్వుబై’అంటాడు.అంటే యాబై అదనం అన్నమాట! సరే అమాయకంగా ఎక్కుతాo!మీటరు భూచక్రంలా బరబరావిష్ణుచక్రంలా గిరగిరాతిరిగి రెండొందలుఅవుతుంది.వంద అనుకుంటే రెండొందలు అయ్యిందే! దొంగ మీటర్ని తిట్టుకుంటూరెండొందలుఇచ్చిఅదనంయాబైఇవ్వనుపొమ్మంటేకుదరదు,‘యాబైకక్కాల్సిందే..తప్పదురాబై!’ గదమాయించి మరీతీసుకుంటాడు. అప్పుడుమనకి ఈ అదనం అనేది పుండు మీద కారం చల్లినట్టు తోస్తుంది! ఐతే మనకప్పుడు తనికెళ్ళభరిణి గుర్తొచ్చి రెండొం దలు ఇవ్వకుండా రివర్సులో యాబై నోటుమీటర్ మీద పెట్టిఅమాయకం నటిస్తే ఆటోఅతను ఆశ్చర్యం గా చూసి ‘ఇదేంటండీ యాబై?’ అంటే ‘నువ్వే చెప్పావుగా మీటరు మీద యాబై! గందుకే ఇచ్చినర బై!’ భుజం మీద చనువుగా చెయ్యి వేసి గడుసుగా నెత్తి మీద జెల్లకొట్ట గలిగితే అది అటోవాళ్ళ ‘అదనపు’ దోపిడీ పై పేల్చిన తొలితూటా అవుతుంది!
*****     *****     *******
పత్రికల్లో వచ్చే ‘షాదీ అదనం’ కతనాలు భలే ఇసిత్రంగుంటాయి.లడికి ఇంజినీరింగుపాసయ్యి సాఫ్ట్ వేర్ కంపనీలో భారీ వేతనం తో ఉద్యోగం చేస్తూOటుంది. లడకా పదోక్లాసు పదిమాట్లు తప్పి బస్టాండ్లో ఆవారాగా తిరుగుతున్నాడని గొప్పగా చెప్తారు.అయినా సరే ఈ సాఫ్టువేరు అమ్మాయిని హార్డుకోరు అబ్బాయికి పాతిక లక్షలు కట్నం అదనం నూరుతులాల గోల్డుపెట్టి  ఘనంగా  షాదీ చేస్తారు.నెలతిరక్కుండానే పిల్లాడికి తాగుడు అలవాటుకి అదనం పెళ్ళాన్ని కొట్టడమని తెలుస్తుంది. దీనికి అదనంగా పెళ్ళికొడుకు తల్లితండ్రులు ఇచ్చినకట్నంచాలదు అదనపుకట్నం కావాలని అమ్మాయిని వేధిస్తారు.దాంతో పుట్టింటికొచ్చేస్తుంది. అప్పుడు మనకి ‘అదనం’ కి గట్టిగా మూడుసార్లు తలాక్ చెప్పాలి అనిస్పిస్తుంది.       
***     ****   ****
ఆకాశం లో ఉరుములకి అదనం మెరుపులు! వర్షానికి అదనం పిడుగులు! హోరు గాలులకి అదనం ఈదురుగాలులు! నష్ట పోయిన రైతు దెబ్బతిన్న పంటని చూపి రోదించి అదనంగా కన్నీళ్లు పెట్టుకుంటే ‘ఇదిగో భరోసా! మేమున్నాం హమేషా’ అంటూమార్కెటింగ్అధికారులు ‘గిడ్డంగుల్లో బోల్డన్ని సౌకర్యాలు అదనం గా కలిస్తాం!వచ్చే ఏడు వర్షాకాలం లోగా అన్ని
అదనపు ఏర్పాట్లు చేస్తాం’అంటారు.ఐతే ప్రతిసారీ అదనంగా వచ్చే అకాలవర్షాలకి ఈదురు గాలులుఅదనంగా వీచి ధాన్యం తడిసిపోతూoది.కానీ అదనపు సౌకర్యాలు మాత్రం కని పించవు. అసలు మన రైతులకి ఉన్న కష్టాలకి తోడూ అధికారుల వాగ్దానాలే అదనపు భారం!ఇదిఅర్ధం చేసుకుంటే చాలావరకు అదనపు బాధలు రైతులకి తప్పుతాయి!
*****     ******      *****
ఎలక్షన్లప్పుడు లీడర్లకి పైకి చెప్పుకోలేని అదనం ఖర్చులవుతాయి.కొందరు వోటర్లకి మ్యాక డోలుబ్రాందీ తాగించి మేకల బిర్యానీ తిన్పించాలి.కక్కితే మూతి కడిగి, ముక్కితే ముక్కు తుడిచి సకల మర్యాదలతో సాగనంపాలి.మొయ్యలేని ఈ అదనపుభారం కుయ్యోమొయ్యో మనిపించి‘వద్దురా దేముడా!ఈ అదనం వద్దు, ఈఎన్నికలొద్దని కొందరు నేతలు ఝడుసు కుని పారిపోతున్నారు.ఐతే కొందరు కంత్రీలు ఈ అదనం ని ముందే అంచనావేసి ఎలాగూ తడిసిమోపెడు ఖర్చు అవుతుంది దాన్ని పదవిలో ఉండగానే జనంనుండి అదనంగా కక్కిన్చేస్తే ఆనక అది వోటర్ల కక్కూర్తి ఖర్చుకి పనికోస్తుందని ఆలోచిస్తూన్నారని ఇప్పుడు జరిగే ఎన్నికల్ని పరిశీలిస్తే తేటతెల్లం అవుతుంది!
*****    ******     *****
అదనం మహామ్మరి! అదనంగా వచ్చే ప్రతీదీ మన చేత అదనపు ఖర్చు పెట్టిస్తుంది! మనిషికి మనిషికి మధ్య చిచ్చు పెడుతుంది.మనిషి హృదయంలోంచి అదనంగా పొందుదాం అనే ఆలోచన తొలగకపోతే అదనం బల్లకింద వామనహస్త అవతారమెత్తి విశ్వరూపంచూపిస్తుంది! పొలాల్లో అదనం గా పంటరాబడి ఆశిస్తే మనుషుల ప్రాణాలు హరించే కెమికల్  ఎరువులా మారుతుంది! ఒక్కోసారి క్రిమి సంహారకమందు అయ్యి ఆరోగ్యాల్నిహరిస్తుంది! వ్యాపార రాజకీయాల్లో బ్లాక్ కరెన్సీలా మారి ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది.అదనం ఎప్పుడూ అదను కోసంచూస్తుంది.అదనం అణుబాంబుకన్నాప్రమాదకరం!ప్రస్తుతప్రపంచంలో జనాభా అవసరాల కోసం అన్ని సహజఇంధనాలను ఇలాగే అదనంగా మండిస్తే వాతావరణం లో అదనంగా మరిన్ని మార్పులు వచ్చి ఆఖరికి తిండి నీళ్ళతో బాటు మంచి గాలికీ అదనం గా డబ్బు ఖర్చు చేసే రోజులు వస్తున్నాయి!అంచేత అదనం ని అదుపులో ఉంచడం ఎంతైనా అవసరం లేపోతే అదనం అణుబాంబులా విస్పోటనం అవుతుంది! అప్పుడు మానవజాతి మనుగడకే ముప్పు! అదనం మానవజాతి హననం! ఇంకా ‘అదనం’ ని ఆదరిద్దామా? ‘ఛీ’ కొట్టి చిత్తం లోంచి తీసి చెత్తలో పారేద్దామా?? ఇప్పుడీ ఆలోచన ‘అదనం’ గా చేద్దాం!     

మరిన్ని శీర్షికలు
adigedimeere answericchedi meere