Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Paravastu Chinnayasuri

ఈ సంచికలో >> శీర్షికలు >>

కార్తీకమాస విశిష్టత - జె. వి. కుమార్ చేపూరి

Kaarteeka Masam Visishtata

శరదృతువు ఉత్తర భాగంలో మరియు సంవత్సరంలో 8వ నెలగా వచ్చేదే కార్తీకమాసం.  కార్తీకమాసం 30 రోజులూ పర్వ దినాలే. కార్తీకమాసం అంటే వర్షాకాలం తర్వాత వస్తుంది. అంటే అప్పటిదాకా వానలు పడి చిత్తడిగా ఉన్న భూములు పొడివారతాయి. అటు వానలు, ఇటు ఎండలు లేకుండా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.  అందువలన అన్ని పుణ్య కార్యాలకు ఈ మాసం ఎంతో అనుకూలం మరియు శుభ ప్రదం.

స్కంద పురాణంలో కార్తీక మాస విశిష్టత ఈ విధంగా వివరించబడింది. పూర్వ కాలం నారద మహర్షి భూలోకమునందు మిగుల వాత్సల్యము కలవాడై  బ్రహ్మను పరి పరి విధాల స్తుతించి  ఈ విధంగా ప్రశ్నించాడు. సంవత్సరంలో ఏ మాసం ఉత్తమ మైనది, ఈ మాసంలో పూజింప వలసిన దైవం ఎవరు, దర్శించవలసిన ఉత్తమ తీర్ధం ఏది? దానికి బ్రహ్మ వెంటనే ఈ విధంగా సమాధానమిచ్చాడు. అత్యంత విశిష్టమైన మాసం కార్తీక మాసం. పూజించ వలసిన దైవాలు శివకేశవులు. శివకేశవులకిద్దరికి ఇది ఎంతో ప్రీతీ పాత్రమైన మాసం. దర్శించ వలసిన తీర్ధం బదరీ క్షేత్రం. కార్తీక మాస విశిష్టతను ఈ క్రింది శ్లోకంలో చక్కగా వివరించడం జరిగింది.

న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరం
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః

(భావం : కార్తికముతో సమానమైన మాసము గానీ, వేదము కంటే అన్యమైన శాస్త్రము గానీ, ఆరోగ్యముతో సమానమైన ఉత్సాహము గానీ, కేశవునికంటే అన్యమైన దైవముగానీ లేవు).

కార్తీక మాసంలో తెల్లవారు ఝామునే లేచి తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి తులసి కోటకు పూజించి భగవన్నామ స్మరణం చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను మనసార పూజిస్తారు. స్నానమాచరించేటపుడు ఈ క్రింది శ్లోకాన్ని స్మరించుకోవాలి.

కార్తికేహం కరిష్యామి ప్రాతః  స్నానం  జనార్దన
ప్రీత్యర్థ  తవ  దేవేష దామోదర  మయ  సహః

(భావం : ఓ జనార్దనా, దేవేశ్వరా, దామోదరా నిన్ను లక్ష్మీ దేవిని స్తుతించి ప్రసన్నం చేసుకోడానికి నేను కార్తీక మాసమందు ప్రాతః కాలమందే స్నాన మాచరిస్తున్నాను).

స్నానాలు అన్నింటిలోను నదీ స్నానం లేక సముద్ర స్నానం ఉత్తమ మయినవి. కారణం ఈ మాసంలో గంగాదేవి స్వయంగా అన్ని నదులలోను, సముద్రాల్లోనూ, సెలయేర్లలోను, జలాశయాల్లోనూ ప్రవేశించి వాటన్నింటిని తనంత పవిత్రంగా చేస్తుంది. విష్ణుమూర్తి కూడా ఈ మాసంలో నదులలోను, తటాకాల్లోను, సెలయేరులలోను నివసిస్తాడని ప్రతీతి.

విష్ణుమూర్తి ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకుపక్రమించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి.

పరమ శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని కార్తీక పౌర్ణమి నాడు సంహరించి జగతిని కాపాడడం జరిగింది. ఈ మాసంలోనే పరమ పవిత్రమైన అయ్యప్ప దీక్ష మొదలవుతుంది.

సోమవారం శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు. కావున ఈ మాసంలో సోమవారాలు శివునికి అభిషేకాలు చేసి ఉపవాసాన్ని పాటిస్తారు. కార్తీక పౌర్ణమి సాయంకాల సమయాన  దైవ కటాక్షం కోసం మహిళలు ఇళ్ళ ముందు అందమైన రంగవల్లులు దిద్దుతారు, దేవాలయాల్లోనూ, నదులలోను, తటాకాల్లోను దీపాలు వెలిగించి తరిస్తారు. దీప దానాలు చేస్తారు.  స్త్రీలు తులసి చెట్టు వద్ద ఉసిరి కాయలపై నేతిలో లేక నూనెలో ముంచిన వత్తులను ఉంచి, వెలిగించి పూజిస్తారు. వివాహాలు, ఉపనయనాలు, వ్రతాలు, నోములు, పూజలకు అత్యంత అనువైన నెల కార్తీక మాసం. ముముక్షువులు కార్తీక పురాణాన్ని ఈ మాసమంతా (ప్రతి రోజు) శ్రద్దగా పటించి, ఆలకించి తరిస్తారు.

కార్తీక సోమవారం నాడు  భక్తులు కేదారేశ్వర స్వామి నోము అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్టగా జరుపు కోవడం విశేషం.

కార్తీక మాసపు మరో విశిష్టత వనభోజనాలు

యః కార్తీకే సితే వనభోజన మాచరేత్
సయాతి వైష్ణవం ధామ సర్వ పాపై ప్రముచ్యతే

(భావం : కార్తీక మాస శుక్ల పక్షంలో వనభోజనం చేసినవారు పాప విముక్తులై విష్ణు ధామాన్ని పొందుతారు).

సూత మహర్షి మునులందరితో  కూడి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కల్గిన వృక్షం మరియు  దామోదరునికి (శ్రీహరికి) అత్యంత ప్రీతీ పాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శేష్టం. వనభోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి చెట్టు మొదట్లో విష్ణు మూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలసి వనభోజనాలను చేస్తారు.

శ్రీ కృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడి తోను మరియు తోటి గోప బాలకులతో కలసి ఉసిరి మొదలైన మహా వృక్షాల నీడన యమునా నదీ తీరాన, బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేసాడని భాగవతంలో వర్ణించబడినది.

ఈ మాసంలో ఏ రోజైనా వనభోజనాలకు అనుకూలమే. ఐతే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారాలు ఉత్తమ మైనవి. కార్తీక వనభోజనాలు స్నేహాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయి మరియు మానవ సంబంధాలను మెరుగు పడేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి.  ఇవి  నిత్య జీవితంలో ఎదురయ్యే చిరాకులు, పరాకులు, వత్తిళ్ళు, వేదనలను మరపింప జేసే వేదికలు.

నాగులచవితి : దీపావళి అనంతరం వచ్చే కార్తీకశుద్ధ చవితిని నాగులచవితి అంటారు. ఈ రోజు నాగదేవతను పూజిస్తారు. నాగేంద్రుని పుట్టదగ్గరకి వెళ్లి పసుపు, కుంకుమ, పువ్వులతో పూజ చేస్తారు. చిమ్మిలి, చలిమిడి, అరటిపళ్ళు,తాటిగుంజు నైవేద్యం పెడతారు. ఆవుపాలు పుట్టలో పోస్తారు.

ముముక్షువులకు, గోతెలుగు పాఠక మహాశయులకు, సమస్త జనావళికి కార్తీక మాస శుభాకాంక్షలు.  శివకేశవుల కృపా కటాక్షాలు మన అందరిపైన సదా ఉండాలని ప్రార్దిద్దాం.

********

మరిన్ని శీర్షికలు
Excuses