Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaarteeka Masam Visishtata

ఈ సంచికలో >> శీర్షికలు >>

X(ఎక్స్)క్యూజులు... - భమిడిపాటి ఫణిబాబు

Excuses

మన చిన్నతనంలో ఏదైనా తప్పుచేస్తే ఓ "సారీ" తో గొడవ వదిలిపోయేది. అవతలివాడూ సరిపెట్టేసుకునేవాడు. ఈ మహత్తర పదం మనకి ఇంగ్లీషువారిచ్చిన ఓ గొప్ప కానుక. కానీ కాలమూ మారింది, కాలంతోపాటు మనుష్యులూ తెలివిమీరిపోయారు. ఆ "సారీ" రూపాంతరం చెంది, వివిధ సందర్భాల్లో ఉపయోగించడానికి వీలుగా అనేకానేక రూపాలు గా తయారయింది. కొంతమంది  Excuse me అనేవారు, కొంతమందైతే Pardon me అంటారు. అతావేతా మూలార్ధం ఆ Sorry యే !!  ఎప్పుడైనా ఓ "వంక" పెట్టాలని ఉంటే, దాన్నికూడా ఇదే ఫ్యామిలీలోకి వేసికోవచ్చు.

సందర్భాన్ని బట్టి ఉంటుంది మన వాడకం. ఉదాహరణకి ఏ బస్సులోనో మనం వెళ్తూన్నప్పుడు చెప్పులేసికున్న మన  కాలు ఎవడైనా బూటుతో తొక్కాడనుకోండి, ఓ " సారీ" చెప్పేసూరుకుంటాడు. మనం మాత్రం ఏంచేస్తాం, చెప్పుతో వాడికాలు తొక్కలేముగా, తొక్కినా అంత ఉపయోగమూ ఉండదు, కాలివేలు మంట పెడుతూన్నా, మొహమ్మాటానికి ఫరవాలేదులే అని ఊరుకోవాలి, కారణం అంతకంటె గత్యంతరం లేదు కాబట్టి. మనం లేచిన వేళ బాగోక, అదే బస్సులో ఎవరైనా ఆడవారి కాలో చెయ్యో తగిలిందనుకోండి, నోరెత్తకుండా "సారీ" చెప్పేయడమే అన్నివిధాలా శ్రేయస్కరం.   ఉద్దేశ్యపూరకంగానో, unintentional గానో ఇలా తగిలించినవారి వయస్సుబట్టి,తగిలింపబడ్డవారి వయస్సు బేరీజు వేసి, మనం చెప్పిన "సారీ" ఉపయోగిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశం. అదిమాత్రం నిశ్చయంగా మనం లేచినవేళ మీదే ఆధారపడుంటుంది.  

అయినా అప్పుడప్పుడు మన పాత నేస్తం sorry తెరమీదకొస్తూంటుంది.  రోడ్డు పక్కన నుంచునుండగా, ఏ బైక్కువాడో కొట్టేసినా ఓ sorry చెప్పేసి ఊరుకుంటాడు. అలాగే ఏ బ్యాంకుకో వెళ్ళినప్పుడు అదృష్టం బాగోక మన జేబులో పెన్ను కనిపించిందా, ఎవడో ఒకడు అడగక మానడు. ఇవ్వననడానికి మొహమ్మాటం. పోనీ తిరిగిస్తాడా అంటే అదీ చేయడూ, ఆ పెన్నేమో చేతులు మారుతూ బ్యాంకంతా ప్రయాణం చేస్తుంది. మొదట్లో పుచ్చుకున్నవాడు తన పని పూర్తిచేసికుని, వెళ్ళిపోతూంటే మనం పెన్ను సంగతి అడిగితే, ఇదిగో ఈ sorry అనబడే ఉదాత్త పదమే మనకు స్వాంతన కలిగించేది.

ఏ పెళ్ళిలోనైనా, లేదా ఏ సభకైనా వెళ్ళినప్పుడు, ఎవరూ పట్టించుకోనటువంటి ఓ అభాగ్యుడి పాలపడ్డామనుకోండి, ఆయనకేమో మొత్తానికి ఓ "బక్రా" దొరికేడుకదా అని మనకి సుత్తికొట్టేస్తూంటాడు. ఎప్పుడు వదిలించుకుందామనుకున్నా చెయ్యి పట్టుకుమరీ ఆపుతాడు.పైగా ఆయన చెప్పేవన్నీ విన్నామో లేదో, యూనిట్ టెస్టుల్లో లాగ  మధ్యమధ్యలో ప్రశ్నలు కూడా వేస్తాడు. మొత్తానికి ఓ అరగంట ఈ హింస భరించి, ఎవరో పిలుస్తూన్నట్టు పోజెట్టి " ఆ వస్తున్నా.." అంటూ గాలిలోకీ, ఈయనతో ఓ Excuse me చెప్పేసి వదిలించుకోవచ్చు.  ఈ ఆధునిక యుగంలో తుమ్మినా, దగ్గినా ఈ excuse me తో సరిపెట్టేసికుంటారు.

ఇంక Pardon me  గురించి, ఎవడైనా చెప్పింది మనకి వినిపించలేదనుకోండి, లేదా వినిపించీ అర్ధం కాలేదనుకోండి హాయిగా ఓ సారి ఈ Pardon me  తో పనికానిచ్చేసికోవచ్చు. కానీ కొంతమంది వాళ్ళు మాట్టాడేది అర్ధం కాకూడదనే మాట్టాడతారు. అలాటప్పుడు మనం ఎన్నిసార్లు ఉపయోగించినా ఫలితం ఉండదు.

పైన ఉదహరించినవన్నీ  కాకుండగా,  చిన్నప్పటినుండీ అలవాటుచేసికున్న కొన్ని "వంకలు", వీటిని కూడా  Excuse లనే అంటారు. ప్రతీదానికీ ఏదో ఒక వంక పెట్టేయడం.  నిన్న స్కూలుకి ఎందుకురాలేదురా అంటే "కడుపునొప్పొచ్చిందని" వంక. పనిమనిషిని  మొన్న రాలేదేమే అంటే " ఒంట్లో బాగోలేదండి." అని వంకా.

ఎవరో  ఒకరికి ఎల్లప్పుడూ మనఫోను చేస్తున్నామూ, ఒక్కసారి కూడా తను ఫోనే చేయలేదూ అనుకుని, ఆఖరిసారి పోనీ ఒకసారి చేసేద్దామా అనుకుని, ఫోనుచేయండి, ఠక్కున చెప్తాడు-- అరే ఇవాళే నీగురించి అనుకున్నామూ, ఇదిగో ఇప్పుడే ఫోనుచేద్దమని ఫోను ఎత్తుతూంటే నీ దగ్గరనుండిఫోనూ, ఏమిటీ ఎలా ఉన్నావూ? వగైరా వగైరా లేనిపోనికబుర్లన్నీ చెప్తాడు, ఫోను ఖర్చు మీదేగా. ఛస్తే ఫోన్లకి ఏగాణీ ఖర్చుచేయడు.

ఏదో కొద్దిగా పలుకుబడి ఉందికదా అని ఎవరినో ఓ ఉపకారం చేయమని అడిగేరా, ఓపికున్నన్నాళ్ళూ తిప్పుతాడు. ఎప్పుడు వెళ్ళినా ఒకటే X(ఎక్స్)క్యూజు. మొన్న ప్రయత్నించానోయ్, ఏదో మీటింగుందని ఫలానా చోటుకి వెళ్ళాడూ, వచ్చీరాగానే మన సంగతే చూద్దామన్నాడూ అని. అలాగే ఏ ఇల్లో అమ్మే సందర్భంలో ఏ తెలిసినవాడికైనా ప్రామిస్ చేసి, దాన్నుంచి తప్పించుకోడానికి నానారకాల వంకలూ చెప్తారు.. "నీకు ఇస్తానని చెప్పేనా, మా అబ్బాయికి తెలిసినవారెవరికో అర్జెంటుగాఇల్లు కావాల్సొచ్చిందిట, నాతో ఓ మాటకూడా చెప్పకుండానే, అతని దగ్గర బయానా కూడా తీసేసికున్నాడు.ఏమిటోనోయ్, ఇదివరకటిరోజుల్లాగా ఏమిటీ, ఎవరిష్టాలు వాళ్ళవీ, పోనీ పెద్దాళ్ళతో ఓ మాటచెప్తే సొమ్మేంపోతుందీ.." అని ఓ లెక్చరుకూడా బోనసుగా చెప్తారు.

పెళ్ళిసంబంధాలు తప్పించుకోవాలంటే ఉండనే ఉంది ఒక ever green excuse "జాతకాలు సరిపోలేదోయ్" అనో, మావాడు ఇప్పుడే పెళ్ళి వద్దంటున్నాడూ అనో.

కొద్దిగా ఏ మొహమ్మాటం లేకుండా ఈ X(ఎక్స్) క్యూజులు సందర్భానుసారం వాడడం నేర్చేసికుంటే జీవితం హాయిగా వెళ్ళిపోతుంది.

మరిన్ని శీర్షికలు
telugu food in singapore