Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ఇరవై ఏడవ భాగం

Anubandhaalutelugu serial twenty seventh Part

"డబ్బు డాడీ! ఇందులో మూడు లక్షల నలభై వేలుంది. మా దగ్గర మిగిలిన డబ్బు ఇదే" చెప్పాడు అనంత్.

"అవును డాడీ! తీసుకోండి" అంది శివాని.

బాధగా చూసాడు గోపాల్.

"మీ దగ్గర డబ్బు వెనక్కి తీసుకోవడం బాధగానే ఉందిరా. కానీ తప్పడం లేదు. ఇక్కడికొచ్చిన మీ కోసం దాదాపు పదిలక్షలు ఖర్చు పెట్టాడు మీ పెద్దనాన్న. రేపు మా అమ్మ
తిరిగొస్తే ఏం చెప్పాలో అర్ధం గావడం లేదంటూ తెగ బాధపడిపోతున్నాడు.

అంతే! డబ్బులేదంటే అయిన వాళ్లు కూడా కొంచెం ఇబ్బందిగా చూస్తారు. అందుకే ఎంతో కొంత ఇచ్చేద్దామనుకుంటున్నాను. కనీసం ఇదన్నా వుంచారు సంతోషం. థాంక్స్!" అంటూ లేచి బ్రీఫ్ కేస్ తీసుకుని వెళ్లిపోయాడు.

ఊహించని పరిస్థితులకు భిన్నులై శిలావిగ్రహాల్లా మిగిలిపోయారు అన్నాచెల్లెళ్లిద్దరూ.

అమెరికా నుంచి డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ వచ్చేసరికి అది జనవరి నెల. సంక్రాంతి పండుగ వారం రోజులే ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలకు ప్రతిరోజూ హడావుడే. ప్రతి ఇంటి
ముందూ పోటీపడి వేస్తున్న రంగురంగుల ముగ్గులు. గొబ్బెమ్మల సందడితో అమ్మాయిలంతా ఒకే హడావుడి. ఊరంతా పండుగ వాతావరణం కన్పిస్తోంది. ఊర్లో హరిదాసుల కీర్తనలు, గంగిరెడ్ల హడావుడి, పగటి వేషగాళ్ళ మాటల కోటలు ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊళ్ళో సంక్రాంతి దగ్గర పడుతున్న సరదాల, సంబరాలు కన్పిస్తున్నాయి. హైదరాబాద్ లో ఎదురైన చేదు అనుభవం నుంచి తేరుకోకముందే అమెరికా నుంచి తండ్రి రావడంతో అనంతసాయిగాని, సాయి శివానీ గాని ఇక గ్రామం వదిలి బయటకెళ్ళే ప్రయత్నం చేయలేదు. చేతిలో డబ్బు కూడా తండ్రికిచ్చేసారు. వెళ్ళాలన్నా చేతిలో డబ్బులేదు. అందుకే బుద్ధిమంతుల్లా ఇంట్లోనే ఉండిపోయారు.
అన్నాచెల్లెళ్లిద్దరూ. అంచేత ఇప్పుడు వాళ్ల దృష్టి గ్రామంలో పండుగ హడావుడి మీద పడింది. ఇంట్లో తమ ఈడు వాళ్ల నవీన్, మహేశ్వరి ఉన్నారు. ముందులా కాకుండా ఇప్పుడు వీళ్లు కొంచెం కలిసి మెలసి తిరగడం ప్రారంభించారు. ఒక పక్కన నవీన్, శివానీని, మరోపక్క అనంత్, మహేశ్వరి మధ్య చనువు ఏర్పడింది. ఒకరినొకరు అర్ధం చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక బావామరదళ్ళ మధ్య చిలిపి తగాదాలు, అల్లరి, ఒకరినొకరు సరదాగా ఉడికించుకోవడం వంటి తమాషాలు చోటు చేసుకోనారంభించాయి.

శుక్రవారం కావడంతో ఉదయమే అమెరికా నుంచి తెచ్చుకున్న ఖరీదైన షాంపూతో తలారా స్నానం చేసింది. ఇలా శుక్రవారం తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకోవాలని మహేశ్వరి నుంచే నేర్చుకుంది శివానీ. స్నానమైతే చేసి దేవుడికి దండం పెట్టుకుంది కానీ బాగా పొడవు జుట్టు కావడంతో తల కురులు చిక్కుబడి, చిక్కు తీసుకోవడం తన వల్ల కాలేదు. దాంతో మహేశ్వరితో చిక్కు తీయించుకుందామని సరాసరి భ్రమరాంబ వాళ్ల ఇంటికి వెళ్ళింది శివాని. తీరా అక్కడికి వెళ్లేసరికి అక్కడ కనబడింది ఒక అపురూప దృశ్యం.

మేడమెట్ల మీద కూర్చుని తల్లి భ్రమరాంబకు తల దువ్వి జడ వేస్తున్నాడు నవీన్. భ్రమరాంబ ఖాళీగా లేదు ఆమె ముందు కింద మెట్టుమీద కూర్చుని ఉంది పెద్దమ్మ మహాలక్ష్మీ, భ్రమరాంబ మహాలక్ష్మీకి చిక్కు తీస్తోంది. మహాలక్ష్మీ తనముందు కూర్చున్న మహేశ్వరికి చిక్కు తీసి జడ వేస్తోంది. అలా వాళ్ల నలుగుర్నీ చూడగానే ఒక మధురమైన అనుభూతికి లోనయింది శివాని.

"ఏమిటి? వరుసగా రైలుపెట్టెల్లా కూర్చున్నారు." అంది నవ్వేస్తూ.

"పడుచుదనం రైలుబండి పోతున్నది.

వయసు వాళ్లకందులో చోటున్నది" అంటూ తల్లికి జడవేస్తూ కూడా శివానీని ఉడికిస్తూ పాత సినిమా పాటొకటి పాడాడు నవీన్.

"నీకు తెలియదేమో ఈ రైల్లో ముసలివాళ్లు కూడా ఉన్నారు" అంది నవీన్ ను ఎద్దేవా చేస్తూ శివానీ.

ఆ మాటలతో అటు భ్రమరాంబ, ఇటు మహాలక్ష్మీ కూడా శివానీని గుర్రుగా చూసారు.

"ఏమిటే అప్పుడే ముసలివాల్లము అయిపోయామనుకుంటున్నావా? ఇంకా ఇంకా మనవళ్ళని ఎత్తుకోలేదు" మేనకోడల్ని ఎక్కిరిస్తూ అంది భ్రమరాంబ.

"అవును. ఇంకా నడివయసు రాలేదు. మేం ముసలి వాళ్ళేంటి అంటూ భ్రమరాంబను బలపర్చింది మహాలక్ష్మీ.

"అయితే బావ ఈ పాట ఎందుకు పాడినట్టు. నాకు పెళ్ళి కాలేదు. నేను పడుచు పిల్లను కదా?" అంటూ దబాయించింది శివానీ.

"వయసుంటే చాలదే మరదలా... కాస్త చురుకుదనం ఉండాలి. చలాకీ ఉండాలి. వీళ్ళంతా తెల్లవారుజామునే లేస్తారు. నీలా బారెడు పొద్దెక్కేక లేచేవాళ్ళని మా వూళ్ళో పడుచుపిల్ల అనరు. ముసలమ్మ అంటారు" అంటూ వెక్కిరించాడు నవీన్.

"ఓహో...! ఆడవాళ్లకి జడ వేసే వాళ్లని మా అమెరికాలో ఏమంటారో తెలుసా?"

"మీ అమెరికా సంగతి నాకు తెలియదు గానీ మా వూళ్ళో మాత్రం బుద్ధిమంతులంటారు. అయినా తల్లిదండ్రులకు సేవ చేయడంలో ఉన్న ఆనందం మీ అమెరికా వాళ్లకేం తెలుసు పిచ్చిమొహమా...? మొహమాటపడకు కావాలంటే చెప్పు? నీకూ చిక్కుతీసి జడవేసి పెడతాను. బావ చేత సేవ చేయించుకోవాలంటే అదృష్టం ఉండాలి. రా కూర్చో..." అంటూ పిలిచాడు.

మూతి మూడు వంకర్లు తిప్పి వెక్కిరించింది శివానీ.

"నీ సేవలేమీ నాకు అక్కర్లేదు. నాకు మహీ జడ వేస్తుంది. ఏ  మహీ... మీ అన్నతో చెప్పు ఆడాళ్ళ పనులు మగాళ్లు చేయకూడదని" అంటూ దువ్వెనను మహేశ్వరికి ఇచ్చి
ఆమె ముందు కింద మెట్టు మీద కూర్చుంది.

"మధ్యలో నన్నెందుకు లాగడం. ఆ మాటేదో నువ్వే చెప్పు." అంటూ శివానీ జుట్టు లాగి చిక్కు తీయడం ఆరంభించింది మహేశ్వరి.

"నేను చెప్పేదాన్ని... కానీ నేను పరాయి మగాళ్ళతో మాట్లాడనులే..." అంటూ పరాయి అనే పదాన్ని వత్తి పలికి ఉడికించింది శివానీ.

"అవునవును. మగాళ్ళతో మాట్లాడే అలవాటు నాకూ లేదు" అన్నాడు నవీన్.

"బావా ఇట్స్ టూ మచ్... నీ కంటికి నేను మగాడిలా కన్పిస్తున్నానా?"

"అది వేరే చెప్పాలేమిటి?'

"బావాఆగు ... తర్వాత నీ పని" అంటూ మరింత ఉడుక్కుంది.

వాళ్ళిద్దరి మాటల యుద్ధాన్ని ముచ్చటగా గమనిస్తూనే ఉన్నారంతా.

ఇంతలో తన తల్లికి జడవేయడం ముగించిన నవీన్ మాట్లాడవద్దన్నాడు. మిగిలిన వాళ్లకి సైగ చేసి నిశ్శబ్దంగా లేచాడు.

మహేశ్వరిని లేవమని సైగ చేసి ఆమె చోటు తను కూర్చుని చిక్కు తీయడం ఆరంభించాడు.

చిక్కు తీయడానికి బదులు మరింత చిక్కు చేసి పిచ్చిపిచ్చిగా జడలు వేయడం ఆరంభించాడు. అది చూసి నవ్వుకోలేక మిగిలిన వాళ్ళు పెద్దగా నవ్వేసారు. వాళ్ళెందుకు
నవ్వుతున్నారో తెలీక తల తిప్పి చూసిన శివానీకి తన వెనుక కూర్చున్న నవీన్ ముఖం కన్పించింది.

జడ ముందుకు లాగి చూస్తే పిచ్చి జడ. ఆమె కోపంతో వళ్ళు మండిపోయి చివ్వున లేస్తూ "బావా జడేస్తావా? నాకు జడేస్తావా? నా జుట్టుని పాడు చేస్తావా? చంపేస్తాను
నిన్ను..." అంటూ కొట్టబోతుంటే పెద్దగా నవ్వేస్తూ ఆమె దెబ్బలు తప్పించుకొని దూరంగా పరిగెత్తాడు నవీన్. "ఏయ్... శివానీ నీ జుట్టు నేను సరిచేస్తాను రా..." అంటూ నవ్వుకుంటూ మహేశ్వరి పిలవడంతో చివరకు తనూ నవ్వేస్తూ వచ్చి ఆమె ముందు కూర్చుంది శివాని.

ఇలాంటి చిలిపి పనులు, కొంటె చేష్టల మూలంగా ఏర్పడే ఆకర్షణ ఎంత బలమైందో శివానీకి ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. వద్దనుకున్నా ఆమె కళ్ళముందు తరచూ నవీన్ మెదులుతున్నాడిప్పుడు. సంక్రాంతి పండుగ వచ్చింది వెళ్ళిపోయింది. మది దోచిన అనుభవాల్ని తీపి గుర్తుగా మిగిల్చింది. నాలుగు రోజుల సంక్రాంతి సంబరాలు దేశమంతా జరుపుకున్నట్టే మున్నలూరు వాసులూ ఘనంగా జరుపుకున్నారు. ఆ నాలుగు రోజులూ ఎలా గడిచిపోయాయో తెలీనంత ఆనందంగా గడిచిపోయాయి.

పండక్కి ఇంటిల్లిపాదికి కొత్తబట్టలు తీసుకురావడానికి విజయవాడ వెళ్ళినప్పుడు నవీన్ ప్రత్యేకించి తన కోసం కొనిచ్చిన చీరను శివానీ అపురూపంగా చూసుకుంది. తిరిగి వచ్చేప్పుడు తనకు తెలీకుండానే అతడి భుజం మీద తలాన్చుకొని నిద్రపోవడం అదో మధుర సంఘటన.

అటు అనంతసాయి, మహేశ్వరిల విషయంలోనూ ఇలాంటి మధుర సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. మొత్తానికి ఉత్సాహభరితంగా వచ్చివెళ్ళిపోయింది సంక్రాంతి పండగ.

అయితే డాక్టర్ గోపాల్ మాత్రం ఏమీ పట్టనట్టు తన గదిలోంచి ఎకూవగా బయటకు రానేలేదు. ఆయన్ని మామూలు మనిషి చేయడం మాత్రం ఎవరివల్లా కాలేదు. పండగ వెళ్లిన మూడోరోజు ఉదయం.

"నాకిక్కడ నచ్చలేదు. ఉండలేకపోతున్నాను" అన్నాడు గోపాల్.

"అదేమిట్రా ఇక్కడ నీకేం లోటని?" అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రామలింగేశ్వర్రావు.

"సమస్య లోటుపాట్ల గురించి కాదన్నయ్యా! వేసవి రాకముందే కరెంటు కోత మొదలైంది. ఈ ఉక్కపోత భరించలేను. బెజవాడ వెళ్లి రావాలనుకుంటున్నాను. అనంత్ శివానీలను తీసుకెళ్తున్నాను" అన్నాడు గోపాల్.

"సాయంత్రానికి వచ్చేస్తారుగా?"

"ఆ వచ్చేస్తాం. కాస్త లేటయినా మీరేం కంగారు పడకండి. ఫోన్ చేస్తాలే. కారు తీసుకెళ్తాను"

"అలాగే"

పదకొండు గంటల తరువాత కొడుకు, కూతుర్ని తీసుకొని కార్లో విజయవాడ బయల్దేరాడు గోపాల్. ఈ ప్రయాణం ఉద్దేశం ఏమిటో అర్ధంకాకపోయినా మౌనంగా ఉండిపోయారు అన్నాచెల్లెళ్లిద్దరూ. సుమారుగా భోజనం వేళకి కారు విజయవాడ హోటల్ డి.వి. మేనర్ పార్కింగ్ లో ఆగింది. విజయవాడ వెళ్తున్నాం అని తెలుసుగాని, ఎక్కడికని తెలీదు అన్నాచెల్లెళ్లకి. అందుకే స్టార్ హోటల్ కి చేరుకోవడం ఏమిటో అర్ధంగాక అనంత్ ముఖంలోకి చూసింది శివానీ. తనకి ఏమీ అర్ధం కానట్టు పెదవి విరిచాడు అనంత్.

ఈలోపల ముందుగా కారు దిగిన డాక్టర్ గోపాల్ "ఏమిటి ఆలోచిస్తున్నారు? దిగండి..." అంటూ పిలిచాడు.

ముందుగా అనంత్, వెనకే శివానీ కారు దిగారు. కార్ డోర్స్ లాక్ చేసి తాళాలు జేబులో వేసుకుంటూ రిసెప్షన్ హాల్లోకి నడిచాడు గోపాల్.

"రండి సార్ రండి. వెల్ కమ్" అంటూ ముఖం నిండా నవ్వులు పులుముకుంటూ ఆహ్వానించాడు రిసెప్షన్ క్లర్క్. పక్కనే హోటల్ మేనేజర్ కూడా ఉన్నాడు.

ఆయన "నమస్తే డాక్టర్...!" అన్నాడు.

"నేను మీకు తెలుసా?" ఆశ్చర్యపోతూ అడిగాడు గోపాల్.

"తెలుసు సార్. ఇంతకు ముందు ఒకసారి ఇక్కడికి వచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్లారు."

"ఆ... గుర్తొచ్చింది. వీళ్లు బిల్లు కట్టకపోతే మేమొచ్చాం. మా అన్నయ్య డబ్బు కట్టాడు. బాగుంది."

"అమెరికాలో మీరు పెద్ద డాక్టరని కూడా తెలుసు సార్" అన్నాడు మేనేజర్.

"థాంక్స్. నాగురించి మీరు ఇంతగా గుర్తుపెట్టుకున్నందుకు మెనీ థాంక్స్. నాకు ప్రస్తుతం డబుల్ రూమ్ ఒకటి కావాలి. సూట్ అయితే ఇంకా మంచిది. వచ్చిన పని చెప్పాడు గోపాల్.

"ష్యూర్ సార్. సూట్ తీసుకోండి విత్ ఏ.సి. కంఫర్టబుల్ గా ఉంటుంది"

"ఓ.కే. థాంక్స్"

మూడువేల అడ్వాన్స్ కట్టి, రిజిష్టర్ లో సంతకం చేసి కీస్ తీసుకున్నాడు గోపాల్. లగేజీ లేకపోయినా సర్వీస్ బాయ్ ఒకడు లిఫ్ట్ లో కూడా వచ్చి, సూట్ చూపించి లోనకు వచ్చి, ఏ.సి. ఆన్ చేసి వెళ్లాడు. ముగ్గురూ హాల్లో కూర్చున్నారు.

"డాడీ! ఏ.సి. సూట్ తీసుకుని ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం అవసరమా?" మౌనంగా ఉండలేక అడిగాడు అనంత్.

డాక్టర్ గోపాల్ భారంగా ఇద్దర్నీ చూసాడు.

"ఈ ప్రపంచంలో అంతా అవసరం ఉంటేనే ఖర్చుపెట్టడం లేదు. అనవసరంగా ఖర్చులు చాలా చేస్తున్నారు" అన్నాడు.

ఆ మాటలు తమను ఉద్ద్దేశించే ఎక్కు పెట్టిన బాణాలని ఇద్ద్దరికీ అర్ధమైంది. ఇంకేమన్నా ఆయనకు కోపం వస్తుందన్న భయంతో ముఖాలు దించుకున్నారు.

"మీకు తెలీదు. మీకు తెలీని విషయాలు ఇక్కడ చాలా జరుగుతున్నాయి. ఆ పైన కరెంటు కోత వేరే. ఆ టార్చర్ భరించలేను. అందుకే వచ్చేసాను" అన్నాడు గోపాల్.

"ఏం జరిగాయి డాడీ! ఏమైంది?" వెంటనే అడిగింది శివానీ.

"ఏమైనా అవుతుందమ్మా! మనం అప్రయోజకులం అయినప్పుడు అయిన వాళ్లకు కూడా లోకువైపోతాం. ఇక్కడికొచ్చి బాధ్యత లేకుండా డబ్బు పాడుచేసి మీరు, షేర్ల వ్యాపారంలో కోట్లు పోగొట్టుకొని నేను వాళ్లకి లోకువైపోయాను. పైకి మాట్లాడుతున్నారు అంతే! మీ అత్తయ్య అన్న మాటలు నా గుండెల్ని ముక్కలు చేశాయి. సొంత చెల్లెలయ్యుండి కూడా అలా అనడానికి నోరెలా వచ్చిందో అర్ధం కావడం లేదు." అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.

తమకు తెలిసి అక్కడ గొడవలేం జరగలేదు. మరి దేని గురించి ఆయన చెప్తున్నాడో అర్ధం కావడం లేదు. చూస్తుంటే అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ గొడవ పడినట్టు అర్ధమవుతోంది.

"డాడీ! అత్తయ్య ఏమన్నారు?" కుతూహలంగా అడిగాడు అనంత్.

"ఏమన్నా అంటుందిరా... మనమిప్పుడు ధనికులం కాదుగా... మాటల సందర్భంలో మీ పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది. నా ముఖం కూడా చూడకుండా ఏమందో తెలుసా? కుండ మార్పిడి పెళ్ళిళ్ళు చేసుకుందామని మీకున్నా మాకిష్టంలేదు. ఇప్పుడు మీ దగ్గర ఏముందని పెళ్లి చేయాలి? పైగా ఎలాగైతే కన్నావు బాధ్యత లేని పిల్లల్ని. రేపు అమ్మ వచ్చి చెప్పినా వినను. మా పిల్లల మీద ఆశ పెట్టుకోవద్దు. అంటూ కట్టె విరిచినట్టు ముఖం మీదే మాట్లాడేసింది.

ఆ మాటలు వింటూ కూర్చున్నారంతా. అన్నయ్యగానీ, వదినగానీ, బావ రఘునాథ్ గానీ ఎవరూ అడ్డు చెప్పలేదు. పైగా వాళ్లే తగిన సంబంధాలు చూసి మీ పెళ్ళిళ్ళు చేస్తారట. ఇంత జరిగాక అక్కడ ఎలా ఉండమంటారు? మీరే చెప్పండి?" అన్నాడు ఆవేదనగా.

ఆ మాటలకు అనంత్ ఆవేశపడిపోయాడు.

"మీరు బాధపడకండి డాడీ! వాళ్ల సంబంధం చేసుకోవాలనే ఆలోచనేమీ మాకు రాలేదు. మిమ్మల్ని అంతమాటన్నాక వాళ్ల ముఖం చూడాలన్పించడం లేదు" అన్నాడు
ఆవేశపడుతూ.

కానీ శివానీకి ఇదంతా జరిగిందంటే నమ్మబుద్ధి కావడంలేదు. ఆమెకు తెలివితేటలు ఎక్కువే.

"అదేమిటి? ఆ ఇంట్లో వాళ్లకెంత హక్కుందో మనకీ అంతే వుంది. వాళ్ళేదో అన్నారని మనం బయటకు రావడం ఏమిటి? అమెరికాకి ఫోన్ చేసి నాయనమ్మతో మాట్లాడదాం" అంది.

"అదొక్కటే తక్కువ. ఇప్పటికే షేర్లలో డబ్బు పోగుట్టుకున్న చవటనని తిట్టిపోస్తోంది. ఇప్పుడు ఫోన్ చేసి తిట్లు తినాలా? ఏం ఫరవాలేదు మనం బ్రతకగలం.అవునూ నా దగ్గర ఉన్న డబ్బంతా ఈ సూట్ కి అడ్వాన్స్ కింద కట్టేశాను. ఇక ఒక్క రూపాయి కూడా లేదు. ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే అర్జంట్ గా నాకు స్కాచ్ కావాలి. మనమింకా భోజనాలు చేయాలి. మీ దగ్గర డబ్బులున్నాయా?" ఆయన ప్రశ్నలకు ముఖాలు తేలేసారు ఇద్దరూ.

"మా దగ్గర డబ్బులెక్కడివి డాడీ! ఉన్న డబ్బు ఇచ్చేసాంగా..." అన్నాడు అనంత్.

"అవును. కానీ నో ప్రాబ్లమ్. పని చేసి సంపాదించండి."

"పనా... ఏమిటి డాడీ... జోక్ చేస్తున్నారా?" అంది కంగారును అణచుకుంటూ శివానీ.

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
duradrustapu dongalu